జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జులై 2022, సోమవారం

రాముడు బాబోయ్ రాముడు

మన తెలుగు సినిమాల్లో ఒక ఇరవయ్యేళ్ళ కిందట సినిమా టైటిల్స్ విషయంలో ఒక ట్రెండ్ ఫాలో అయ్యేవారు అనుకుంటా. 'విచిత్ర' అనే పదం పేరులో ఉండే సినిమా వచ్చి హిట్ అయిందంటే ఇక విచిత్ర ను ముందో వెనుకో తగిలించుకొని కొన్ని పదుల సినిమాలు తయారయిపోయేవి. 

విచిత్ర దంపతులు 

విచిత్ర జీవితం 

విచిత్ర కుటుంబం (మరీ అంత విచిత్రం యేమీ ఉండదు ఆ కుటుంబం లో, ఏదో ఆ సమయానికి అలా పేరు పెట్టేసి ఉండచ్చు)

విచిత్ర బంధం 

విచిత్ర కాపురం 

విచిత్ర దాంపత్యం 

విచిత్ర పైత్యం 

ఇలా అన్నమాట 

డబ్బింగ్ సినిమాలైతే 

విచిత్ర కలయిక 

విచిత్ర గూఢచారి 

విచిత్ర సోదరులు 

విచిత్ర సుందరి 

ఇలా ఉండేవన్నమాట. 

ఇలా ప్రేమ, పెళ్ళి లాంటివి తగిలించుకున్న సినిమాలు వందల్లో ఉంటాయనుకుంటాను. 

ఇక మన అన్నగారైతే "రాముడు" పేరుకు ఏదో ఒక తగిలించి ఓ డజన్ పైగానే తీసి ఉంటారు తన కెరీర్ లో. 

పిడుగు రాముడు 

బండ రాముడు 

శభాష్ రాముడు  

ఛాలెంజ్ రాముడు 

అడవి రాముడు 

డ్రైవర్ రాముడు 

సర్కస్ రాముడు 

కలియుగ రాముడు 

సరదా రాముడు 

అగ్గి రాముడు 

బుగ్గి రాముడు 

దగా రాముడు 

అని ఆ పేరు అరిగి పోయే దాకా తీశారు. (చివరి రెండూ నా పైత్యం అనుకోండి )

ఇక పైత్యం ముదిరి రాముడి పేరుకు అతకని కొన్ని పదాలని కలిపేసి దొంగ రాముడు, రౌడీ రాముడు-కొంటె కృష్ణుడు,  శృంగార రాముడు లాంటివి కూడా పెట్టేసారు. 

ఈ కాలం లో అయితే పోకిరి రాముడు, మార్కెట్ రాముడు, రాకెట్ రాముడు, ఇస్మార్ట్ రాముడు, D.J రాముడు అని కూడా తీసేసేవారేమో

శృంగార రాముడా? ఇలాంటి సినిమా కూడా ఉందా అని ఆశర్య పోకండి, నేను పుట్టక మునుపే ఇది పుట్టిందట, గూగుల్ చెబుతోంది. కాకపోతే అప్పట్లో అట్టర్ ప్లాప్ అయిందని విన్నాను కానీ ఆ సినిమా చూసే ధైర్యం ఎప్పుడూ చేయలేదు. "నందమూరి అందగాడా" అనే పద ప్రయోగం ఈ సినిమాలోని ఒక పాటలో వినపడుతుంది. 

Note: 99% of the times my posts are neither educative nor informative. Those are intended for fun and relief from the daily routine work. Apologies if you feel like you wasted your time after reading my posts. Thanks for reading.

5, మే 2022, గురువారం

మళ్ళీ ఫ్రైడ్ రైసా?

ఇది మునుపటి పోస్ట్ పోర్ట్ స్టీఫెన్స్ ట్రిప్ విశేషాలు కి కొనసాగింపు.


అది పేరుకు హోటల్ గానీ మాకు అలాట్ చేసిన యూనిట్ ఒక త్రీ బెడ్రూమ్ హౌస్. బయట స్విమ్మింగ్ పూల్ తో పాటు లోపల పెద్ద కిచెన్ ఉంది. ఆ రాత్రి పడుకొని ఉదయాన్నే లేచి కిచెన్ లో ఇండియన్ టీ పెట్టుకొని తాగి, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయిన దోశ వేసుకొని తిని రూమ్ ఖాళీ చేసి వేల్ వాచింగ్ కోసం వెళ్ళిపోయాము. మేము స్టే చేసిన రూమ్ పక్కన ఉండే ఇండియన్ షాప్ లో పాల కోసం వెళ్తే దోశ పిండి దొరికింది మరి.


మధ్యాహ్నం థాయ్ రెస్టారెంట్ బయట మెనూ చూస్తూ - "ఏంటి ఫ్రైడ్ రైస్ 11 డాలర్ లేనా అంత తక్కువ రేట్ పెట్టాడు అంటే ఏదో డౌట్ కొడుతోంది, టూరిస్ట్ ప్లేస్ లో ఇంత తక్కువ లో దొరుకుతుందా? పైగా నిన్న రాత్రి ఇండియన్ రెస్టారెంట్ లో ఉప్పు లేని ఆ ఫ్రైడ్  రైస్ తిన్న తర్వాత మళ్ళీ ఈ సాహసం అవసరమా" అంది మా ఆవిడ.


సరే మనకు వేరే ఆప్షన్ ఏమన్నా ఉన్నాయా? మరో రెస్టారెంట్ కూడా దగ్గర్లో లేదు కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదాం అన్నాను నేను లోపల సంబరపడిపోతూ తక్కువ రేటుకు ఫుడ్ దొరికినందుకు.


నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక డాక్టర్ ఉండే వారు. ఆయన ఏదైనా సూది పొడిస్తే ఏంటి సారు అసలు చురుక్కుమనలేదు మీరు అసలు మంచి సూది మందు వేస్తున్నారా అని అడిగే వాళ్లట అక్కడి పల్లెటూరి వాళ్ళు. ఆయన మంచివాడే పాపం, మంచి ఇంజక్షన్ లే ఇచ్చేవాడు. ఒక్కోసారి ఆయన నవ్వుతూ ఇలా అనేవాడు. వీళ్లకు ఉప్పు, నీళ్లు కలిపి దాన్ని సిరంజీ లోకి ఎక్కిచ్చి వెయ్యాలి అప్పుడే వీళ్లు నన్ను నమ్ముతారు అనేవాడు. చురుక్కుమని కాస్త నొప్పి పుట్టేలా ఉండే ఇంజక్షన్ అయితే మంచిది అని వారి నమ్మకం. అయినా పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్లు మనూరి డాక్టర్ వేస్ట్, పక్కన పులివెందులలో ఉండే డాక్టర్ బెస్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం.


వాళ్లనే కాదు ఎవరైనా ఇలాంటి అభిప్రాయంతోనే ఉంటారు రేటు తక్కువ పెడుతున్నారంటే డౌట్ పడుతుంటారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే మేము తిన్న ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంది అక్కడ.


మొన్న ఇండియన్ రెస్టారెంట్ లో ఉప్పు లేని ఆ ఫ్రైడ్  రైస్ తిన్న తర్వాత ఇంతకుముందు వెళ్ళిన ట్రిప్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తోంది. పెరి పెరి చికెన్ పిజా ఆర్డర్ చేస్తే అందులో బేకన్ వేసి తెచ్చారు, అందుకు మేము రిపోర్ట్ చేస్తేవారు సారీ చెప్పి ఫ్రెష్ గా మరో పెరి పెరి చికెన్ పిజా తీసుకువచ్చి ఇవ్వడమే కాకుండా బిల్ లో ఆ పిజ్జా ఛార్జ్ చేయకుండా మా వైపు జరిగిన తప్పుకు కాంప్లిమెంటరీ ఇది అని చెప్పారు.

15, డిసెంబర్ 2021, బుధవారం

బకెట్స్ లో పండ్లు నింపుకుందామా?

"పవన్, వీకెండ్ లో నువ్వు కూడా పార్ట్ టైం జాబ్ చేస్తావా"  అన్నాడు మా మేనేజర్?

పార్ట్ టైం జాబా ? అన్నాను ఆశ్చర్యంగా 

అదే Orange Picking అన్నాడు నవ్వుతూ. 

పోయిన నెల పండ్ల తోటకి వెళ్ళాము, అక్కడికి మా మేనేజర్ కూడా వచ్చాడట అక్కడ నన్ను చూశాడట అదీ విషయం. 

ఆస్ట్రేలియా లో ఈ సీజన్లో oranges విరివిగా పెరుగుతాయి. కొన్ని పండ్ల తోటల ఓనర్స్ పది లేదా ఇరవై డాలర్ల టికెట్ పెట్టి పబ్లిక్ ని లోనికి వెళ్ళనిస్తారు. పది డాలర్ల టికెట్ కొన్నవారికి  చిన్న బకెట్,  ఇరవై డాలర్ల టికెట్ కొన్నవారికి పెద్ద బకెట్ చేతికిస్తారు. లోపల తిన్నన్ని పళ్ళు తిని మిగతావి ఆ బకెట్స్ లో నింపుకొని రావచ్చు. 

చిన్నప్పుడు మేము కడప జిల్లా పులివెందుల దగ్గర ఉండే అంకాలమ్మ గూడూరు అనే పల్లెలో ఉండేవాళ్ళము అక్కడ శీనాకాయ తోటలు బాగా ఉండేవి. మా పక్కింట్లో ఉండేవారికి ఆ తోటలు ఎక్కువగా ఉండేవి. మాకు వాళ్ళు బాగా క్లోజ్ అవడం వల్ల ప్రతీ వారం అక్కడికెళ్ళి మేమే కోసుకొని తినేవాళ్ళము. అవీ కాక చింత చెట్లు, రేగి పండ్లు, గంగి రేగు పండ్లు, సుగంధాలు కాచే చెట్లు కూడా ఉండేవి. 

రేగు పండ్లలో రకరకాలు ఉండేవి, కొన్ని పెద్ద సైజు, కొన్ని చిన్న సైజు. ఆవులు, గేదెలు తోటలోకి రాకుండా ఉండటానికి ఈ చిన్న సైజు రేగు పండ్ల చెట్లను తోటల చుట్టూ పెంచేవారు. ఈ చిన్న సైజు రేగు పళ్ళతో రేగు వడలు చేసేవారు, భలే రుచిగా ఉంటాయి కొంచెం కొంచెం కొరుక్కుంటూ తింటూ ఉంటే. కొన్ని ప్రాంతాల్లో వీటిని రేణిగాయలు అని కూడా అంటారు, ఈ రేణిగాయల చెట్టుకు ముళ్ళు ఉంటాయి, అవి అప్పుడప్పుడూ చేతికి కుచ్చుకునేవి రేణిగాయలు తెంచడానికి ప్రయత్నించినప్పుడు.  

కొంచెం పెద్ద సైజు రేగు పళ్ళను గంగి రేగు పండ్లని పిలిచేవారు. ఇవి పుల్లగా కాకుండా కాస్త తియ్యగా ఉండేవి. ఈ  గంగి రేగు పండ్ల సైజు లోనే ఉంటూ వాటి కంటే తియ్యగా ఉండటంతో పాటు మంచి సువాసనతో ఉండే పళ్ళను సుగంధాలు అని పిలిచేవారు. ఈ పండ్లు ఇప్పటికీ ఉన్నాయో లేదో కాస్తున్నాయో లేదో నాకు తెలీదు. గ్లోబలైజషన్ వచ్చాక స్ట్రాబెర్రీస్, చెర్రీస్ లాంటివి వచ్చేసి మన మధురమైన పండ్లు మూలన పడిపోయినట్లున్నాయి. 

పల్లెల్లో పెరిగిన నా లాంటి వాడికి ఇలాంటి పళ్ళ తోటలు కొత్త కాదు కానీ మా పిల్లలకి అలాగే సిటీస్ లోనే పెరిగిన వారికి ఇలా పళ్ళ తోటలలోకి వెళ్ళి పళ్ళు కోసుకోవడం లాంటివి సరదాగా ఉంటుంది కాబట్టి తిరణాలకి తరలి వెళ్ళినట్లు ఇక్కడి జనాలు పండ్ల సీజన్ లో తోటలకి వెళ్తారు. దాని వల్ల ఆ పళ్ళ తోటల చుట్టుపక్కల దాదాపు రెండు మూడు కిలోమీటర్ల మేర విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. 

తోట లోపల పండ్లు తినడం వరకూ బాగానే ఉంటుంది కానీ చాలా మంది పండ్లు ఒలిచి కొంచెం మాత్రం తినేసి  మిగతాది పారేయడం వంటివి చేస్తూ ఉంటారు అదే కొద్దిగా బాధగా అనిపిస్తుంది. ఒక్క అన్నం మెతుకు పారేయాలంటేనే భాధపడే రైతు కుటుంబం నుంచి వచ్చిన నాకు అలా పండ్లను వృధా చేయడం, ఫోటో దిగడం కోసం ఆ కొమ్మల మీద వాలిపోయి వాటిని విరిచిపారేయడం వంటివి బాధ కలిగిస్తూ ఉంటాయి. 

ఆ పండ్ల తోటల ఓనర్స్ కి ఇలాంటివి నష్టం కలిగించినా, ఇంకో రకంగా వాళ్ళు లాభపడతారు. అదెలాగంటే పండ్లు కోయించే కూలీ ఖర్చు తగ్గిపోతుంది (ఇక్కడ లేబర్ ఖర్చు చాలా ఎక్కువ, వాచ్ లాంటివి పని చేయకపోతే వాటిని రిపేర్ చేయించుకునే ఖర్చుతో ఇంకో కొత్త వాచ్ కొనుక్కోవచ్చు) పైగా వాటిని కోసిన తర్వాత మార్కెట్ కి తరలించే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గుతుంది. 

అక్కడ ఆ తోటల బయట ఉన్న గొఱ్ఱెలు, ఆవులు, కోళ్ళను చూసి పిల్లలు యెంత సంబరపడ్డారో వాటిని అబ్బురంగా చూస్తూ.  

How do oranges communicate with each other? 

చిన్న జోకు లాంటి పై ప్రశ్నకి సమాధానం కనుక్కోండి చూద్దాం?

... 

... 

Answer: By speaking in  Mandarin.

ఇక్కడ oranges ని మాండరిన్స్ అంటారు. మాండరిన్ అనేది ఒక లాంగ్వేజ్, చైనాతో సహా కొన్ని దేశాల్లో కొందరు ప్రజలు ఈ భాషలో మాట్లాడుతారు.