3, మే 2021, సోమవారం

బీచ్ కి దారేది?

అది నేను సిడ్నీ లో అడుగుపెట్టిన మొదటి వారం.  నేనుండే ఇంటి దగ్గరే ఒక పెద్ద మాల్ ఉండేది. అదే మాల్ లోంచి రైల్వే స్టేషన్ లోకి డైరెక్ట్ గా వెళ్ళి ట్రైన్ ఎక్కేలాగా ఆ మాల్ ని డిజైన్ చేశారు. ఆఫీస్ కి వెళ్ళడానికి రోజూ అదే మాల్ లోకి వెళ్ళి అక్కడే ట్రైన్ ఎక్కేవాడిని. ట్రైన్ దిగగానే ఎదురుగా మా ఆఫీస్ ఉండేది. భలే కన్వీనియెంట్ గా ఉండేది ఆఫీస్ కి వెళ్లి రావడం... వెళ్ళడానికి 20 నిముషాలు, రావడానికి 20 నిముషాలు. పైగా యెంత భారీ వర్షం పడ్డా ఆఫీస్ కి వెళ్లి రావడానికి గొడుగు కూడా అవసరం పడేది కాదు ఎందుకంటే రూమ్ పక్కనే మాల్/స్టేషన్, మళ్ళీ స్టేషన్ పక్కనే ఆఫీస్ ఉండటం వల్ల. బెంగుళూరు మహాసాగరంలోని ట్రాఫిక్ ఈదుతూ ఆఫీస్ కి వెళ్ళడానికి రెండు గంటలు, రావడానికి మరో రెండున్నర్ర గంట పట్టేది. దాన్ని తలచుకుంటే ఆహా! సుఖం అంటే ఇదే కదా అనిపించేది సిడ్నీ లో, పైగా ఇండియన్ ఆఫీస్ లో లాగా కాకుండా 8 గంటల ఆఫీస్ మాత్రమే ఉండేది. నేను మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 వరకు టైం choose చేసుకున్నా. 

ఒక రోజు ఆఫీస్ నుంచి బయల్దేరుతూ ఇవాళ మాల్ లో కొన్ని వంట సరుకులు  కొనాలి అనుకున్నా. ఆ రోజు ఆఫీస్ లో ఈవినింగ్ స్నాక్స్ పార్టీ ఉండి బయలు దేరేటప్పటికీ సాయంత్రం 5 అయిపోయింది.  ట్రైన్ దిగి మాల్ లోకి ఎంటర్ అయ్యాక చూస్తే షాప్స్ అన్నీ మూసేశారు. అదేంటబ్బా! అప్పుడే మూసేశారు అని ఓపెనింగ్ హవర్స్ చూస్తే 8 AM - 5 PM అని రాసి ఉంది షాప్స్ బయట. వార్నీ, ఇవేమైనా ఆఫీస్లు అనుకున్నారా టంచనుగా మూసేయడానికి? ఇప్పుడు నయం సాయంకాలం 6 వరకు తెరిచి ఉంచుతున్నారు. నేనొచ్చిన కొత్తలో 5 వరకే తెరిచేవారు. 

ఇక అసలు విషయం లోకి వస్తాను. మాల్లో ఒక చోట బోర్డు ఉండేది. స్టేషన్ కి దారి ఇటు, బీచ్ కి దారి అటు అని. భలే భలే, మాల్ లోంచి స్టేషన్ కి కనెక్ట్ చేసినట్లు, మాల్ నుంచి బీచ్ కి కూడా కనెక్షన్ పెట్టినట్లున్నారు ఈ తెల్లోళ్ళు అనుకున్నా. బీచ్ లు ఆస్ట్రేలియా లో ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా ఉంటాయని విన్నాను కానీ మరీ ఇంత దగ్గరగా ఉందా నేనుండే ప్లేస్ కు అనుకున్నా? మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలని అనుకోని ఈ వీకెండ్ బీచ్ కి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయా. అనుకున్నట్లే శనివారం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తినేసి బయలుదేరా. తీరా వాడు దారి చూపెట్టిన వైపు వెళ్ళానా అక్కడ చూస్తే ... 



అదో షాప్ పేరు అని అర్థమై నా తెలివి తక్కువ తనానికి నేనే సిగ్గుపడి ఇప్పటి వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. మీరూ ఎవ్వరికీ చెప్పకండి ప్లీజ్.  

2 కామెంట్‌లు:

  1. హ్హ హ్హ హ్హ, అలా ఆకర్షించడమే వ్యాపార తెలివితేటలేమో?
    మొదటి సారి మీరలా వెళ్ళినది తెలివితక్కువతనం అవదు. రెండోసారి కూడా మీరు అలాగే చేస్తే అది ముమ్మాటికీ మీ తెలివితక్కువే అవుతుంది 😁😁. Once bitten, twice shy లాగా ఉండాలి 🙂.

    మీ ఊళ్ళో మాల్ / రైలు లాంటిదే అమెరికాలో చూశాను. మినియాపోలిస్ నగరంలో Mall of America అని భూతం సైజు మాల్ ఉంది. ఆ మాల్ నుండి ఎయిర్-పోర్ట్ వరకు మెట్రో ట్రెయిన్ నడుస్తుంది. ఎయిర్-పోర్ట్ బిల్డింగులో గ్రౌండ్ ఫ్లోర్ దాకా వెళ్ళి ఆగుతుంది. దిగి లిఫ్టులు, ఎస్కలేటర్లు ఎక్కి పైకి వెడితే చెక్-ఇన్ వంటి పనులు చూసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Once bitten, twice shy అయితే ok మేష్టారు. రెండో సారి దెబ్బతినలేదు వేరే మాల్ లో అదే బోర్డ్ చూసినప్పుడు, దానికి సంతోషం.

      తొలగించండి