29, జూన్ 2021, మంగళవారం

ఈ వారం చూసిన సినిమా - మోసగాళ్ళు

ఎన్టీఆర్, చిరంజీవి కాలంలోని పాత తెలుగు సినిమాల్లో అరిగిపోయిన ఫార్ములా తో (తల్లికి మందులు లేక మోసం చేయడం లాంటి)   మొదలవుతుంది హీరో ఎలా మోసగాడిగా మారాల్సి వచ్చింది అనేది సినిమాలో కూడా.  ఆ కాలంలో అంటే హీరో మంచివాడు అనే జస్టిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటి సీన్స్ ఒక నాలుగైదు పెట్టాలి, ఈ కాలంలో అలాంటివి అవసరం లేదు. 

తర్వాత యధావిధిగా అన్ని తెలుగు మాస్ సినిమాలో లాగా స్టార్టింగ్ లో హీరో ఒక ఫైట్ చెయ్యాలి కాబట్టి అదీ చేయించి కథ మొదలెడతారు. ఇంతోటి సినిమా తీయడానికి మనోళ్ళు సరిపోరు అన్నట్లు జెఫ్రీ అనే ఒక హాలీవుడ్ డైరెక్టర్ ని తెచ్చారు. (అక్కడ బేరాలు లేక ఇక్కడికి వచ్చిన చోటా మోటా డైరెక్టరేమో తెలీదు, తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ లేదు)

కాజల్, సునీల్ శెట్టి తో పాటు హీరో కూడా ఫేడ్ అవుట్ అయిన వారే కాబట్టి కాస్టింగ్ పరంగా పెద్దగా ఖర్చు కూడా అయి ఉండదు, బాహుబలి లాంటి పీరియాడిక్ సినిమా కాదు, KGF లాంటి భారీ చేజింగ్ సీన్స్ ఉన్న సినిమా యెంత మాత్రం కాదు, మరి ఈ మాత్రం సినిమాకా 50 కోట్లు ఖర్చు అయిందన్నారు? ఓ పాతిక కోట్లు ఎక్కువ చెప్పారేమో అనిపించింది. దీనికి థియేటర్స్ నుంచి కలెక్షన్స్ 2 కోట్లు మాత్రమే వచ్చాయని టాక్, మరి మంచు వారికి పెద్ద స్థాయిలోనే నష్టం వచ్చి ఉండాలి. 

అప్పట్లో సచిన్ అని ఒక బడా వ్యాపారవేత్త కొడుకు సంవత్సరానికి ఒక తెలుగు సినిమా వదిలేవాడు, వాళ్ళ నాన్నే ఆ ఖర్చు భరించేవాడేమో మరి. అలాగే మోహన్ బాబు పిల్లలు కూడా వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బుతో సంవత్సరానికి తలా ఒకటి తీస్తుంటారేమో. ఈ ఫామిలీ అనే కాదు సినిమా ఇండస్ట్రీ లో అన్ని హీరో ల ఫామిలీస్ ఇంతేగా. సరేలే మనదేం పోయింది అమెజాన్ కి, నెట్ ఫ్లిక్స్ కి చందా కట్టుకోవడమే కదా. 

సినిమాలో అంత పెద్ద స్కాం చాలా సింపుల్ గా చేసినట్లు చూపిస్తారు కానీ నమ్మబుద్ది వెయ్యదు, కాకపోతే 2016 లో షాగీ రవీందర్ అనబడే 24 ఏళ్ళ యువకుడు చేసిన మీరా రోడ్ కాల్ సెంటర్ స్కాం ని బేస్ చేసుకొని తీసిన సినిమా కాబట్టి నమ్మాల్సిందే. 

ఆస్టేలియా లో కూడా ఇలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి నమ్మేసి 2000 డాలర్లు కూడా కట్టేసాడు. F. M ల్లో టీవీ ల్లో కూడా ఇల్లాంటి ఫేక్ కాల్స్ నమ్మొద్దని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అంటే మీరే అర్థం చేసుకోండి యెంత మంది బకరాలు అయి ఉంటారో.  

అసలు విషయం ఏమిటంటే ఇక్కడి కొచ్చిన కొందరు స్థానికులు,  విదేశీయులు చేస్తున్న జాబ్ తో పాటు సైడ్ బిజినెస్ చేసి రెండు చేతులా సంపాదిస్తుంటారు, ఆ సైడ్ బిజినెస్ అంతా కార్డు payments ద్వారా కాకుండా క్యాష్ రూపంలో జరుగుతుంటుంది. దీని వల్ల వాళ్ళు ఆ సైడ్ బిజినెస్ వల్ల సంపాదించిన దానికి టాక్స్ కట్టరు, సో ఆ భయం అలాగే ఉండిపోతుంది దాన్ని ఈ స్కాం చేసే వాళ్ళు కాష్ చేసుకుంటారు. వాళ్ళు పది మంది మీద వల చేస్తే అందులో ఇద్దరు ముగ్గురు చిక్కుకుంటారు.  

ఉదాహరణకి, ఒక మూడేళ్ళ క్రితం అనుకుంటా, నాకు ఇలాగే ఒక కాల్ వచ్చింది. నువ్వు కార్ రివర్స్ చేస్తూ మరొక కారుని గుద్దావు, ఆ విషయం ఓల్డ్ సీసీ కెమెరా రికార్డ్స్ డిలీట్ చేస్తున్నప్పుడు బయట పడింది కాబట్టి ఆ డామేజ్ కి డబ్బులు కట్టు అన్నారు. అది స్కాం అని నాకు అర్థం అయింది ఎందుకంటే నాకు అప్పటికి డ్రైవింగ్ రాదు కాబట్టి, కానీ వేరొకరైతే ఆ వల లో చిక్కుకునే ఛాన్స్ ఉంది. స్కాం చేసే వాళ్ళు కూడా పోతే వెంట్రుక వస్తే కొండ అని అనుకునే మొదలుపెడతారు. 

క్లుప్తంగా జరిగినదేమిటంటే షాగీ అనే యువకుడు కాల్ సెంటర్ ఓపెన్ చేసి యువతీ యువకులను రిక్రూట్ చేసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి అమెరికన్లకు ఫోన్ చేయించి పోయిన ఏడాది మీరు లేదా మీ ఆడిటర్ టాక్స్ పూర్తిగా కట్టలేదు, ఇంకా ఇంత అమౌంట్ కట్టాల్సి ఉంది ఈ రోజు లోగా కట్టకపోతే రేపు ఉదయాన్నే FBI వాళ్ళు మీ డోర్ తలుపు తట్టాల్సి వస్తుంది జాగ్రత్త అనే హెచ్చరికతో కూడిన బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. అలా రోజుకో 100 రాళ్ళు విసిరితే ఒక పది రాళ్ళు తగులుతూ ఉండేవి. ఆ కాల్ సెంటర్ లో పని చేసేవారికి జీతంగా 15000 రూపాయల దాకా ఇస్తూ డీల్ క్లోజ్ చేసి మనీ రాబట్టిన వారికి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేవారు. అలా స్కాం ద్వారా 380 మిలియన్ డాలర్ల దాకా గుంజారట.  ఆ తర్వాత స్కాం బయట పడ్డప్పుడు ఆటను దుబాయ్ పారిపోయి తర్వాత పోలీసులకి చిక్కి కొన్ని నెలలకు బయటికి వచ్చి దర్జాగా బతుకుతున్నాడని గూగులమ్మ చెబుతోంది. 

24, జూన్ 2021, గురువారం

ఒక విజేత కథ - ఏర్చి కూర్చిన కథలు

మా ఇంట్లో పెద్దగా చదివించలేదు గానీ లేదంటే నా రేంజే వేరుగా ఉండేది అని ఎవరైనా అనడం మన చెవిన పడుతూ ఉంటుంది అప్పుడప్పుడూ.  ఇది ఒక రకంగా వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే అని ఈ పోస్ట్ చదివాక మీకు అనిపించచ్చు. 

నోరు తిరగని పేరు గల Nusret Gökçe అనే కుర్రాడు మైన్స్ లో పనిచేసే ఒక లేబరర్ కొడుకు. ఇల్లు గడవాలి అంటే ప్రతీ రోజు ఆ మైన్స్ లో దిగాల్సిందే ఆ దిగువ తరగతి కుటుంబీకుడు. కానీ అతని కొడుకైన Nusret Gökçe బ్రతకాలంటే  అక్కడే ఆ మైన్స్ లో దిగాల్సిందే అని మైన్స్ లోతు ల్లోకి దిగలేదు , ఎత్తుకు ఎదగాలనుకున్నాడు ఎదిగి చూపించాడు. 

'పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పు, నీ చేతగాని తనమే" అంటారు కదా అలా చేతగాని వాడిలా మిగిలిపోలేదు. 

ఒక అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎంతోమంది గురించి మీరు వినే ఉంటారు లేదా చదివి ఉంటారు.  అలాంటి కోవలోకి చెందిన వ్యక్తే ఈ Nusret Gökçe. మరీ చరిత్ర సృష్టించేటంతటి ఉన్నత స్థాయికి చేరుకోక పోయి ఉండచ్చు, కానీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకునే వాళ్ళకి ఇతని కథ ఒక పాఠమే. 

పుట్టింది టర్కీ లో, ఒక పేద కుటుంబలో. స్కూల్ లో చదవడానికి డబ్బులు లేక 6 వ తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. అతని పేదరికం అతన్ని చదువుకు దూరం చేయగలిగిందేమో గానీ, అతని కష్టించే గుణం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది. 

స్కూల్లో చదువే ఆర్థికస్తోమత లేక కుటుంబం గడవడం కోసం ఒక కసాయి కొట్లో అలాగే ఒక హోటల్ లో పనికి కుదిరాడు. అక్కడే తనకి వంట మీద మక్కువ ఏర్పడింది.  ఆ తర్వాత వివిధ దేశాలు తిరిగి అక్కడి రెస్టారెంట్స్ లో పనిచేసి వివిధ రకాల వంటలు నేర్చుకొని తన దేశానికి తిరిగొచ్చి ఆ అనుభవంతో తన మొదటి రెస్టారెంట్ ని మొదలెట్టాడు. ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని దుబాయ్ తో పాటు అమెరికా లాంటి వివిధ దేశాలకి విస్తరించాడు. 

వంట చేసేటప్పుడు అతని చేష్టలు అలాగే వంట పూర్తయ్యాక సాల్ట్ ని ఆ వంట మీద చల్లే అతని స్టైల్ కి అభిమానులు ఉన్నారు (మన రజినీ కాంత్ నోట్లో సిగరెట్ విసురుకునే విధానానికి ఉన్నట్లు). ఆ సాల్ట్ చల్లే ఒక ప్రత్యేకమైన అతని స్టైల్ వల్ల Salt Bae అనే పేరుతో ఫేమస్ అయ్యాడు. Salt Bae అని మీరు గూగుల్ లో టైపు  చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ చూడొచ్చు. 

పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రతీ వారి జీవితంలో ఉన్నట్లే ఇతనూ విమర్శలు ఎదుర్కున్నాడు గానీ అవేమీ అతని ఎదుగుదలని ఆపలేకపోయాయి.  ఫుడ్ బాగా కాస్ట్లీ అనీ మరీ అంత రుచిగా ఏమి ఉండదు అని ప్రఖ్యాత మ్యాగజైన్స్ లో విమర్శించారు అలాగే కస్టమర్స్ తమకు ఇచ్చే టిప్స్ లో అతను వాటా అడుగుతాడని అతని రెస్టారెంట్ లో పని చేసిన కొందరు వెయిటర్స్ ఆరోపణలు చేశారు, వాటి కోసం కోర్ట్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది గానీ అవేమీ అతని బిజినెస్ ని దెబ్బతీయలేదు.

కథ ఇక్కడే ముగిసిపోలేదు, శ్రీమంతుడు సినిమాలో లాగా తన ఊరికి ఏదైనా చెయ్యాలనుకొని తనలా తన ఊరిలో ఇంకెవ్వరూ చదువుకు దూరం కాకూడదని స్వంత డబ్బులతో స్కూల్ కట్టించాడు.  

చివరికి దీని నుంచి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా అంటే, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాకపోతే దాన్ని మనమే ప్రపంచానికి చూపెట్టాలి ఆ కళను ప్రదర్శించే ప్లాట్ఫారంని మనం వెదుక్కోవాలి లేదంటే నిర్మించుకోవాలి. వంట చేయడం అనేది కూడా ఒక కళే, దాన్ని సరైన చోట ప్రదర్శించబట్టే అతను విజేత అయ్యాడు.  ఇలాంటి విజేతలు ఎక్కడో విదేశాల్లో కాదు మన ఊర్లోనే ఉంటారు, మనం వారిని చూసి స్ఫూర్తి పొందాలి.