10, డిసెంబర్ 2025, బుధవారం

కడలి తరంగాలు - పిచ్చి పూనడాలు - వెయ్యి కథలు

ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే అవి నేను డిగ్రీ వెలగబెడుతున్న రోజులు.

ఎప్పుడూ కాలేజీ కి రాని నేను పది రోజులుగా క్రమం తప్పకుండా క్లాస్ కు ఎందుకు వస్తున్నానో, ఎప్పుడూ కాలేజీ కి వచ్చే ప్రతాప్ మాత్రం కాలేజీ కి ఎందుకు రావడం లేదో అర్థం కాక మా లెక్చరర్స్ ,తోటి స్టూడెంట్స్ ఎవరి జుట్టు వారు పీక్కుంటున్నారు.

ప్రతాప్ కాలేజీ కి ఎందుకు రావడం లేదో ఎవరికైనా తెలుసా అన్నాడు ఒక లెక్చరర్.

"వాడికి పిచ్చి పట్టిందట సర్ వాళ్ళ అమ్మ చెప్పింది" అని సమాధానం ఇచ్చారెవరో. 

"వాడు మరీ ఎక్కువ చదువుతాడు సర్ అందుకే పిచ్చి పట్టి ఉంటుంది" అని తీర్మానించేసాను నేనూ. 

వాళ్ళు జుట్టు పీక్కోవడం, నేను కాలేజీ కి రావడం ఆగిపోయిన రోజు అది. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం.

ఆ రోజుల్లో వరస ప్లాప్ లతో విసిగి పోయిన చిరంజీవి,  "హిట్లర్ సినిమా అయినా హిట్ అయ్యింది" అనే మాట కోసం యెంత పరి తపించి పోతున్నాడో అంత కంటే ఆతృతగా 'పోస్ట్' అనే పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను.

మార్కెట్ కి వెళ్లి బీరకాయలు, బెండకాయలు తెమ్మంటే తీసుకురావు కానీ కథలు, కాకరకాయలు అంటావా అని అమ్మ అరిచే ప్రమాదం ఉంది.

కరెంట్ బిల్ కట్టి రావడం తెలీదు కానీ కథలు రాయడం వచ్చా అని నాన్న అనచ్చు

అందుకని నేను రాసిన మొట్టమొదటి కథను పత్రికకు పంపినప్పుడు ఇంటి అడ్రస్ కాకుండా కాలేజీ అడ్రస్ ఇచ్చా. 

ఆ రోజు పోస్ట్ లో "మీ పిచ్చెక్కించే అమూల్యమైన కథను మేము అచ్చు వేయట్లేదు" అని నా కథ వెనక్కి పంపితే వెక్కి వెక్కి ఏడవలేకపోయాను అది క్లాసురూం కావడం వల్ల.

మా  లెక్చరర్ ఆ కథ చదవడం మొదలెట్టాడు 

                                                            కడలి తరంగాలు 

'సాగరం ఒడ్డున కూర్చొని సుఖ్ సాగర్  నుంచి తెచ్చుకున్న బిసి బేలే బాత్ తింటూ భోరున విలపిస్తోంది భీభత్స. కడలి తరంగాలు కూడ హోరుమని  శబ్దం చేస్తూ ఆమెతో పోటీపడుతున్నాయి'

భీభత్స బెంగళూరు కి రావడం అదే మొదటి సారి బహుశా ఆఖరి సారి కూడా ఇదేనేమో. బిసి బేలే బాత్ అక్కడ ఫేమస్ అని అందరూ చెప్పగా విని, బిసి బేలే బాత్ తో పాటు 'విషం' అని రాసున్న ఒక చిన్న బాటిల్ లోని ద్రవం కలుపుకొని తింటోంది. 

"చికిత్స కు కూడా అందని మీ 'భీభత్స' మానసిక సమస్య గురించి ఏం చేయాలో తెలియట్లేదు" అని అన్నయ్య ఊస్గరిధ్ తో డాక్టర్ కుక్కలయ్య  అన్న మాటలే పదే పదే గుర్తొస్తూ మనసును దేవేస్తూ ఉన్నాయి పక్కన పానీ పూరి వాడు చేయి పెట్టి నీళ్లలో యేవో మసాలాలు కలిపి దేవినట్లు. 

భీభత్స, ఊస్గరిధ్, కుక్కలయ్య  ఇవేం పేర్లు ? అన్నాడు కథ మధ్యలో ఆపేసి 

ఈ టీవీ లో కళంకిత అని సీరియల్ వస్తోంది కదా సర్.. అలా పేరు వెరైటీ గా ఉంటే బాగుంటుందని భీభత్స అని పెట్టా, ఇక మిగతా పేర్లు గోపి, రమేష్ లాంటి కామన్ పేర్లు కాకుండా కొత్తగా అలోచించి పెట్టాను. 

అయినా బెంగుళూరు లో బీచ్ ఎక్కడుందిరా?

"చిన్నదైన వైజాగ్ లోనే ఉన్నప్పుడు దానికన్నా పెద్దదైన బెంగుళూరు లో ఎందుకు ఉండదు సర్?" నా తెలివితేటల్ని శంకించిన మా లెక్చరర్ మీదకు ఒక ప్రశ్నను సంధిస్తూ. 

సంబంధం లేకుండా మాట్లాడతావేమిటి రా?

ఇప్పుడే పిలుచుకొస్తానండి?

ఎవర్ని?

అదే సంబంధాన్ని, మన కాలేజ్ బయట టీ స్టాల్ పెట్టుకున్న తమిళియన్ని.

వాడి అవసరం లేదు, చెప్పు.

వైజాగ్ లో ఉండే సినిమా హాల్స్, కాలేజీ ల కన్నా బెంగుళూరు లో ఎక్కువ సినిమా హాల్స్, కాలేజీ లు ఉంటాయి కదా అంటే వైజాగ్ కన్నా బెంగుళూరు  పెద్దది అలాంటప్పుడు వైజాగ్ లోనే బీచ్ ఉన్నప్పుడు బెంగుళూరు  లో ఉండకుండా పోవడమేమిటి సర్? ఉండే ఉంటుంది అన్నాను.

ఇక నా ప్రశ్నలకు సమాధానం చెప్పడం కంటే ఊరుకోవడం ఉత్తమం అని చదవడం మొదలెట్టాడు

మధ్యాహ్నం అనగా బయటికి వెళ్లిన తన చెల్లెలు ఇంటికి ఇంకా రాలేదెందుకని కంగారుగా ఉన్నాడు అక్కడ హైద్రాబాద్లో ఊస్గరిధ్ 

ఆదరా బాదరా గా పక్కన ఉన్న బైనాక్యూలర్స్ తీసుకొని చుట్టూ చూస్తే తన చెల్లి బెంగళూర్ బీచ్ దగ్గర కనిపించింది. భయంతో వణికిపోయి గ్లాసులో మిగిలున్న స్కాచ్ ని అలానే వదిలేసి బీచ్ వైపు చెల్లిని కాపాడటానికి పరిగెట్టబోతుంటే బల్లి స్కాచ్  లో పడింది. 

చెల్లా లేక బల్లా, 

బల్లా లేక  చెల్లా ,

అటు చెల్లి  ఇటు బల్లి ,

ఇటు బల్లి అటు చెల్లి  

వీరిలో ఎవరిని కాపాడాలి అని క్షణం లో ముప్పాతిక సార్లు సందిగ్ధావస్థలో పడి 'నేను గోడమీద నుంచి పడిన ఈ బల్లి ని కాపాడితే ఆ దేవుడు నా గోడు విని నా చెల్లిని కాపాడటానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు' అని అనుకొని బల్లిని మొదట కాపాడాలనుకున్నాడు. 

బఠాణీలు అమ్ముకోవడానికి బీచ్ కొచ్చిన అనుక్షణ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎవరో అమ్మాయి ఏదో అఘాయిత్యం చేసుకోబోతుందని గ్రహించి కాపాడటానికి అటు వైపుకు పరిగెత్తాడు. 

మరో పక్క పల్లీలు అమ్ముకునే ప్రతీక్షణ్ కూడా క్షణం కూడా ఆలస్యం చేయకుండా రెప్పవాటు సమయంలోనే  పరుగు అందుకున్నాడు

ప్రతీక్షణా  లేక అనుక్షణా ,

అనుక్షణా లేక  ప్రతీక్షణా ,

ఇటు ప్రతీక్షణ్  అటు అనుక్షణ్ 

అటు అనుక్షణ్  ఇటు ప్రతీక్షణ్ 

భీభత్స ను ఎవరు కాపాడుతారు? అని క్షణ క్షణం  జరుగుతున్న ఈ పరిణామాన్ని చూడటానికి ఇంటికెళ్లిపోదామనుకున్న సూరీడు కూడా  తన రథాన్ని ఆపేసి మరీ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. 

మా ప్రతాప్ గాడికి పిచ్చి ఎలా పట్టిందో అర్ధమయ్యే లోపే ఆయన కుర్చీ మీద నుంచి పడి గిల గిల కొట్టుకోవడం, అదే క్లాస్ లోనే ఉన్న వాళ్ళ అమ్మాయి నన్ను చూసి కసా బిసా పళ్ళు నూరుకోవడం జరిగిపోయాయి

తర్వాత ఆ కథ పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ కి చక్కగా పనికొస్తుందని తీసుకెళ్లడం జరిగింది. 

ఒక నెలరోజుల్లో తేరుకున్నాక ఆయన నాకిచ్చిన అమూల్యమైన సలహా - 'వెయ్యి కథలు చదివాకే ఒక కథ రాయడం మొదలెట్టు అని' కథ అంటే 4,5 పేజీలు ఉండాలని నవల లాగ వందల  పేజీలు రాయకూడదని చెప్పాడు. 

ఇక అప్పటి నుంచి ఆ వెయ్యి కథలు పుస్తకం కోసం వెదుకుతూనే ఉన్నాను. వెయ్యి పడగలు పుస్తకమైతే ఉంది అంటున్నారు కానీ వెయ్యి కథలు పుస్తకం లేదు అంటున్నారు ప్రతీ షాప్ లో. 

ఆ పుస్తకం దొరికేదెప్పుడో? 

నేనది చదివేదెప్పుడో? 

ఎప్పటికైనా ఒక కథ రాసేదెప్పుడో?  

రాసిన ఆ కథ ఏదో ఒక పత్రికలో అచ్చు అయ్యేదెప్పుడో? 

Every dog has its day అని నిరూపించేదెపుడో?

2 కామెంట్‌లు:

  1. నట భీభత్సలను చూశాం కాని కవి భీభత్సలను చూడలేదు. సాహో! ఆస్ట్రేలియా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కనీసం మీరైనా మెచ్చుకొని కవి భీభత్స తో సత్కరించినందుకు ధన్యవాదాలు శర్మ గారు.

      తొలగించండి