22, డిసెంబర్ 2016, గురువారం

వైద్యుల దస్తూరి

ఇండియా వెళ్లినప్పటి కబుర్లలో భాగమైన ఊరికొచ్చిన/ఉరికొచ్చిన  ఉత్సాహం - తిరిగొచ్చిన బాల్యం కి తర్వాతి పోస్ట్ ఇది.

ప్రతి సారీ ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చినప్పుడల్లా వాతావరణ మార్పు వలన జ్వరం  వస్తూ ఉంటుంది మా పాపకు.  అందుకే ముందు జాగ్రత్తగా మందులు ఇక్కడి నుంచే తీసుకెళ్తుంటాము.

ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు కూడా జ్వరం వచ్చింది, దాంతో పాటు వాంతులు కూడా మొదలయ్యాయి  సరేలే కక్కే బిడ్డలే కదా దక్కేది అని మొదట్లో సరిపుచ్చుకున్నాము కానీ ఆ తెచ్చుకున్న మందులు మూడు రోజులు వాడినా తగ్గకపోయేసరికి గుడ్డి కంటే మెల్ల మేలు కదా అన్నట్లు  మందుల వాడటం కంటే డాక్టర్ దగ్గరికి వెళ్లడం మంచిది అని అనుకున్నాము.  ఏ మొగుడు లేనప్పుడు అక్క మొగుడే గతి అన్నట్లు దగ్గర్లో ఉన్న ఒకే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము.

సినిమా రిలీజ్ మొదటి రోజు లాగా హాస్పిటల్ కూడా జనాలతో కళ కళ లాడుతోంది దానికి తగ్గట్లు గల్లా పెట్టె కూడా గల గల మంటోంది .ఆ హాస్పిటల్ ని  అంత మంది జనాలని చూసి జడుసుకొని ఏడుపు మొదలెట్టేసింది.

మందులతో తగ్గిందో మాములుగా తగ్గిందో తెలీదు గానీ రెండు సార్లు ఆ హాస్పిటల్ చుట్టూ తిరిగేసరికి మా పాపను జ్వరం వదిలేసింది  కానీ ఈ లోగా మా బుడ్డోడు కాస్త డల్ అయ్యాడు, జ్వరం రాలేదు కానీ కళ్ళు ఎర్రగా మారిపోయాయి. తినడం , పాలు తాగడం మానేసాడు. వీడిని కూడా అదే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే  అచ్చంగా యే మందులైతే మా పాపకు రాసిచ్చాడో అవే మా బుడ్డోడికి రాసిచ్చాడు. ఆ తర్వాత కొంత మంది ద్వారా ఆ డాక్టర్ గురించి విన్నదేమిటంటే 'పిడుక్కీ, బియ్యానికి, తలంబ్రాలకూ, తద్దినాలకూ అన్నిటికీ ఒకే మంత్రం' వేసే రకమని,  అలాగే యే ప్రాబ్లెమ్ తో ఆ హాస్పిటల్ కు వెళ్లినా అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ ల్యాబ్ లో మన రక్తం సమర్పించుకోవలసిందేనని.  


డాక్టర్  ప్రిస్క్రిప్షన్ లో ఉండే RX కి అర్థం 'రియాక్షన్ ఇస్తే మాకు సంబంధం లేదని' ఫన్నీ గా అంటారు కొందరు.

మొగుడు రాసిన లెటర్ ను మెడికల్ షాప్ వాడి దగ్గరకు వెళ్లి చదివించుకు వస్తుందట డాక్టర్ గారి భార్య. డాక్టర్ల కొక్కిరి బిక్కిరి చేతిరాతల గురించి expire అయిన ఒక పాత జోక్ ఇది. ఇప్పట్లో ఎవరూ చేతితో లెటర్ రాయడాలు లాంటివి చెయ్యట్లేదు కాబట్టి ఇది expire అయినా జోక్ కిందే లెక్క. 

వైద్యుడు పెదవి విరిస్తే 'నారాయణ నారాయణ' అంటూ రోగిని హరి చరణాల వద్దకు సాగనంపాల్సిందే కాబట్టి 'వైద్యో నారాయణో హరి' అన్నారని మరికొందరి తమాషా తాత్పర్యం. 

దేవుడి తలరాత లాగే అర్థం కానిది వైద్యుల దస్తూరి కనుక వైద్యుడు కూడా దేవుడితో సమానం అంటారు మరికొందరు తమాషాకి. 

అసలు ఆ రాతను వాళ్ళకు అనుగ్రహించింది రాక్షస రాజు విభీషణుడు అని చిన్నప్పుడు విన్న కల్పిత కథ కాస్త అటూ ఇటుగా రాసాను చదవండి . 

రామ రావణ యుద్హం ముగిసి హీరో చేతిలో విలన్ చనిపోయాక, అంత వరకూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంటి విభీషణుడు లంక కు హీరో అవుతాడు. కాసిన్ని రోజులకు  విభీషణుడికి విపరీతమైన కడుపు నొప్పి మొదలవుతుంది. దాన్ని లొంగదీయడం లో రాజ వైద్య బృందం విఫలమవుతారు. 

రాముడి సిఫారసుతో హనుమాన్ గారి ద్వారా సంజీవిని పర్వతం తెప్పించుకోమని కొందరు సలహా ఇస్తే, సరేలే మరీ ప్రాణాల మీదకి వస్తే అప్పుడలా చేద్దాం అని అనుకొని ఫారిన్ డాక్టర్స్ ఎవరైనా ఉన్నారేమో అని ఎంక్వయిరీ చేస్తే మహారాష్ట్ర లో ఎలాంటి కడుపు నొప్పి నైనా తగ్గించగలిగే  వైద్యుడొకడు ఉన్నాడని తెలిసి రాత్రికి రాత్రే మంచం తో సహా అతన్ని కిడ్నాప్ చేసుకొచ్చేస్తారు.

లంకలో తెల్లారింది ఆ మరాఠీ వైద్యుడికి. ఇక తన బ్రతుకు తెల్లారినట్లే అనుకున్నాడు ప్రాణ భయంతో. ఎలాగైతేనేం కొద్దీ రోజుల్లోనే కడుపు నొప్పి పోగొట్టేసాడు తన మందులతో. దాంతో విభీషణుడు అతనిని సన్మానించి, తనకి తెలిసింది, ఆ వైద్యుడికి తెలియనిది అయిన విద్యనొకదానిని బహుమతి గా ఇవ్వాలనుకొని రాక్షస లిపిని అతనికి ఉపదేశించాడు.  ఆ తర్వాత  ఆ రాక్షసలిపి మిగతా వైద్యులకు సంక్రమించిందట.

మా పాపను రెండు సార్లు హాస్పిటల్ కు తీసుకు వెళ్ళినందుకే కన్సల్టేషన్ ఫీజ్, బ్లడ్ టెస్ట్ , మెడిసిన్స్ అని 5000 దాకా ఖర్చు తేలింది. మరి జయలలిత గారికి 70 రోజులకు అపోలో హాస్పిటల్ లో ఉన్నందుకు గాను అన్ని ఖర్చులు కలిపి 6 కోట్లే అయింది అంటే బాగా చీపే మరి చెవిలో పువ్వులు పెట్టించుకోవడానికి రెడీ అయితే.

కార్టూన్ గూగుల్ సౌజన్యంతో. 

6 కామెంట్‌లు:

  1. బావుంది పవన్ గారు. అన్నింటిని ఒకే గాటకు కట్టలేముకదా. అమ్మకి వైద్యం పెద్దఎత్తున చేయటం కాకుండా ఇతర విఐపిలకు ఏర్పాట్లు చెయ్యటానికి ఈ రుసుము తక్కువే. ఏమంటారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అనానిమస్ గారు. అసలు రుసుము 80 కోట్లు అని అందరూ అంటూ ఉంటే సదరు గవర్నమెంట్ వారు 6 కోట్లే అయింది అని ప్రకటించడం ప్రజల చెవుల్లో పూలు పెట్టడమే కదా అని నా ఉద్దేశ్యం.

      తొలగించండి
  2. పోన్లెండి - డాక్టర్ గారి చేతిరాత ఎలా వున్నా అది అర్థం చేసుకుని మందులు ఇవ్వగలిగే మెడికల్ షాపుల పుణ్యమా అని మీ పిల్లల ఇబ్బందులు తగ్గాయి - అంతే చాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ లలిత గారు. మీరన్నట్లు ఏదో లాగా జ్వరాలు తగ్గాయి అదే పదివేలు.

      తొలగించండి
  3. డాక్టర్ల దస్తూరీ మీద నాకు నచ్చిన ఓ జోక్ (కార్టూన్) ఈ క్రింది లింక్ లో ఉంది 😀.
    telugujok.blogspot.in బ్లాగ్ లో కనిపించింది.

    Doctors' Strike



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ కార్టూన్ నరసింహా రావు గారు. That was a nice one.

      తొలగించండి