14, జులై 2021, బుధవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 2

అలా దూరపు కొండలు నునుపు కాదు అని సిడ్నీ లో దిగగానే తెలుసుకున్న నేను ఇండియా నుంచే  బుక్ చేసుకున్న ఇంటికి వెళ్ళాను. (నా లాగా ఇక్కడికొచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒకరిద్దరు ఇదొక సైడ్ బిజినెస్ లాగా మొదలెట్టారు. స్టేషన్ కి బాగా దగ్గరగా ఉండి, ఇండియన్స్ ఎక్కువగా ఉండే స్థలాల్లో ఒక మూడు నాలుగు ఇళ్ళు అద్దెకు తీసుకోవడం, అందులో ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం)

అదే ఇంట్లో క్రాంతి అనే అతను పరిచయమయ్యాడు, మన తెలుగోడే, నాకొక గైడ్ గా అలాగే నా గోడు ఏమైనా ఉంటే వినడానికి అతనొక్కడే దొరికాడు మొదటి 3 వారాల్లో (ఏ దేశమేగినా అక్కడ మనతో మాట్లాడటానికి ఒక తెలుగోడు దొరికితే యెంత హాయో మాటల్లో చెప్పలేము)

అరే, ఇన్ని బొద్దింకలు ఏమిట్రా బాబు. అని అడిగా? 

ఇవి చాలా తక్కువ, ఇది కొంచెం కొత్త బిల్డింగ్ కాబట్టి, రామ్ అని నా కొలీగ్ ఉండే రూమ్ లో బొద్దింకలు  చైనా జనాభా ని ఛాలెంజ్ చేయగలవు. 

అది మూడో నాలుగో తరగతి చదువుతున్న రోజులు, బెల్ కొట్టగానే ఒంటేలు కోసం పరిగెత్తాము నేను నా మిత్రుడు. ఆ రోజు రాత్రి బట్టసినిమాగా వేటగాడు వేయబోతున్నారు అని దండోరా వినపడింది. 

అవున్రా, మీ శ్రీదేవి కూడా ఒంటేలు వస్తే మనలా పరిగెత్తాల్సిందేనా? అడిగాడు మిత్రుడు 

ఛీ ఛీ వెధవా, వాళ్ళకు ఇలాంటివి ఉండవురా. 

అంటే పొద్దుటే చెంబు పట్టుకుపోరా వాళ్ళు 

మళ్ళీ అదే మాట, వాళ్ళు ఇలాంటి దరిద్రపు పనులకు పోవాల్సిన పని లేకుండా దేవుడు పుట్టించి ఉంటాడురా. 

"రేయ్, వాళ్ళు కూడా మన లాగా భూమ్మీద పుట్టినోళ్ళేరా. శ్రీదేవేమీ ఆకాశం నుంచి ఊడి పళ్ళేదు" అన్నాడు ఏడో తరగతి చదువుతున్న మా సీనియర్ జిప్పెట్టుకుంటూ. 

ఆస్ట్రేలియా లో కూడా బొద్దింకలు ఏమిటి ఛండాలంగా? అందామనుకున్నా కానీ చిన్నప్పుడు జరిగిన పై సంఘటన గుర్తొచ్చి ఆగిపోయి 'కానీ ఇవి మన ఇండియా లో కనపడే బొద్దింకలలా లేవే, కొంచెం చిన్నగా ఉన్నాయి' అన్నాను. 

వీటిని జర్మన్ బొద్దింకలు అంటారు, మన ఇండియా లో కనిపించే అంత సైజు లో ఉండవు ఇవి, ఇవి చిన్నగా ఉంటాయి గానీ బాగా చిరాకు పెడతాయి. కానీ వీటితో మరీ అంత పెద్దగా ప్రమాదం లేదు కానీ ఫ్రిడ్జ్ వెనుక దాక్కొని వాటి వైర్లను కొరికేసి డామేజ్ చేస్తుంటాయి.  

పుట్టి బుద్దెరిగాక ఇలాంటి బొద్దింకలను ఎన్ని చూడలేదు, సరేలే మనల్ని కొరకవు  కదా అది చాలు.  

దాని కోసం స్పైడర్స్ ఉన్నాయిగా, ఇక్కడ తిరిగే కొన్ని రకాల స్పైడర్స్ నిన్ను స్వర్గానికో, నరకానికో పంపగల సామర్థ్యం గలవి. 

సరేలే, స్పైడర్స్ తో ఎలాగోలా జాగ్రత్త పడతాలే. అయినా అంతగా మన మీదకి వస్తే అప్పుడా  స్పైడర్స్ ని అలా సైడ్ కి తోసేస్తే సరి ?

మరి పాములు?

అవి కూడానా?

ప్రపంచం లో ఉండే డేంజరస్ పాముల్లో 20 శాతం ఇక్కడే ఉన్నాయిట, మనం ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి backyard లో అప్పుడప్పుడూ అవి తిరుగుతూ ఉండచ్చు జాగ్రత్త, చీకటి పడితే డోర్ మూసి ఉండటం మంచిది. 

నిజం చెప్పొద్దూ, కలలోకి కూడా వచ్చేవి ఆ బొద్దింకలు అంత ఎక్కువగా తిరుగుతుండేవి ఆ ఇంట్లో.  

12, జులై 2021, సోమవారం

ఈ వారం ముచ్చటగా మూడు మంచి సినిమాలు

ఎప్పుడూ మంచి సినిమాలే పెట్టవు అంటుంది మా ఆవిడ రోజూ టీవీ లో సినిమా పెట్టినప్పుడు. ఏం చేస్తాం నిశ్శబ్దం, మోసగాళ్ళు, సాహో లాంటి చెత్త సినిమాలే చూశాను ఈ మధ్య కాలంలో. 

జాతి రత్నాలు సినిమా రిలీజ్ టైములో ఆ సినిమా ప్రోమోస్, యాడ్స్ యూ ట్యూబ్ లో చూసి ఈ సినిమాకి థియేటర్ కి వెళదాం అంది. మా ఆవిడ.  సోషల్ మీడియా లో కనపడే జోక్స్ ని సినిమాలో పెట్టారు ఇదీ ఒక సినిమానేనా అని వద్దన్నాను. నా ప్రెడిక్షన్స్ ఎప్పుడూ తప్పు కాలేదు కాబట్టి తనూ పట్టుపట్టలేదు సినిమాకి తీసుకెళ్ళమని. 

ఆ తర్వాత ఈ సినిమా హిట్టయిందని విని చూశావా అనవసరంగా మంచి సినిమాని మనం మిస్ అయ్యాము అంది. సరే, నాకు దాని మీద ఇంటరెస్ట్ లేకపోయినా అమెజాన్ లో ఎలాగూ ఎప్పటి నుంచో ఉంది కదా అని ఆ సినిమా పెట్టాను కనీసం నవ్వుకోవడానికి బాగుంటుందని . 

ప్రధాన నటుల ప్రతిభ తప్ప ఏ రకంగానూ మెప్పించని సినిమా ఇది. అసలు ఇలాంటి సినిమా ఎలా హిట్టయిందో దేవుడికే ఎరుక. కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేసి హడావిడి చేసేసి హిట్ చేసే tactics వంటబట్టించుకున్న వారు ఉన్నట్లు ఉన్నారు ఈ సినిమా వెనుక, 'సరిలేరు నీకెవ్వరూ' లాంటి సినిమాకి దిల్ రాజు ఉన్నట్లు. నిండుకుండ తొణకదు కానీ ఇదిగో ఇలా విషయం తక్కువ హడావిడి ఎక్కువ సినిమాలే తెగ తొణుకుతూ ఉంటాయి. టీవీ లోనూ సోషల్ మీడియా లోనూ ఇంతకంటే మంచి జోకులు కనపడుతుంటాయి. సోషల్ మీడియా లోదొరికే ఒక పది జోకులను, సెటైర్ లను పోగేసుకొని ఈ సినిమా తీసినట్లు అనిపించింది కథ కాకరకాయ మాకెందుకు అని, ఈ మాత్రం దానికి జబర్దస్త్ చూడటం బెటర్. 

మత్తు వదలరా, బ్రోచేవారెవరురా, షాదీ ముబారక్ లాంటి మంచి సినిమాలు కూడా చూశాను ఈ మధ్యకాలంలో.  మత్తు వదలరా లో నటించిన ముగ్గురు కుర్రాళ్ళలో ముందుగా చెప్పుకోవలసింది కమెడియన్ సత్య గురించి మాత్రమే. వచ్చిన కొత్తలో ఇతను ఎక్కువగా సునీల్ ని ఇమిటేట్ చేసేవాడు కానీ ఈ మధ్య కాలంలో ఆ ఇమిటేషన్ ని కాస్త తగ్గించి బాగా షైన్ అయ్యాడు. ఒకే మూసలో వస్తున్న తెలుగు సినిమాలకి ఇలాంటి కొత్త దర్శకుల అవసరం ఎంతైనా ఉంది. హీరో అనగానే 6 పాటలు, 4 ఫైట్స్ అనే ధోరణి పోవాలి అప్పుడే ఇండస్ట్రీ లో మంచి సినిమాలు వస్తాయి.

నట వారసుల కంటే మంచి ఫిజిక్, డైలాగ్ డెలివరీ, నటన ఉన్న సత్య దేవ్ లాంటి నటులు బ్రోచేవారెవరురా లాంటి సినిమాలో చిన్న చితక పాత్రల్లో నటించాల్సిరావడం తెలుగు సినిమా కి పట్టిన చీడ. 

షాదీ ముబారక్ ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంటుంది, సెకండ్ హాఫ్  కొంచెం బోర్ కొడుతోంది. సాధారణంగా సెకండ్ హాఫ్ సరిగ్గా తీయలేకపోవడాన్ని సినిమా పరిభాషలో సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అంటారు. ఇది చాలా మంది దర్శకుల్లో ఉంటుంది. షాదీ ముబారక్ సినిమా చూస్తున్నంత వరకు ఈ సినిమా బాగుందే ఎందుకు అంత హిట్ కాలేదు అని ఆలోచించా. అలా ఆలోచించిన కాసేపటికే అర్థం అయింది, సినిమా లో సెకండ్ హాఫ్ నుంచి ఫ్లో దెబ్బ తింది అని. ఇవన్నీ సినిమా రివ్యూ లో రాసే మాటలు. నా భాషలో చెప్తాను ఎక్కడ సినిమా మీద ఇంటరెస్ట్ తగ్గింది అన్నది. 

సినిమా గురించి మాట్లాడేముందు ఈ సినిమాలో ఆకట్టుకునే విషయం ఏమిటంటే అది హీరోయిన్. ముఖ్యంగా ఆమె ఎక్సప్రెస్సివ్ కళ్ళు సినిమా చూస్తున్నంతసేపూ ఆకట్టుకుంటాయి. మంచి నటి అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో, పైగా చిట్టి పొట్టి బట్టలు లాంటివి వేసుకోకుండా పద్దతిగా బట్టలు వేసుకుంది. 

సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే హీరోయిన్ చీర కట్టుకుంటుంది. ఇక అదే చీర తోనే ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకూ కథ జరుగుతుంది.  ఆ చీర తోనే  సినిమా అంతా హీరోయిన్ కనపడినా ప్రాబ్లెమ్ ఉండేది కాదు. ఏదో మాల్ లోపలికి వెళ్ళి డ్రెస్ కొనుక్కొని, అదే డ్రెస్ వేసేసుకొని వస్తుంది. అహ, ఇది అవసరమా? సినిమా బాగా సాగే టైములో. ఆ డ్రెస్ ఏమైనా బాగుంటుందా అంటే అది ఛండాలంగా ఉంటుంది  పైగా మెళ్ళో అదేదో పూసల దండ దరిద్రంగా. అంత వరకు దేవ కన్య లా అందంగా అనిపించిన ఆ అమ్మాయి ఉన్నట్లుండి ఒక మామూలు అమ్మాయిగా అనిపిస్తుంది. సరే సర్దుకుపోదాం అనుకుంటే మళ్ళీ అదే డ్రెస్సులో అర్థం పర్థం లేకుండా పబ్బులో పాట ఒకటి. (ఈ కాలం యూత్ కి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు, పబ్బుల్లో పాటలు నచ్చుతాయి అనుకుంటా, బట్ నాకు నచ్చలేదు ఎంతైనా కాస్త ఓల్డ్ జనరేషన్ కదా) సినిమా అంటే పాటొకటి ఉండాల్సిందే అనే భావన పోతే గానీ సినిమాలు బాగుపడవు. పాటలు పెట్టాలి అనుకుంటే సినిమా ఫ్లో కు అడ్డుపడకుండా ఎలా తీయాలో పవన్ కళ్యాణ్, కరుణాకర్ కాంబినేషన్ లో వచ్చిన తొలిప్రేమ చెబుతుంది. 

మరీ హీరోయిన్ గురించి ఎక్కువ రాసేశాను కదా, ఏం చేస్తాం మగబుధ్ధి. హీరో గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఋతురాగాలో, చక్రవాకమో ఏదో సీరియల్లో పాపులర్ అయిన సాగర్ ఈ సినిమాలో హీరో.  ఛిచ్చీ! హీరోల గురించి ఇంత కంటే ఇంకేం చెపుతాం చాలు చాలు.