సీరియస్ కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సీరియస్ కబుర్లు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, అక్టోబర్ 2021, ఆదివారం

పఠనమా..లేక దృశ్య మాధ్యమమా?

ఎనిమిదేళ్ళ క్రితం అనుకుంటాను తెలుగు మీద  మోజుతోనో లేదంటే ఏదో తెలుగుని బతికించాలి అనే సదుద్దేశ్యంతో ఒక తెలుగు పత్రిక స్టార్ట్ చేశారు ఆస్ట్రేలియా లో. మంత్లీ 4 డాలర్లు కట్టండి లేదంటే సంవత్సర చందా 40 డాలర్లు కట్టండి,  పత్రిక మీ ఇంటికే పంపిస్తాము. నెలలో జస్ట్ ఒక కాఫీ కంటే తక్కువ ఖర్చుకే మీరు మంచి తెలుగు కథలు చదవచ్చు అని advertise చేసుకున్నారు. 

పుస్తకం పట్టుకు చదివితే వచ్చే మజానే వేరు అనే ఉద్దేశ్యంతో నేనూ 8 డాలర్లు మిగులుతాయని సంవత్సర చందా 40 డాలర్లు కట్టాను, తర్వాత సరిగ్గా సంవత్సరానికి ఎక్కువ మంది చందాదారులు లేక ప్రింట్ ఆపేస్తున్నాము, ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్ లో చదువుకోండి  అని చెప్పి ఆన్లైన్ లో మరో ఏడాది కొనసాగించి ఆ తర్వాత దుకాణం పూర్తిగా మూసేశారు. చదవాలి అనే ఆసక్తి పాఠకుల్లో లేకపోవడమో లేదంటే చదివి తీరాలి అనిపించే కంటెంట్ వాళ్ళు ఇవ్వలేకపోవడమో జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే పఠనానికంటే దృశ్య మాధ్యమానికే మొగ్గు చూపుతున్నారు ఈ నాటి తరం. చిన్న హాస్య పుస్తకం చదవడానికంటే జబర్దస్త్ చూడటానికో, సినిమా రివ్యూ చదవడం కంటే పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికో యు ట్యూబ్ ఓపెన్ చేస్తున్నారు తప్ప అసలు చదవడం అన్నదానికి ఫుల్ గా ఫుల్స్టాప్ పెట్టేసినట్లున్నారు. 

నేనొక న్యూస్ కంపనీ లోని IT డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాను. ఆ న్యూస్ పేపర్స్ కి ఉన్న సబ్స్క్రైబర్స్ సంఖ్య చాలా ఎక్కువ, నేను మాట్లాడేది ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ గురించి కాదు ప్రింట్ సబ్స్క్రిప్షన్ గురించి. ఇంకా ఇంటికి పేపర్ తెప్పించుకొని చదివే అలవాటు పెంచుకుంటున్నారు తప్పితే తగ్గించుకోవడం లేదు. ప్రింట్ పేపర్ తగ్గించడం వల్ల వాతావరణానికి మంచి చేసినట్లే అవ్వచ్చు కానీ మన కంటికి విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాము అదే టైం లో ఈ లాప్టాప్, మొబైల్ ఫోన్స్ వాడి విపరీతమైన రేడియేషన్ పెంచుతున్నాము అని నా అభిప్రాయం. 

ఇక్కడ చాలా మంది తెల్లోళ్ళ ఇళ్ళలో ఈ బుక్ షెల్ఫ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది, వారు ఈ చదివే అలవాటు తగ్గించుకోవడం లేదు. మన పాత జనరేషన్ లో ఈ బుక్ షెల్ఫ్ వ్యవహారం ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఈ జనరేషన్ వాళ్ళు అంతా ఫోన్ లోనే వినడం లేదంటే పోడ్ కాస్ట్ లంటూ వింటూ ఉండటం, చివరికి కథలు కూడా ఎవరో రికార్డు చేస్తే  వింటున్నారు. అసలు కథలను మనం చదివితే కదా మజా, వాళ్లెవరో చదివి వినిపించడం ఏమిటి? సరేలెండి నేను ఓల్డ్ జనరేషన్  కాబట్టి నా అభిప్రాయం ఇదేమో. చదవడానికి అంత టైం ఎక్కడుంది, వినడం అయితే సైకిల్ మీద  వెళ్తూనో లేదంటే జాగింగో, జిమ్ చేస్తూనో వినచ్చు అంటున్నారు ఇప్పటి వారు.  ఏదైనా సరే ఒక విషయం గురించి తెలుసుకోవడానికి ఒక వీడియో చూడటం కంటే చదివి తెలుసుకోవడం ఉత్తమం అనేది పాత చింతకాయ పచ్చడి కిందే లెక్క. 

మొన్నీ మధ్యే ఏదో మళయాళ సినిమా బాగుంది అన్నాడు ఒక మిత్రుడు. ఎప్పుడు చూశావ్ అంటే చూడలేదు విన్నాను అన్నాడు. వినడం ఏమిటి, అప్పట్లో మాయాబజార్,  శ్రీ కృష్ణ తులాభారం లాంటి సినిమా ఆడియో కాస్సెట్స్ వచ్చేవి, పాటలు మాత్రమే కాకుండా సినిమా అంతా. అలా ఇప్పుడు కూడా ఆడియో సినిమాలు రిలీజ్ చేస్తున్నారా అని అడిగాను. 

అదేం లేదు, యు ట్యూబ్ లో కొన్ని సైట్స్ ఉన్నాయి.  రెండు గంటల సినిమా చూసే ఓపిక లేని వాళ్ళకు సినిమా స్టోరీ  మొత్తం అరగంట లో చెప్పేస్తారు అన్నాడు. సినిమా కథ ఎక్స్ప్లెయిన్ చేస్తూ యు ట్యూబ్ వీడియోస్ కూడా వచ్చాయంటే జనాలు దృశ్య మాధ్యమానికి యెంత అడిక్ట్ అయ్యారో తెలుస్తోంది. ఇదేం విచిత్రం రా నాయనా అనుకున్నా?  20-20 క్రికెట్ మ్యాచుల జనరేషన్ లో పోను పోను ఇలాంటి ఎన్ని విచిత్రాలు వినాల్సి వస్తుందో. 

పాతికేళ్ళ క్రితం 'రోజులో అలా 8 గంటలు టీవీ ముందు కూర్చుని క్రికెట్ చూస్తూ టైం ఎందుకు వేస్ట్ చేస్కుంటారు' అని మా నాన్న అంటుంటే ఓల్డ్ జనరేషన్ అని సరిపెట్టుకున్నా. ఇప్పుడు  నేను కూడా అదే ఓల్డ్ జనరేషన్ లోకి చేరినట్లున్నాను. 

పాత నీరు పోయి కొత్త నీరు రావాల్సిందే, అదే ప్రకృతి ధర్మం కూడా. 

13, నవంబర్ 2019, బుధవారం

అవ్వా బువ్వా రెండూ కావాలంటే మాత్రం కుదరదు

ఎప్పుడూ సినిమాలు, సరదా కబుర్లే కాకుండా ప్రస్తుతానికి వార్తల్లో బాగా నలుగుతున్న 'ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు' అనే కాన్సెప్ట్ మీద నా అభిప్రాయం రాద్దామనుకున్నాను. ఈ ఇంగ్లీష్, తెలుగు మీడియం చదువుల డిబేట్ ఎప్పటికీ తీరేది కాదు కానీ నా స్టాండ్ అంటూ ఒకటి ఏడ్చి ఉంటుంది కదా అది రాద్దామని ఈ ప్రయత్నం.  ఇలాంటి టాపిక్స్ 'నా కప్ అఫ్ టీ' కాదు అని నాకు తెలుసు కానీ ఏదో రాద్దామని చిన్న ప్రయత్నం అంతే

'దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ'  అని ఒక సారి సినిమా హీరో నాగార్జున T.V ఇంటర్వ్యూ లో అన్నాడు. దాని అర్థం ఏమిటన్నది తెలీదు కానీ అబ్బో వీడికి భలే ఇంగ్లీష్ వచ్చన్నమాట అని నా మిత్రులంతా అనుకునేవారు. మీ చిరంజీవి ఒక్క సారన్నా ఇంగ్లీష్ మాట్లాడాడా అని వాళ్ళు మమ్మల్ని దెప్పి పొడిచేవారు. ఈ విషయం లో మేము ఏమీ మాట్లాడలేకపోయాం. అంటే అర్థం ఏమిటి తెలుగు వచ్చిన వాడికంటే ఇంగ్లీష్ వచ్చిన వాడికే మనం అట్ట్రాక్ట్ అవుతాం అని

కాబట్టి నా ప్రియాతి ప్రియమైన తెలుగు అభిమానులారా, ఎక్కువ మంది ప్రజలు అమ్మ పాల లాంటి  తెలుగు కంటే ఎంగిలిపీసు అయినా ఇంగ్లీష్ వైపుకే కాస్త ఎక్కువ మొగ్గు చూపుతారు అని నా ఉద్దేశం.  నా వరకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే అన్ని సబ్జక్ట్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండి తీరాలి, అలాగని మాతృ భాషను తక్కువ చెయ్యాలని కాదు కానీ తెలుగు కూడా కంపల్సరీ సబ్జెక్టు గా పెట్టాలి. అది కూడా  ఏదో మొక్కుబడి కోసం సంస్కృతం సబ్జెక్టు పెట్టినట్లు కాకుండా. కుండ లో ఉండే కూడు అట్టాగే ఉండాలి, పిల్లాడు మాత్రం గుండులా తయారు కావాలి అంటే కుదరదు. తెలుగు మీడియం ను పక్కకు తోసేసి, తెలుగును మాత్రమే ముందుకు తీసుకెళ్లాలి, వాటితో పాటు మిగిలిన సబ్జక్ట్స్ ఇంగ్లీష్ లో భోదించాలి. 

మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభ చాటాలంటే ఖచ్చితంగా మొక్కగా ఉన్నప్పుడే ఇంగ్లీష్ అందిస్తూ ఉండాలి, మాను అయిన తర్వాత అందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మొక్క, మాను చీప్ తెలుగు వర్డ్స్, ఎవడికి అర్థమవుతాయి ఈ కాలంలో నా పిచ్చి కాకపోతే. 

ఏం, నిజ్జంగా సర్కార్ స్కూళ్ళలో చదువుకొని అంతర్జాతీయంగా తమ సత్తా చాటిన వాళ్ళు లేరా అని అనొచ్చు కానీ వారి సంఖ్య కూడా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేటంత మాత్రమే అన్నది అక్షరాలా నిజం. 

చిన్నప్పుడు గవర్నమెంట్ బడుల్లో చదువుకున్నాను కాబట్టి ఆ అనుభవాలతో చెప్తున్నాను. సైన్స్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులన్నీ తెలుగులో చదివి పౌనపున్యం, ఆరోహణ, అవరోహణ, కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు, కక్ష్య, భూపరిభ్రమణం, వైశాల్యము, విస్తీర్ణం, లంబ కోణం అని చదువుకున్నాను, ఆ తర్వాత కాలేజీ రోజులకు వచ్చాక తర్వాత వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారో సరిగ్గా తెలీక ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన కుర్రాళ్లతో మాట్లాడేప్పుడు కొన్ని సార్లు ఎన్నో విషయాలు తెలుగులో తెలిసి ఉండీ వాటిని ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తీకరించాలో తెలీక ఊరుకుండిపోయాను. 

డిగ్రీ  వరకు తెలుగు మీడియం లో చదివి,  ఒక్కసారిగా M .C. A ఇంగ్లీష్ మీడియం అంటే బాగా ఇబ్బందిపడ్డాను. అందులోనూ కంప్యూటర్ ఆర్గనైజషన్ అని ఒక బుక్ ఉండేది, అందులో మొదటి చాఫ్టర్ చదివి అర్థం చేసుకునే లోపే మొదటి సెమిస్టరు అయిపోయింది. ఏదో అత్తెసరు మార్కులతో పాస్ అయి బయటపడ్డాను. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి ఉంటే అన్ని ఇబ్బందులు ఉండేవి కాదు అని నా అభిప్రాయం. 

అంతెందుకు, తెలుగు మీడియం లో చదివి ఏంతో టాలెంట్ ఉండి  కూడా ఇంగ్లీష్ సరిగ్గా లేక కింది స్థాయిలోనే మిగిలి పోయిన వాళ్ళను చూశాను, టెక్నికల్ గా స్ట్రెంగ్త్ లేకపోయినా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు బాగా రావడం వల్ల మానేజేర్స్ గా అధికారాన్ని చెలాయించిన వాళ్ళను చూశాను.

కాలేజీల వరకు తెలుగు మీడియం లో చదివి, వీసాల కోసం PTE/ IELTS/ TOFEL/ GR E  లాంటి ఎగ్జామ్స్ లో తెచ్చుకోవాల్సినన్ని మార్కులు తెచ్చుకోలేక యెంత మంది ఇబ్బంది పడుతున్నారో ఇప్పటికీ నేను రోజూ చూస్తూనే ఉన్నాను. నా వరకు నేను PR కు  అప్లై చేయడటం కోసం 3 నెలల పాటు  ఇష్టం లేకపోయినా కష్టపడి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతూ, ఇంగ్లిష్ మాత్రమే వింటూ, ఇంగ్లీష్ మాత్రమే తింటూ, ఇంగ్లీష్ నే తాగుతూ వచ్చాను. అసలు ఆ మూడు నెలలు ఒక్క తెలుగు సినిమా కూడా చూడలేదంటే నమ్మండి కాకపోతే ఆ 3 నెలల తర్వాత మళ్ళీ తెలుగుకు షిఫ్ట్ అయినప్పుడు సంతలో తప్పిపోయి చివరకు అమ్మ ఒడికి చేరిన బిడ్డ లాగా తెగ ఆనంద పడ్డాను

ఒక వేళ గవర్మెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మొదట అక్కడ పనిచేసే టీచర్స్ కి తగిన శిక్షణ ఇవ్వాలి. నేను M.C.A చదివే రోజుల్లో చూసాను అక్కడ భోదించే వారికే సరిగ్గా ఇంగ్లిష్ వచ్చేది కాదు, ఇక స్టూడెంట్స్ కి వాళ్ళేం నేర్పుతారు. 

ఇకపోతే మాతృ భాష మృత భాష అయిపోతుంది అని తెగ గగ్గోలు పెడుతున్న వారంతా నిజంగా తెలుగు మీద అంత ప్రేమే ఉండి ఉంటే తెలుగు భాషను బతికించడానికి మార్గాలు వెతికితే బాగుంటుంది.  ఆల్రెడీ తెలుగులో చదవడం వచ్చిన వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు మీడియం తర్వాత, అసలు తెలుగు చదవడం అనేదే నామోషీ అయిపోయింది ఈ కాలం లో. ఎంతమంది అమ్మా, నాన్న అని పిలుస్తున్నారు వారి తల్లిదండ్రులను ఈ కాలంలో? అంతెందుకు మొన్నటి దాకా అమ్మా, నాన్న అని పిలిచినా వారే ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాల్సినప్పుడు మా మమ్మీ, డాడీ అంటూ మొదలెడతారు.

ఏ ఎండకా గొడుగు పట్టడం ఈ రాజకీయ నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. తెలుగు దేశం పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తాం అంటే Y.S.R పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతారు,  Y.S.R పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తాం అంటే తెలుగు దేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతారు. చాలా మంది తెలుగు చచ్చిపోతోంది అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు గానీ వాళ్ళ ఇళ్ళు మొత్తం ఇంగ్లీష్ తోనే నిండిపోయి ఉంటుంది. గాంధీ ఎప్పుడూ పక్కింట్లోనే పుట్టాలి మనింట్లో కాదు అన్నది వీరి కోరిక. 

ఇంకా ఏమైనా అంటే 'ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష కొన్నేళ్ళకు అంతరించి పోతుందని ఫలానా అధ్యయనాల్లో తేలింది' కాబట్టి విద్యా భోధన మాతృభాషలోనే జరగాలి అని వాదిస్తారు. మరి ఇలా అన్నవాళ్లంతా ఈ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళు మొదలైనప్పుడు ఏమయ్యారో తెలీదు. తెలుగు వద్దనడం లేదు, తెలుగు తప్పక నేర్పించండి, కానీ సైన్స్, మాథ్స్, సోషల్ లాంటివి ఇంగ్లీషులో నేర్పించండి.

ఏది ఏమైతేనేం, తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ఇంగ్లీష్ మీడియం చదువులు సర్కారు బడుల్లోకి తీసుకొచ్చేశాం మీ ఇష్టమైంది మీరు చేసుకోండి అని డిసైడ్ అయినట్లు ఉన్నారు జగన్ గారు, ఏది ఏమైతేనేం ఇల్లలకగానే పండుగ కాదు, ముందుండి ముసళ్ల పండుగ ఈ ఇంగ్లీష్ మీడియం రాకతో ఎన్ని ఆటు పోట్లు ఎదురవుతాయో సర్కారు స్కూళ్లలో?

కాకపోతే ఒక్కటి నిజం మన తెలుగంత తియ్యనిది ఈ లోకం లో మరొకటి లేదు, కాకపోతే  చద్ది అన్నం కంటే పిజ్జా, బర్గర్లకే డిమాండ్ ఇక్కడ. జీవితంలో ఎదగాలనుకుంటే మాత్రం తెలుగును తుంగలో తొక్కడమో, గంగలో వదిలేయడమో చెయ్యాల్సిందే.  అవ్వా బువ్వా రెండూ కావాలంటే మాత్రం కుదరదు, అసలే పోటీ ప్రపంచం ఇక్కడ. 

'నా కప్ అఫ్ టీ' కాని విషయం మీద ఏదేదో రాసి మీకు బొప్పి కట్టించి ఉంటాను వెళ్ళి టీ పెట్టుకు తాగండి తల నొప్పి తగ్గడానికి.