ఏర్చి కూర్చిన కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఏర్చి కూర్చిన కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, జూన్ 2021, గురువారం

ఒక విజేత కథ - ఏర్చి కూర్చిన కథలు

మా ఇంట్లో పెద్దగా చదివించలేదు గానీ లేదంటే నా రేంజే వేరుగా ఉండేది అని ఎవరైనా అనడం మన చెవిన పడుతూ ఉంటుంది అప్పుడప్పుడూ.  ఇది ఒక రకంగా వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే అని ఈ పోస్ట్ చదివాక మీకు అనిపించచ్చు. 

నోరు తిరగని పేరు గల Nusret Gökçe అనే కుర్రాడు మైన్స్ లో పనిచేసే ఒక లేబరర్ కొడుకు. ఇల్లు గడవాలి అంటే ప్రతీ రోజు ఆ మైన్స్ లో దిగాల్సిందే ఆ దిగువ తరగతి కుటుంబీకుడు. కానీ అతని కొడుకైన Nusret Gökçe బ్రతకాలంటే  అక్కడే ఆ మైన్స్ లో దిగాల్సిందే అని మైన్స్ లోతు ల్లోకి దిగలేదు , ఎత్తుకు ఎదగాలనుకున్నాడు ఎదిగి చూపించాడు. 

'పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పు, నీ చేతగాని తనమే" అంటారు కదా అలా చేతగాని వాడిలా మిగిలిపోలేదు. 

ఒక అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎంతోమంది గురించి మీరు వినే ఉంటారు లేదా చదివి ఉంటారు.  అలాంటి కోవలోకి చెందిన వ్యక్తే ఈ Nusret Gökçe. మరీ చరిత్ర సృష్టించేటంతటి ఉన్నత స్థాయికి చేరుకోక పోయి ఉండచ్చు, కానీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకునే వాళ్ళకి ఇతని కథ ఒక పాఠమే. 

పుట్టింది టర్కీ లో, ఒక పేద కుటుంబలో. స్కూల్ లో చదవడానికి డబ్బులు లేక 6 వ తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. అతని పేదరికం అతన్ని చదువుకు దూరం చేయగలిగిందేమో గానీ, అతని కష్టించే గుణం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. 

స్కూల్లో చదువే ఆర్థికస్తోమత లేక కుటుంబం గడవడం కోసం ఒక కసాయి కొట్లో అలాగే ఒక హోటల్ లో పనికి కుదిరాడు. అక్కడే తనకి వంట మీద మక్కువ ఏర్పడింది.  ఆ తర్వాత వివిధ దేశాలు తిరిగి అక్కడి రెస్టారెంట్స్ లో పనిచేసి వివిధ రకాల వంటలు నేర్చుకొని తన దేశానికి తిరిగొచ్చి ఆ అనుభవంతో తన మొదటి రెస్టారెంట్ ని మొదలెట్టాడు. ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని దుబాయ్ తో పాటు అమెరికా లాంటి వివిధ దేశాలకి విస్తరించాడు. 

వంట చేసేటప్పుడు అతని చేష్టలు అలాగే వంట పూర్తయ్యాక సాల్ట్ ని ఆ వంట మీద చల్లే అతని స్టైల్ కి అభిమానులు ఉన్నారు (మన రజినీ కాంత్ నోట్లో సిగరెట్ విసురుకునే విధానానికి ఉన్నట్లు). ఆ సాల్ట్ చల్లే ఒక ప్రత్యేకమైన అతని స్టైల్ వల్ల Salt Bae అనే పేరుతో ఫేమస్ అయ్యాడు. Salt Bae అని మీరు గూగుల్ లో టైపు  చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ చూడొచ్చు. 

పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రతీ వారి జీవితంలో ఉన్నట్లే ఇతనూ విమర్శలు ఎదుర్కున్నాడు గానీ అవేమీ అతని ఎదుగుదలని ఆపలేకపోయాయి.  ఫుడ్ బాగా కాస్ట్లీ అనీ మరీ అంత రుచిగా ఏమి ఉండదు అని ప్రఖ్యాత మ్యాగజైన్స్ లో విమర్శించారు అలాగే కస్టమర్స్ తమకు ఇచ్చే టిప్స్ లో అతను వాటా అడుగుతాడని అతని రెస్టారెంట్ లో పని చేసిన కొందరు వెయిటర్స్ ఆరోపణలు చేశారు, వాటి కోసం కోర్ట్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది గానీ అవేమీ అతని బిజినెస్ ని దెబ్బతీయలేదు.

కథ ఇక్కడే ముగిసిపోలేదు, శ్రీమంతుడు సినిమాలో లాగా తన ఊరికి ఏదైనా చెయ్యాలనుకొని తనలా తన ఊరిలో ఇంకెవ్వరూ చదువుకు దూరం కాకూడదని స్వంత డబ్బులతో స్కూల్ కట్టించాడు.  

చివరికి దీని నుంచి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా అంటే, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాకపోతే దాన్ని మనమే ప్రపంచానికి చూపెట్టాలి ఆ కళను ప్రదర్శించే ప్లాట్ఫారంని మనం వెదుక్కోవాలి లేదంటే నిర్మించుకోవాలి. వంట చేయడం అనేది కూడా ఒక కళే, దాన్ని సరైన చోట ప్రదర్శించబట్టే అతను విజేత అయ్యాడు.  ఇలాంటి విజేతలు ఎక్కడో విదేశాల్లో కాదు మన ఊర్లోనే ఉంటారు, మనం వారిని చూసి స్ఫూర్తి పొందాలి. 

22, అక్టోబర్ 2019, మంగళవారం

ఒక్కోసారి పిచ్చి ఊహ కూడా మీకు మేలు చెయ్యొచ్చు - ఏర్చి కూర్చిన కథలు

"పెంపుడు రాళ్ళు" అన్న మాట ఎప్పుడైనా విన్నారా?

ఏంటి మమ్మల్ని పిచ్చోళ్లనుకున్నావా? నువ్వు రాసే ప్రతీ చెత్త మేము చదవడానికి అని నా పోస్ట్ క్లోజ్ చేయాలని మీరు అనుకుంటే పప్పులో కాలు, ఉప్పులో చెప్పు వేసినట్లే.

"పెంపుడు రాళ్ళు" అనే మాట పిచ్చిగా అనిపిస్తుంది కానీ ఆ పిచ్చి ఊహే నాలుగు రాళ్ళు వెనకేసుకునేలా చేసింది ఒక వ్యక్తి విషయంలో.

అప్పుడెప్పుడో 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో గాలి బొక్కల చొక్కా, తుపుకు తుపుకు డిజైన్ షర్ట్ అని అమ్మితే జనాలందరూ ఎగబడి కొన్నట్లు చూపిస్తే సినిమా కాబట్టి అలా చూపిస్తారు నిజ జీవితం లో అలాంటి జనాలు ఎవరుంటారు అని అనుకునే వాళ్ళము కదా! కానీ నిజ జీవితం లో అంతకంటే క్రేజీ పీపుల్ ఉంటారని మీరు ఈ పోస్ట్ చదివిన తర్వాత అనుకుంటారు. 

ఇక నాన్చుడు లేకుండా డైరెక్ట్ గా విషయానికి వస్తాను.

గారీ రోస్ దాల్ ..వద్దులే అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇప్పుడు నేను మార్చడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ లోనే చెప్తాను Gary Ross Dahl అనే పేరున్న ఇతన్ని మనం Gary అని పిలుచుకుందాం క్లుప్తంగా.

1975 టైములో ఈ Gary అనే వ్యక్తి అమెరికా లో "ఫ్రీలాన్స్ కాపీ రైటర్" అనబడే ఉండీ లేని జాబ్ ఏదో వెలగబెడుతున్న రోజులవి. బార్లో కూర్చొని బీర్ తాగుతూ ఫ్రెండ్స్ తో బాతాఖానీ కొడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్, తను ఊరెళ్ళినప్పుడు తన పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి యెంత కష్టపడ్డదీ, యెంత ఖర్చుపెట్టిందీ తలచుకొని బావురుమన్నాడు. ఇక మిగతా వారు కూడా ఈ పెంపుడు జంతువుల విషయం లో తాము ఊర్లో లేనప్పుడు వాటి సంరక్షణ కోసం పడ్డ కష్టాలను ఏకరువు పెట్టారు. అసలే డబ్బులు లేక కరువు లో అల్లాడుతున్న మన Gary కి ఈ సమస్య ఏదో బంగారు బాతులా అనిపించి "పెంపుడు రాళ్ళు" అనే ఐడియా వచ్చేలా చేసింది.

అట్టపెట్టెలలో కాస్త మందంగా ఎండు గడ్డి పేర్చి అట్టపెట్టె సైడ్ లో కాస్త పెద్ద సైజు రంధ్రాలు చేసి లోపల Rosarito అనే బీచ్ దగ్గర దొరికే నున్నటి ఓవల్ షేప్ లో ఉన్న రాళ్ళను ఉంచి ఆ అట్టపెట్టె మీద 'Pet Rock' అని ముద్రించి ఒక్కొక్కటి నాలుగు డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. ఈ రాయితో పాటు దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో జాగ్రత్తలు చెబుతూ ఒక instruction బుక్ కూడా పెట్టాడు. కరెక్ట్ గా చెప్పాలంటే అమ్మకాల్లో ఈ instruction బుక్ కీ లాగా పనిచేసింది. ఈ బుక్ లో ఆ పెంపుడు రాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పే జాగ్రత్తలు బాగా హాస్యాన్ని తెప్పించాయట. 'వీటికి బద్ధకం ఎక్కువ, కూర్చున్న చోటి నుంచి కదలవు. మీరే బయటికి తీసుకెళ్ళాలి.  అలాగని చెప్పి స్విమ్మింగ్ కి మాత్రం తీసుకెళ్ళద్దు వాటికి ఈత రాదు మునిగిపోతాయి' అంటూ హాస్యాన్ని కురిపించాయట.

మొత్తానికి అలా ఈ రాళ్ళ వ్యాపారం 1975 మధ్యలో మొదలైంది. అలా మొదలైన వ్యాపారం ప్రజల్లోకి వెళ్ళడానికి బాగా ఫేమస్ అయిన 'టు నైట్ షో' అనే పాపులర్ అమెరికన్ టీవీ షో లో పాల్గొనడం, పేపర్లో పబ్లిసిటీ ఇవ్వడం వీటికి తోడూ 'నేను నా పెట్ రాక్ తో ప్రేమలో ఉన్నాను'  అనే ఒక సాంగ్ ని కూడా షూట్ చేయించి రిలీజ్ చేయడం చేశాడు.


అతని ప్రయత్నాలు వృథా కాలేదు. అమెరికాలో ఆ సంవత్సరం క్రిస్మస్ కి చలితో పాటు ఈ పెట్ రాక్స్ వ్యాపారం కూడా అమాంతం పెరిగింది. ఈ క్రేజీ ఐడియా 6 నెలలే పని చేసింది గానీ అప్పటికే అతను పది పదిహేను లక్షల రాళ్ళ దాకా అమ్మి సొమ్ము చేసుకున్నాడట.

ఇందులో మనకు అంత విచిత్రం ఏమీ కనపడకపోవచ్చు, ఎందుకంటే జాతి రత్నాలపేరు చెప్పి మన దేశంలో ఇప్పటికీ బోలెడన్ని రాళ్ళు అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 

ఆ పెంపుడు రాళ్ళ వ్యాపారం మూలపడ్డాక అలాంటివే ఇంకొన్ని పిచ్చి పిచ్చి వ్యాపారాలు మొదలెట్టాడు గానీ ఏవీ క్లిక్ అవలేకపోయాయి. ఏదైతేనేం మార్కెట్టింగ్ లో తన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 'Advertising For Dummies' అనే బుక్ కూడా రాశాడు ఇతను. 

ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి పిచ్చి ఐడియా ఉండి దాన్ని ప్రమోట్ చేసుకోగలిగితే "పెంపుడు రాళ్ళు" కాన్సెప్ట్ లాగా మీరూ నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు. 

16, మే 2019, గురువారం

వయసెప్పుడూ అడ్డంకి కాదు - ఏర్చి కూర్చిన కథలు

"నాకు చిన్నప్పటి నుంచి కరాటే నేర్చుకోవాలని తెగ కోరిక, కానీ ముప్పయ్యేళ్ల వయసులో కరాటే  క్లాస్ కెళ్తే అందరూ నవ్వరూ?" అని సిగ్గు. 

"నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఇంట్రస్ట్ ఉండేది, కానీ పదేళ్ల వయసులో నేర్చుకోవాలింది ఈ నలభయ్యేళ్ళ వయసులో ఏం నేర్చుకుంటాం?" అని బెరుకు. 

"కాలేజ్ లో చదివేప్పుడు  కథలు, కవితలు అంటూ తెగ రాసేవాడిని, ఆ తర్వాత చదువు, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు అంటూ యాభయ్యేళ్ళు వచ్చేశాయ్, ఇప్పుడేం రాస్తాను" అని ఒక నిర్లిప్తత. 

వయసులో ఉన్నప్పుడు స్టేజి మీద ఎన్ని నాటకాలు వేసేవాడిని, ఒక్క సినిమాలో అయినా నటించాలన్న కోరిక మాత్రం అట్లాగే మిగిలి పోయింది.... జాబ్ లోంచి రిటైర్ అయిన అరవయ్యేళ్ళ వ్యక్తి మనసులోంచి బయటపడిన ఒక నిరాశ. 

"అసలు నాకున్న ఐడియాలు సరిగ్గా వర్కౌట్ చేసి ఉంటే నా చివరి దశలో వైద్యానికి సరైన డబ్బు లేక ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ లో ఇంత ఇబ్బంది పడేవాడిని కాదు" అనే ఆవేదన. 

ఎప్పుడో ఒకప్పుడు మనలో చాలా మంది పైన చెప్పిన ఏదో ఒక స్టేట్మెంట్ తో relate చేసుకునే ఉంటారు. 

కానీ ఒక వ్యక్తి మాత్రం 'ఈ వయసులో ఇప్పుడేం చేయగలం?' అని అందరిలా అనుకొని చేతులు కట్టుకు కూర్చోలేదు. 

ఆ దానిదేముంది, అతని విషయం వేరు, మన విషయం వేరు అని కుంటి సాకులు చెప్పడానికి వంద కారణాలు వెతుక్కుంటాం కానీ ఒక్క ప్రయత్నం కూడా చేయం.

"అదేం కాదు, నేను కనీసం ఒక వంద సార్లు ట్రై చేసి ఉంటాను." అనేవాళ్ళు ఉంటారు. మరొక్క ప్రయత్నం నిన్ను విజయానికి చేరువ చేసేదేమో ఎవరు చెప్పొచ్చారు. నువ్వు చేస్తున్న ప్రయత్నం 101 సారికే ఫలిస్తుంది అని నీ తల రాత లో రాసి ఉంటే? నువ్వు ఓడిపోయినట్లేగా.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో వ్యక్తి కూడా 1009 సార్లు ప్రయతించి ఫెయిల్ అయ్యాడు. మరి అతను 1010 సారి ప్రయత్నించకుండా అక్కడితోనే ఆపేసి ఉంటే అతను కూడా మనలో ఒకడిగా మిగిలిపోయి ఉండేవాడు, ఈ రోజు అతని కథ మనం చదివే వాళ్ళం కాదు.

అతనే ఈ రోజు మన కథలో హీరో, పేరు Harland Sanders. అతను ఎక్కడ పుట్టాడు, ఏం చేసాడు, ఏం చదివాడు అన్న సోది ఈ పోస్టుకి అవసరం లేదు. ఒక చిన్న ఇంట్లో ఉంటూ అరవయ్యేళ్లు పైబడ్డ వయసుతో పెన్షన్ లాంటి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ పొందుతూ,  ఓ డొక్కు కారు కలిగి ఉన్న అతని ఇంట్రడక్షన్ చాలు.


తను చేసిన చికెన్ తిని అందరూ మెచ్చుకుంటున్నారు కదా అని అక్కడితో ఆగిపోలేదు అతను. దాన్ని మరింత పెద్ద రేంజ్ కి తీసుకెళ్ళి తద్వారా తన ఫైనాన్సియల్ రేంజ్ కూడా పెంచుకోవాలి అనే సంకల్పం అతని వయసుని గుర్తుకురానివ్వలేదు.

తను వండిన ఫ్రైడ్ చికెన్ తీసుకొని లోకల్ రెస్టారెంట్స్ చుట్టూ తిరిగాడు డీల్ కోసం. ఆ డీల్ ప్రకారం, ఆ చికెన్ తయారు చేయడానికి అవసరమయ్యే 11 రకాల herbs, spices (మసాలా దినుసులు) అంతా కలిపి ఒక ప్యాకెట్ లో ఇస్తాడు. దాన్ని రెస్టారెంట్ వాళ్ళు యూజ్ చేసి ఫ్రైడ్ చికెన్ తయారు చెయ్యొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మసాలా ఆ పెద్దాయనది, చికెన్ ఏమో రెస్టారంట్ వారిది. మసాలా లో వాడే దినుసుల గురించి సీక్రేసీ మెయింటైన్ చెయ్యడానికే  తను ఇలా అన్నీ ముందే కలిపి వాళ్లకు ఒక ప్యాకెట్ లో అందిస్తాడు. ఆ రెసిపీ వాడి రెస్టారెంట్స్ అమ్మిన ప్రతీ చికెన్ మీద ఒక నికెల్ (5 సెంట్స్) ఇతనికి ఇచ్చే ఒప్పందం ఇది.

లోకల్ రెస్టారెంట్స్ వారందరూ రుచి చూసి బాగుందన్న వాళ్ళే గానీ డీల్ ఓకే చేసుకోలేదు.  వాళ్ళు ఓకే చెయ్యలేదని ఆగిపోలేదు ఆ పెద్ద మనిషి. తన డొక్కు కారు వేసుకొని యునైటెడ్ స్టేట్స్ మొత్తం తిరిగాడు ఏదో ఒక రెస్టారెంట్ తనతో డీల్ చేసుకోదా అని.

ఇలా 1009 సార్లు నో అనే రెడ్ సిగ్నల్స్ తర్వాత 1010 సారి ఎస్ అనే గ్రీన్ సిగ్నల్ ఎదురైంది. ఆ చికెన్ కోసం అమెరికా లోని చాలా మంది జనాలు  ఎగబడ్డారు, ఆ తర్వాత ప్రపంచంలో చాలా మంది.

అలా మొదలైన ప్రస్థానం 1964 నాటికి 600  ఫ్రాంచైజీలలో ఆ చికెన్ అమ్మడం దాకా వెళ్ళింది.
ఇక ఆ చరిత్ర గురించి మరింత చెప్పాల్సిన అవసరం లేదు, KFC (Kentucky Fried Chicken) బ్రాండ్ చెబుతుంది ఆ వ్యాపారం యెంత పాపులర్ అయిందో.

65 ఏళ్ళ దగ్గర చాలా మంది తమ విజయ యాత్ర ను ముగిస్తే, అతను మాత్రం అదే 65 ఏళ్ళ దగ్గర మొదలెట్టాడు ప్రపంచం నలుమూలలా తన KFC సామ్రాజ్యాన్ని విస్తరించే జైత్ర యాత్రని.

ఇక చాలు, ఈ వయసులో ఇంకేం చేస్తాం అనుకునే వారందరికీ ఈ కథ చెప్పేది ఒక్కటే Never Give-up, It’s never too late to chase your dreams అని.