23, సెప్టెంబర్ 2019, సోమవారం

ఒరు నాళ్ ఇరవిల్ - ఒరు తమిళ్ పడం

నాకు తమిళ చిత్రాలతో అనుబంధం డబ్బింగ్ సినిమాల ద్వారా చిన్నప్పటి నుంచే మొదలైంది, కాకపోతే డైరక్ట్ తమిళ సినిమాల వాసన తగిలింది మాత్రం తిరుపతి లోనే. 

సరే మనకున్న సినిమాల passion కు (దీన్నే పిచ్చి అని అంటారు కొందరు) లాంగ్వేజ్ barrier అనే అడ్డెందుకు అని డిసైడ్ అయి, తమిళ్ సినిమా చూద్దాం అని "పళని" కి బయలుదేరా. పళని అంటే తమిళనాడు లో ఉండే ఊరు అని పొరపడకండి. అది మా ప్లాట్ నెంబర్ 62 దగ్గర్లో ఉన్న థియేటర్. అక్కడి నుంచే ఈ తమిళ సినిమాల వాసన తగిలేది.

అక్కడ నేను చూసిన మొదటి సినిమా 'పార్థేన్ రసితెన్' అనే తమిళ హిట్ చిత్రం (తెలుగులో శ్రీకాంత్ హీరోగా 'నా మనసిస్తా రా' అని రీమేక్ చేస్తే అట్టర్ ప్లాప్ అయింది, అది వేరే విషయం). అప్పట్లో టీ బంకుల దగ్గర తమిళ హోటల్స్ లో ఈ సినిమా పాటలు మార్మోగిపోయేవి. ఇప్పటికీ వినడానికి బాగుంటాయి, తమిళ్ నచ్చకపోతే తెలుగు సినిమా పాటలు వినండి, మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్.

ఆ సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు ఒక తమిళ్ వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను నిల్చొని ఉంటే 'ఉక్కారుంగా' అన్నాడు ఖాళీ సీట్ చూపిస్తూ, ఆ 'ఉక్కారుంగా' కి అర్థం తెలియకపోయినా కూర్చోమంటున్నాడు కదా అని అర్థమై కూర్చున్నా అక్కడ ఖాళి సీట్ లో.

కాసేపటికి 'నేరం ఎన్న?' అనేదో అన్నాడు.

ఇదేమైనా పోలీస్ స్టేషనా 'నేరం ఏం చేసావ్?' అని అడగటానికి అని కన్ఫ్యూజ్ అయ్యా,

'నేరం ఎన్న?' అన్నాడు ఈ సారి మళ్ళీ నా చేతి కున్న వాచ్ వైపు చూపిస్తూ.

2:30 అన్నాను.

తర్వాత మళ్ళీ తమిళ్ లో ఏదో అన్నాడు, ఆ  ముక్క అర్థం కాలేదు, ఇప్పుడు గుర్తు కూడా లేదు.

"ఎనక్కు తమిళ్ తెరియాదు" అన్నాను వచ్చీ రాని తమిళ్ మాటలు కూడబలుక్కొని.

మరి తమిళ్ సినిమాకి ఎందుకు వచ్చావ్? అన్నట్లు పేస్ పెట్టాడు అతను. 

సో అలా మొదలైన ఆ తమిళ సినిమాల వాసన ఇప్పటికీ నన్ను తాకుతూనే ఉంటుంది. పొరుగింటి పుల్లగూర రుచి అన్నట్లు, నా మటుకు నాకు చాలా వరకు తమిళ్ సినిమాలు బాగా నచ్చుతాయి.  అందులో భాగంగానే ఈ మధ్య చూసిన నాకు నచ్చని/నచ్చిన ఓ నాలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం.  అందులో మొదటిగా  'ఒరు నాళ్ ఇరవిల్' అనే తమిళ సినిమా తో మొదలెడతాను.  

సత్యరాజ్ తప్ప సినిమాలో చాలా వరకు నాకు తెలియని నటీనటులే. ఇది 'షట్టర్' అనే మళయాళ సినిమా రీమేక్. ఆ మళయాళ మాతృక గురించి పెద్దగా తెలియదు గానీ ఈ తమిళ సినిమా మాత్రం నాకు బాగా నచ్చింది. ఇదే సినిమాని తెలుగులో ప్రకాష్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా 'మన ఊరి రామాయణం' అని తీశారు. 

వీలయితే ఈ తమిళ సినిమాని మీరూ చూడండి, నచ్చుతుందనే అనుకుంటున్నాను. యు ట్యూబ్ లో ఫ్రీ గానే దొరుకుతుంది.

అలాగే Monster అని మరో తమిళ్ సినిమా చూశాను, డైరెక్టర్ కం యాక్టర్ అయిన S.J. సూర్య హీరో గా నటించిన సినిమా, చాలా బాగుంటుంది కామెడీగా. 'ఏ ప్రాణినీ చంపడానికి ఇష్టపడని ఒక వ్యక్తి' అనే చిన్న కాన్సెప్ట్ ని స్టోరీ గా మలచి తీసిన సినిమా. సినిమాలో మెజారిటీ భాగం హీరో, ఎలుక మధ్య నడిచే సన్నివేశాలతోనే ఉంటుంది.  కాకపొతే ఎలుకంటే చాలా మందికి చూడటానికే అలర్జీగా అనిపిస్తుంది కాబట్టి అలాంటి వారి గురించి చెప్పలేను కానీ లేదంటే చూడ్డానికి సినిమా చాలా బాగుంటుంది.

ఎక్కడో ఫారిన్ లో పాటలు, ఒక పద్ధతీ పాడూ అంటూ లేని హీరోయిన్ వ్యక్తిత్వం, ఒసేయ్, పోవే అంటూ హీరోయిన్ లను వెకిలిగా పిలిచే హీరో క్యారెక్టర్, ఐటెం సాంగ్స్, ఇవే కాకుండా అమ్మ, అన్న, వదిన అని తేడా లేకుండా అందరినీ వంగోబెట్టి తంతూ ఉంటే అదే కామెడీ అని ఇష్టపడేవాళ్ళు మాత్రం ఈ సినిమాలకు దూరంగా ఉండటం మంచిది.  అలాంటి వారికి నచ్చే మరో సినిమా కూడా చూశాను అదే కాంచన-3.

ఇక మీరెంత టార్చెర్ భరించగలరో టెస్ట్ చేసుకోవాలి అనిపిస్తే 'Anbanavan Asaradhavan Adangadhavan' సింపుల్ గా AAA అనబడే శింబు సినిమా చూడండి. 

15, ఆగస్టు 2019, గురువారం

తలా తోక లేని కథే కావచ్చు

పెన్సిల్ తన మానాన తాను ఏదో రాస్తోంది. 

అప్పుడప్పుడూ రబ్బర్ కొంచెం కొంచెంగా కొట్టేస్తూ ఉంది . 

ఎందుకు కొట్టేస్తున్నావ్? 

నువ్వు తప్పు రాశావు, అందుకే 

కాసేపటికి మళ్ళీ రబ్బర్ కొట్టేసింది.  

మళ్ళీ ఎందుకు?

నువ్వు మళ్ళీ తప్పు రాశావు, అందుకే. 

"నువ్వు ఇలా ప్రతి సారి అడ్డుతగిలితే నేను పూర్తి చెయ్యలేను" విసుక్కుంది పెన్సిల్ 

అయినా రబ్బర్ తన పని తాను చేస్తూనే ఉంది. 

నిన్ను తిట్టినా నీకు బుద్ధి రాదు, అయినా ఎందుకు ఎప్పుడూ నా వెన్నంటే ఉంటావు, నీకు అస్సలు సిగ్గు లేదు. 

ఇవేమీ పట్టనట్లుగా రబ్బర్ తన పని తాను చేస్తూనే ఉంది. 

ఇలా పెన్సిల్ రాస్తూనే ఉంది, రబ్బర్ సరిచేస్తూనే ఉంది. 

కొంతకాలానికి రాయడం పూర్తయ్యింది, చాలా బాగా రాశావని అందరూ పెన్సిల్ని మెచ్చుకున్నారు. 

పెన్సిల్ ఇంటికి వస్తూనే 'చూశావా, ఎప్పుడూ నేను రాస్తుంటే తప్పులు, తడకలు అంటూ నాకు అడ్డు తగులుతూ నన్ను అరగదీస్తుండేదానివి.   ఇప్పుడు చూడు చాలా బాగా రాశానని అందరూ మెచ్చుకుంటున్నారు, నువ్వు అడ్డు రాకపోయి ఉంటే ఇంకా తొందరగా పని పూర్తి చేసేదాన్ని' అని రబ్బర్ తో అందామనుకుంది. 

రబ్బర్ మాత్రం ఎక్కడా  కనిపించలేదు, రబ్బర్ అరిగిపోయి చాలా చిన్న ముక్క మిగిలి ఉండటం వల్ల నేమో పనికి రాదని చెత్త బుట్ట లోకి తోసేసినట్లు గుర్తొచ్చింది. 

ఒకప్పుడు బలంగా, పెద్దగా ఉండే రబ్బర్ ఇలా పీలగా, చిన్నగా అయిపోయిందనే విషయం అప్పుడే అర్థం అయింది. 

నేను తప్పు చేసిన ప్రతీ సారి నన్ను సరిచేస్తూ నువ్వు అరిగిపోతున్నావని నేను గుర్తించలేకపోయాను, క్షమించు అంది పెన్సిల్. 

ఇంతే కథ. ఇది అర్థం పర్థం లేని, తలా తోక లేని కథే కావచ్చు, కానీ రబ్బర్ స్థానం లో మన తల్లిదండ్రులు, పెన్సిల్ స్థానం లో మనము ఉన్నామని గుర్తిస్తే ఈ కథకు తల, తోకే కాదు ప్రాణం కూడా ఉందని అనిపిస్తుంది.