స్థలం: మంగస్థలం సినిమా షూటింగ్ స్పాట్.
సమయం: దుర్ముహూర్తం, 2018.
జరిగిన సంఘటన: 2019 లో జరగబోయే విలయ విధ్వంసానికి బీజం పడ్డ రోజు.
బ్రేక్ టైం లో రచణ్ జిమ్ లో exercise చేస్తున్నాడు. అవి ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ లోనే, ట్విట్టర్ లోనే అప్లోడ్ చేస్తోంది ఉప్మానస.
ఒరేయ్ అబ్బాయ్! ఈ సినిమా ఎలాగూ దెబ్బేసేలా ఉంది. ఈ సినిమాలో నటన, గిటన అంటున్నారు అది నీ వల్ల కాదు. అయినా అందంగా ఉండే మన గానార్జున కోడల్ని హీరోయిన్ అంటే మంచి గ్లామర్ కురిపిస్తుందనుకున్నా. ఇక్కడేమో గేదలు కడుగుతూ, అంట్లు తోముతూ మసి గొట్టుకు పోయినట్లు చూపిస్తున్నఆ మసంత మొహం.. ఇవన్నీ చూస్తుంటే అసలు గ్లామర్ కనిపించట్లేదు ఈ సినిమాలో. కుసుమార్ ను నమ్ముకుంటే నట్టేట ముంచేసేలా ఉన్నాడు. నా మాట విని మనకు అచ్చొచ్చిన మాంచి మాస్ మసాలా సినిమా ఈ మంగస్థలం రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ చేయడానికి రెడీ చేసి పెట్టుకోవడం మంచిది.
అంతే అంటారా డాడ్.
అంతేరా అబ్బాయ్, 150 సినిమాల అనుభవంతో చెప్తున్నా వినుకో.
మరి ఏ డైరెక్టర్ అయితే మంచి మాస్ సినిమా తీస్తాడు. V.V వాజమౌళి ని పట్టుకుంటే?
ఏదో ఆయన వల్లే నీ కెరీర్ లో నిఖార్సయిన 'గమధీర' అని అప్పట్లో ఇండస్ట్రీ హిట్ వచ్చింది. మనకి ఇప్పటికిప్పుడు ఫాస్ట్ గా సినిమా తీసే వాడు కావాలి, అతనేమో ఇంకో రెండేళ్లు సినిమా తీస్తూనే ఉంటాడు. అయినా మనం అడగ్గానే మనతో సినిమా తీసే రేంజ్ లో లేడు. వీలయితే ఫ్యూచర్ లో ఆయన కరుణిస్తే చేద్దువులే .
టపోరి గజన్నాథ్ ఉన్నాడుగా, భలే ఫాస్ట్, ముప్పై రోజుల్లో తీయగలడు.
అదేమైనా హిందీనా, తమిళా, ముప్పై రోజుల్లో హిందీ నేర్చుకోవడం ఎలా? అన్నట్లు, అలాంటి బుక్ చదివి యెంత హిందీ నేర్చుకోగలమో, ఆ టపోరి జగన్నాథ్ సినిమా నుంచి కూడా అంతే కలెక్షన్స్ తెచ్చుకోగలం.
హిందీ అని గుర్తుచెయ్యొద్దు డాడ్, బంజీర్ సినిమా గుర్తొస్తే మంజీరాలో దూకేయాలి అనిపిస్తది.
జుట్టున్నమ్మ ఏ కొప్పు కట్టినా అందమే, మరి నీకేమో అంత సీన్ లేదు. తెలుగులోనే ఇప్పటిదాకా సరిగ్గా దిక్కు లేదు గానీ హిందీకి పోయావ్.
అబ్బా, వదిలేయ్ డాడ్. మరి, S.S. సినాయక్ తో అయితే.
నాలాగా బాగా outdated సరుకు అతను. expire అయిన మెడిసిన్స్ వాడటం యెంత డేంజరో ఇలాంటి వాళ్లతో సినిమా కూడా అంతే డేంజర్.
మరి ష్రిక్ అయితే బాగా తీస్తాడేమో?
మరీ అంత క్లాస్ మనకు నప్పదు.
వితిక్రం?
అజ్ఞాన వాసి దెబ్బకు ఇంకా మీ బాబాయే కాదు, చూసిన జనం కూడా ఇంకా కోలుకోలేదు.
నుశీ బ్లాక్ల అయితే?
వద్దురా బాబూ, మందమైన వాడు, వెస్లీ అని మనిద్దరం బోల్తా కొట్టాం అతనితో కలిసి. మళ్ళీ అవసరమా?
మాస్ కు అడ్రస్ లాంటి వాడైన యోబపాటిని పిలిపించు. అతనైతే దండగమారి వంశ హీరోతో హింసా, భజండ్ లాంటి మాంచి మాస్ సినిమాలు తీసినట్లు మన తడికెల వంశంతో కూడా మంచి మాస్ సినిమా తీస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ ను కూడా ఆవు లాగా పిండేసి మంచి మ్యూజిక్ రాబడతాడు.
మంచి చాయిస్ డాడ్. అందుకే నిన్ను గెమాస్టార్ అనేది అందరూ. సరే అలాగే పిలిపిస్తాను.
************
సమయం: 10 జనవరి 2019
స్థలం: ఒకటని కాదు "విలయ విధ్వంస రామ" సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్ల
జరిగిన సంఘటన: సునామీలు, తుఫాన్లే కాదు, ఇలాంటివీ వస్తుంటాయని వచ్చిన హెచ్చరికలు ఖాతరు చేయకుండా పోయిన జనాల హాహాకారాలు.
****************
సమయం: ఇటీవల ఒకరోజు రాత్రి 9:30, శుక్రవారం
స్థలం: ఆస్ట్రేలియాలో ఒక ఇంట్లో
జరిగిన సంఘటన: గర్వం అణిగిన రోజు
యెంత చెత్త సినిమా అయినా కన్నార్పకుండా చూస్తానని నాకు భలే గర్వం ఉండేది. అలాంటి నా గర్వాన్ని ఈ సినిమా అణిచేసింది. హాట్స్ ఆఫ్ టు యోభపాటి ఫర్ సచ్ ఏ గ్రేట్ మూవీ.
ఇంటర్వెల్ తర్వాత నేనెళ్ళి పడుకుంటాను అని నిద్రపోయింది మా ఆవిడ. మరుసటి రోజు ఉదయం అడిగింది ఇంటర్వెల్ తర్వాత కథ ఏంటి? అని.
ఒకే మాటలో చెప్పాను. ఇంటర్వెల్ తర్వాత మొదలెట్టిన ఫైట్ సినిమా ఎండ్ కి ఆపేశాడు అని.
అవార్డు సినిమాల గురించి శివాజీ గణేశన్ గారు చెప్పే వారట 'ఒక వ్యక్తి సముద్రంలో పడవ వేసుకుని బయల్దేరతాడు, వెళ్తుంటాడు, వెళ్తూనే ఉంటాడు సినిమా చివరి దాకా' అని.
ఈ సినిమా స్టోరీ కూడా అలాగే ఉంటుంది. 'హీరో ఫైట్ మొదలెడతాడు, చేస్తుంటాడు, చేస్తూనే ఉంటాడు సినిమా చివరి దాకా'. మరి ఇలాంటి డబ్బా సినిమాలను ఏ కేటగిరి లో చేర్చాలబ్బా?
P.S: ఈ పోస్ట్లోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం, కల్పితం, కల్పితం.
P.S: ఈ పోస్ట్లోని పాత్రలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం, కల్పితం, కల్పితం.