2, మే 2022, సోమవారం

పోర్ట్ స్టీఫెన్స్ ట్రిప్ విశేషాలు

మొన్న ఈస్టర్ లాంగ్ వీకెండ్ వచ్చిందని ఓ రెండ్రోజుల ట్రిప్ కోసం "పోర్ట్ స్టీఫెన్స్" అనే ప్లేస్ కి వెళ్ళాము . 

ఆ రోజు 'శాండ్ బోర్డింగ్' అని తలకి 40$, కామెల్ రైడ్ కి తలకో 30$ సమర్పించుకొని (ఈ శాండ్ బోర్డింగ్ మా పెన్నా నదిలో ఫ్రీ గా చెయ్యచ్చు, మా ఊరి తిరణాలలో 100 రూపాయలు పెట్టి ఈ కామెల్ రైడింగ్ చెయ్యొచ్చు, ఏమైనా శంఖం లో పోస్తేనే తీర్థం అయినట్లు డబ్బులు వదిలించుకుంటే గానీ సాటిస్ఫాక్షన్ రాదు) తర్వాత మోకాలి చిప్పలు నొప్పెట్టేవరకు కొండ పైకి ఎక్కేసి రాత్రి పది గంటల టైం లో ముందు రోజే బుక్ చేసుకున్న రిసార్ట్స్ కి వెళ్ళాము. 

మీరు బుక్ చేసుకున్న రూమ్ ఇక్కడికి మరో కిలోమీటర్ అని చెప్పి కీస్ ఇచ్చి మా వాడిని ఫాలో అయిపోండి తీసుకెళ్తాడు అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఆఫీస్ క్లోజ్ చేస్తూ. వాడు మా ముందు బైక్ లో వెళ్తుంటే మేము వాడిని ఫాలో అయిపోయాము గుడ్డిగా. 

అదొక అపార్ట్మెంట్, అందులో ఒక ఫ్లోర్ లో ఉండే యూనిట్స్ అన్నీ ఈ హోటల్ వాడు కొనేసి వాటిని ఇలా పీక్ సీజన్లో హోటల్ గదులుగా అద్దెకి ఇస్తుంటాడు అన్న మాట. 

బాబూ, ఇక్కడ మంచి రెస్టారెంట్స్ ఉన్నాయా అంటే రెండు మూడు లోకల్ రెస్టారెంట్స్ పేరు చెప్పాడు గానీ ఉదయం నుంచి ఆ బర్గర్స్, పీజ్జాలు తిని నాలుక చప్పబడిపోయి ఉండటం వల్ల అలాగే అన్నానికి మొహం వాచి దగ్గర్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయా అని అడిగితే వాచ్ లో టైం చూసుకొని '2 బ్రదర్స్' అనే ఒక ఇండియన్ రెస్టారెంట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది పదకొండు వరకు ఓపెన్ అన్నాడు. 

వెంటనే అక్కడి నుంచి మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళి తిన్నాము. ఫ్రైడ్ రైస్ లో ఉప్పు లేదని అక్కడే ఉన్న వెయిటర్ ని పిలిచి ఇందులో ఉప్పు లేదు అని కంప్లైంట్ చేస్తే ఇదేమైనా పేస్టా ఉప్పు ఉండటానికి అనే రేంజ్ లో మెనూ కార్డు తెచ్చి ఇందులో సాల్ట్ వేస్తామని రాశామా? అంది. నేను షాక్ లోంచి తేరుకొని మరి ఈ చికెన్ కర్రీ లో వేస్తామని మెనూ లో రాయలేదు కదా మరెందుకు వేశారు అని అడిగేలోపే అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చి తినేది టూరిస్ట్స్ మాత్రమే కదా ఒకసారి వచ్చిన వారు మళ్ళీ వస్తారని గారంటీ లేదనే 'డోంట్ కేర్ యాటిట్యూడ్' అయి ఉండచ్చు. 

భోజనం చేసి బయలుదేరే ముందు గుర్తొచ్చింది అర్రే! మనం స్టే చేసే ప్లేస్ అడ్రస్ నోట్ చేసుకోలేదు కదా, ఇప్పుడెలా అని. అప్పుడు ఆ రిసార్ట్స్ దగ్గరికి వెళ్లి అక్కడినుంచి గుడ్డిగా ఆ బైక్ వాడిని ఫాలో అయిన రోడ్ లను ఒక్కక్కటిగా సర్వే చేస్తూ వెనక్కి ముందుకు వెళ్ళి ఏదోలా ఆ ఇంటి అడ్రస్ పట్టేశాము. 

గూగుల్ మ్యాపులు గట్రా లేని రోజుల్లో చలామణిలో ఉన్న చిన్న జోక్ ఇప్పుడు:

ఒకతనికి ఇంట్లో ఉండే పెళ్ళంటా పాటు ఆవిడ పెంచుకునే కుక్క అన్నా ఇష్టం ఉండేది కాదట. అందుకని ఒక రోజు ఆ కుక్కను పెళ్ళాం చూడకుండా కార్ లోకి కుక్కేసి, ఒక రెండు మైళ్ళ దూరం తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడట దాన్ని వదిలించుకోడానికి. 

అక్కడినుంచి అతను తిరిగి వచ్చి గారేజ్ లో కార్ పార్క్ చేసే లోపే ఆ కుక్క ఇంటికి చేరి మొరుగుతూ స్వాగతమిచ్చిందట. ఇలా కాదని మరుసటి రోజు ఒక 20 మైళ్ళ దూరంలో విడిచి వస్తే అతని కంటే ముందే అది ఇంటి చేరిందట, ఇలా కాదని ఒక 100 మైళ్ళ దూరానికి వెళ్ళి అక్కడ కుక్కను విడిచి ఇంటికి బయలుదేరాడట. ఒక నాలుగైదు గంటల తర్వాత ఇంటికి ఫోన్ చేసి కుక్క ఇంట్లో ఉందా అని అడిగాడట పెళ్ళాన్ని?

ఉంది గానీ ఇంత రాత్రి పూట చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయారు అందట 

వస్తా గానీ ముందు కుక్కకు ఫోన్ ఇవ్వు, ఇంటికి దారి కనుక్కోవాలి మూడు నాలుగు గంటల నుంచి దారి తప్పిపోయి తిరుగుతున్నా అన్నాడట

అలా ఉండేవేమో అప్పట్లో తిప్పలు.  ఈ GPS, గూగుల్ మ్యాపులు లేకపోతే బైక్ రోడ్ లో ఆపేసి అటు పక్క ఉండే షాప్స్ వారినే లేదంటే ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తున్న వారినో అడ్రస్ అడిగి వెళ్లిన రోజులు నాకింకా గుర్తే. 

26, ఏప్రిల్ 2022, మంగళవారం

రీమేకులకు ఇక కాలం చెల్లినట్లే

ఓ పది పన్నెండేళ్ళ క్రితం హీరో రాజశేఖర్ మీద ఒక మేకు జోకు బాగా వినిపించేది.

ఇంటర్వ్యూ కోసం ఒక విలేఖరి రాజశేఖర్ ఇంటికి వెళ్తాడు. సర్ వస్తారు కూర్చోండి అని ఒక సర్వెంట్ హాల్లోని సోఫాను చూపిస్తుంది. అతను సోఫా లో కూర్చొని ఉంటే ఆవిడ ఇల్లు క్లీన్ చేసే పనిలో ఉంటుంది. 

ఆ విలేఖరి ఇంటిని తేరిపార చూస్తూ అక్కడ కింద పడి ఉన్న ఒక మేకు ను గమనించి 'ఇదిగో అమ్మాయ్ ఇక్కడ మేకు పడి ఉంది తీసి ఎక్కడైనా పెట్టు' అని అంటాడు.

అయ్యో! మెల్లిగా మాట్లాడండి, మా అయ్య గారికి వినపడుతుంది అంటుందావిడ కంగారుగా

వినపడితే వచ్చే నష్టమేముందమ్మాయ్ .. మేకునే కదా నేను ఎత్తేయమన్నాను అంటాడు

అయ్యో మెల్లిగా మాట్లాడండి సర్ ..మేకు అనే మాట వినపడితే చాలు పూనకం వచ్చిన వాడిలా ఏదో ఒక సినిమా రీ'మేకు' రైట్స్ కొనడానికి తమిళనాడుకో, కేరళాకో బయల్దేరతారు అంటుంది మెల్లిగా. 

అప్పట్లో రాజశేఖర్ ఎక్కువగా రీమేక్ సినిమాలే చేస్తుండటం వల్ల వినపడ్డ జోక్ అది. ఇప్పటికీ 'శేఖర్' అనే రీమేక్ సినిమా చేస్తూ అదే జోన్ లోనే ఉంటున్నాడు "పరుగు ఆపడం ఒక కళ" అని అర్థం చేసుకోకుండా. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఆ జోక్ ని అన్వయించుకోవచ్చేమో...వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అంటూ వరుసగా రీ-మేకులు దించుతున్నాడు. 

మొన్న "జిగర్ తాండ"/"గడ్డలకొండ గణేష్" సినిమాని "బచ్చన్ పాండే" అని రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నారు, నిన్నటికి నిన్న జెర్సీ సినిమాతో మరో సారి  అదే రిపీట్ అయింది. పదేళ్ళ క్రితం పరభాషా సినిమాలు అతి తక్కువ మంది చూసేవారు కాబట్టి ఈ రీమేకులు వర్కౌట్ అయ్యేవి. ఇప్పుడు ప్రపంచసినిమాలని మన ఇంట్లోనే చూసే సౌలభ్యం కలిగాక ఈ రీమేకుల ను చూసే ఇంటరెస్ట్ జనాలలో తగ్గిపోయింది. 

ఏదో పవన్ కళ్యాణ్ కాబట్టి, అంతో ఇంతో పిచ్చిగా చూసే అభిమానులు ఉండబట్టి అతని రీమేక్ సినిమాలు కాస్తో కూస్తో బాగా ఆడి ఉండచ్చు కానీ మరో హీరో సినిమాలు అయితే బొక్క బోర్లా పడటం ఖాయం. పోను పోను ఆ మాత్రం కూడా ఆడతాయని నమ్మడానికి లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడటం మంచిది. 

పర భాషలో హిట్టయ్యింది కదా అని వందల కోట్లు కుమ్మరించి మళ్ళీ రీమేక్ అని తీయడం వల్ల లాభం లేదని ఈ పాటికే బచ్చన్ పాండే, జెర్సీ సినిమా నిర్మాతలకి అర్ధమయ్యే ఉంటుంది, అయినా ఇంకా పలు తెలుగు, తమిళ  సినిమాలని రీమేక్ చేస్తున్నారంటే వారి లెక్కలు వారికి ఉండే ఉండచ్చు. 

సూరారై పోట్రు / ఆకాశమే నీ హద్దురా  సినిమాని అక్షయ్ కుమార్ రీమేక్ చేస్తున్నారు. ఛత్రపతి సినిమాని మన బెల్లంకొండ హీరోగా రీమేక్ చేస్తున్నాడంటే ట్రోలర్స్ కి కావాల్సినంత స్టఫ్ ని బంగారు పళ్ళెం లో పెట్టి ఇవ్వడమే, ఇప్పటికే ఆ ఛత్రపతి  బెంగాళీ రీమేక్ సినిమా హీరో ని మన ప్రభాస్ తో పోల్చుతూ బోలెడంత కామెడీ చేశారు యూ ట్యూబ్ వీడియో లలో. 

ఇక తప్పని సరి తద్దినం అయిన మెగాస్టార్ సినిమా వస్తోంది, ఆ మెగా ఫామిలీ కి మా రెండెద్దుల ఫ్యామిలీ ఏ జన్మలోనే పడిన బాకీని ఈ జన్మలో ఇలా తీరుస్తున్నాను.  ఇలా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్ని ఫామిలీస్ యెంత బాకీ పడ్డాయో గానీ ఆ బాకీ తీరే వరకూ ఈ తాత సినిమాలు ఆపేలా లేడు.  సినిమానో, సీరియలో లేదంటే షార్ట్ ఫిల్మో కూడా అర్థం కానంత సినిమాని వదిలాడు లెజెండ్ అనుకునే ఇంకో తాత.  ఘోరాతి ఘోరమైన హిట్టు అని వినిపించిన సినిమా వదిలాడు మరో తాత. కాకపోతే ఇవేవీ రీమేకులు కాకపోవడం మన అదృష్టం. 

"పరుగు ఆపడం ఒక కళ" అని ఈ తాతల వయసు హీరోలు తెలుసుకోలేరు, మనం అయినా తెలుసుకుంటే మంచిదేమో.