నేను తొమ్మిదవ తరగతి చదివేటప్పుడు భాషా అని ఒక మాథ్స్ టీచర్ ఉండేవారు. ఎవరైనా పిల్లాడు బాగా చదువుకోకపోతే వాడు చెడిపోతాడేమో అనే బాధతో 'మసీదు మెట్ల మీద కూర్చుని అడుక్కుతింటావురోయ్' అనే మాట ఆయన నోటి వెంట వచ్చేది .అలా ఎక్కువ సార్లు అనిపించుకున్న వాళ్ళలో లక్ష్మిపతి, చాంద్, కిరణ్ అనే ముగ్గురు మిత్రులు ఉండేవారు.
వీళ్ళతో పాటు హుస్సేన్ అని ఇంకో మిత్రుడు కూడా ఉండేవాడు. అంతవరకూ హిందీ అంటే పెద్దగా తెలీని నేను అంతో ఇంతో నేర్చుకున్ననంటే అది మా హుస్సేన్ వల్లనే. హిందీ సినిమాలు చూడటం వలన కూడా హిందీ నేర్చుకోవచ్చు అని నన్ను మభ్యపెట్టి తనతో పాటు నన్ను కొన్ని హిందీ సినిమాలకు తీసుకెళ్ళేవాడు. సినిమాలు అర్థం కావడానికి భాష తెలియవలసిన అవసరం లేదన్న సత్యం బోధపడింది అంతేకాదు అంతవరకూ బావి లో కప్పలాగా చిరంజీవే ఇండియా లో పెద్ద స్టార్ అనుకునే నాకు అమితాబ్ అని ఇంకో పెద్ద స్టార్ కూడా ఉన్నాడని తెలిసింది.
ఎప్పుడు చూడు ఆ కట్టె పట్టుకొని పుల్లలు పెట్టుకుని ఆటలాడటం (క్రికెట్ ను ఆయన అలా అనేవారు) తప్ప ఏనాడైనా పుస్తకం పడితే కదరా చదువు బుర్రకేక్కేది అని పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు బడిత పూజ చేసేవాడు మా బాషా సారు. బయట ఒక చిన్న బాబాయ్ హోటల్ లాంటిది ఉండేది. ఈ రోజు దెబ్బ ఎలా ఉందిరా అబ్బాయ్ అంటే నిన్నటి దెబ్బే బాగుంది బాబాయ్ అనేవాడు మా తోలు మందం చాంద్ గాడు . నిన్ను కొట్టి కొట్టి మీ సారు చేతులు పడిపోవాలే కాని నువ్వు మారవు రా అబ్బాయ్ అనేవాడు ఆ హోటల్ బాబాయ్.
హుస్సేన్ చదువులో చురుకైన వాడే కానీ లక్ష్మిపతి, చాంద్ మాత్రం బాగా వీక్. 1 కిలో పంచదార 12 రూపాయిలైతే 3 కిలోలు ఎంత లాంటి చిన్న లెక్కలడిగినా చాలు చెమటతో వాళ్ళ చొక్కాలు తడిచిపోయేవి. ఒరేయ్ లక్ష్మిపతి కనీసం ఈ లెక్క కూడా చెప్పలేకపోతే మీ నాన్న కిరాణా షాప్ ఎలా నడపగాలవురా అని అనేవారు మా భాషా సార్. కానీ లక్ష్మిపతి మాత్రం calculator యూజ్ చేస్తే పోలా అని స్మార్ట్ గా ఆలోచించేవాడు. బతక నేర్చినవాడి ఆలోచన అది అని కొందరు అనేవారు.
ఆ లెక్క నువ్వు చెప్పురా చాంద్ అంటే చాలు వాడి నోరు బంద్.
ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే మొగుడు కొట్టబోయే దెబ్బలకి అందట వెనకటికి ఒకావిడ అలా సారు ఈ ప్రశ్న అడగ్గానే మా కిరణ్ ఏడుపు మొదలెట్టేవాడు.
ఇలా సంవత్సరమంతా వాళ్లకు లెక్కలు నేర్పించాలనుకున్నా వాళ్లకు ఎక్కలేదు. విసుగొచ్చేసి నాశనం అయిపోతారురా రేయ్ మసీదు మెట్ల మీద కూర్చుని అడుక్కుతింటారు. ఒరేయ్ లక్ష్మిపతి నువ్వేమో బడి మానేసి ఆ కిరాణా కొట్లో కూర్చోవాల్సిందే, చాంద్ నువ్వేమో మీ నాన్న బదులు నువ్వు సైకిల్ కు puncture వేసుకు బతకాలి. రేయ్ కిరణ్ నువ్వేమో మీ నాన్న లాగానే సోడాలమ్ముకొని బతకాలి అని తిట్టేసాడు.
కాని విధి విచిత్రమేమిటంటే లక్ష్మిపతి సూపర్ మార్కెట్ పెట్టుకొని బాగా సంపాదించి బాగా బతికేస్తున్నాడు. బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి చాంద్ అయితే వాళ్ళ నాన్నతో పెట్టుబడి పెట్టించి మొబైల్ షో రూం పెట్టుకొని బ్రహ్మాండంగా బతుకుతున్నాడు. ఇక కిరణ్ ఏమో కష్టపడి సోడా కొట్టు ను ఐస్ క్రీం parlour గా మార్చేసి కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం లు అమ్ముకుంటూ దర్జాగా బతుకుతున్నాడు
ఇక బాగా చదువుకున్న హుస్సేన్, నేను I.T ఫీల్డ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లుగా తెల్లోల్లకు బానిసత్వం చేస్తున్నాము.
ముష్టోడికి ఒక ఇల్లని లేదు అలాగే ఉద్యోగికి ఒక ఊరని లేదు అంటారు కదా అలా మా నాన్నకు ట్రాన్స్ఫర్ అయి ఊరు మారాల్సి వచ్చినప్పుల్లా పాత ఫ్రెండ్స్ ని వదిలేసి కొత్త ఫ్రండ్స్ ని వెదుక్కోవలసి వచ్చేది. కాని ఈ నలుగురు ఫ్రెండ్స్ మాత్రం బాగా స్పెషల్, ఎందుకంటే అప్పుడే కొన్న కొత్త సైకిల్స్ మీద విపరీతంగా తిరగడం, చింత చెట్లు ఎక్కి చింతకాయలు కోయడం, క్రికెట్ ఆడటం లాంటివి తప్ప ఏనాడూ పెద్దగా చదివినట్లు గుర్తు లేదు.
రంజాన్ కదా నా ఫ్రెండ్స్ హుస్సేన్, చాంద్, మా భాషా సర్ గుర్తొచ్చారు.
ముస్లిం మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.