9, మే 2022, సోమవారం

అర్రే, పంచు నాకు పడిందే


యూట్యూబ్ లో 'తల్లి పోగాదే' (ఇలాగే పలకాలా, ఏమో తెలీదు మరి) అని కొత్త తమిళ్ సినిమా కనపడితే చూడటం మొదలెట్టాను. ఒక అరగంట అయిన తర్వాత 'ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే' పాట మ్యూజిక్ మొదలైనప్పుడు డౌట్ వచ్చింది అరే, ఇది మన తెలుగు సినిమా 'నిన్ను కోరి' లో పాట కదా అనుకున్నాను. కాసేపటి తర్వాత ఆ సినిమా రీమేకే నేను చూస్తున్న సినిమా అని అర్థమైంది. 'నిన్ను కోరి' సినిమా కాన్సెప్ట్ తెలుసు కానీ ఆ సినిమా చూడలేదు కాబట్టి పోల్చుకొని తెలిసేప్పటికి గంట సినిమా ముగిసింది. 


ఇక చూద్దామా వద్దా అనే ఊగిసలాటలో అక్కడి నుంచి సినిమా ఎంజాయ్ చెయ్యలేకపోయాను. అరె, నాని అయితే ఈ సీన్లో ఇంకా బాగా యాక్ట్ చేసి ఉంటాడేమో, అనుపమ కంటే నివేదా థామస్ బాగా చేసేదేమో అని అనిపిస్తూనే ఉంది. రీమేక్ సినిమాలతో వచ్చే తంటానే ఇదేమో, యెంత వద్దనుకున్నా కంపారిజన్ వచ్చేస్తుంది. పైగా 'హృదయం' హీరో మురళి కొడుకు అధర్వ గానీ, అనుపమ పరమేశ్వరన్ గానీ నాకెందుకో నచ్చరు, అది కూడా ఒక కారణం కావచ్చు.


పైగా ఇదే సినిమా ఫ్లేవర్ లో అభినందన, ప్రేమాలయం, ప్రేయసీ రావే, కన్యాదానం, శ్రీమతి వెళ్ళొస్తా లాంటి బోలెడు పాత సినిమాలు చూసినందువలన కూడా పెద్దగా నచ్చలేదు.


ఆ సినిమా చూడడం అయిపోయాక నా భార్యను కాస్త ఉడికిద్దామని  నేను కాలేజీలో చదివే రోజుల్లో నన్ను కూడా ఒక అమ్మాయి ప్రేమించింది కాకపోతే కులం-మతం, ఆస్తులు-అంతస్తులు, అప్పడాలు-వడియాలు, కోడి -పకోడీ లాంటి కారణాల వల్ల నేను తనని పెళ్లి చేసుకోలేకపోయాను. అప్పటి నుంచి తను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు నన్ను తలుచుకుంటూ. ఇందాక చూసిన సినిమాలో లాగా తనని కూడా  మన ఇంటికి తీసుకొని వస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు అన్నాను. 


నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే .. "తీసుకురా నిన్ను, దాన్ని కలిపి చీపురు తిరగేస్తాను అంటుందని అనుకున్నా,  కానీ తను సింపుల్గా "ఆ పని చెయ్ పుణ్యం ఉంటుంది రోజూ ఈ వంట పని చేసే బాధ ఉండదు, అది ఉన్నన్ని రోజులు ఆ పని దానికి అప్పగిస్తే సరిపోతుంది." అంది 


అర్రే, పంచు నాకు పడిందే అనుకున్నా. 

3 కామెంట్‌లు: