అలా దూరపు కొండలు నునుపు కాదు అని సిడ్నీ లో దిగగానే తెలుసుకున్న నేను ఇండియా నుంచే బుక్ చేసుకున్న ఇంటికి వెళ్ళాను. (నా లాగా ఇక్కడికొచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒకరిద్దరు ఇదొక సైడ్ బిజినెస్ లాగా మొదలెట్టారు. స్టేషన్ కి బాగా దగ్గరగా ఉండి, ఇండియన్స్ ఎక్కువగా ఉండే స్థలాల్లో ఒక మూడు నాలుగు ఇళ్ళు అద్దెకు తీసుకోవడం, అందులో ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం)
అదే ఇంట్లో క్రాంతి అనే అతను పరిచయమయ్యాడు, మన తెలుగోడే, నాకొక గైడ్ గా అలాగే నా గోడు ఏమైనా ఉంటే వినడానికి అతనొక్కడే దొరికాడు మొదటి 3 వారాల్లో (ఏ దేశమేగినా అక్కడ మనతో మాట్లాడటానికి ఒక తెలుగోడు దొరికితే యెంత హాయో మాటల్లో చెప్పలేము)
అరే, ఇన్ని బొద్దింకలు ఏమిట్రా బాబు. అని అడిగా?
ఇవి చాలా తక్కువ, ఇది కొంచెం కొత్త బిల్డింగ్ కాబట్టి, రామ్ అని నా కొలీగ్ ఉండే రూమ్ లో బొద్దింకలు చైనా జనాభా ని ఛాలెంజ్ చేయగలవు.
అది మూడో నాలుగో తరగతి చదువుతున్న రోజులు, బెల్ కొట్టగానే ఒంటేలు కోసం పరిగెత్తాము నేను నా మిత్రుడు. ఆ రోజు రాత్రి బట్టసినిమాగా వేటగాడు వేయబోతున్నారు అని దండోరా వినపడింది.
అవున్రా, మీ శ్రీదేవి కూడా ఒంటేలు వస్తే మనలా పరిగెత్తాల్సిందేనా? అడిగాడు మిత్రుడు
ఛీ ఛీ వెధవా, వాళ్ళకు ఇలాంటివి ఉండవురా.
అంటే పొద్దుటే చెంబు పట్టుకుపోరా వాళ్ళు
మళ్ళీ అదే మాట, వాళ్ళు ఇలాంటి దరిద్రపు పనులకు పోవాల్సిన పని లేకుండా దేవుడు పుట్టించి ఉంటాడురా.
"రేయ్, వాళ్ళు కూడా మన లాగా భూమ్మీద పుట్టినోళ్ళేరా. శ్రీదేవేమీ ఆకాశం నుంచి ఊడి పళ్ళేదు" అన్నాడు ఏడో తరగతి చదువుతున్న మా సీనియర్ జిప్పెట్టుకుంటూ.
ఆస్ట్రేలియా లో కూడా బొద్దింకలు ఏమిటి ఛండాలంగా? అందామనుకున్నా కానీ చిన్నప్పుడు జరిగిన పై సంఘటన గుర్తొచ్చి ఆగిపోయి 'కానీ ఇవి మన ఇండియా లో కనపడే బొద్దింకలలా లేవే, కొంచెం చిన్నగా ఉన్నాయి' అన్నాను.
వీటిని జర్మన్ బొద్దింకలు అంటారు, మన ఇండియా లో కనిపించే అంత సైజు లో ఉండవు ఇవి, ఇవి చిన్నగా ఉంటాయి గానీ బాగా చిరాకు పెడతాయి. కానీ వీటితో మరీ అంత పెద్దగా ప్రమాదం లేదు కానీ ఫ్రిడ్జ్ వెనుక దాక్కొని వాటి వైర్లను కొరికేసి డామేజ్ చేస్తుంటాయి.
పుట్టి బుద్దెరిగాక ఇలాంటి బొద్దింకలను ఎన్ని చూడలేదు, సరేలే మనల్ని కొరకవు కదా అది చాలు.
దాని కోసం స్పైడర్స్ ఉన్నాయిగా, ఇక్కడ తిరిగే కొన్ని రకాల స్పైడర్స్ నిన్ను స్వర్గానికో, నరకానికో పంపగల సామర్థ్యం గలవి.
సరేలే, స్పైడర్స్ తో ఎలాగోలా జాగ్రత్త పడతాలే. అయినా అంతగా మన మీదకి వస్తే అప్పుడా స్పైడర్స్ ని అలా సైడ్ కి తోసేస్తే సరి ?
మరి పాములు?
అవి కూడానా?
ప్రపంచం లో ఉండే డేంజరస్ పాముల్లో 20 శాతం ఇక్కడే ఉన్నాయిట, మనం ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి backyard లో అప్పుడప్పుడూ అవి తిరుగుతూ ఉండచ్చు జాగ్రత్త, చీకటి పడితే డోర్ మూసి ఉండటం మంచిది.
నిజం చెప్పొద్దూ, కలలోకి కూడా వచ్చేవి ఆ బొద్దింకలు అంత ఎక్కువగా తిరుగుతుండేవి ఆ ఇంట్లో.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి