14, నవంబర్ 2016, సోమవారం

చేదు కాకరకాయ

మొన్నొక రోజు ఉదయం ఉప్మా తింటుంటే 500,1000 నోట్లు రద్దు చేశారట అంది మా ఆవిడ 

ఉప్మాలో రాయి పడింది అన్నాను నేను. 

ఉప్మా లో కాదు ఆవాల్లో నల్ల రాళ్లు ఉన్నట్లున్నాయ్ .. అవి పారేస్తాలే అంది 

ఎందుకు పారేయడం ఏరితే సరిపోద్దిగా 

ఎన్నని ఏరమంటావ్ ..దాన్నిండా రాళ్ళు ఉన్నట్లున్నాయ్. అయినా నేనొకటి మాట్లాడుతుంటే నువ్వు ఇంకేదో మాట్లాడతావేంటి అంది. 

నోట్ల రద్దు పుకారు అయ్యుంటుందిలే అని ఆఫీస్ కి బయలుదేరాను. 

ఆర్ట్ సినిమాల్లో ఉండే ఆర్టిస్టుల్లా ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మా ఆఫీస్ వాళ్ళు కృష్ణ వంశీ సినిమాలో లాగా పని మానేసి గుంపులు గుంపులు గా చేరి ఈ నోట్ల రద్దు గురించి మాట్లాడుతుంటే అప్పుడర్థమైంది నోట్ల రద్దు నిజమేనని. 

పేస్ బుక్ లో ఈ నోట్ల రద్దు పై జోక్స్ చక్కర్లు కొట్టడం మొదలెట్టాయి. అందులో నాకు బహుబాగా నచ్చిన జోక్: మోడీజీ, 500, 1000 నోట్లతో పాటు 500, 1000 ఎపిసోడ్స్ రన్ అవుతున్న సీరియల్స్ కూడా రద్దు చేయండి అని విన్నవించుకుంటున్న మొగుళ్లు.  

ఇక్కడ సిడ్నీ లో కూడా దాదాపు అందరి దగ్గర కొద్దో గొప్పో ఆ నోట్లు ఉన్నాయి. వాటిని మార్చుకోవడానికి ఎవరి తిప్పలు వాళ్ళు పడుతున్నారు. 

ఒకతను ఏమో తన దగ్గర ఉన్న కొన్ని నోట్లను పోస్ట్ లో పంపాను అన్నాడు. 

ఇంకొందరేమో క్రిస్మస్ లీవ్స్ కు ఇండియా వెళ్తున్న వాళ్లకు ఈ నోట్లు అంటగడుతున్నారు. వాళ్ళేమో కస్టమ్స్ వాళ్ళ కళ్ళు కప్పి 20000 కంటే ఎక్కువ తీసుకెళ్ళలేము బాబోయ్ అని మొత్తుకుంటున్నారు. 

ఇక నేనేమో ఇక్కడి బ్యాంక్స్ కూడా కరుణించి నోట్లు మార్చుకునే అవకాశం కల్పిస్తాయేమోనని గోతి కాడ నక్క లా ఎదురుచూస్తున్నాను. 

నిన్న రాత్రి బెంగుళూరు లో ఉండే నా మిత్రుడితో ఫోన్ లో మాట్లాడుతూ మంచి రోజులు రావాలంటే కొన్నిరోజులు ఈ కరెన్సీ కష్టాలు పడక తప్పదు అన్నాను. 

ఓసోస్...నీకేం అక్కడుండే వాడివి మా కరెన్సీ కష్టాలు నీకెలా తెలుస్తాయి? ప్రాణాలు కూడా పోతున్నాయి ఇక్కడ ఈ నోట్ల రద్దుతో అని పేపర్లలో వచ్చిన వార్తల గురించి ప్రస్తావించాడు.  

నాన్నా! వర్షం పడుతోంది ..వేస్ట్ పేపర్స్ ఉంటే ఇవ్వు పడవ చేసుకొని ఆడుకుంటా అంది మా పాప నేను ఫోన్ పెట్టెయ్యగానే. 

షెల్ఫ్ లో ఉండే బాగ్ లో కొన్ని వేస్ట్ పేపర్స్ఉండాలి తీసుకొని చేసుకోమ్మా అని చెప్పా. 


ఇంతలో మా ఆవిడ భోజనానికి పిలవడంతో ..  తిన్నాక ఆడుకుందువు లే చిట్టీ అన్నాను. 

యాక్ కాకరకాయ చేదు, వేరే కూర చేసి ఉండచ్చుగా అంది మా పాప. 

అది మొదట్లో కాస్త చేదే ఉండచ్చు కానీ పొట్ట లో పురుగులు చచ్చిపోయి కడుపు క్లీన్ అవుతుంది వచ్చి తిను అంది వాళ్ళ అమ్మ తనకు అర్ధమయ్యే పద్దతిలో నచ్చచెప్తూ.  



6, నవంబర్ 2016, ఆదివారం

సెల్ ఫోన్ లేక పడ్డ పాట్లు

నేను బెంగళూరు వెళ్తున్నానని తెలిసి ఇక్కడి మిత్రుడొకతను నన్ను కలిసి 'మా ఇంటివి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇస్తాను మా బాబాయికి ఇవ్వు' అన్నాడు.

అదెంత పని సరే అన్నాను.

నువ్వసలే కుండల మీది దుమ్ము రోకలితో దులిపే రకానివి జాగ్రత్తగా మా బాబాయికి అందజేయి అని చెప్పాడు.

కుందేటి కొమ్ము కూడా సాధించుకొచ్చే వాడిని  నన్ను నమ్ము అన్నాను.

పులి పాలు సాధించుకు వస్తానన్నా నమ్మే వాడిని కానీ ఉండని కుందేటి కొమ్ము కూడా సాధించుకొస్తానంటున్నావ్ అదే నా భయం అన్నాడు.

అలాంటి భయాలేమి పెట్టుకోకు అని అభయమిచ్చా.

బెంగుళూరు కి వెళ్లిన మొదటిరోజు సిం కార్డు తీసుకుందామనుకుంటే ఏవేవో డాకుమెంట్స్, అడ్రస్ ప్రూఫ్ లాంటివి అడిగారు దాంతో అక్కడ ఉండే రెండు మూడు రోజులకి ఫోన్ లేకున్నా పర్లేదులే అనుకున్నాను.

మా వాడు ఇచ్చిన డాక్యూమెంట్స్ వాళ్ళ బాబాయికి అందచేద్దామని ఫోన్ చేశా మా కజిన్ ఫోన్ లోంచి

రేపు సాయంత్రం పలానా పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉంటాను వచ్చి ఇవ్వండి అన్నాడు

మీరు ఖచ్చితంగా చెప్పిన టైం కు అక్కడ ఉండండి అంకుల్ నా దగ్గర ఫోన్ కూడా లేదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నాను.

మరుసటి రోజు సాయంత్రం చెప్పిన టైం కన్నా పది నిముషాలు ముందుగానే పార్క్ దగ్గరికి వెళ్లాను

ఒక వ్యక్తి అప్పటికే పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాడు

మోడీ మ్యాన్లీగా ఉంటాడు అన్నాను అతని దగ్గరికి వెళ్ళి

నేను కూడా బ్రూస్లీలా ఉంటానని అందరూ అంటూ ఉంటారు యు సిల్లీ ఫెలో అని అక్కడి నుంచి కాస్త దూరం జరిగాడు నన్నో పిచ్చోడి కింద జమకట్టి

కాసేపటికి ఇంకో వ్యక్తి వచ్చి ఎంట్రన్స్ దగ్గర నిల్చున్నాడు.

మోడీ మ్యాన్లీగా ఉంటాడు అన్నాను అతని దగ్గరికి వెళ్ళి

నేనూ మాడా లా ఉంటానని అందరూ అంటారు అన్నాడు కాస్త తేడాగా .. ఈ సారి నేను కాస్త దూరం జరిగాను

కాసేపటికి ఇంకో వ్యక్తి వచ్చి నిలబడితే అతని దగ్గరికి వెళ్లి మోడీ మ్యాన్లీగా ఉంటాడు అన్నాను

మాయావతి కూడా అన్నాడు.

మీ నెత్తి మీద పడింది కాకి రెట్ట అన్నాను

దాన్ని కవర్ చేసుకోవడానికి నా దగ్గర ఉంది జామకాయల బుట్ట అన్నాడు

నేను కలుసుకోవలసిన బ్రోకలీ మీరేనన్నమాట

డాక్యుమెంట్స్ అందజేసే డ్రాక్యులా నువ్వేనన్నమాట .. నైస్ టు మీట్ యు అన్నాడు

ఫోన్ లో మాట్లాడుకున్నట్లే కోడ్ వర్డ్స్ అన్నీ మ్యాచ్ అవడంతో డాక్యుమెంట్స్ ఇచ్చేసాను.




















'నువ్వేమయినా పాత సీక్రెట్ ఏజెంట్ సినిమాలు, కృష్ణ జేమ్స్ బాండ్ సినిమాలు ఇప్పటికీ చూస్తూ ఉంటావా' అని అడిగాడు

అర్రే భలే కనిపెట్టారే అన్నాను

మా వాడినడిగి ఫేస్బుక్ లో నా ఫోటో చూస్తే సరిపోయేదిగా .. ఈ కోడ్ వర్డ్స్ బదులు అన్నాడు.

మనిషిని పోలిన మనుషులు ఉంటారని యెన్ని సినిమాల్లో చూడలేదండి

ఖర్మరా బాబు .. ఉత్తి సినిమా పిచ్చోడిలా ఉన్నావే అని థాంక్స్ చెప్పేసి వెళ్లిపోయాడు.

అయినా ఈ వయసులో సినిమా పిచ్చి లేని తెలుగు వారు ఎవరుంటారు? మీరే చెప్పండి.

గూగుల్ లో గాలించి కొట్టుకొచ్చిన కార్టూన్...గీసిన వారికి ధన్యవాదాలు.