Tuesday, 26 November 2019

పొరుగింటి పుల్లగూరకు కాస్త పులుపెక్కువైంది

మూడేళ్ళ క్రితం మణిరత్నం కాఫీ తాగుతూ దేని గురించో ఆలోచిస్తూ ఉన్నారు. 

"ఇంతకీ ఏదైనా  కొత్త సినిమా తీసే ఆలోచనలో ఉన్నారా?" అడిగింది సుహాసిని. 

కథ ఏమి తట్టట్లేదు అందుకే ఆలోచిస్తున్నా.  

ఓకే బంగారం లాంటి ట్రెండింగ్ యూత్ స్టోరీస్ తియ్యండి మళ్ళీ రామాయణం, మహాభారతం జోలికి వెళ్లకుండా.  

ఇంతలో T.V లో పాట వస్తోంది. ఆ పాట అయిపోగానే సుహాసిని గారు పిలుస్తున్నా పట్టించుకోకుండా రూంలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. 

ఆ తరువాత ఒక కథ రాసుకొని 'చెలియా' అనే సినిమా తీశాడు. ఆ సినిమా తీయడానికి టీవీ లో చూసిన ఆ పాటే ఇన్స్పిరేషన్ ఇచ్చింది.

ఆ పాట ఏంటంటే తను మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆయనే తీసిన 'సఖి'  సినిమా లోని 'కలలై పోయెను నా జీవితం' అనేది.  ఆ పాట లో హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరో వెళ్ళి చివరికి ఎక్కడో మెడికల్ క్యాంపు లో ఉన్న తనను కలుస్తాడు.

ఇక 'చెలియా' సినిమా కూడా అంతే, ఆర్మీ బ్యాక్ డ్రాప్ పెట్టేసి హీరోయిన్ తో గొడవ పడిన హీరో  చివరకి ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఎక్కడో మెడికల్ క్యాంపు లో కలుస్తాడు. ఆయన అన్ని సినిమాల్లో లాగానే హీరోయిన్ ని అద్భుతంగా చూపించారు కానీ మొహం మీద మీసాలు లేని కార్తీ ని చూడటమే కాస్త ఇబ్బందిగా అనిపించింది.  సినిమా మరీ బాలేదా అంటే బాగుంది అది కూడా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ వరకే ఆ తర్వాతంతా బోర్. ఈ మధ్య మణి గారి సినిమాలంటే భయం వేస్తోంది చూడాలంటే, అంత చెత్తగా ఉంటున్నాయి మరి ఆయన ఈ మధ్య కాలంలో తీసిన ఓకే బంగారం మూవీ మాత్రం ఇంకా చూళ్ళేదు. అదెలా ఉందో చూడాలి.

జనతా హోటల్ అనే మళయాళ డబ్బింగ్ సినిమా కూడా చూశాను. ఏదో అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన టైములో ఏదో ఆ టైటిల్ కలిసి వచ్చేట్లు పెడితే కాస్త క్రేజ్ వస్తుంది అనుకొని జనతా హోటల్ అని పెట్టి ఉంటారు అనుకొని ఆ సినిమా వైపు చూడలేదు. మొన్న ఏ సినిమా దొరక్క ఆ సినిమా చూశాను యు ట్యూబ్ లో. 

ఆ సినిమాలో నాకు ముందుగా నచ్చిన విషయం మ్యూజిక్. ఆ మ్యూజిక్ వింటున్నంతసేపు నాకు బాగా నచ్చిన సినిమా అయిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' గుర్తుకు వస్తూనే ఉంది. సరే ఆ రెంటిలో ఏ సినిమా మ్యూజిక్ ఒరిజినల్ అయి ఉండచ్చు అని గూగుల్ లో గాలిస్తే రెంటికీ గోపి సుందరే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసింది.  గోపి సుందర్ మలయాళం సినిమా అయిన 'ఉస్తాద్ హోటల్' లోని background మ్యూజిక్ నే 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లో చాలా వరకు రిపీట్ చేసాడు అని అర్థమైంది రెండింటిలోనూ ముస్లిం ఫామిలీ background ఉండటం ఒక కారణం కావచ్చు. నాకు ఆ రెండు సినిమాలు నచ్చడానికి కథ ఒక కారణం అయితే రెండోది పాటలు, background మ్యూజిక్. మూడోది అందులో నటించిన నటీనటులు. ఆ సినిమా చూశాక అర్రే, ఇన్ని రోజులు జనతా హోటల్ లాంటి మంచి సినిమా మిస్ అయ్యానే అనిపించింది. 

గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలేవి అని నెట్లో వెదికితే అందులో చాలా వరకు ఈ మధ్య కాలంలో  నేనెప్పుడూ వినే పాటలు, నాకు నచ్చిన పాటలు అతను కంపోజ్ చేసినవే అని తెలిసింది. అందులో కొన్ని మజ్ను, నిన్ను కోరి, ఊపిరి, మజిలీ, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు లోని సినిమా పాటలు. 

ఒకే సంవత్సరంలో 25 సినిమాలకు సంగీతం అందించిన ఘనత కూడా ఉందట ఇతని ఖాతాలో. 

ఇక నేను రుచి చూసిన పొరుగింటి పుల్లగూరలో బాగా పులుపు ఎక్కింది jackpot అనబడే మరొకటి. జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో వచ్చిన కామెడీ యాక్షన్ సినిమా. యాక్షన్ అని ఎందుకు అన్నానంటే రెగ్యులర్ తెలుగు, తమిళ హీరోల్లాగానే జ్యోతిక కూడా విపరీతమైన బిల్డప్ లతో ఫైట్స్ చేస్తుంది కాబట్టి. మైండ్ లెస్ కామెడీ అంటారు కదా అలాంటి సినిమా ఇది. మొదటి సగం కాస్త కామెడీ గా బానే ఉంటుంది రెండో సగం బాగా సాగదీయడంతో నీరసం వచ్చేస్తుంది. సగం సినిమా చూసేసి మిగతాది చూడకపోవడం బెటర్ మన F2 సినిమా లాగా. 

Monday, 18 November 2019

ఈ పాపం ఎవరిది? - అక్కడా ఇక్కడా విన్న మంచి కథలు

అనగనగా అదేదో ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని ఏలే రాజుగారికి ఏడుగురు కొడుకులు ...  ఉన్నారో లేదో నాకు తెలీదు కానీ ఉన్నదంతా ఊరోళ్ళకు పంచిపెట్టే టైపు. అందువల్ల  ప్రతీ రోజూ పేదవాళ్లకు అన్నదానం చేసేవారు. 

ఒక  రోజు మధ్యాహ్నం భోజనం వండి వడ్డించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  అదే  సమయం  లో   ఆకాశం  లో  ఒక  గద్ద కాళ్ళతో  ఒక పాముని పట్టుకొని గాల్లో  ఎగురుతూ వెళ్తోంది.  ఆ  పట్టుకున్న  పాము  నోటి నుండి జారిన  విషం  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న  అన్నం మీద  పడింది  .  అది  ఎవరూ  గమనించలేదు. ప్రతీ మెతుకు మీద తినబోయే వారి పేరు ఉంటుంది అంటారుగా ఆలా ఆ విషం పడ్డ మెతుకులమీద ఒక పేద బ్రాహ్మణుడి పేరు రాసి ఉందేమో మరి, ఆ భాగం  తిన్న ఆ  పేద బ్రాహ్మణుడు  చనిపోయాడు.  

ఈ  వార్త  రాజుగారికి  చేరింది.   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు. పిల్లిని చంపిన పాపమే గుడి కట్టించినా పోదు అంటారు అలాంటిది నా వల్ల ఒక బ్రాహ్మణుడే చనిపోయాడు. దానికి తోడు పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి అంటారు కాబట్టి ఈ పాపం నాకు మాత్రమే చుట్టుకుంటే పర్లేదు, నా రాజ్యానికి కుటుంబానికి వంశానికి చుట్టుకోకుండా చూడు తండ్రీ అని దేవుడిని వేడుకున్నాడు.   

పైన అకౌంట్స్ రాసుకునే చిత్రగుప్తుడికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ  బ్రాహ్మణుడు  చనిపోవడానికి  కారణం  ఎవరు ?

విషం వదిలిన పామా ? 

లేక పాముని పట్టుకున్న గద్దా ? 

రాజా ? 

వంట చేసిన మనిషా ?    

వడ్డించిన  వ్యక్తా ?  

మరి ఈ  పాపాన్ని ఎవరి అకౌంట్ లో వెయ్యాలి ? 

కావాలని  ఎవరూ   ఆ  బ్రాహ్మణుడిని   చంపలేదు.

అందుకని అతని మేనేజర్ అయిన యమ  ధర్మరాజును  అడిగాడు.  ఆయనకు కూడా అది భేతాళ ప్రశ్న లాగే అనిపించింది. సరే కాస్త అలోచించి చెప్తాను అని అందరు మేనేజర్స్ లాగే అప్పటికి తప్పుకున్నాడు.  

మర్నాడు దారిన  పోతున్న బ్రాహ్మణులు  కొందరు  అన్నదానం  జరిగే  చోటును  చెప్పమని  అక్కడున్న సూర్యకాంతం ని అడిగారు .  

ఆవిడ వారికి  దారిని  చూపుతూ  “ బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి బాపనోళ్ళు అంటే పడదు.  నిన్ననే  ఒకాయనను  విషం  పెట్టి  చంపించేశారు. మీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర పడ్డాయేమో ఆలోచించుకొని వెళ్ళండి నాయనా? ఊపిరుంటే ఉప్పయినా అమ్ముకొని బతకచ్చంటారు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అని ఆ రోజుకు తన కడుపు నింపుకుంది  ఖాళీ కడుపులతో ఉన్న బ్రాహ్మణుల మనస్సుల్లో అనుమానాలు మొలకెత్తించి. 

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపించిన ధర్మరాజు గారు “చిత్రగుప్తా! యాదృచ్చికంగా ఏదైనా జరిగినప్పుడు దానిని ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యక్తులు చేయనప్పుడు అనవసరంగా ఆ వ్యక్తులకు అంటగట్టి, వారిని నిందించే  వారికే ఆ  మొత్తం  కర్మ  ఫలం చెందాలి అని  శాస్త్రాలు చెబుతున్నాయి అదే ధర్మం కూడా, కాబట్టి మొత్తం  పాపం  అంతా  ఆమె అకౌంట్ లో వెయ్యి”  అన్నారు.

మొత్తానికి నీతి ఏమిటంటే అనవసరంగా ఇతరులపై బురద చల్లడానికి ప్రయత్నించకండి అది మీ నెత్తి మీదే పడచ్చు అని.  దీనినే కర్మ ఫలం అదీ ఇదీ అంటారు కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, వేదాలు అవీ తిరగేసిన వారు.

P.S: పాత సినిమాల్లో ఏదైనా గయ్యాళి భార్య లేదా గయ్యాళి అత్త  లాంటి పాత్ర ఉంటే వారు గయ్యాళి అని చూపెట్టడానికి అనవసరంగా రెండు మూడు  సీన్స్ పెట్టాలి దానికో రీల్ వృధా ఖర్చు ఎందుకని ఆ పాత్రకు సూర్యకాంతాన్ని తీసుకునేవారట. ఆల్రెడీ ఆవిడ అలాంటి పాత్రలు ఎన్నో సినిమాల్లో చేసింది కాబట్టి ఆవిడని తెర మీద చూడగానే ఈ పాత్ర గయ్యాళి పాత్ర లేదంటే చాడీలు చెప్పే పాత్ర అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు కాబట్టి. అందువల్ల నేను కూడా సూర్యకాంతం అనే పేరుని వాడాను తప్పితే ఆ పేరు గల (ఎవరైనా అలాంటి పేరు గల వాళ్ళు ఈ పోస్ట్ చదువుతుంటే..ఛాన్స్ ఉండకపోచ్చు ఒక వేళ ఉంటే ) వాళ్లను కించపరచాలని కాదు.