సినిమా జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సినిమా జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జులై 2022, సోమవారం

రాముడు బాబోయ్ రాముడు

మన తెలుగు సినిమాల్లో ఒక ఇరవయ్యేళ్ళ కిందట సినిమా టైటిల్స్ విషయంలో ఒక ట్రెండ్ ఫాలో అయ్యేవారు అనుకుంటా. 'విచిత్ర' అనే పదం పేరులో ఉండే సినిమా వచ్చి హిట్ అయిందంటే ఇక విచిత్ర ను ముందో వెనుకో తగిలించుకొని కొన్ని పదుల సినిమాలు తయారయిపోయేవి. 

విచిత్ర దంపతులు 

విచిత్ర జీవితం 

విచిత్ర కుటుంబం (మరీ అంత విచిత్రం యేమీ ఉండదు ఆ కుటుంబం లో, ఏదో ఆ సమయానికి అలా పేరు పెట్టేసి ఉండచ్చు)

విచిత్ర బంధం 

విచిత్ర కాపురం 

విచిత్ర దాంపత్యం 

విచిత్ర పైత్యం 

ఇలా అన్నమాట 

డబ్బింగ్ సినిమాలైతే 

విచిత్ర కలయిక 

విచిత్ర గూఢచారి 

విచిత్ర సోదరులు 

విచిత్ర సుందరి 

ఇలా ఉండేవన్నమాట. 

ఇలా ప్రేమ, పెళ్ళి లాంటివి తగిలించుకున్న సినిమాలు వందల్లో ఉంటాయనుకుంటాను. 

ఇక మన అన్నగారైతే "రాముడు" పేరుకు ఏదో ఒక తగిలించి ఓ డజన్ పైగానే తీసి ఉంటారు తన కెరీర్ లో. 

పిడుగు రాముడు 

బండ రాముడు 

శభాష్ రాముడు  

ఛాలెంజ్ రాముడు 

అడవి రాముడు 

డ్రైవర్ రాముడు 

సర్కస్ రాముడు 

కలియుగ రాముడు 

సరదా రాముడు 

అగ్గి రాముడు 

బుగ్గి రాముడు 

దగా రాముడు 

అని ఆ పేరు అరిగి పోయే దాకా తీశారు. (చివరి రెండూ నా పైత్యం అనుకోండి )

ఇక పైత్యం ముదిరి రాముడి పేరుకు అతకని కొన్ని పదాలని కలిపేసి దొంగ రాముడు, రౌడీ రాముడు-కొంటె కృష్ణుడు,  శృంగార రాముడు లాంటివి కూడా పెట్టేసారు. 

ఈ కాలం లో అయితే పోకిరి రాముడు, మార్కెట్ రాముడు, రాకెట్ రాముడు, ఇస్మార్ట్ రాముడు, D.J రాముడు అని కూడా తీసేసేవారేమో

శృంగార రాముడా? ఇలాంటి సినిమా కూడా ఉందా అని ఆశర్య పోకండి, నేను పుట్టక మునుపే ఇది పుట్టిందట, గూగుల్ చెబుతోంది. కాకపోతే అప్పట్లో అట్టర్ ప్లాప్ అయిందని విన్నాను కానీ ఆ సినిమా చూసే ధైర్యం ఎప్పుడూ చేయలేదు. "నందమూరి అందగాడా" అనే పద ప్రయోగం ఈ సినిమాలోని ఒక పాటలో వినపడుతుంది. 

Note: 99% of the times my posts are neither educative nor informative. Those are intended for fun and relief from the daily routine work. Apologies if you feel like you wasted your time after reading my posts. Thanks for reading.

26, జనవరి 2022, బుధవారం

సినిమా జ్ఞాపకాలు - మండే సూర్యుడు

నా  తొమ్మిదవ తరగతి మిత్రుడు ముగ్ధుమ్ కు వీడ్కోలు చెబుతున్న సమయం అది. మా నాన్నగారికి కర్నూల్ జిల్లా పత్తికొండ నుంచి కడప కి ట్రాన్స్ఫర్ అయ్యింది. (ఇప్పుడు ఈ జిల్లాల పేర్లు అలానే ఉంచారో లేక నిన్న విడుదల చేసిన జాబితాలో మార్చేశారో తెలీదు) 

సరిగ్గా మేము ఆ పత్తికొండ లో ఉన్నది ఒక్క సంవత్సరమే అయినా ఆ కొద్ది సమయం లోనే నా  మనసుకు దగ్గరయిన మిత్రుడు ముగ్ధుమ్ అని చెప్పగలను. అప్పట్లో మా వయసుకి  సినిమా మాత్రమే సరదా కాబట్టి చివరి రోజు ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. 

అప్పట్లో ఆ ఊర్లో ఉన్నది  రెండు థియేటర్స్, ఒక దాంట్లో మేము చూసేసిన సినిమా ఏదో ఆడుతోంది కాబట్టి రెండో దాంట్లో ఏ సినిమా ఆడుతుందో దానికే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. 

ఆ రెండో థియేటర్ లో 'మండే సూర్యుడు' అనబడే తెలుగు లోకి డబ్ చేసిన తమిళ్ సినిమా ఆడుతోంది. సైడ్ క్యారెక్టర్, విలన్ లేదంటే సెకండ్ హీరో వేషాలేసుకొనే అతను ఆ సినిమాలో  హీరో అని బయట సినిమా పోస్టర్ చూస్తే అర్థం అయింది. నిజంగా చెప్పాలంటే అతన్ని స్టువర్ట్ పురం పోలీసుస్టేషన్  సినిమాలో  విలన్ గా, గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి  అన్నగా చూసినట్లు గుర్తు కానీ అతని పేరు అప్పటివరకూ రిజిస్టర్ కాలేదు. అంతే కాకుండా 'కెప్టెన్ ప్రభాకర్' అనే తమిళ్ సినిమా లో కూడా చూశాను కానీ అతను బాగా గుర్తుండి పోయింది మాత్రం వెంకటేష్ నటించిన  సూర్య I.P.S సినిమాలో, అదేమంత బంపర్ హిట్ కాదు గానీ ఆ రోజుల్లో బానే ఆడింది.

ఆ సినిమాలో ఒక బాక్సింగ్ పోటీలో అతని చేతిలో వెంకటేష్  ఓడిపోతాడు. అప్పటికే వెంకటేష్ మంచి కమర్షియల్ హిట్లతో స్టార్ల లిస్ట్ లో చేరిపోయినా  క్యారెక్టర్ కోసం వెంకటేష్ ఎలాంటి సీన్స్ అయినా చేసేవాడు. మిగతా స్టార్ హీరోల లాగా ఇగో ల మాటున ఇరుక్కోవడం అప్పటి నుంచే లేదు అతనికి. ఆ సినిమాలో పోలీస్ ట్రైనర్ క్యారెక్టర్ లో అతని బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ మాత్రం బాగా నచ్చింది. అర్రె, హీరో అంటే ఇలా కదా ఉండాలి, ఇతనెందుకు హీరో కాకూడదు అనుకున్నాను అప్పట్లో. 

సో అప్పుడెప్పుడో అనుకున్నది కళ్ళ ఎదురుగా జరగడం చూసి ఆ సినిమాకే వెళదామని డిసైడ్ అయ్యాం. మరి తక్కువ అంచనాలతో చూడటం వల్లో, లేదంటే సినిమా నిజంగానే బాగుండటం వల్లో మాకు విపరీతంగా నచ్చేసింది 'మండే సూర్యుడు' అనబడే ఆ సినిమా. ఆ తర్వాతే తెలిసింది అతని  పేరు శరత్ కుమార్ అని. 

ఆ తర్వాత ఈ 'మండే సూర్యుడు' సినిమా ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూసినా నచ్చుతుంది అన్న గారంటీ లేదు, కొన్ని సినిమాలు ఆ కాలానికే నచ్చుతాయి అంతే. చిన్నప్పుడు పల్లెల్లో ఉండటం వల్ల  ఖైదీ సినిమా చూళ్ళేదు, 1995 టైం లో అనుకుంటా ఒక సారి చూశాను. నాకేం పెద్ద నచ్చలేదు. ఏముందని ఈ సినిమాలో అంత హిట్టయ్యింది అని అనిపించింది కానీ కాలం తో జరిగే మార్పుల ప్రభావం అది అని అప్పుడు నాకు అర్థం కాలేదు. క్లాస్ సినిమాల మాటేమో గానీ మాస్ సినిమాలకెప్పుడూ కాలం గడిచిన తర్వాత కూడా ఆదరణ దక్కుతుందని చెప్పలేము.  

'మండే సూర్యుడు' అనే టైటిల్ తోనే  ఆర్య హీరోగా ఒక డబ్బింగ్ సినిమా నిన్న యూట్యూబ్ లో చూశాను, అప్పుడు ఈ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇలా పోస్ట్ రాసేశాను.  వీలయితే చూడండి సినిమా బానే ఉంటుంది పోకిరి సినిమా ఫ్లేవర్ కనపడుతుంది ఈ సినిమాలో. 

2, డిసెంబర్ 2021, గురువారం

హిట్ కి కొలమానం ఏదైనా ఉందా?

నేను నిన్న రాసిన అఖండ తో బాలయ్య మరో పదేళ్ళు?? అనే పోస్ట్ లో వంశోద్ధారకుడు ప్లాప్ అయితే నువ్వు హిట్ అని రాశావు అని నా ఫ్రెండ్ అన్నాడు. 

పవిత్ర ప్రేమ మా ఊర్లో వంద రోజులు ఆడింది కాబట్టి అది ప్లాప్ సినిమా కింద ఎలా కన్సిడర్ చేస్తావు, అలాగే టాప్ హీరో కూడా ప్లాప్ కాదు అని ఒక వ్యక్తి అన్నారు. 

దాని గురించి అదే పోస్ట్ లో కామెంట్స్ రాద్దామని మొదలెట్టాను, కానీ అది ఒక పెద్ద పోస్ట్ అయి కూర్చుంది, అదే ఈ సారాంశం. 

అవి నేను కొత్తగా కడపకు వచ్చిన రోజులు, ఒక్కడినే సినిమా కెళ్ళడం కూడా అదే మొదటి సారి. 

సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి కౌంటర్ దగ్గర జనాలు లేరు అనుకున్నా, ఫస్ట్ క్లాస్ కి ఒక టికెట్ ఇవ్వండి అన్నాను కౌంటర్ దగ్గర కెళ్ళి 

అతను టికెట్ఇవ్వబోయాడు. 

నేను డబ్బులు నా చేతిలోనే ఉంచుకొని టికెట్ తీసుకోకుండా 'సీట్స్ ఉన్నాయా లోపల' అని అడిగాను

లేవు తమ్ముడూ, థియేటర్ ఫుల్ అన్నాడు 

అయితే టికెట్ వద్దన్నా అన్నాను 

పర్లేదు తమ్ముడూ, ఎక్స్ట్రా చైర్ వేస్తారు. నిలబడి చూడాల్సిన అవసరం లేదు అన్నాడు 

ఆ సమాధానం తో కాస్త సంతృప్తి చెంది టికెట్ తీసుకొని లోపకి వెళ్తే నేను ఫూల్ అయ్యానని అర్థం అయింది.  

మొత్తంగా పట్టుమని పది మంది కూడా లేరు ఫస్ట్ క్లాస్ లో, థియేటర్ మొత్తంలో యాభై మంది ఉంటే ఎక్కువ అది కూడా ఆదివారం మధ్యాహ్నం షో కి. నాకేం తెలుసు సినిమా ఆడినన్ని రోజులు జనాలతో నిండిపోయి ఉండేవేమో థియేటర్స్ అని అనుకునే వయస్సు అది. 

ఆ థియేటర్ మా ఇంటికి దగ్గరలో ఉండేది దాని పేరు  'లక్ష్మి రంగ',  మరి ఇప్పటికీ అది ఉందో లేదు తెలీదు. అది యెంత పెద్ద థియేటర్ అంటే ఆ థియేటర్ ని కొట్టేసి ఇంకో మూడు థియేటర్స్ కట్టే అంత. పది లారీల జనాన్ని అందులోకి పంపినా ఇంకా సీట్స్ ఖాళీగా ఉంటాయి అని అనేవారు అప్పట్లో ఆ థియేటర్ గురించి. 

ఆ సినిమా పేరు బంగారు బుల్లోడు, అప్పటికే ఆ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అంటే మిగతా 50 రోజులు ఇలా 50 మందితోనో లేదంటే ఇంకా తక్కువ మందితోనే వంద రోజులు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత తెలిసిందేమిటంటే కొన్ని సినిమాలు ఆబ్లిగేషన్ మీద లేదంటే ఫాన్స్ తలా కొంత డబ్బులు పోగు చేసి ఆ థియేటర్ వాడికిచ్చి వంద రోజులు ఆడిస్తారని తెలిసింది. 

పైగా బంగారు బుల్లోడుతో పాటు ఒకే రోజు విడుదల అయిన 'నిప్పురవ్వ' సినిమా మీద ఈ సినిమా హిట్ అని అనిపించుకోవడానికి కొంత తంటాలు పడ్డారని తెలిసింది. అలా అని బంగారు బుల్లోడు ప్లాప్ అని నేను చెప్పడం లేదు, కాకపోతే ఎందుకో నిప్పు రవ్వే మంచి సినిమా ఏమో అని నాకప్పుడు అనిపించింది. 

కాబట్టి సినిమా హిట్టా ఫట్టా అనే దానికి నిర్దిష్టమైన కొలమానం ప్రజలు మాట్లాడుకునే మాటలే అంతే. 

నేను చిన్నప్పుడు 'శంకరాభరణం' సినిమా చూడని జన్మా ఒక జన్మేనా అనే మాట వినపడేది మేముండే ఒక  పల్లెలో, అంటే 'శంకరాభరణం' చూడకపోతే జన్మ వ్యర్థం అని కాదు, ఆ సినిమా ఏదో బాగుందనో హిట్టయ్యిందనో మాకు అర్థం అయ్యేది. అలా జనాల మాటలే కొలమానం అని నా ఉద్దేశం.  

ఉదాహరణకు నేను MCA చదివే రోజల్లో ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్తే, నైట్ అక్కడే పడుకోవాలి అని డిసైడ్ అయితే మృగరాజా? నరసింహనాయుడా? అని అడిగేవారు. 

నరసింహనాయుడా? వద్దు బాబోయ్, మృగరాజు బెటర్ అనేవాళ్ళము. 

మీ కర్థం కాలేదు కదూ, చెబుతా. ఎక్కువ రోజుల నుంచి ఉతక్కుండా వాడే లుంగీ అయితే నరసింహనాయుడు, ఈ మధ్యే ఉతికిన లుంగీ అయితే మృగరాజు అని దాని అర్థం. నరసింహనాయుడు ఎక్కువ రోజులు ఆడిందని, మృగరాజు పట్టుమని పది రోజులు కూడా ఆడలేదని ఆ మాటల్లో అర్థం. 

ఇలా జనాల మాటల్లో తెలిసిపోయేది ఏది హిట్టు ఏది ప్లాప్ అని. 

అలా నా చుట్టుపక్కన వాళ్లతో మాట్లాడినప్పుడు తెలిసిన విషయాలని బట్టి నేను పవిత్ర ప్రేమ ప్లాప్ అని వంశోద్ధారకుడు హిట్ అని నాకు అప్పట్లో అర్థమైంది. నేను వేరే ఊరిలో ఉంటే ఈ అభిప్రాయం వేరే లాగా ఉండేదేమో చెప్పలేను. 2+2=4 అన్నంత ఖచ్చితంగా ఇది హిట్టు ఇది ప్లాప్ అని డిసైడ్ చేయడం కష్టం అని నా ఉద్దేశ్యం.  

1, డిసెంబర్ 2021, బుధవారం

అఖండతో బాలయ్య మరో పదేళ్ళు??

ఇవాళ మాస్ ప్రియులని ఉర్రూతలూగించడానికి బాలయ్య అఖండతో బరిలోకి దిగుతున్నారు. అందుకే బాలయ్య సినిమాల మీద ఈ స్పెషల్ ఆర్టికల్.  

మొన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాజమౌళి మాట్లాడుతూ  'బాలయ్య ఆటంబాంబు లాంటోడు, ఎలా వాడాలో బోయపాటి కే తెలుసు' అన్నాడు. అది ముమ్మాటికి నిజం. బాలయ్య కి ఏ డైరెక్టర్ పడితే ఆ డైరెక్టర్ హిట్ ఇవ్వలేడు. 

బాలయ్య అనే ఆటంబాంబు ని ఎలా వాడాలో బోయపాటి కే కాక మరో ఇద్దరు, ముగ్గురు  డైరెక్టర్స్ కి మాత్రమే తెలుసు, వారెవరో ఇక్కడ విశ్లేషిద్దాం. 

కొంత ఫ్లాష్ బాక్ లోకి వెళ్తే, ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన గాండీవం విరిగిపోయింది, అలాగే మాంచి ఫార్మ్ లో ఉన్న యస్వీ క్రిష్ణారెడ్డి బాలయ్య బాబుతో 'టాప్ హీరో' అనే ఒక దిక్కుమాలిన సినిమా తీశాడు. అదే రోజు రిలీజ్ అయిన ఈవీవీ 'ఆమె' సినిమాకి ఏ మాత్రం పోటీ కాలేక పోయింది. రెండు సినిమాల టార్గెట్ ఆడియన్సు వేరైనప్పటికీ ఆమె సూపర్ హిట్టయ్యి 'టాప్ హీరో' టాప్ చిరిగి పోయింది. . 

ఆ తర్వాత  ఈవీవీ దర్శకత్వం లో గొప్పింటి అల్లుడు అనే సినిమా అటకెక్కేసింది.  

యస్వీ క్రిష్ణారెడ్డి, ప్రియదర్శన్ , ఈవీవీ లాంటి వారికి ఈ ఆటంబాంబు ను ఉపయోగించడం చేత కాలేదు, కాబట్టి వీరిని రెడ్ లిస్ట్ లోకి వెయ్యొచ్చు. 

అగ్ర దర్శకులుగా పేరొందిన కోదండ రామి రెడ్డి బొబ్బిలి సింహం లాంటి బంపర్ హిట్ ఇచ్చాడు గానీ, నిప్పు రవ్వ, యువరత్న రాణా, ముద్దుల మొగుడు, మాతో పెట్టుకోకు లాంటి ప్లాప్స్ ఇచ్చారు కాబట్టి వీరికీ ఆటంబాంబు ను ఉపయోగించడం చేత కాలేదు అని చెప్పొచ్చు  (యువరత్న రాణా - ఈ సినిమా చేసిన విషయం బాలయ్య బాబు హార్డ్ కోర్ ఫాన్స్ కైనా గుర్తుండకపోవచ్చేమో అంత అట్టర్ ఫ్లాప్ ఈ సినిమా, బాల కృష్ణ ఫ్యాన్ అయిన మా గుప్తా ని తెగ ఏడిపించేవాళ్ళం ఈ సినిమా ప్లాప్ అయిన టైములో, అందుకే నాకు బాగా గుర్తుండిపోయింది. )

పవిత్ర ప్రేమ, కృష్ణ బాబు లాంటి అట్టర్ ప్లాప్స్ తో ముత్యాల సుబ్బయ్య, పరమ వీర చక్ర అంటూ స్వర్గీయ దాసరి, అది పాండు రంగడు కాదు పాడు రంగడు అంటూ ప్రేక్షకులతో ఛీ కొట్టేలా చేయించిన రాఘవేంద్ర రావు, బంగారు బుల్లోడు తో హిట్ ఇచ్చి దేవుడు సినిమాతో గోవిందా అనిపించినాడు కాబట్టి రవిరాజా పినిశెట్టి ని లిస్ట్ లోంచి కొట్టేయచ్చు. 

ఇక గ్రీన్ లిస్ట్ లోకి ఎవరెవరిని వెయ్యొచ్చో చూద్దాం. 

మధ్య మధ్య లో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి హిట్ సినిమాలతో ఫామిలీ ప్రేక్షకులని బాలయ్య కి దగ్గర చేసినా శ్రీ కృష్ణా ర్జున విజయం లాంటి సినిమాతో విజయానికి కాస్త దూరమయ్యారు సింగీతం శ్రీనివాస రావు లాంటి క్లాసిక్ డైరెక్టర్. ఈయన ఆటంబాంబుని ఆటం బాంబు లా కాకుండా చిచ్చుబుడ్డి లా వాడి ఒక సెక్షన్ ఆఫ్ ఆడియెన్సు ని బాలయ్యకి దగ్గర చేశాడు. 

డైరెక్టర్ శరత్ లాంటి వారు వంశోద్దారకుడు, వంశానికొక్కడు, పెద్దన్నయ్య లాంటి సూపర్ హిట్లు, సుల్తాన్ వంటి ప్లాప్ ఇచ్చాడు గానీ బంపర్ హిట్ అనబడే సినిమా అయితే ఇవ్వలేకపోయాడు. ఈయన ఆటంబాంబుని ఆటం బాంబు లా కాకపోయినా నాటు బాంబు రేంజ్ లోనైనా ప్రయోగించగలిగాడు. 

బాలయ్య కెరీర్ కొత్తలో 'మంగమ్మ గారి మనవడు' సినిమాతో బూస్ట్ ఇచ్చాడు స్వర్గీయ కోడి రామకృష్ణ గారు ఆ తర్వాత మువ్వ గోపాలుడు,  ముద్దుల మామయ్య లాంటి మంచి హిట్స్  ఇచ్చాడు (ముద్దుల మేనల్లుడు లాంటి ప్లాప్స్ ఉన్నాయి గానీ పెద్దగా బాలయ్య ఇమేజ్ డామేజ్ కాలేదు వాటితో )

తర్వాత బాలయ్య కెరీర్ ని బాగా బూస్ట్ చేసింది మాత్రం  బి. గోపాల్ అని చెప్పొచ్చు. ఒకటా రెండా మొత్తంగా నాలుగు మాస్ హిట్స్ ఇచ్చాడు. అవి అలాంటి ఇలాంటి హిట్స్ కాదు  - లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు ఒకటికి మించి ఒకటి మాస్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ లాంటివి అవి.  ఇదే గోపాల్ 'పల్నాటి బ్రహ్మనాయుడు' అని కన్నడం లో విష్ణువర్ధన్ హీరోగా వచ్చిన ఒక సినిమాని ఎత్తుకొచ్చి తొడగొడితే కుర్చీ ముందుకొచ్చే సన్నివేశానికి తన క్రియేటివిటీ/పైత్యం జోడించి తొడగొడితే ట్రైన్ ఆగిపోవడం లాంటి కిచిడి యాడ్ చేసి చెత్త సినిమా తీసాడు కానీ ఆ నాలుగు హిట్స్ ముందు దీన్ని మర్చిపోవచ్చు. 

ఆ తర్వాత ఇక బాలయ్య పని అయిపోయింది  అని అందరూ అనుకునే టైం లో వచ్చాడండీ ఈ  బోయపాటి శీను సింహా సినిమాతో, ఆ తర్వాత లెజెండ్ అంటూ దెబ్బకు బాలయ్య ఇంకో పది సంవత్సరాలు హిట్స్ లేకపోయినా బండి లాగించగలడు అనే రేంజ్ లో హిట్ ఇచ్చాడు. 

ఇప్పడు అఖండ హిట్టయిందా, బాలయ్య కెరీర్ హీరోగా ఇంకో పదేళ్ళు పెరిగినా ఆశర్య పోవాల్సిన అవసరంలేదు. 

12, అక్టోబర్ 2021, మంగళవారం

పెదరాయుడు దెబ్బకు చిత్తై పోయిన బిగ్ బాస్

బిగ్ బాస్ దెబ్బకు పెదరాయుడు చిత్తై పోతాడనుకుంటే పెదరాయుడు దెబ్బకు బిగ్ బాస్ మట్టి కరిచాడు. ఇది నిన్నో మొన్నో జరిగిన మా ఎన్నికల గురించి అని అనుకునేరు? కాదు కాదు పాతికేళ్ళ క్రితం జరిగిన విషయం చెప్తున్నా. 

ఘరానా మొగుడు సినిమాతో 10 కోట్ల కలెక్షన్స్ సాధించి శిఖరం అంచుకు ఎక్కేసిన చిరంజీవి, ముగ్గురు మొనగాళ్లు, మెకానిక్ అల్లుడు, SP పరశురామ్ అంటూ దిగడం మొదలు పెట్టాడు, ఎంతగా అంటే హిట్టొస్తే చాలురా ఈవీవీ సత్యనారాయనా అని అల్లుడా మజాకా సినిమాలో నటించి మరింత కిందికి దిగజారి పోయాడు. ఆ రోజుల్లో మహిళలతో ఛీకొట్టించుకుని సభ్య సమాజం తలదించుకునేలా పేరు తెచ్చుకున్న ఆ బూతు సినిమా ఎలాగోలా హిట్టనిపించుకుంది గానీ చిరంజీవి రేంజ్ కి నికార్సయిన హిట్ సినిమా కాదది.  

అల్లుడా మజాకా తర్వాత విడుదల అవుతున్న బిగ్ బాస్ సినిమాతో మళ్ళీ శిఖరం పైకి ఎక్కుతాడని అప్పట్లో నేనెంతో ఆశపడ్డాను  పైగా గ్యాంగ్ లీడర్ లాంటి బంపర్ హిట్ తీసిన విజయ బాపినీడే ఈ బిగ్ బాస్ కు దర్శకుడు అవడం నా ఆశలకు మరింత ఊతమిచ్చింది. 

అదే రోజు రిలీజ్ అవుతున్న పెదరాయుడు మీద వేరే ఎవరికైనా నమ్మకాలు ఉన్నాయేమో గానీ మెగా స్టార్ మేనియా లో ఉన్న నా కళ్ళకు ఆ సినిమా అనలేదు. పైగా ఆ సినిమాలో రజని కాంత్ ఉన్నాడు, నాలుగైదు నెలల క్రితం రిలీజ్ అయిన బాషా రికార్డ్స్ ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి అయినా సరే బిగ్ బాస్ ఇక్కడ అని ధైర్యం చెప్పుకున్నా. 

అప్పట్లో రిలీజ్ కి ముందు రోజు రాత్రే ఫాన్స్ షో వేసే వారు, దానికి టికెట్స్ తీసుకురావడానికి ఎప్పటిలాగానే మా కరడు గట్టిన చిరంజీవి అభిమాని ఉండనే ఉన్నాడుగా కాబట్టి టికెట్స్ గురించి భయం లేదు. ఉన్న దిగులంతా నాన్న ను ఒప్పించడమే, మరీ కష్టం కాదు కానీ ఆ రోజుకు ఒక రెండు గంటలు ఎక్కువ చదివేస్తే ఒప్పుకుంటారు సినిమాకి వెళ్ళడానికి. 

రాత్రి 10 గంటల టైం లో షో మొదలైంది. గంట లోపే అర్థం అయిపోయింది సినిమా లో అస్సలు విషయం లేదని.  ఫాన్స్ అయిన మాకే నచ్చలేదంటే ఇక మామూలు ప్రేక్షకులకు అస్సలు ఎక్కదు అని సినిమా చూసొచ్చాక అర్థమైంది. ఇంటికొచ్చేదాకా మేమెవ్వరం నోరు విప్పలేదు సినిమా ఇంట చెత్తగా ఉందే అని. 

భాషా లాంటి సినిమా తీయాలని అనుకున్నారని, లేదు.... లేదు  భాషా సినిమా లాంటి కథనే తీయబోయి భాషా రిలీజ్ అయిందని స్టోరీ మార్చేసి కలగా పులగం చేశారు అని ఎవరికి నచ్చినట్లు వారు విశ్లేషించారు సినిమా సర్కిల్స్ లో. 

ఏది ఏమయితేనేం రెండ్రోజులకే పూర్తిగా బిగ్ బాస్ థియేటర్స్ ఖాళీ ఇక్కడ, అక్కడేమో పెదరాయుడు ఆడే థియేటర్స్ లో జాతర మొదలైంది. అగ్నికి వాయువు తోడయినట్లు  మోహన్ బాబు నటనకు, రజనీ కాంత్ స్టైల్ తోడై  బిగ్ బాస్ ను పూర్తిగా బూడిద చేసేసింది పైగా 10 కోట్లు అని గొప్పగా చెప్పుకునే ఘరానా మొగుడు కలెక్షన్స్ ని 2 కోట్ల మార్జిన్ తో దాటేసింది. 

అదీ, పెదరాయుడు దెబ్బకు చిత్తై పోయిన బిగ్ బాస్ విషయం. మొన్న జరిగిన 'మా' ఎన్నికలకు దీనికి ఎటువంటి సంబంధం లేదని మనవి.  

చిరంజీవి సినిమాలతో పాటు దాదాపు ఒకే టైం లో రిలీజ్ అయి అంచనాలు తారుమారుచేసిన సినిమాలు మచ్చుకు కొన్ని గుర్తున్నాయి.  

రిక్షావోడు - ఒరేయ్ రిక్షా (దాసరి, ఆర్ నారాయణ్ మూర్తి కాంబినేషన్)

స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ - స్టువర్ట్ పురం దొంగలు (భానుచందర్ హీరో)

మృగరాజు - నరసింహనాయుడు (హీరో ఎవరో చెప్పాల్సిన పని లేదు)

కొదమ సింహం - ఇంద్రజిత్ 

ఈ చివరి రెంటిదీ డిఫరెంట్ స్టోరీ. రెండూ హిట్ కాలేదు కానీ, కొదమ సింహం వల్ల  తన కొడుకు బోసుబాబు(అతనికి మొదటి/చివరి సినిమా ఇదే అనుకుంటాను) ని  హీరో గా పెట్టి తను డైరెక్ట్ చేసిన సినిమా 'ఇంద్రజిత్' కి నష్టం జరిగింది అని గిరిబాబు చాలా సార్లు తన గోడు వెళ్లబోసుకున్నారు.