మొన్న ఈస్టర్ లాంగ్ వీకెండ్ వచ్చిందని ఓ రెండ్రోజుల ట్రిప్ కోసం "పోర్ట్ స్టీఫెన్స్" అనే ప్లేస్ కి వెళ్ళాము .
ఆ రోజు 'శాండ్ బోర్డింగ్' అని తలకి 40$, కామెల్ రైడ్ కి తలకో 30$ సమర్పించుకొని (ఈ శాండ్ బోర్డింగ్ మా పెన్నా నదిలో ఫ్రీ గా చెయ్యచ్చు, మా ఊరి తిరణాలలో 100 రూపాయలు పెట్టి ఈ కామెల్ రైడింగ్ చెయ్యొచ్చు, ఏమైనా శంఖం లో పోస్తేనే తీర్థం అయినట్లు డబ్బులు వదిలించుకుంటే గానీ సాటిస్ఫాక్షన్ రాదు) తర్వాత మోకాలి చిప్పలు నొప్పెట్టేవరకు కొండ పైకి ఎక్కేసి రాత్రి పది గంటల టైం లో ముందు రోజే బుక్ చేసుకున్న రిసార్ట్స్ కి వెళ్ళాము.
మీరు బుక్ చేసుకున్న రూమ్ ఇక్కడికి మరో కిలోమీటర్ అని చెప్పి కీస్ ఇచ్చి మా వాడిని ఫాలో అయిపోండి తీసుకెళ్తాడు అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఆఫీస్ క్లోజ్ చేస్తూ. వాడు మా ముందు బైక్ లో వెళ్తుంటే మేము వాడిని ఫాలో అయిపోయాము గుడ్డిగా.
అదొక అపార్ట్మెంట్, అందులో ఒక ఫ్లోర్ లో ఉండే యూనిట్స్ అన్నీ ఈ హోటల్ వాడు కొనేసి వాటిని ఇలా పీక్ సీజన్లో హోటల్ గదులుగా అద్దెకి ఇస్తుంటాడు అన్న మాట.
బాబూ, ఇక్కడ మంచి రెస్టారెంట్స్ ఉన్నాయా అంటే రెండు మూడు లోకల్ రెస్టారెంట్స్ పేరు చెప్పాడు గానీ ఉదయం నుంచి ఆ బర్గర్స్, పీజ్జాలు తిని నాలుక చప్పబడిపోయి ఉండటం వల్ల అలాగే అన్నానికి మొహం వాచి దగ్గర్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయా అని అడిగితే వాచ్ లో టైం చూసుకొని '2 బ్రదర్స్' అనే ఒక ఇండియన్ రెస్టారెంట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది పదకొండు వరకు ఓపెన్ అన్నాడు.
వెంటనే అక్కడి నుంచి మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళి తిన్నాము. ఫ్రైడ్ రైస్ లో ఉప్పు లేదని అక్కడే ఉన్న వెయిటర్ ని పిలిచి ఇందులో ఉప్పు లేదు అని కంప్లైంట్ చేస్తే ఇదేమైనా పేస్టా ఉప్పు ఉండటానికి అనే రేంజ్ లో మెనూ కార్డు తెచ్చి ఇందులో సాల్ట్ వేస్తామని రాశామా? అంది. నేను షాక్ లోంచి తేరుకొని మరి ఈ చికెన్ కర్రీ లో వేస్తామని మెనూ లో రాయలేదు కదా మరెందుకు వేశారు అని అడిగేలోపే అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చి తినేది టూరిస్ట్స్ మాత్రమే కదా ఒకసారి వచ్చిన వారు మళ్ళీ వస్తారని గారంటీ లేదనే 'డోంట్ కేర్ యాటిట్యూడ్' అయి ఉండచ్చు.
భోజనం చేసి బయలుదేరే ముందు గుర్తొచ్చింది అర్రే! మనం స్టే చేసే ప్లేస్ అడ్రస్ నోట్ చేసుకోలేదు కదా, ఇప్పుడెలా అని. అప్పుడు ఆ రిసార్ట్స్ దగ్గరికి వెళ్లి అక్కడినుంచి గుడ్డిగా ఆ బైక్ వాడిని ఫాలో అయిన రోడ్ లను ఒక్కక్కటిగా సర్వే చేస్తూ వెనక్కి ముందుకు వెళ్ళి ఏదోలా ఆ ఇంటి అడ్రస్ పట్టేశాము.
గూగుల్ మ్యాపులు గట్రా లేని రోజుల్లో చలామణిలో ఉన్న చిన్న జోక్ ఇప్పుడు:
ఒకతనికి ఇంట్లో ఉండే పెళ్ళంటా పాటు ఆవిడ పెంచుకునే కుక్క అన్నా ఇష్టం ఉండేది కాదట. అందుకని ఒక రోజు ఆ కుక్కను పెళ్ళాం చూడకుండా కార్ లోకి కుక్కేసి, ఒక రెండు మైళ్ళ దూరం తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడట దాన్ని వదిలించుకోడానికి.
అక్కడినుంచి అతను తిరిగి వచ్చి గారేజ్ లో కార్ పార్క్ చేసే లోపే ఆ కుక్క ఇంటికి చేరి మొరుగుతూ స్వాగతమిచ్చిందట. ఇలా కాదని మరుసటి రోజు ఒక 20 మైళ్ళ దూరంలో విడిచి వస్తే అతని కంటే ముందే అది ఇంటి చేరిందట, ఇలా కాదని ఒక 100 మైళ్ళ దూరానికి వెళ్ళి అక్కడ కుక్కను విడిచి ఇంటికి బయలుదేరాడట. ఒక నాలుగైదు గంటల తర్వాత ఇంటికి ఫోన్ చేసి కుక్క ఇంట్లో ఉందా అని అడిగాడట పెళ్ళాన్ని?
ఉంది గానీ ఇంత రాత్రి పూట చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయారు అందట
వస్తా గానీ ముందు కుక్కకు ఫోన్ ఇవ్వు, ఇంటికి దారి కనుక్కోవాలి మూడు నాలుగు గంటల నుంచి దారి తప్పిపోయి తిరుగుతున్నా అన్నాడట.
అలా ఉండేవేమో అప్పట్లో తిప్పలు. ఈ GPS, గూగుల్ మ్యాపులు లేకపోతే బైక్ రోడ్ లో ఆపేసి అటు పక్క ఉండే షాప్స్ వారినే లేదంటే ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తున్న వారినో అడ్రస్ అడిగి వెళ్లిన రోజులు నాకింకా గుర్తే.
పైన ఆఖరి పేరాలో correct గా చెప్పినది ఒకప్పటి జీవనవిధానం. అక్కడి నుంచి ఇప్పుడు GPS లేకపోతే పక్క వీధిలోని షాపు వరకు కూడా వెళ్ళలేని ఈ నాటి తరం వరకు వచ్చాం.
రిప్లయితొలగించండిఆ మధ్య నేనొక జోక్ విన్నాను. ఈ కాలపు కుర్రాడిని మోటర్ సైకిల్, సెల్ ఫోన్ లేకుండా ఊరి బయట వదిలేస్తే వాడు తనంతట తాను ఇంటికి తిరిగి రాలేడు అని.
ఆ ఇండియన్ రెస్టారెంట్ లో ఆ “సర్వరిణి” ఇండియన్నా? అందుకనే అలాంటి నిర్లక్షపు సమాధానం ఇచ్చిందేమో …. ఎయిర్ ఇండియా స్టాఫ్ లాగా? లేదా తెల్లవాళ్ళు అయ్యుంటే జాత్యహంకారం అనుకోవాలి (కొంత మంది మినహాయింపులు ఉంటారు లెండి). ఏ జాతివారు అయినప్పటికీ మీరన్నది కరక్ట్ - ఈ కస్టమర్ మళ్ళీ వస్తాడా పెడతాడా అనుకుని నిర్లక్ష్య ధోరణి చూపించడం అన్నది అక్షరాలా నిజం.
- విన్నకోట నరసింహారావు
అదీ కరక్టే మేష్టారు, ఈ జెనెరేషన్ అలానే ఉంది. ట్రైన్ లోనే బస్సు లోనో పక్క వారితో మాట కలుపుదామని చూస్తే ఫోన్లో చాటింగ్ చేస్తూనే, వీడియోస్ చూస్తూనో బిజీ గా ఉంటున్నారు.
రిప్లయితొలగించండిఆ సర్వరిణి పక్కా ఇండియనే, I might be wrong, బట్ ఇక్కడి రెస్టారెంట్స్ వాళ్ళు అలా చేయరు. నా అనుభవం తో చెప్తున్నాను.