3, జులై 2016, ఆదివారం

మూడవ కప్పదాటు

ముందటి టపాకి  కొనసాగింపు

గమనిక: కొన్ని సెన్సార్ అభ్యంతరాల వల్ల ఈ టపా కు యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడమైనది

ఇక ఆ తర్వాత మేముండే ఊరికి ఎప్పుడు చిరంజీవి సినిమా వచ్చినా వదలకుండా చూసేవాళ్ళము. అలాంటి టైంలోనే ఖైదీ సినిమా రిలీజ్ అయి ఇక చిరంజీవి గాడికి తిరుగులేదు అని అందరూ అనటం మొదలు పెట్టారు. ఖైదీ సినిమా మా ఊర్లో వేస్తున్నాము అని ఊరించి ఊరించి చివరికి రోషగాడు సినిమా తెచ్చారు ఒక రోజు.

షరా మామూలుగానే నేను నా ఫ్రెండ్ సినిమా మధ్యలో తినడానికి కావలసిన బజ్జీలు, జంతికలు, బెల్లం మిఠాయి, పాకం పప్పు లాంటివి శెట్టి గారి షాప్ లో కొనుక్కెళ్ళాము కానీ సినిమా స్టార్ట్ అవ్వకముందే సగం పైనే ఖాళీ చేసేసాము, మిగిలిన ఆ సగం భాగాన్ని సినిమా అయిపోయాక ఇంటికి పోయేప్పుడు తింటూ వెళదాం అని పక్కనపెట్టుకోకుండా ముందు జాగ్రత్తగా నీ భాగం నీ దగ్గర ఉంచుకో నా భాగం నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పాను పోయినసారి లాగా అన్యాయం కాకూడదని. అబ్బే ఈ సినిమాలో జయమాలిని లేదట కాబట్టి ఈ సారి అలా జరగదులే అన్నాడు.

సినిమా అయిపోయాక ఇంటికి వెళ్తూ ఇందాక తినకుండా మిగిలినవి కొన్ని ఉన్నాయి కదా ఇవ్వు తింటూ వెళదాం అని అడిగాను.

ఇంకెక్కడున్నాయ్ ఎప్పుడో తినేసాను అన్నాడు

ఎప్పుడు అని అడిగాను

ఎప్పుడేంటి చాలా సార్లు సినిమా మధ్యలో ఆ యమ్మి కనపడ్డప్పుడల్లా నీ నోట్లో దోమలు దూరినప్పుడు అన్నాడు.

మరుసటి రోజు మా వాడన్నట్లు నేను నోరు తెరిచి మరీ చూసిన ఆ యమ్మి ఎవరా అని ఈ సారి మా అమ్మ దగ్గర కాదు కానీ బళ్ళో కూపీ లాగాను . ఆ యమ్మి ఎవరో కాదు విజయలక్ష్మి ఉరఫ్ సిల్క్ స్మిత అని తెలియడంతో పాటు నా కంటే పెద్ద ముదుర్లు మా క్లాస్ లో ఉన్నారని కూడా తెలిసింది.

LOVE AT FIRST SIGHT లాగా సిల్క్ స్మిత మీద LIKE AT FIRST SIGHT ఏర్పడింది. వీడెంటి తేడా గాడు హీరోయిన్ మీద అభిమానం ఉండచ్చు కానీ వ్యాంపు మీద ఏమిటీ అని మీలో కొందరు అనుకుంటున్నట్లే మా బడదల్ కూడా అన్నాడు.

అప్పుడెప్పుడో వేటగాడు సినిమా చూసి శ్రీదేవి మీద అభిమానం పెంచుకున్నావ్ బాగానే ఉంది కానీ మరీ సిల్క్ స్మిత మీద ఏమిటి అన్నాడు.

నీకు పూరి ఇష్టమా చపాతి ఇష్టమా అడిగాను నేను

రెండూ అన్నాడు

మరి నాకు కూడా ఇద్దరూ ఇష్టమే అన్నాను

దానికి దీనికి పోలికేమిటి అన్నాడు చిరాగ్గా.. సరిగ్గా మీ మెదడులో మీరూ అనుకుంటున్నట్లే

ఇప్పుడు మీ అమ్మ అదే పిండితోనే చేసిన చపాతి, పూరి నీకు నచ్చినట్లే నాకు కూడా ఆ దేవుడు ఒకే పిండితో చేసి ప్రాణం పోసిన ఆ ఇద్దరూ నచ్చారు.  చపాతి, పూరి లలో రూపులు, షేపులు, రుచులు కాస్త తేడా ఉన్నట్లే వీళ్ళిద్దరి రూపులు, షేపులు, చూపులు, ఊపులు, వాళ్ళు వేసే డ్యాన్సులు, డ్రెస్సులు తేడా ఉండొచ్చు అంతే అన్నాను.

ఏడ్చినట్లే ఉంది నువ్వు నీ చెత్త లాజిక్ అనుకుంటున్నారు కదూ కానీ మా వాడు కన్విన్స్ అయ్యాడు.

జల్లెడ తో నీళ్లు పట్టే మీ వాడు కన్విన్స్ అయినంత మాత్రాన మేము కన్విన్స్ అవ్వాలా అని మీరు అనరు ఎందుకంటే ఇంత కంటే చెత్త లాజిక్ లకు అలవాటు పడేలా చేశాయి మన తెలుగు సినిమాలు

'మరి నీ favourite జయమాలిని' అన్నాడు

పార్టీ  మారుదామనుకుంటున్నాను.

ఇలా పార్టీ మారడం బాగోదు ప్రతిసారి అన్నాడు

మొన్నటిదాకా కర్ర బిళ్ళ ఆడి దార్లో వెళ్లే వాళ్ళ బుర్రలకు బొక్క పెట్టేవాడివి మరి ఈ రోజు అవే బుర్రలు క్రికెట్ ఆడుతూ పగలగొడుతున్నావ్ ఇలా నువ్వు మారచ్చు కానీ నేను మారితే బాగోదా ఇదెక్కడి అన్యాయం అని ఒక దిక్కుమాలిన పోలిక పెట్టి అడిగా.

ఇది నైతికత అనిపించుకోదు, దీనికి నేను నిరశన తెలియజేస్తున్నాను అన్నాడు రాజకీయ వార్తలు పేపర్ లో చదివి తలకెక్కించుకున్న మైకంతో.

నిన్నటికి నిన్న ఎన్టీవోడిని ఆ నాదెండ్ల భాస్కర్ రావ్ వెన్ను పోటు పొడిచి సి.ఎం సీట్ లాక్కున్నప్పుడు హైదరాబాద్ దాకా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి నిరశన తెలియచేద్దాం అంటే అప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు నేనేదో పార్టీ మారుతున్నానని నైతికత గురించి మాట్లాడుతున్నావ్ అని మా వాడి నోరు మూయించాను

అలా మూడవ కప్పదాటు జయమాలిని పార్టీ నుంచి సిల్క్ పార్టీకి. ఇక సిల్క్ సినిమాలన్నీ చూసి జన్మ ధన్యం చేసుకోవాలనుకున్న నన్ను విధి వెక్కిరించింది.

అవి జయమాలిని, జ్యోతిలక్ష్మి హవా తగ్గి సిల్క్ స్మిత విజృంభిస్తున్న రోజులు. అప్పుడు ఈ కప్ప బావి లోంచి చెరువులోకి వచ్చి పడింది అంటే నన్ను చదువుకోవడానికి పులివెందుల పంపారు. లక్కీగా అక్కడ కూడా రెండు వారాలకొకసారి హాస్టల్ లో వేసే సినిమాల్లో కూడా ఎక్కువగా చిరంజీవి సినిమాలే వేసేవారు కానీ జీడిపప్పు తీసేసి హల్వా పెట్టినట్లు విత్ సెన్సార్ కట్స్ ఆఫ్ సిల్క్ స్మిత పాట. ఉసురు ఊరికే పోదంటారు అందుకే కొన్నేళ్ళకే ఆ స్కూల్ మూసేసుకున్నారు. ఏ మాటకా మాట చిరంజీవికి సినిమాల్లో ఖైదీ ఎలాగో అలాగే ఆ హాస్టల్ లో పెట్టే ఫుడ్ లో పూరి అలాగ. అబ్బో ఆ రుచే వేరు. దీని గురించి ఇంకో టపాలో ఎప్పుడైనా మాట్లాడుకుందాం.


10 కామెంట్‌లు:

  1. పులివెందుల బండి శేష రెడ్డి స్కూల్లో చదివారా

    రిప్లయితొలగించండి
  2. అదే స్కూల్ లో నేను ఎడవతరగతి తరువాత కొన్ని రోజులు అదేదో కోచింగ్ కు చేరాను, అప్పుడు స్కూల్ బాగానే నడిచేది, కొన్ని రోజులకు మూసేసారు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కారణం నాకు తెలీదు కానీ మూసేశారని నేను విన్నాను. బండి శేషా రెడ్డి గారు చాలా బాగా ట్రీట్ చేసేవారు స్కూల్ లో స్టూడెంట్స్ ని.

      తొలగించండి
  3. త్వరగా పూరి గురించి రాసేయండి, కడుపులో ఆకలి వేస్తాంది .

    రిప్లయితొలగించండి
  4. మన కాలంలో అంటే 1989 ఆ మద్యలో ఓక వెలుగు వెలిగిన స్కూల్,

    రిప్లయితొలగించండి
  5. విద్యాదర్శిని అంటే అప్పట్లో బెస్ట్ స్కూల్ అనేవారు.

    రిప్లయితొలగించండి
  6. సిల్కు మీద అభిమానం ని నేను కూడా ఇంత చక్కగా రాయలేను.

    రిప్లయితొలగించండి