7, జూన్ 2021, సోమవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 1

హలో, మీ సిగరెట్ బాక్స్ కింద పడింది.

అది ఖాళీ అయింది నాకిక అవసరం లేదు అన్నాడు కొత్తగా విదేశానికి వెళ్లిన మన ఇండియన్. 

మా దేశానికి కూడా అవసరం లేదు, నువ్వే ఉంచుకో అని చేతికిచ్చాడు. 

ఇది చాలా సార్లు విన్న జోకే అయినా సిడ్నీ లో దిగగానే నాకు గుర్తొచ్చింది. దూరపు కొండల నునుపెంతో రోడ్స్ మీద చచ్చి పడున్న సిగరెట్స్, రైళ్ళలో, స్టేషన్స్ లో ఖాళీ అయి పడి ఉన్న కూల్డ్రింక్స్ బాటిల్స్ తెలియజేశాయి. పక్కనే డస్ట్ బిన్స్ ఉన్నా కొందరు ఎక్కడంటే  అక్కడ పడేస్తుంటారు చెత్తని. మలేషియా లోనే సింగపూర్ లోనే అలా కింద పడేస్తే ఫైన్స్ వేస్తారని విన్నాను. అవి కూడా నాకు దూరపుకొండలు కాబట్టి ఎవరైనా దాని నునుపెంతో తెలియజేయండి. ఇక్కడ ఆస్ట్రేలియా గవర్నమెంట్ లో మరీ అంత స్ట్రిక్ట్ రూల్స్ ఏమీ ఉన్నట్లు లేవు. 

ఇక ఫుట్పాత్ మీద నడుస్తూ వెళ్తూ పొగ వదుల్తుంటారు కొందరు ధూమపాన రాయుళ్ళు, వారి వెనుక వస్తే మాత్రం చచ్చే చావే. కాసేపు అక్కడే ఆగి, ఆ పొగ రాయుడు ( చినరాయుడు, పెద రాయుడు, సుబ్బారాయుడు లాంటి వారి మనోభావాలు ఎప్పుడూ దెబ్బతినలేదా అలా ఎవరైనా అన్నప్పుడు, లేక మగరాయుడు అనేదాంట్లో కూడా రాయుడు ఉంది కదా అని సంతోషపడ్డారా??) కాస్త దూరం వెళ్ళే దాకా ఆగడం లేదంటే అర్జెంట్ గా వెళ్తున్నప్పుడు ఆ పొగ రాయుడిని లేదంటే ఆ రాయుడమ్మ ని దాటి వెళ్ళాలి. (ఎవ్వరి మనో బావాల, మరదళ్ళ వివక్షలేదని నా ఉద్దేశ్యం)  నేను రాస్తున్నది రామాయణం కాదు కాబట్టి ఈ పిడకల వేట ఉండటం లో తప్పేం లేదు. అది రామాయణంలో పిడకల వేట కాదని, పితకాల వేట అని కాదు కాదు పీడ కలల వేట అని కొందరు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అంటుంటారు. 

సరే ఆ పిడకల వేట వదిలేసి విషయానికి వస్తే,  ఏ పూర్వ జన్మ శాపమో గానీ, నేను ఏ ఇంట్లో అద్దెకి ఉన్నా నా కింది ఇంటి వాడో, పక్కింటి వాడో బాల్కనీ లో పొగ వదులుతుంటారు. వీళ్ళ దెబ్బకి విశాలమైన బాల్కనీ ఉండి కూడా అక్కడ కూర్చొని టీ తాగాలన్నా, కనీసం ఓపెన్ చేయాలన్నా భయం వేస్తుంది. 'పది మంది పొగరాయుళ్ళకి/రాయుడమ్మలకి  పది రోజుల పాటు పది సిగరెట్ పెట్టెలు పంచి పెడితే ఈ పాపం పోతుందని'  నా జాతకం చూసి పొగేశ్వరస్వామి సెలవిచ్చారు లేదంటే Pavan అని కాకుండా Paavan అని ఒక a ఎక్కువ చేర్చాలట నా పేరులో. ఆలోచించుకోవాలి ఏ రెమెడీ ఫాలో అవ్వాలో. 

నా చిన్నప్పుడు ఈ ఇంటర్నెట్ లేదు కాబట్టి క్రికెట్ విషయంలో మాత్రమే అప్పట్లో ఆస్ట్రేలియా పేరు ఎక్కువగా పినిపించేది, సబ్జక్ట్స్ లో, టీవిలో న్యూస్ లో వచ్చినా అవి మనకు వినపడవు. ఆ తర్వాత రేసిజం మీద ఒక పదేళ్ళ క్రితం జనాల నోళ్ళలో బాగా నానింది. అప్పుడే నా onsite ప్రయాణం ఆస్ట్రేలియా కి, చాలా మంది భయపెట్టారు కానీ రేసిజం తీవ్రతను నేనెప్పుడూ ఎదురుకోలేదు ఇక్కడ. 

ఈ మధ్య గత రెండేళ్ళుగా వార్తలలో మరీ ఎక్కువగా వినపడుతోంది ఆస్ట్రేలియా పేరు. కార్చిచ్చులని కొన్ని రోజులు, వరదలని కొన్ని రోజులు, ఎలుకల దాడి అని గత వారం రోజులు వార్తల్లో నిలిచింది. పోయిన రెండు నెలలలో విపరీతంగా కురిసిన వర్షాల దాటికి కలుగుల న్నీ నిండిపోయి ఎలకలు ఊరిమీద, ఇళ్ళ మీద పడ్డాయి. 

గత సంవత్సరం లంచ్ టైం లో టీవీలో వార్తలు వింటూ ( ఆఫీస్లో ఛానల్ మార్చే అవకాశం లేదు కాబట్టి, లేదంటే వార్తలు చూసే అలవాటు మా ఇంటా వంటా లేదు మా నాన్నగారికి తప్ప) covid గురించి విన్న కొత్తలో 'హెహ్హేయ్, అదెక్కడో చైనా లో మొదలైన వైరస్, దాని గురించి ఎందుకు ఇంత వర్రీ' అనుకున్నా కర్రీ లో చపాతీ ముంచుకొని తింటూ. ఆ తర్వాత కదా దాని ప్రతాపమేమిటో ప్రపంచానికి తెలిసింది. ఆ విషయం ఇంకా గుర్తు ఉంది కాబట్టే మేముండేస్థలం ఆ మూషికదాడులు జరిగే స్థలానికి దూరంగా ఉన్నా భయపడాల్సి వస్తోంది. అవి మేము ఉండే చోటికి చేరేలోగా వాటిని అరికట్టే చర్యలు ప్రభుత్వం చేపడుతుందని  ఆశిస్తూ... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి