కరడు కట్టిన చిరంజీవి అభిమాని పోస్ట్ కి తరువాయి భాగం
వాళ్ళింటికి పిలిచి 'బాలయ్య ఫ్యాన్ గా మారిపోదామా' అని ప్రపోసల్ ఏమైనా పెట్టాడా మీ వాడు అని చాలా మంది అడిగారు ఆ పోస్ట్ చదవగానే.
కాదండి అంతకంటే పెద్ద షాక్ ఇచ్చాడు అదేంటో తెలుసుకోవాలంటే చదవండి మరి.
వాళ్ళ ఇంటికి వెళ్ళగానే పెరట్లో ఎప్పుడూ ఉండే కుక్కి మంచం కనపడలేదు. మంచం విరిగిందా అని అడిగాను?
లేదు. పోయిన వారమే మా అమ్మ వృద్దాశ్రమానికి డొనేట్ చేసింది అన్నాడు.
మరి దానిపై కూర్చుని ఉండే మీ బామ్మ
తను మొన్నే పోయిందిరా
ఖాసీం .. పనికి మాలిన విషయాలన్నీ గంటల తరబడి మాట్లాడుతావ్ కానీ మీ బామ్మ పోయిన విషయం మాత్రం చెప్పలేదేరా
పోవడం అంటే ఆ పోవడం కాదురా ఆ మంచం మీద తప్ప ఇంకెక్కడా నిద్ర పట్టలేదంటేనూ తననూ వృద్దాశ్రమానికి పంపించేసిందిరా మా అమ్మ
దాన్ని పోవడం అనరురా పంపించడం అంటారు
కరక్టే అనుకో కానీ మా బామ్మ గురించి ఎవరు అడిగినా తనే వెళ్ళిపోయినట్లుగా చెప్పమందిరా మా అమ్మ.
ఇక అంతకంటే వాళ్ళ అమ్మ గురించి మాట్లాడితే అట్లు దక్కవని గ్రహించి సైలెంట్ గా ఉండిపోయి అట్లు తింటూ వాటి రుచికి మైమరిచిపోయిన ఆ బలహీన క్షణం లో 'చిరంజీవి సినిమాలు ఫ్యాన్స్ షో గాని, మొదటి రోజు మొదటి షో గానీ నువ్వెప్పుడూ చూడద్దు అని పెరటి గట్టు మీద కూర్చోబెట్టి వాళ్ళమ్మ చేసిన అట్టు పెట్టి పట్టు బట్టి ఆ అట్టు మీద గట్టి గా ఒట్టు వేయించుకున్నాడు.'
ఇంతకీ అలా ఫ్యాన్స్ షో లోనో, మొదటి రోజు మొదటి షో లోనే చూసిన ఆ నాలుగు కళాఖండాలు ఏవో మీకు చెప్పలేదు కదూ అవి ముగ్గురు మొనగాళ్లు, S.P పరశురామ్, బిగ్ బాస్, రిక్షావోడు.
దెబ్బకు ఒట్టు తీసి గట్టు మీద పెట్టలేక ఆ తర్వాత రిలీజ్ అయినా హిట్లర్ సినిమా ఫస్ట్ రోజు చూడలేదు. ఆ సినిమా హిట్, ఆ తర్వాత వచ్చిన చిరంజీవి సినిమాలు మూడు నాలుగు నేను మొదటి రోజు చూడలేదు అవి బాగా హిట్ అయ్యాయి. దాంతో మా వాడి నమ్మకం బాగా బలపడి పోయింది. వాడి నమ్మకాన్ని మరింత బలపరచడం ఇష్టం లేక తాడిపత్రి వెళ్ళినప్పుడు మా పెదనాన్న కొడుకుతో కలిసి 'ఇద్దరు మిత్రులు' సినిమాని మొదటి రోజు చూసిన విషయాన్ని దాచి పెట్టాను. ఆ అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపమో ఏమో ఆ తర్వాత నా జీవితం లో అట్టు అనేది అంతమైపోయి దోశ అనేది మొదలైంది. (దోశ కు అట్టు కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది)
పేలాలు Popcorn గా రూపాంతరం చెందుతున్న రోజుల్లో కప్పనది లోంచి మరోనది లోకి వచ్చి పడింది. M.C.A చదవడానికి తిరుపతి చేరాను.
అక్కడ మరో సారి ఒట్టు తీసి గట్టున పెట్టేశాను. ఫ్రెండ్స్ ఒత్తిడి మేరకు తొలి రోజు తొలి ఆట 'మృగరాజు' సినిమా బుట్టెడు popcorn తింటూ చూశాను. ఈ విషయం ఖాసీం కు తెలిస్తే నన్ను మృగరాజులా నమిలేస్తాడేమో. ఆ అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపమో ఏమో ఆ తర్వాత ఎందుకో Popcorn అంటే ఇష్టం పోయింది.
సేమియా వదిలేసి మ్యాగీ వెంట పడుతున్న రోజుల్లో కప్ప నది లోంచి సముద్రం లోకి వచ్చి పడింది. ఉద్యోగ అన్వేషణ కోసం బెంగళూరు చేరాను.
మళ్ళీ మాట తప్పాను.. పొద్దుటే లేచి రూమ్ లో ఇష్టమైన మ్యాగీ చేసుకొని తిని చంద్ర, చిన్ని భయ్యా తో కలిసి 'అంజి' సినిమా బెంగళూరు లోని సుద్దగుంట పాళ్య శ్రీనివాస థియేటర్ లో ఉదయం 7 గంటలకే చూసాను. ఫలితం తెలిసిందే. ఆ అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపమో ఏమో ఆ తర్వాత ఎందుకో మ్యాగీ అంటే ఇష్టం పోయింది.
ఫిల్టర్ కాఫీ వదిలేసి espresso, cappuccino అంటూ బరిస్తా ల వెంట పడుతున్న రోజుల్లో కప్ప ఈ సారి సంసార సాగరం లో పడింది. పెళ్లయింది, నా భార్య తో కలిసి cappuccino తాగుతూ జై చిరంజీవ ఫస్ట్ రోజే ఫస్ట్ షో చూసాను ఫట్టుమంది. ఆ అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపమో ఏమో ఆ తర్వాత ఎందుకో cappuccino అంటే ఇష్టం పోయింది.
చివరికి నేను చెప్పొచ్చేదేమిటంటే జరిగిన పరిణామాలను బట్టి నేను ఎవరితో కలిసి చిరంజీవి సినిమా మొదటి రోజు చూసినా సరే అది ఫట్టుమనటం ఖాయం అని.
అప్పట్లో ఈ ఫేసుబుక్స్, ఈ మెయిల్స్, మొబైల్స్ ఉండేవి కాదు కాబట్టి కడప నుంచి మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయ్యాక ఖాసీం ను కలవలేదు మాట్లాడలేదు.. అతనిప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలీదు. 2 గంటల సినిమాను కూడా 4 గంటల సేపు చెప్పేవాడు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక తెలుగు సీరియల్ కు మాటలు రాస్తూ ఉంటాడు అని రాస్తుంటాడు అని నా నమ్మకం.
బాబు ఖాసీం నువ్వెక్కడున్నా ఒకసారి touch లోకి రా. నువ్వు touch లో నుంచి వెళ్ళినప్పటినుంచి మూడు పూటలా తినడం మానేసి కేవలం త్రీ టైమ్స్ మాత్రమే తింటున్నాను. రాత్రి పూట మంచం పడుతున్నాను (నిద్రపోతున్నాను). పగలు పడుకోవడం మానేసాను (ఆఫీస్ లో తప్ప). గత ఎనిమిది సంవత్సరాలుగా రిలీజ్ అయిన చిరంజీవి కొత్త సినిమాలు చూడడమే మానేసాను.
హెచ్చరిక: నువ్వు ఈ పోస్ట్ చదివి కూడా టచ్ లోకి రాకపోతే.. ఖబడ్ధార్, చిరంజీవి 175 వ సినిమా మా అబ్బాయితో, 200 వ సినిమా మా మానవరాలితో వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను of course అంతవరకు ఈ సీనియర్ సిటిజెన్ ను హీరో గా అభిమానించే పెద్ద మనసు మన తెలుగు ప్రేక్షకులకు ఉందనుకుంటాను.
అందరూ పాస్తా వెంట పడుతున్న ఈ రోజులలో కూడా ఇంకా పాత చింతకాయపచ్చడి రుచి చూపిస్తా అంటున్నాడు చూడాలి మరి సినిమా ఏమవుతుందో.
ఖాసీం, 'ఖైదీ నెంబర్ 150' సినిమా రిలీజ్ కు ముందు రోజు షో కి ఇంకా 14 సీట్స్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఒక టికెట్ బుక్ చేసుకొని పాస్తా తిని వెళ్తా జాగ్రత్త ....వెంటనే టచ్ లోకి రాగలవు. (ఎలాగూ నాకు పాస్తా అంటే ఇష్టం లేదు కాబట్టి అట్టు మీద ఒట్టు వేసి తప్పిన పాపం వల్ల వచ్చే నష్టమేమి లేదు)
Good luck ✋️ 🙂.
రిప్లయితొలగించండిThanks NaraSimha Rao Gaaru
తొలగించండిSo ఎలా ఉంది?
తొలగించండిఇంకా చూడలేదండి నరసింహా రావు గారు. టికెట్స్ ఆదివారం కి బుక్ చేసుకున్నానండి
తొలగించండిప్రజల విన్నపం మన్నించి మొదటిరోజుకి కాకుండా ఓ రెండు రోజులు వాయిదా వేసుకున్నట్లున్నారే చూస్తుంటే 🙂? అలాక్కానివ్వండి. చూసిన తరువాత చెప్పండి 👍.
తొలగించండినేను ఈ పోస్ట్ రాసేపాటికే టికెట్స్ సండే కి బుక్ చేసుకున్నానండి. ఎదో పోస్ట్ రాయడం కోసం అలా బిల్డప్ ఇచ్చాను అంతే. సినిమా చూశాక అభిప్రాయం తప్పకుండా రాస్తానండి నరసింహా రావు గారు.
తొలగించండిపోస్టులో హ్యూమర్ అదిరింది. మీరు narrate చేసే విధానం అద్భుతం. మీ ప్రతి ఒక్క పోస్టు ఎంజాయ్ చేశాను. తరువాతి పోస్టు కోసం ఎదురు చూస్తూ, వందనములతో మీ అభిమాని నాగేశ్వరరావు.
రిప్లయితొలగించండిమీ కామెంట్స్ కు, నా పోస్ట్ కు స్పందించిన మీ అభిమానానికి ధన్యవాదాలండి నాగేశ్వర రావు గారు.
తొలగించండిమీ మిత్రుడు అనండి చాలు...మీ అభిమాని అనకండి..ఏదో అల్లా టప్పా పోస్ట్స్ రాసేవాడిని, నాకు అంత సీన్ లేదు.
చిరు ఫాన్స్ ఈ పోస్ట్ చదివారంటే వెంటనే మీ ఇంటిమీద వాలిపోయి, ముందు జాగ్రత్తగా రేపు మొదటి ఆట అయ్యేదాకా మిమ్మల్ని మీ పెరట్లో చెట్టుకు కట్టేసి కాపలా కాసెయ్యగలరు జాగ్రత్త.
రిప్లయితొలగించండి
తొలగించండిఆల్మోస్ట్ అలాంటిదే జరిగింది లేండి నాగేశ్వర రావు గారు. ఫోన్ లో, పేస్ బుక్ లో, వాట్స్ అప్ లో requests వరదలా వెల్లువెత్తాయి, మహాప్రభో నువ్వు అటువైపు మొదటి రోజు వెళ్లొద్దు అని.
వెంటనే వచ్చిన మీ జవాబులకు సంతోషం వేసింది. తెలుగు బ్లాగులలో మీలాగా చక్కగా రాసేవారు అతి కొద్దిమందే ఉన్నారు. మీరు ఇలాగే మరిన్ని మంచి పోస్టులతో మీ బ్లాగును సుసంపన్నం చేయాలని మనవి.
రిప్లయితొలగించండిమీ కామెంట్స్ నా భాద్యత ను మరింత పెంచుతున్నాయండి . మరిన్ని మంచి పోస్ట్స్ రాయడానికి తప్పక ప్రయత్నిస్తానండి
తొలగించండిఒక్కోసారి pasta తిన్న తర్వాత పాతచింతకాయ పచ్చడి మహా రుచిగా అనిపిస్తుందండి - hope the movie gives that feel!
రిప్లయితొలగించండిYes Lalitha Gaaru..movie was good. Thanks for the comments.
రిప్లయితొలగించండి