చంద్రుని మీద:
స్టార్టింగ్ సీన్ లో చంద్రుని మీద లాండ్ అవుతాడు నాసా లో పనిచేసే నసీర్.
అక్కడ గుడారాలు వేసుకొని అమెరికా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదుల మీద ఒక చేత కత్తి మరో చేత సుత్తి పట్టి ఒక భీభత్సమైన ఫైటింగ్ సీన్.
చంద్రుడి మీద నీరు ఉందో లేదో తర్వాత విషయం, రక్తం మాత్రం ఏరులై ప్రవహిస్తోందని మా శాటిలైట్స్ కనిపెట్టాయి అని రష్యా ప్రపంచానికి తెలియచెప్పింది ఈ లోగా.
ఆ తర్వాత అక్కడే చందమామ మీద నసీర్ తన అభిమానులతో కలిసి ఒక ఇంట్రడక్షన్ సాంగ్
మా బ్లడ్డు బ్రీడు వేరే
మా ఫుడ్డు బ్రెడ్డు మీ ప్రేమే
మా బ్లడ్ బ్రదర్స్ మీరే
మీకిక మిగిలేది గాడిద గుడ్డే
వైట్ హౌస్ లో :
అమెరికన్స్ మన హీరోని అభినందించి ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ గా విజయశాంత్ అని మన తెలుగువాడే ఉంటాడు. అతను మన హీరో దగ్గరికి వెళ్ళి అమెరికాలో ఉగ్రవాదులని ఏరివేసి నీ కర్తవ్యం నెరవేర్చావు, కానీ ఇండియా లో నువ్వు చెయ్యాల్సిన పని ...... అని చెప్పబోతూ ఆగిపోతాడు.
చెప్తాను విను నడిపి సింహా రెడ్డి
వాడెవడు?
అది నీ పేరే, శత్రువుల కంట పడకుండా నీ అసలు పేరు అయిన నడిపి సింహా రెడ్డి ని నసీర్ గా మార్చాము. మీది సీమలో చంద్రమూరి వంశం. మీకు ఆ సూర్యమూరి వంశానికి పడదు.
అదే సోది ఫ్లాష్ బ్యాక్
అప్పట్లో మీ నాయనమ్మ గారే ఆ ఊర్లో వైద్యులు, ఆ సూర్యమూరి వంశస్తుడి ప్రాణం నిలబెడితే "పగవారు నిలబెట్టిన ప్రాణం ఉంటే యెంత పోతే యెంత" అని అప్పుడే వచ్చిన ఇంద్ర సేనా రెడ్డి సినిమా చూసి తన ప్రాణం తానే తీసుకున్నారు.
ఆ తర్వాత అప్పుడెప్పుడో వచ్చిన ఎమ్మెస్ రెడ్డి, కేవీ రెడ్డి, సమర సింహా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి, జయ ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి , ఎ రెడ్డి, బి రెడ్డి , జెడ్ రెడ్డి అని ఫాక్షన్ సినిమాలన్నీ చూసేసి ఈ సీమ లో ఎవరూ కత్తి పట్టకూడదు రక్తపాతం చిందకూడదు అని నరుక్కు చచ్చారు. చివరికి మీ వంశంలో మిగిలిన ఒకే ఒక్క వంశోద్ధారకులు, వారసులు, అరిసెలు, జిలేబీలు, జాంగ్రీలు, వడలు, పకోడాలు అన్నీ మీరే బాబు.
చివరికి చంపడానికి మీ వంశస్తులు లేక, ఆ సూర్యమూరి వంశస్తులు కత్తులు పట్టడమే మానేశారు. దాంతో తరతరాలుగా కత్తులు చేసేవారు, కత్తులు నూరేవారు తినడానికి పట్టెడన్నం దొరక్క 'అలో స్విగ్గీ' అంటూ పీజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసుకొని తింటున్నారు.
లక్ష్యం
అయితే నేను మా ఊరికి వెళ్ళి నా కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిందే విజయశాంత్.
వద్దు బాబూ వద్దు ఏదో పొరపాటున ఈ వైట్ హౌస్ లో మాన్షన్ హౌస్ ఎక్కువ తాగేసి నిజం చెప్పేశాను. కావాలంటే ఈ అమెరికన్ ప్రెసిడెంట్ పదవి రాసిస్తా, అసలు ఈ పదవే మీ వంశం పెట్టిన భిక్ష, మీరు ఇక్కడ ఉండటమే మీకు రక్ష, ఎందుకు బాబూ ఈ కక్ష్య.
ఇకపై నా లక్ష్యం నాసా లో చంద్రుడు, సూర్యుడు, కక్ష్య కాదు, సీమలో మా చంద్రమూరి వంశ రక్ష, ఆ సూర్యమూరి వంశానికి శిక్ష.
అట్నే గానీ బాబు. శానా సేపు ఎమోషన్ నడిసినాది, ఎంటర్టైన్ మెంట్ కోసం ఒక ఐటెం సాంగ్ ఏర్పాటు చేసినా , మీరు డాన్స్ చెయ్యాల్సిందే.
ఐటెం సాంగ్
పుట్టిందేమో బొంబాయి
సీమలో కత్తులు తయారు చేసే కాలనీలో:
ఇక మీరు పస్తులతో పడుకునే టైం ముగిసిపోయింది, ఇకపై రకరకాల డిజైన్స్ లో కత్తుల తయారీని మొదలుపెట్టండి. ఈ కత్తుల పరిశ్రమే కాదు మరే పరిశ్రమని మన ఆంధ్రా దాటి వెళ్లనివ్వను. ఆకలేస్తే అమృతాంజనం, జలుబు చేస్తే జండూబామ్ తింటున్న మీరు ఇకపై రోజూ బిర్యానీ తినేలా చేస్తా.