28, మే 2016, శనివారం

తొందరగా పడుకోవాలి ఏ వార్తలు చూస్తూనో

చిన్నప్పుడు స్కూల్ కు వెళ్ళే వయసులో నేనెప్పుడూ  పేపర్ లో సినిమా పేజి లాస్ట్ లో స్పోర్ట్స్ పేజి తప్ప ఇంకే పేజీ చూసేవాడిని కాదు (ఇప్పటికి అంతే అనుకోండి ).  మా నాన్న ఎంత మొత్తుకున్నాసరే వార్తలు వినడం లాంటివి అస్సలు చేసేవాడిని కాదు  . దూరదర్శన్ లో వచ్చే పందుల పెంపకం అయినా చూసేవాడిని కాని ఎందుకో వార్తలు అంటే మాత్రం అక్కడినుంచి ఏదో వంకతో వెళ్ళిపోయేవాడిని. ఒక వేళ మా నాన్న వార్తలు చూస్తే తెలివి పెరుగుతుంది లోక జ్ఞానం కలుగుతుంది అని శ్రీ కృష్ణ భగవానుడి టైపు లో ఉపదేశం చేస్తే  తప్పక వార్తలు వినడానికి/చూడటానికి  టి.వి ముందు కూచునేవాడిని. అదేమీ విచిత్రమో రోజూ శాంతి స్వరూపే వచ్చేవారో  లేక నేను వార్తలు చూసే రోజే ఆయన వచ్చేవారో  తెలీదు కానీ ఆయన వార్తలు చదువుతుంటే   జోల పాడినట్లు ఉండటంతో కాసేపటికే నిద్ర వచ్చేసేది. (1980 టైం లో లేదా అంతకు ముందు పుట్టిన వాళ్లకు శాంతి స్వరూప్ గారి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా). జోలపాటలు వినకుండా సారీ వార్తలు వినకుండా నేను నిద్ర పోయానని మళ్లీ మా నాన్న  శ్రీ కృష్ణ భగవానుడి టైపు లో ఉపదేశం మొదలు పెట్టేవారు. 

అలా ఏ చీకు చింతా లేకుండా బతికేస్తున్న రోజుల్లో  సోషల్ పరీక్షల్లో అనుకుంటా చివర్లో ఒక ప్రశ్న రాజకీయాల మీద ఉండేది. అందులో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్న వస్తే సమాధానం తెలియక ఇబ్బంది పడేవాడిని అదే తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్న వస్తే మాత్రం సంతోషమేసేది ఎందుకంటే జయలలితో  లేక కరుణానిధో వీళ్ళలో ఎవరో ఒకరు ఉంటారు అని గుడ్డి నమ్మకం. వీళ్ళలో ఎవరి పేరు రాసిన 50% ఛాన్స్ ఉండేది నేను రాసిన ఆన్సర్ కరెక్ట్ అవడానికి. ఇది 20 సంవత్సరాల కిందటి మాట.

20 సంవత్సరాల తర్వాత  ఇప్పుడు కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరు (మధ్యలో పనీర్ సెల్వం Exception ఇక్కడ)  అని నన్నెవరన్నా అడిగితే ఇప్పటికీ అదే 50% ఛాన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి నాకు ఉంది  :) ఇప్పటికీ అదే జయలలిత అదే కరుణానిధి. 

ఇక నిద్రపోయే టైం అయింది తొందరగా పడుకోవాలి ఏ వార్తలు చూస్తూనో. ఇదెక్కదికి పోయింది కనపడి చావడం లేదు అదేనండి రిమోటు . ఒక రెండు మూడు రిమోట్ లు తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో ఒకటి కాకపోతే ఇంకోటైనా కనపడుతుంది .  T.V అమ్మేవాళ్ళే ఒక రెండు ఎక్స్ట్రా రిమోట్లు ఇస్తే బాగుండు నా లాంటి వాళ్ళ కోసం. 

5 కామెంట్‌లు:

  1. సోషల్ పరీక్షలో "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు?" అనే ప్రశ్నకి సమాధానం రాసేశాక ఆ పరీక్ష ఫలితం వచ్చేలోగా ముఖ్యమంత్రి మారిపొతారేమో అనే బెంగ వుండేది నాకు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి లలిత గారు మీరు బాగా గుర్తు చేశారు నాకూ ఒక్కోసారి ఆ అనుమానం వచ్చేది.

      తొలగించండి
  2. "అదేమీ విచిత్రమో రోజూ శాంతి స్వరూపే వచ్చేవారో లేక నేను వార్తలు చూసే రోజే ఆయన వచ్చేవారో తెలీదు కానీ ఆయన వార్తలు చదువుతుంటే జోల పాడినట్లు ఉండటంతో కాసేపటికే నిద్ర వచ్చేసేది. "
    అవునండి నేను మీ సమకాలికుడినే, శాంతి స్వరూప్ గారు మనలాంటి ఎంతో మంది కి జోల పాడారు

    రిప్లయితొలగించండి