Wednesday, 26 April 2017

నా పాపానికి నిష్కృతి ఉందంటారా?

ఏంటి వెళ్లడం లేదా?
నహీ జారహే హో?
నాట్ గోయింగ్?
హోగ్తా ఇల్వా?


గత  రెండు రోజులుగా కనబడ్డ ప్రతివారూ నిన్ను అడుగుతున్న ప్రశ్న. ఇంత మంది అడిగాక కూడా వెళ్లలేదో చచ్చాక 'మహిస్మతి పురాణం' ప్రకారం నువ్వు నరకం లో నానా బాధలు పడాల్సిన ఉంటుంది జాగ్రత్త, నువ్వసలు తెలుగు వాడివేనా? వెళ్లకుండా పెద్ద పాపం చెయ్యబోతున్నావ్, ఈ నీ పాపానికి నిష్కృతి లేదు అని నా మనస్సాక్షి హెచ్చరించించింది.  

చాళ్లే నీ వెటకారాలు. బాహుబలి-2 సినిమాకు వెళ్లనంత మాత్రాన నేను తెలుగు వాడిని కాకుండా పోతానా? నాకూ వెళ్లి చూడాలనే ఉంది కాకపొతే కొన్ని కారణాల రీత్యా వెళ్లలేక పోతున్నాను. 

కారణాలు అని చెప్పి తప్పించుకుంటే సరిపోదు చెప్పి తీరాల్సిందే?  అంది మనస్సాక్షి

నీకు గుర్తుందా? బాహుబలి కి వెళ్ళినప్పుడు 7 సార్లు 
ధృవ కి వెళ్ళినప్పుడు రెండు సార్లు 
ఖైదీ నెంబర్ 150 కి వెళ్ళినప్పుడు మూడు సార్లు థియేటర్ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. 

అయినా అన్ని సార్లు వెళ్ళే బదులు, ఒక్క సారిగా ఇంటర్వెల్ లో వెళ్లి పోసుకు రావచ్చుగా? ఒకసారి డాక్టర్ ని కలిస్తే మంచిదేమో?

నేను బయటికి వెళ్ళింది అందుకు కాదు, నీకు తెలుసు కదా ఫైటింగ్ వచ్చినప్పుడల్లా 'నాకు భయం నేను చూడనహో' అని బుడ్డిది అక్షయ మొత్తుకుంటుంది కాబట్టి తనకోసం ఆ ఫైటింగ్ అయిపోయే వరకు థియేటర్ బయటికి వెళ్ళి రావాలి.  ఇక బాహుబలి-2 లో ఖచ్చితంగా యుద్ధాలే ఎక్కువ ఉండి ఉంటాయి, అవి చూడకపోతే మిగిలేది రసం పిండేసిన చెరకు పిప్పే. అల్లాంటప్పుడు ఇక సినిమాకు వెళ్లడం ఎందుకు అని వెళ్లట్లేదు. 

పాయింటే, మరి నువ్వొక్కడివే వెళ్లి చూసి రావొచ్చుగా?

ఆఫీస్ కి తప్ప ఇంకెక్కడికి ఫామిలీ ని వదలి వెళ్ళను అని తెలిసీ ఆ ప్రశ్న అడగటం అనవసరం.

అది సరే, నాకు తెలిసినంతవరకు తెలుగులో పార్ట్-2 సినిమా ఏదీ హిట్టయ్యినట్లు చరిత్రలో లేదే? మరి ఇది అవుతుందంటావా?(తధాస్తు దేవతలూ! కాసేపు ఆగండి ప్లీజ్)

ఏమో ఈ సినిమానే ఆ పాత చరిత్ర కి శుభం పలికి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టొచ్చేమో. (ఇప్పుడు తధాస్తు అనేయండి ప్లీజ్)

ఆ ఏముంది ఆ సినిమాలో అని సత్యనారాయణ లాంటి సీనియర్ నటులు పెదవి విరిచారు కదా?

తాను మునిగిందే గంగ, వలచిందే రంభ, నటించిందే కళాఖండం అని ఆయన అనుకొని ఉండచ్చు. అయినా అంత గొప్ప వారిని తప్పుపట్టే అర్హత మనకెక్కడుంది. ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు అంతే. లోకోభిన్నరుచి అని అన్నది అందుకే కదా, అందరికీ  అన్ని నచ్చాలని లేదు. ఒకప్పుడు కుర్రకారును వెర్రెత్తించిన 'ప్రేమదేశం' ను కూడా ఇదేం సినిమారా అనేవారు మా పక్కింటి అంకుల్. మొన్నామధ్య యమగోల సినిమా చూస్తుంటే 'ఈ అంకుల్ హీరో ఏంటి?' అని అడిగింది అక్షయ. పిల్ల కాకి తనకేం తెలుసు ఎన్టీవోడి గొప్పదనం గురించి. అంతెందుకు అందరికి నచ్చిన 'నేను లోకల్' సినిమా నాకు నచ్చలేదు, అంత మాత్రం చేత అది మంచి సినిమా కాకుండా పోతుందా? జనరేషన్ గ్యాప్ అని సరి పెట్టుకోవాలంతే. 

కావచ్చు కానీ అదేమైనా చరిత్ర గురించి చెబుతున్న సినిమానా అంత విలువ యివ్వడానికి, అనవసరంగా ఆ సినిమాను పొగుడుతున్నారు అనిపిస్తోంది. 

చరిత్ర పేరు చెప్పి కమర్షియాలిటీ కోసం కథను వక్రీకరించడం కన్నా ఇలాంటి సినిమాలు తీయడమే బెటర్. అప్పుడెప్పుడో మాయబజార్, నర్తనశాల, శంకరాభరణం లాంటి కొన్ని గొప్ప సినిమాల తర్వాత ఇదిగో ఇప్పుడే తెలుగు సినిమాలకు మళ్ళీ అంతర్జాతీయ లెవెల్లో కాస్తో కూస్తో గుర్తింపు వస్తోంది సంతోషం.

సినిమా బాలేదని అప్పుడే చూసేసినట్లు కొందరు విమర్శిస్తున్నారు. ఇంతకీ బాహుబలి-2 గురించి నువ్వు ఏమంటావ్? బాగుంటుందంటావా?

ఏదో కాస్త పబ్లిసిటీ వస్తుందని కొందరు అలా అని ఉండచ్చు. సూట్ అవుతుందో లేదో తెలీదు కానీ మోటు సామెత ఉంది చెప్తాను విను. 'గుళ్ళో గుగ్గిలం వెయ్యకపోయినా పర్లేదు అదేదో చేసి కంపు కంపు చెయ్యొద్దు' అన్నారు కదా పెద్దలు, అది ఫాలో అయిపోతే సరి.  

P.S: నా దగ్గర బాహుబలి-2 మీద ఒక టపా రాయడానికి ఎటువంటి మేటర్ లేకపోయినా కనీసం ఆ సినిమా మీద ఏదో  ఒక టపా రాస్తే కొంతలో కొంత పాప విమోచనం కలుగుతుందని మా గురువు బొంగు భగవానందస్వామి గారు, అలాగే ఆయన గురువు గొట్టం గోవిందస్వామి గారి ఉపదేశం మేరకు ఆదరా బాదరా గా ఇప్పటికిప్పుడు రాసిన పోస్ట్ ఇది. తప్పులున్నా, మిమ్మల్ని బోర్ కొట్టించినా క్షమాపణలు. 


10 comments:

 1. ఇలా ప్రతి సినిమా రిలీజ్ అయినపుడల్లా మాత్రమే టపాలు వ్రాస్తున్నారు !! చూస్తున్నాం చూస్తున్నాం !! బాహుబలి చూడకపోతే పాపం వస్తుందో రాదో కానీ ఇలాంటి పాపానికి మాత్రం నిష్కృతి ఉండదు మరి!! :)

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ చంద్రిక గారు. క్రమం తప్పకుండా రాయడానికి ప్రయత్నిస్తానండి.

   Delete
 2. టపా వ్రాసి పాపం పోగొట్టుకున్నారు.

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అన్యగామి గారు.

   Delete
 3. ఇంతకీ మీరు బాహుబలి-2 ని పొగిడారా? లేక...? :)

  ReplyDelete
  Replies
  1. రెండూ లలితా గారు కాకపొతే అందులో పొగడ్తలు ఎక్కువ పాళ్ళు. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్.

   Delete
 4. bagundi bhayya...
  mee buddidi ila aite meeru cinemalu chuddam ela... papam.

  ReplyDelete
  Replies
  1. Thanks for the Comments Sri. Inko 6 months wait cheste kaasta peddadi avuddi appudu choodocchanukuntaa :)

   Delete
 5. Super pavan.. inthaki chusava ledha..?

  ReplyDelete