చదువెందుకు సంక నాకను, నాలుగు బర్రెలు కాచుకుంటూ ప్రేమికులు బతికేయచ్చు లాంటి కాన్సెప్ట్ తో తేజ అనే ఒక డైరెక్టర్ హై స్కూల్ డేస్ కే ప్రేమ , పిల్లలు, కాపురం లాంటి అద్భుతమైన సినిమాలు ఓ పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం తీసి ఆపై కనుమరుగై పోయాడు. తర్వాత అర్జున్ రెడ్డి లాంటి కథలతో కొన్ని అద్భుతమైన సినిమాలు వచ్చి హిట్టయ్యాయి.
ఈ మధ్య రిలీజ్ అయిన వాటిల్లో అద్భుతమైన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్ " అంటుంటే నిన్ననే నెట్ ఫ్లిక్స్ లో చూసా.
అప్పట్లో విజయ శాంతి హీరోగా చేసే టైములో కాస్త మార్కెట్ తక్కువుండే రఘు (ఉరఫ్ రెహ్మాన్ ), వినోద్ కుమార్, జగపతి బాబు లాంటి వాళ్ళను పెట్టేవారు. ఇప్పుడు అలాంటి వారు ఎవరూ లేరో ఏమో కన్నడ ఇండస్ట్రీ నుంచి తెచ్చారు రక్షిత్ శెట్టి ని రష్మిక కోసం. దియా అనే కన్నడ సినిమా (ఇదే సినిమా తెలుగు లో రీమేక్ చేస్తే మేకై కూర్చున్నట్లుంది) గురించి ఇదివరకెప్పుడో బ్లాగులో రాశాను, ఆ రక్షిత్ శెట్టి నే ఇందులో (ప్రతి)నాయకుడు.
సత్రం లాంటి ఒక లేడీస్ హాస్టల్. అందులోకి ఎవరైనా డైరెక్ట్ గా లోపలికి వెళ్లి రావచ్చు (బాయ్ ఫ్రెండ్ అయినా లేదంటే ఆ అమ్మాయి నాన్న అయినా). బాయ్ ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయితో రూంలో ఎన్ని నిద్రలైనా చెయ్యొచ్చు, ఉదయాన్నే అందరూ చూస్తుండగానే అతను బయటికి వెళ్ళొచ్చు. ఈ విషయం ఎప్పుడూ హీరోయిన్ కి అవమానం గా అనిపించదు ఎందుకనో మరి. సరే, ఈ జనరేషన్ వాళ్లకు ఇవన్నీ చాలా కామన్ ఏమో అని సర్ది చెప్పుకున్నా.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఎన్ని గొడవలు జరిగినా పోలీసులు కలగజేసుకోనప్పుడు మా సినిమా లో స్టూడెంట్స్ ఏం చేసినా మేమెందుకు పట్టించుకోవాలి అన్నట్లు ఆ సత్రానికి ఓనర్ (ఈ సినిమా డైరెక్టరూ ఈయనే) ఆయనకిష్టం వచ్చిన రూల్స్ ఆయన పెట్టుకుంటాడు. వాళ్ళేమీ డ్రగ్స్ తీసుకోవట్లేదు కదా ప్రేమించుకుంటున్నారు పైగా వాళ్ళు మేజర్స్ కాబట్టి మేము వాళ్ళకు అడ్డు చెప్పం అంటాడు.
"అదేమైనా రాంబాయమ్మ కంపెనీనా? ఎవడు పడితే వాడు అమ్మాయితో రాత్రంతా పడుకొని తెల్లారి లేచి వెళ్లిపోవడానికి.. ఈ డైరెక్టర్ ని ఎవడికైనా చూపించండ్రా" అనాలని అనిపిస్తుంది కానీ ఏమో, ఇండియా లో కొన్ని హాస్టల్స్ ఇలాగే ఓయో రూమ్స్ లా మారాయేమో నేను ఔట్ డేటెడ్ అయి ఉండచ్చు అని ఆగిపోయా.
ఒక రోజు ఉదయాన్నే హీరోయిన్ నాన్న తలుపు తడితే, వాళ్ళ అమ్మాయి బదులు ఆమె బాయ్ ఫ్రెండ్ తలుపు తీస్తాడు షార్ట్స్ వేసుకొని. పాతకాలం నాన్న కాబట్టి నానా అల్లరి చేసి చదువు మానేసి నాతో వచ్చేయ్ అని బెదిరిస్తాడు కూతురిని. తను రానని చెబితే మాట్లాడటం మానేస్తాడు.
"ఈ పెద్దోళ్ళు ఉన్నారే" వీళ్లకు మీ మీద ఏ రైట్స్ లేవు. నువ్వు ఈ కాలపు అమ్మాయివి నీకు రైట్ అనిపిస్తే బోయ్ ఫ్రెండే కాదు కన్న తండ్రినైనా లెఫ్ట్ అండ్ రైట్ ఎదిరించచ్చు అని లెక్చర్ దంచుతాడు.
"జరిగింది చాలు, ఇప్పుడే మనం పెళ్ళి చేసుకుందాం, తర్వాత నువ్వు ఇంట్లో పడి ఉండి పాలు పితుకుతూ ఉండు నేనెళ్ళి గేదెల్ని మేపుకొస్తాను మన లైఫ్ సెట్ అయినట్లే నువ్వు ఎలాగూ ముద్ద పప్పు లాంటి దానివేగా కాబట్టి ఈ చదువు నీకొద్దు, నేనే నీ ముద్దు" అని బాయ్ ఫ్రెండ్ అంటాడు.
అప్పుడు జ్ఞానోదయం అయి "ఇక చాలు, బ్రేక్ అప్" అని హీరోయిన్ ఎదిరిస్తే, హీరోయిన్ కారెక్టర్ అస్సాసినేషన్ (వ్యక్తిత్వ ఖననం అనొచ్చా) కి జొరబడతాడు ఆ బాయ్ ఫ్రెండు. దాంతో మన వీరోయిన్ కి జేజెమ్మ పూని వీర విహారం చేసి స్టేజి ఎక్కి ఒక లెక్చర్ దంచేస్తుంది.
కట్ చేస్తే .. లండన్ లో జాబ్ చేస్తూ తండ్రి అప్పట్లో తనతో మాట్లాడకపోయినా, ఇప్పుడు తన మంచి చెడ్డలు చూసుకునే కూతురిగా హీరోయిన్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ శుభం కార్డు వేస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి