14, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఇన్నాళ్ళకి .. కాదు కాదు ఇన్నేళ్ళకి మొదలెట్టాను

అప్పుడెప్పుడో COVID అనేది పుట్టక ముందు:

హలో, నా పేరు పవన్. ఇది add a did daala కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యుటా?

add a did daala కాదది 'అడ్డదిడ్డాల'.  నా పేరు అడ్డదిడ్డాల ఢాంబాబు. మా ఇంటి పేరు మీదే  ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాను. 

ఓహో అలాగా! నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. 

DKT ఇచ్చావా ?

నేను ఆఫీస్ లో KT ఇస్తున్నట్లు వీడికేలా తెలిసింది? 3 KT లు ఇచ్చాను, ఇంకో రెండు ఇస్తే అయిపోతుంది. 

అంటే 3 సార్లు రాశావా?

రాయడమేమిటి?

DKT టెస్ట్ 

అలాంటి పేరు వినలేదు. 

ముందు DKT టెస్ట్ రాసి పాస్ అయితే learner లైసెన్స్ ఇస్తారు. అప్పుడు రా, డ్రైవింగ్ నేర్పిస్తాను. ఎర్ర బస్సు అనుకొని ఎయిర్ బస్ ఎక్కి వచ్చేస్తారు మా టైం వేస్ట్ చెయ్యడానికి. 

కొన్నినెలల.. కరెక్ట్ గా చెప్పాలంటే ఏడాది తర్వాత:

అడ్డదిడ్డాల ఢాంబాబా?

అవును. 

నాకు learner లైసెన్స్ ఉంది. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. 

ఓకే,  గంటకు XX $. 

మరీ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మిగతా వారి కంటే. 

నేనయితే 5 గంటల్లో నేర్పిస్తా, మిగతా డ్రైవింగ్ స్కూల్ లాగా కాదు. 

అయితే ఓకే. 

రేపు ఉదయం 8 గంటలకి మీ ఇంటి బయట వెయిట్ చేస్తుంటాను. 

మరుసటి రోజు ఉదయం: 

మీరేనా ఢాంబాబు?

అవును, ఎవరికి నేర్పించాలి? మీ తమ్ముడికా? లేక మీ అబ్బాయికా ??

నాకే... అన్నాను జేబులోంచి మాస్క్ బయటికి తీస్తూ. 

దబ్బున శబ్దం వచ్చింది. ఎదురుగా ఢాంబాబు కనపడలేదు. అరె, ఢాంబాబు ఎక్కడ అని అటూ ఇటూ చూస్తే కింద పడి ఉన్నాడు. 

వెంటనే కార్లోంచి కాస్త పెట్రోల్ తీసి ఢాంబాబు మొహం మీద చల్లితే లేచి నిలబడ్డాడు. 

మరీ ఇంత లేత వయసులో డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎందుకు  అనుకుంటున్నారు. ఇంకో పదేళ్ళు ఆగితే మీ పిల్లలే నేర్చుకునేవారుగా. 

అవుననుకోండి, కాకపోతే ఇంత లేటుగా డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవడం మొదలెట్టానో తెలుసు కోవాలంటే కాసిన్ని కారు కూతలు మాట్లాడుకోవాల్సిందే

ఆపు నీ సోది, ఇప్పటికే ఇవాళ్టి గంటలో 15 నిముషాలు టైం  అయిపొయింది. పద కార్ లో కూర్చో. 

సరే. 

సరే అని అటు వైపు సీట్ లోకి వెళ్తావేం? డ్రైవింగ్ సీట్ లోకి వచ్చి కూర్చో. 

అలవాటు లేదు కదా అందుకే ఈ పొరపాటు అనేసి 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే' అని హమ్ చేసుకుంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను. 

నువ్వు బైక్ డ్రైవ్ చేశావా ఎప్పుడైనా?

బైక్ డ్రైవింగా? మూతి మీద మీసాలు మొలవక ముందే దాని మీద విన్యాసాలు చేశాను.  ఏదో కార్ డ్రైవింగ్ అంటే టైం కలిసి రాక నెత్తి మీద జుట్టు రాలడం మొదలయ్యాక మొదలు పెడుతున్నాను. 

అదీ గొప్పేనా, నేను మూతి మీద మీసాలు మొలవక ముందే అప్పట్లోనే డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ కార్ కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను. 

డబ్బు లేకపోయినా అప్పు చేసి కార్ కొన్నావా? మురళీ మొహన్  ఇంటర్వ్యూ చూడలేదా?

ఆడెవడు?

అదే, తెలుగు సినిమాల్లో ఎక్కువగా సెకండ్ హీరో వేషాలు వేసేవాడు అప్పట్లో.  నాగేశ్వర్రావో, శోభన్బాబో కొన్ని కారణాల చేత హీరోయిన్ ని పెళ్ళి చేసుకోకపోతే తనే చేసుకునే వాడు. 

నేను శరత్ బాబు ఫ్యాన్ ని. మురళీ మోహన్ నచ్చడు, అతని ఇంటర్వ్యూలు మాత్రం ఎందుకు చూస్తాను?

అర్రే యెంత ఘోరం జరిగి పోయింది, నేను కూడా శరత్ బాబు ఫ్యాన్ అయ్యుంటే మురళీ మొహన్ ఇంటర్వ్యూ చూడకుండా అప్పట్లోనే కార్ కొని డ్రైవింగ్ నేర్చుకొని ఉంటే ఇప్పుడిలా వీడితో అడ్డదిడ్డమైన మాటలు పడాల్సి వచ్చేది కాదు, పైగా వీడిలా దర్జాగా రోజూ కార్లో తిరుగుతూ బతకొచ్చు అనుకుంటూ ... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి