9, జూన్ 2020, మంగళవారం

లాక్ డౌన్ తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా??


లాభయ్య బాబు, విరంజీవి అనే ఇద్దరు పేద్ద నటులు ఒక చోట సమావేశమయ్యారు.  గత కొద్ధి రోజులుగా వీరిద్దరి మధ్య వైరం రకోనా కన్నా వేగంగా పెరుగుతోందని అన్ని సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలు విని కరోనా వైరస్ లాగా దీన్ని కూడా తుంచేయాలని వారిద్దరూ నడుం వాల్చారు. 

ఇప్పటికిప్పుడు ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని లోకానికి ఎలుగెత్తి చాటాలని నిర్ణయించుకున్నారు. 

నేను నిన్నే అరవై క్రాస్ చేశాను మహా అయితే ఇంకో అరవయ్యేళ్లు (నిజ్జంగా నిజం లాభయ్య బాబే అలా అన్నారట ఒక ఇంటర్వ్యూ లోమాత్రమే హీరోగా నటించగలను అనిపిస్తోంది

నేను కూడా  మధ్యే 65 కి దగ్గరయ్యా, నా స్టార్ డం (??)  తో బాక్స్ ఆఫీస్ ని ఇంకో పాతికేళ్ళు  మాత్రమే గడగడ లాడించగలనుకాబట్టి మనం ఎన్ని సినిమాలు చేస్తే కళామతల్లికి అంత సేవ చేసినట్లు

మౌళిరాజా ను పెట్టుకుందామా మన సినిమా తీయడానికి?

మనం కాదు, ఆయనకి ఇప్పుడున్న ఫేమ్ కి మనం ఆయన్ని పెట్టుకునే సీన్ లేదు, ఆయనకి అనిపిస్తేనే మనల్ని పెట్టుకుంటాడు. 

మా బ్లడ్డు, బ్రీడ్ అలాగే మేము తినే బ్రెడ్డు మా రేంజ్ వేరు, అలాంటిది మాకు అంట సీన్ లేదంటావా?

అయినా ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాని పూర్తి చేయడానికే సంవత్సరం పడుతుంది, మనకు కుదరదు. 

మరి వితిక్రమ్ ని ట్రై చేద్దామా?

అతనూ అంతే, మరి నీతో మాంచి హిట్స్ తీసిన బోయటపా?

పెద్ద పెద్ద ఫైటింగ్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తాడు, ఈ కరోనా టైములో అవి షూట్ చేయడానికి టైం పడుతుంది. వినాషక్ ని ట్రై చేద్దామా?

వినాషక్ మన లాంటి ముదురు హీరోలను చూసి ఇన్స్పైర్ అయి ఈ వయసులో కూడా యాక్షన్ హీరో అవ్వాలనుకొని ఒక సినిమాలో హీరో గా చేస్తూ బిజీ గా ఉన్నాడు కాబట్టి వీలుపడదు. 

కరోనాకాలం లో కూడా సినిమా చుట్టేసిన నిర్జీవి మాత్రమే ఇప్పటికిప్పుడు సినిమా తీయగలడు అని ఆయన్ని వెళ్లి కలిశారు. 

మీ ఇద్దరినీ కలిపి సినిమా తీయాలంటే నా లాంటి వాడే సరైన వ్యక్తి. సైరా, శాతకర్ణి కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసినట్లు ఒక కాల్పనిక కథ రాసుకుందాం రెండు సినిమాల్లోని కొన్ని సీన్స్ తీసుకొని నా స్టైల్ ఎడిటింగ్ టచ్ ఇస్తాను. మిగతాది నేను కొంత తీసి అతికిస్తాను. అలాగే వాళ్ళిద్దరిని ఇన్స్పైర్ చేసే నార్త్ ఇండియన్ క్యారెక్టర్ లో మియతాబ్ ని తీసుకుందాం. తనకి నేను యెంత చెప్తే అంత, నా మాట వింటాడు

మా బుడ్డోడు, రచణ్, విజయ్ గదేవన్ కలిసి నటిస్తున్న RRR సినిమా స్టోరీ లా అనిపిస్తోంది నువ్వు చెప్తున్న కథ వింటుంటే

మరీ మంచిది, బాగా కాంట్రవర్సీ అవుతుంది, నాకు, నా సినిమాకి అదే పబ్లిసిటీ తెచ్చిపెడుతుంది, నాక్కావలసింది కూడా కాంట్రావర్సీనే. మన కథకు RRR అని కాకుండా SSS ( సైరా శాతకర్ణి సమరం) అని పెట్టుకుందాం. ఇక కథ ప్రకారం హీరోయిన్ గా లాభయ్య బాబు పక్కన ఒక ఫారిన్ పిల్లని తీసుకోవాలి కాబట్టి 'యమా పాలకోవా' ని తీసుకుందాం, మొన్న నా S.G.T , నిన్న నా ఐమాక్స్ సినిమాలో భలే నటించింది

కానీ కోక, రైక అని నా మార్క్ పాట ఒకటి ఉండాలి

యమా పాలకోవా కి అలాంటి పాట సెట్ అవదు, నేను ఇంకో పాట రాసి సెట్ చేస్తా

సరే పాట ఇప్పుడు బాగా పాపులర్ అయినా దిస్ శ్రీశ్యామ్  తో పాడిద్దాం

అవన్నీ అవసరం లేదు, నేను బాగా పాడగలను మొన్నీ మధ్యే రకోనా సైరస్ మీద ఒక పాట పాడా, అది బాగా పాపులర్ అయింది.  

సరే లాభయ్య బాబు పక్కన యమా పాలకోవా ని తీసుకుంటున్నారు కాబట్టి నా పక్కన మన దేవిశ్రీ కూతురు నాజ్వి ని తీసుకోండి, మా జోడి చూడ్డానికి బాగుంటుంది

విషయం నాకొదిలేయ్, గజలోక వీరుడు మతిలేని సుందరి సినిమాలో ఒక రెండు పాటలు తీసుకుని ఎడిటింగ్ చేసి దేవిశ్రీ బదులు దేవిశ్రీ కూతురు డాన్స్ చేసినట్లు ఎడిటింగ్ చేయిద్దాం. ఇలా త్వరగా సినిమా చుట్టేస్తే లాక్ డౌన్ తర్వాత థియేటర్ లో విడుదల అవుతున్న మొదటి సినిమా మనదే అవుతుంది

అదీ ఈ రోజుకి నాకు తట్టిన తలా తిక్క ఆలోచన నిన్న నిర్జీవి ఇంటర్వ్యూ చూసాక. మరి అలాంటి సినిమా నిజంగానే వస్తే నరసింహనాయుడు + ఇంద్ర అంత హిట్ అవుతుందో లేక ఒక్క మగాడు + మృగరాజు అంత ఫట్టు మంటుందో చూడాలి.  

2, ఏప్రిల్ 2020, గురువారం

ఈ సినిమా వాళ్ళు ఇంతే

ఈ సినిమా వాళ్ళు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా వేలల్లో దానం చేయడానికి కూడా ఛస్తుంటారు. అందుకే వారి తీరును ఉతికి ఆరేసి ఎండగడతా ఈ రోజు పోస్టులో. 

నేను కడప లో చదివేప్పుడు అనుకుంటా చిరంజీవి ఏమో Thumbs Up అని, పవన్ కళ్యాణ్ ఏమో పెప్సీ అని ప్రమోట్ చేసి వాళ్ళ జేబులు నింపుకుంటే ఆ ఇద్దరి ఫాన్స్ చొక్కా జేబులు చించుకుని మరీ కొట్టుకున్నారు.  అదేదో థియేటర్ లోనే కొట్టుకు చచ్చారు కూడా. 

ఇక ఫెయిర్ అండ్ లవ్లీ, సంతూర్, లక్స్ మోసాలు చెప్పాల్సిన అవసరం లేదు, తరతరాలుగా తారలను పోషిస్తూ మధ్య తరగతి కుటుంబీకుల నడ్డి విరిచేస్తున్నాయి. 

మహేష్ బాబు మాత్రం ఎన్ని కార్పొరేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడరో ఎవరికీ తెలీదు. Thumbs Up లాంటివి మంచిది కాదు అని తెలిసీ ప్రమోట్ చేయడానికి ఒప్పుకుంటారు, అదే సినిమాలో అయితే ప్రజల తరపున పోరాడతారు, అంతా డబ్బు మాయ. ఆయనకున్న కోట్లల్లో మరీ కోటి రూపాయలు COVID విరాళం ఏమిటండీ మరీ చోద్యం కాకపొతే. శ్రీమంతుడు సినిమాలోనేమో ఆస్తి మొత్తం ఖర్చు పెట్టేస్తాడు ప్రజల కోసం.  ఈ సినిమా హీరోలంతా ఇంతేనండీ.   చెప్పేది శ్రీ రంగ నీతులు, దూరేది *** . 

అందరి మీద కంటే మహేష్ బాబు మీద కూసింత విషం ఎక్కువే కక్కేసినట్లున్నాను. ఎంతైనా అసూయ అతనంటే,  అందగాడు, పైగా మూణ్ణెల్లకోపాలి పెళ్ళాం పిల్లల్ని సంకలో ఎత్తేసుకొని పారిన్ టూర్లన్నీ తిప్పేస్తుంటాడు. అందుకే అందరు భార్యలు మహేష్ బాబు లాంటి మొగుడు కావాలి అంటారు. అయినా మా లాంటి నెలసరి జీతగాళ్ళ వల్ల అవుతుందా ఇలా తిప్పాలంటే? 

సరే లారెన్స్ లాంటి వాళ్ళు అంతో ఇంతో చేతనైన సాయం చేస్తుంటారు అనుకోండి పేదల కోసం అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సినిమా రంగంలో. 

ఇక మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం తానా, తందానా అంటూ U.S వెళ్ళి తైతక్కలాడతారు అక్కడ మనోళ్ల నెత్తి మీద చెయ్యెయ్యడానికి. ఏం కోట్లకు కోట్లు పెట్టి ఇళ్ళు, కారవాన్ లు కట్టుకుంటారు కానీ వాళ్ళ సొంత డబ్బుల్తో అసోసియేషన్ బిల్డింగ్ కట్టడానికి మాత్రం వీళ్లకు మనసొప్పదు. 

ఇక పొలిటీషియన్స్ గురించి నన్నడకండి, నాకంటే మీకే బాగా తెలిసి ఉంటుంది, నేనసలే శానా ఈక్ పాలిటిక్స్ లో.

నేనిక్కడ ఇంత సీరియస్ గా ఈ సినిమా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎండగడుతుంటే ఎవరో మా ఇంటి డోర్ కొడుతున్నారు. చూసేసి వస్తా. 

ఎవరు కావాలి? మీరు

మెర్రీ

మెర్రీ క్రిస్మస్?

నో, మెర్రీ ఈస్టర్

Ok merry, చెప్పండి

COVID మీద పోరాటానికి విరాళాలు సేకరిస్తున్నాం. 

విరాళమా?

వందలు ఏమి అవసరం లేదు సర్, మీ వంతుగా కనీసం ఒక రెండు డాలర్లు ఇచ్చినా చాలు సర్. 

Change లేదు

Card ఇచ్చినా ok

కార్డు కాకెత్తు కెళ్ళింది

Sorry

Card తీసుకొని మా ఆవిడ ఇందాకే షాపింగ్ వెళ్ళింది


ఈ క్రైసిస్ లోనా?

అవును, అది వారి జన్మ హక్కు అడగడానికి ఎవరికీ ధైర్యం లేదు.  

మరి ఇంట్లో ఉన్న ఆవిడ ?

మా బామ్మ  

బాగా యంగ్ గా ఉన్నారు, నమ్మకం కలగడం లేదు

బాల్య వివాహం 


ఓహ్ అలాగా పాపం , మరి COVID బాధితులకు మీ వంతు సాయం ....

నా వంతు సాయం అంటే ఒక చిన్న జోక్ గుర్తొస్తోంది, చెబుతా విను. 

నాకు టైమ్ లేదు సర్ 

టైమ్ అంటే మరో పెద్ద జోక్ గుర్తొస్తోంది. 

వద్దులేండి  సర్,ఆ చిన్న జోకే చెప్పెయ్యండి వింటాను. 

నీలాంటి ఒక వ్యక్తి నాలాంటి పెద్ద మనిషి దగ్గరికి వచ్చి 'మేష్టారు, వృద్ధుల కోసం వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఉచితంగా సేవ చేద్దామనుకుంటున్నాను, మీ వంతు సాయం చేస్తే బాగుంటుంది' అని అడిగాట్ట. 

అప్పుడు దానిదేముంది, మా అమ్మా, నాన్నను మీ వృద్ధాశ్రమానికి పంపిస్తాను లెండి అన్నాడట ఆ పెద్దమనిషి. 

ఇప్పుడు నీకు ఆ జోక్ ఎందుకు చెప్పానో అర్థమైందా?

అర్థమయింది. వెళ్ళొస్తాను సారీ వెళ్తాను సర్. 

ఆ ఏం చెప్పుకుంటున్నాం, ఈ సినిమా వోళ్ళు అంతా ఇంతే, ఒక్క లక్ష విదిల్చడానికి కూడా చస్తారు కోట్లు పెట్టుకొని ఏం మనుషులో ఏమో మానవత్వం మచ్చుకైనా ఉండదు. ఈ ప్రపంచాన్ని బాగు చేయడం ఈ కరోనా వల్ల కూడా కాదు.