మూడు రోజుల పాటు బెంగుళూరు లో ఉండే పనులు పూర్తి చేసుకొని అమ్మా నాన్న ఉండే తాడిపత్రికి బయలు దేరాము. పిల్లలతో పాటు లగేజ్ కూడా ఎక్కువ ఉందని బెంగళూరు నుంచి తాడిపత్రి కి కార్ మాట్లాడితే వాడు చెప్పిన రేట్ కు ఒక సెకండ్ హాండ్ కార్ కొనవచ్చనిపించి ఆ ఐడియా నుంచి డ్రాప్ అయ్యాము. దాంతో మా నాన్న తాడిపత్రి నుంచి కార్ పంపించారు, అక్కడి వాళ్ళయితే తెలిసిన వాళ్ళు కాబట్టి కాస్త తక్కువ ఛార్జ్ చేస్తారని.
ఉదయాన్నే ఐదుకే అక్కడ బయలుదేరి బెంగుళూరులో తొమ్మిదింటికి ఇంటికి చేరాడు ఆ కార్ డ్రైవర్. నా భాగం ఉప్మా అతనికి త్యాగం చేసి రాత్రి మిగిలిన బెండకాయ కూర తో బెండకాయ బర్గర్ చేసుకుతిని బయలుదేరాము.
ఇక్కడ ఈవెంట్స్ లోనో లేక సంవత్సరానికి ఒకసారి జరిగే ఈస్టర్ షో లోనో కనిపించే జంతువులన్నీ(ఆవులు, గేదెలు,పందులు, గొర్రెలు, మేకలు, కోతులు, కోళ్లు లాంటివి) రోడ్డు పక్కనో, అక్కడక్కడా రోడ్డు మీదో కనపడేసరికి మా పాప తెగ సంతోషించింది. కాకపొతే సమస్య ఏమిటంటే పంది ని పంది అని తనను ఒప్పించడం కష్టమైంది. పంది అంటే peppa pig కార్టూన్ లో వచ్చేటంత అందంగా ఊహించుకుంది మా పాప కానీ రియాల్టీ వేరుగా ఉంది. అయినా తన తప్పేముందిలెండి పెద్దవాళ్ళమైన మేమే ఒకసారి ఒకానొక ప్రముఖ హీరోయిన్ ను షాపింగ్ మాల్ లో చూసి, గుర్తుపట్టలేకపోయామంటే కారణం ఆ హీరోయిన్ మేకప్ తో లేకపోవడమే. అలాగే మా పాప కూడా రియల్ పంది ని గుర్తించలేక పోయింది.
మధ్యలో టీ బ్రేక్ కోసం ఒక ధాబా దగ్గర ఆగాము. ఒక్కో టీ కి 25 రూపాయలు ఛార్జ్ చేశాడు, అదేమైనా పావు లీటర్ సైజు లో ఉండే కప్ అయితే ఓకే. నాన్నా.. ఎన్నాళ్ళ నుంచో టాయ్ టీ పాట్ సెట్ కావాలని అడుగుతున్నానా ఇదిగో ఇలాగే ఉండాలి అంది మా బుజ్జిది ఆ బుజ్జి బుజ్జి సైజుల్లో ఉండే కప్పులు చూసి .
టీ చాలా రుచిగా అనిపించింది. తమ్ముడూ, ఏ టీ వాడుతారేమిటీ అని అడిగా అక్కడ టీ చేసే కుర్రాడ్ని.
3 రోజెస్ అన్నాడు.
మేము ఇంట్లో ఇదే వాడుతాం కానీ ఎప్పుడూ ఇంత రుచిగా అనిపించలేదయ్యా
3 రోజెస్ టీ మాత్రమే వాడితే సరిపోదు సార్, 3 రోజెస్ కు ఒకసారి మాత్రమే టీ గిన్నె కడిగి చూడండి రుచి వస్తుంది అన్నాడు రహస్యాన్ని నా చెవిలో వేస్తూ, టీ టేస్టు కి ఫిదా అయిపోయి రెండో కప్పు టీ తాగుతున్న మా ఆవిడకు వినపడకుండా .
ఇంతకీ ఇది ఎన్నో రోజు తమ్ముడూ
ఇదింకా రెండో రోజే సార్, రేపొచ్చి తాగి చూడాల్సింది టేస్ట్ ఇంకా అద్దిరిపోయేది అన్నాడు.
అలా టేస్టీ టీ తాగితే వచ్చిన ఊపులో తాడిపత్రి చేరాక, మీ ఇంటికి వెళ్ళడానికి డైరెక్షన్స్ ఇవ్వండి సర్ అన్నాడు డ్రైవర్.
నాకు ఇల్లు ఎక్కడుందో తెలీదు కానీ అడ్రస్ చెప్తాను నీది ఈ ఊరే కాబట్టి ఈజీ గా వెళ్లొచ్చు అన్నాను.
ఏంటి సర్ మీ ఇంటి అడ్రస్ మీకే తెలీదా అన్నాడు ఆశ్చర్యంగా.
అది మా ఇల్లే కానీ 6 నెలల క్రితమే అమ్మా నాన్న ఆ ఇంటికి మూవ్ అయ్యారు అన్నాను.
బెంగుళూరు క్యాబ్ డ్రైవర్ లా 20, 30 సందులు కాకుండా కాకుండా కేవలం రెండు మూడు సందులు మాత్రమే తిప్పి ఇదే సర్ మీరు చెప్పిన అపార్ట్మెంట్ అన్నాడు.
ఇది కాదనిపిస్తోంది తమ్ముడూ
ఇదే సర్ మీరు చెప్పిన అడ్రస్ ప్రకారమైతే
కావచ్చు కానీ, ఈ అపార్టుమెంట్ లో మూవ్ అయ్యే ముందు మా నాన్న పంపిన ఫోటోల ప్రకారం అపార్టుమెంట్ ఎదురుగా ఒక ట్రాన్స్ఫార్మర్ ఉండాలి
ఇదిగో ఉంది కదా
ట్రాన్స్ ఫారం పక్కన రెండు పందులు కూడా ఉండాలి అవి లేవు అందుకే ఇది కాదేమో అని నా డౌట్
బై బర్త్ మీరింత ఇంటెల్లిజెంటా లేక బెండకాయ బర్గర్ తిన్న ఎఫెక్ట్ అంటారా అనడిగాడు.
అతను ఎందుకలా అడిగాడో నా అరికాలు ఎంత గోక్కున్నా ఇప్పటికీ అర్థం కావడం లేదు.
3 "రోజె"స్ టీ రహస్యం, ట్రాన్స్ఫార్మర్ పక్కన పందుల లాండ్ మార్క్ - మీ sense of humor కి చప్పట్లు
రిప్లయితొలగించండిధన్యవాదాలండి లలిత గారు కామెంట్స్ పెట్టినందుకు.
తొలగించండిపవన్ గారూ మీరు మరీ "ముదురు తెలివైన" వాళ్ళలా ఉన్నారే
రిప్లయితొలగించండిథాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ శ్రీనివాస్ గారు. తిట్టారో పొగిడారో అర్థం కాలేదు నా మట్టి బుర్ర కి.
తొలగించండి