అప్పుడెప్పుడో ఆర్నెల్ల క్రితం రాసిన ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 4 పోస్ట్ కి కొనసాగింపు....
'పొగ త్రాగడం హానికరం మరియు ప్రమాదకరం' అంటూ సినిమాకి ముందు వచ్చే ముఖేష్ యాడ్ ని గుర్తుకు తెచ్చేలా నా రూమ్ లోకి ఆరోజు మధ్యాహ్నమే ఒక కొత్త రూమ్మేట్ వచ్చాడు. అతను ఇన్ఫోసిస్ లో మేనేజర్ గా పనిచేసేవాడు. ఆగ్రా నుంచి వచ్చాడట, ఎప్పుడు చూసినా సిగరెట్ తాగుతూ ఉండటమో లేదంటే పాన్ పరాగ్ నములుతూ ఉండటమో చేస్తుంటాడు. ఆ పాన్ పరాగ్ ని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటాడు. నాకు రూమ్ లోకి రాగానే కనిపించిన ఆ రక్తపు మరకల ఎఫెక్ట్ అదే. ఉమ్మేసిన తర్వాత అక్కడ ఏ టవల్ దొరికితే ఆ టవల్ తో మూతి తుడుచుకునేవాడు తన పర అనే భేదం లేకుండా. ఆ ఒక్క రాత్రే నన్ను నిద్ర పోనీకుండా తన ఫామిలీ హిస్టరీ మొత్తం చెప్పేశాడు అర్ధ రాత్రి దాకా.
పొద్దుటే గంట కొడుతున్న శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేచా, టైం చూస్తే ఉదయం ఆరు. బాగా చలిగా ఉండే మే నెలలో అంత ఉదయాన్నే గంట కొడుతూ అగరొత్తులు వెలిగించి పూజ చేస్తున్నాడు ఆ వ్యక్తి.
అయినా ఓరి ముఖేష్! నీకు ఈ యాంగిల్ కూడా ఉందా? సిగరెట్స్, పాన్ పరాగ్ లాంటి చెడ్డ అలవాట్లతో పాటు అగరొత్తులు, పూజ అనే ఈ మంచి అలవాట్లూ ఉన్నాయే అనుకున్నా.
గుడ్ మార్నింగ్ పవన్. అదేం విచిత్రమో లేక దైవ బలమో తెలీదు గానీ ప్రతీ రోజూ తెల్లవారుజామున ఐదుకే లేచి స్నానం చేసి పూజ చేయడం అలవాటు. ఈ చలికి చల్ల నీళ్ళతో ఎలా స్నానం చెయ్యాలా అని దిగులుపడ్డా, పైగా నేను ఇండియా నుంచి తెచ్చుకున్న వాటర్ హీటర్ ఇక్కడి ప్లగ్ సాకెట్స్ లో పట్టలేదు యెంత ట్రై చేసినా. చివరికి ఏదైతే అదవుతుందని చన్నీళ్లతోనే స్నానం చేద్దాం అనుకున్నా కానీ బై గాడ్స్ గ్రేస్ వేడి నీళ్ళు వచ్చాయి టాప్ తిప్పితే అన్నాడు.
గాడ్స్ గ్రేస్ లేదు గాడిద గుడ్డు లేదు ఆస్ట్రేలియా లో బై డిఫాల్ట్ హీటర్ ఫిక్స్ అయి ఉంటుంది వాటర్ కనెక్షన్ కి అన్నాడు దేవుడంటే గిట్టని మా చెన్నై కమల్ హాసన్ (ఎప్పుడూ ఉదయం 9 కి గానీ లేవని మా ఫ్లాట్ లోనే మరో రూమ్ లో ఉండే ఫ్లాట్ మేట్ ఇతను, ఆ గంట శబ్దానికి మొదటి సారి సూర్యుడి కంటే ముందే నిద్ర లేచాడు)
అవునా, నాకా విషయం తెలీదే అన్నాడు ఆశ్ఛర్యంగా ఆ ముఖేష్.
ఆశ్ఛర్యం తర్వాత, ముందు ఆ గంట కొట్టడం ఆపేయ్ లేదంటే మన పక్క ఫ్లాట్ లో ఉండే ఆ రష్యా వాడు డిస్టర్బ్ చేస్తున్నామంటూ కంప్లైంట్ చేస్తాడు అనే లోపే తలుపు తడుతున్నారు ఎవరో.
తీసి చూస్తే ఆ రష్యా వాడే...
"ఈ ఫ్లాట్ కి ఏమైంది, ఒక వైపు టంగు టంగుమని శబ్దం, మరో వైపు ఈ దట్టమైన పొగ .. దీన్ని చూస్తూ నేను సహించలేను" అంటూ సినిమా ముందు వచ్చే స్మోకింగ్ రీల్ డైలాగ్స్ ను గుర్తు చేస్తూ మా మీద విరుచుకు పడ్డాడు.
ఈ గంట శబ్దం సరే, ఆ పొగ కథేమిటబ్బా ఇంత పొగ చుట్టుకుంది అని చూస్తే డోర్ బయట రెండు వైపులా అటొక కట్ట, ఇటొక కట్ట అగరొత్తులు గుచ్చి ఉన్నాయి. ఆ అగరొత్తుల నుంచి వచ్చిన పొగ అది.
అర్థమైంది అది మా ముఖేష్ పనే అని, ఇక ఆ రష్యా వాడికి చిక్కిన ఉక్రెయిన్ వారిలా బలి కావడం తప్ప వేరే దారి లేదని మౌనంగా తలదించుకున్నాం సారీ చెబుతూ.
నాకసలే ఆస్మా ఉంది, ఈ పొగకి నాకేమైనా అయితే నన్నే నమ్ముకున్న నా మొదటి భార్య చివరి ఇద్దరు పిల్లలు, రెండవ భార్య కి పుట్టిన నా పెద్ద కొడుకు, ఆవిడ మొదటి భర్త తో కన్న ఇద్దరు పెద్ద కూతుర్ల భాద్యత, ఇప్పుడు లివింగ్ టుగెదర్ లో ఉన్న నా బాయ్ ఫ్రెండ్, వాడి మొదటి పెళ్ళాం కి పుట్టిన మూడవ పిల్లాడి భాద్యత ఎవరు చూస్తారు? మరో సారి ఇలా జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయాడు.
అగరొత్తులు వెలిగించొద్దా, నీకు ఆస్మా ఉందా. ఏంటీ ఈ మాత్రం పొగకే పోతావా? నిన్ను ఢిల్లీ లోనో బీజింగ్ లోనో వదిలేయాలి దెబ్బకు దారికొస్తావ్ అని మేము రూమ్ లోకి వెళ్లి సైలెంట్గా నవ్వుకున్నాం.
కానీ ఇలాంటిదే మరో తుఫాన్ హెచ్చరిక రాబోవు రెండు మూడు గంటల్లో వస్తుందని మేమూ ఊహించలేకపోయాము, ఏ ఆకాశవాణి మమ్మల్ని హెచ్చరించనూ లేదు.
ఆస్ట్రేలియా యే, మీ స్వర్గం కదా :)
రిప్లయితొలగించండిఅంతేగా అంతేగా, కానీ పై “అజ్ఞాత” కామెంట్ వ్రాసింది నేను కాదు, పవన్ కుమారా 🙂.
తొలగించండి(మీరు “మేష్టారు” అంటుండేది నన్నేగా … సాధారణంగా 🙂?)
అలా అనుకునే బతికేయాలి ఇక్కడ, నిండా మునిగాక చలేమిటి.
తొలగించండిConfusion cleared and clarified Mestaaru :)
తొలగించండి