17, జూన్ 2016, శుక్రవారం

బకాసురులను కూడా బక్కగా మార్చే డైట్ మేళాలు

ఇది ఓ పదేళ్ళ కిందటి మాట. 

ఒకసారి నేను ఆఫీస్ లో ఉండగా నా ఫ్రెండ్ వచ్చి ‘దగ్గరలో S.B.I  ATM ఎక్కడ ఉంది ?’ అని అడిగాడు.

నేను ఇలా ఇలా వెళ్ళాలి అని డైరెక్షన్స్ ఇచ్చాను.

ఎంత దూరం ఉంటుంది? అని అడిగాడు.

ఎంత…జస్ట్  వాకబుల్ డిస్టెన్స్ అన్నాను

సరే ATM కు వెళ్ళొస్తాను అని వెళ్ళిపోయాడు.

ఒక గంట తర్వాత వచ్చి ‘నీ ప్రకారం వాకబుల్ డిస్టెన్స్అంటే ఎంత?’ అని అడిగాడు.

3 నుంచి 5 కిలోమీటర్లు అని నేను చెప్పాను.

బాబూ, ఏదో ఒక అర కిలోమీటర్ అయితే వాకబుల్ డిస్టెన్స్ అంటారు గాని  నాకేం తెలుసు వాకబుల్ డిస్టెన్స్ అనేది   నీ ఉద్దేశ్యం లో 3 నుంచి 5 కిలోమీటర్లు అని. దాదాపు కిలోమీటర్ దూరంలో ఉండే ఆ ATM కి వెళ్ళేటప్పటికి నడవలేక నా ప్రాణాలు పోయాయి. అందుకే వచ్చేటప్పుడు ఆటో లో వచ్చాను అని చెప్పాడు.

ఇలా ప్రతి చిన్న దూరానికి కూడా ఆటో లోనో  బైక్ లోనో  వెళ్ళే అలవాటున్న అతను ఇప్పుడు పదేళ్ళ తర్వాత సన్నబడటానికి తన అపార్ట్మెంట్ చుట్టూ మార్నింగ్ వాక్ లు చేస్తూ, గ్రీన్ టీ లు తాగుతూ జిమ్ కు వెళ్తూ డైటింగ్ అంటూ ఏది పడితే అది తినకుండా ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదో డైట్ చార్ట్ ప్రకారం తింటూ తిప్పలు పడుతున్నాడు.

పదేళ్ళ కిందటే కాస్త వాకింగ్ ను వంటికి అలవాటు చేసి ఉంటే ఇవాళ అతని పరిస్థితి మరీ ఇలా ఉండేది కాదేమో అనిపిస్తుంది. రోజూ కాస్త దూరం నడిచిన వారంతా సన్నగా అవుతారు అని కాదు కానీ బాగా నడిచే వారి పరిస్తితి కాస్త మెరుగ్గా ఉంటుందనేది నా ఉద్దేశ్యం. నా వరకు నేనైతే మూడు నాలుగు కిలోమీటర్లు అయినా నడిచే వెళ్తాను, అంతే కాకుండా షవర్ బాత్ గట్రా కాకుండా బక్కెట్లో నీళ్ళు పట్టుకొని మగ్ తో నీళ్ళు ముంచుకొని స్నానం చేస్తాను. అలా చేయడం వలన కనీసం ఒక 20 సార్లయినా వంగిలేయటం వలన మనకు తెలీకుండానే శరీరానికి కొంత వ్యాయామం ఇస్తున్నాము. ఈ జనరేషన్ లో కూడా ఈ పాత చింతకాయ పద్దతులు ఏంటి అని అనుకున్నా పర్లేదు నేను మారను. మరీ జంక్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ ల జోలికి పోకుండా ఆయిల్ ఫుడ్, స్వీట్స్  ఏదైనా సరే నాకు నచ్చినది, నేను అనుకున్నది శుభ్రంగా తింటాను ఎలాంటి సంశయాలు లేకుండా . మన పూర్వికులు మనకిచ్చిన యోగా అనబడే ఒక అద్బుతమైన కానుకను కనీసం వారం లో 3-4 సార్లు అయినా చేస్తాను. యోగా చేయడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా నాన్న గారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. గత పాతికేళ్ళుగా ఆయన యోగ చేస్తూ అరవై దాటినా ఇంకా ఉత్సాహంగా ఉండగలుగుతున్నారు.

ఇక్కడ సిడ్నీ లో కాఫీ షాప్ కి వెళ్లి కాఫీ లో 3 స్పూన్స్ షుగర్ అని చెప్తే Are you  sure అని ఒకటికి రెండు సార్లు నిర్ధారించుకొని నాశనమై పోతావు రేయ్ అంత షుగర్ కలుపుకు తాగితే అన్నట్లు మొహం పెడతారు గాని నేను మాత్రం ఎటువంటి భయాలు లేకుండా 3 స్పూన్స్ షుగర్ తోనే కాఫీ తాగుతాను. నా వరకు నేను కాఫీ ని కషాయం లా తాగడానికి ఇష్టపడను. ఈ మధ్య చాలా మంది వాళ్ళ ఇంటికి ఎవరైనా వెళ్తే వచ్చిన వాళ్ళు తాగుతారో లేదో కూడా తెలుసుకోకుండా గ్రీన్ టీ ఇస్తున్నారు. నాకూ అలాగే ఇచ్చారు వద్దంటే బాగోదని ఒకటి రెండు సార్లు తాగాలని ప్రయత్నించాను కాని అది నా కప్ అఫ్ టీ కాదని అర్థమైపోయింది. మీకు నా మీద ఏమైనా కోపం ఉంటే ఒక అరగంట సేపు T.V లో ఏదో ఒక తెలుగు సీరియల్ ను పెట్టేసి రిమోట్ దాచిపెట్టేసుకొని మీ పాటికి మీరు ఫేసుబుక్ లో మెసేజ్ లు పెట్టుకుంటూ కూర్చోండి కానీ ఇలా గ్రీన్ టీ మాత్రం ఆఫర్ చేయకండి అన్నాను నవ్వుతూ.  

మొన్న ఆ మధ్య తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే అడక్కుండానే వైట్ టీ ఇచ్చారు. వద్దు నేను తాగలేను అని సున్నితంగా చెప్తే ఆరోగ్య సూత్రాలు చెప్పడమే కాకుండా వైట్ టీ బాగా కాస్ట్లీ అని దర్పం కూడా ప్రదర్శించారు.  మీరు నాకు ఈ వైట్ టీ ఇవ్వకపోయినా పర్లేదు మీ ఆరోగ్య సూత్రాలు మీ దగ్గరే అట్టి పెట్టుకోండి నాకు మాత్రం అంట గట్టకండి నా ఆరోగ్య సూత్రాలేవో నా దగ్గరే ఉన్నాయి అని గట్టిగా చెప్పాలనుకొని చెప్పలేకపోయాను. రోజూ ఉదయాన్నే లైట్ అండ్ ఈజీ అని అదేదో డైట్ కంపనీ డెలివరీ బోయ్ వచ్చి ఓ రెండు బాక్స్ లు వాడాలి వెళ్తారు వాళ్ళ డోర్ ముందు ఒకటి అతనికి ఇంకొకటి వాళ్ళావిడకి. అందులో 5 చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి. రోజంతా అదే వాళ్ళ ఫుడ్. ఉదయాన ఇంట్లో ఒకసారి ఆఫీసు లో మూడు సార్లు రాత్రి ఇంటికి వచ్చాక ఒక సారి ఆ చిన్న చిన్న డబ్బాల్లో ఫుడ్ తింటూ ఉంటారు. నన్ను కూడా పాటించమని వాళ్ళు నాకు చెప్పిన ఆరోగ్య సూత్రాలలో ఇదొకటి. 

ఈ జనరేషన్ వాళ్ళమైన మనము మన పాత జనరేషన్ వాళ్ళతో  పోలిస్తే ఆరోగ్యం విషయం లో క్వాలిటీ అఫ్ లైఫ్ బతుకున్నాము అన్నది అతని నమ్మకం. అదే విషయాన్ని గూగుల్ లో సెర్చ్ చేసి చూపించాడు.  నాకేమో దాన్ని ఒక పట్టాన ఒప్పుకోవాలనిపించలేదు . డైట్ కంపనీ వాడు పంపించే రుచి పచి లేని ఆహారం తినడం, ఇష్టమైనవి తినకుండా నోరు కట్టేసుకుని ఉండటం, ఏది తినాలన్నా కేలరీలు ఎంత అని లెక్కిస్తూ కూర్చోవడం క్వాలిటీ అఫ్ లైఫ్ ఎలా అవుతుందో నాకైతే ఎప్పటికి అర్థం కాని విషయం. 

పోయిన వారం ఒక సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తుంటే హాయ్ అనే పిలుపు వినిపించింది. తిరిగి చూద్దును కదా ఎక్కడో చూసిన మొహం లా ఉన్నట్లుందే అనుకున్నాను కాని గుర్తు రావడం లేదు. తర్వాత గ్రీన్ లైట్ వెలిగింది అటు బుర్రలో ఇటు సిగ్నల్ లో. నమిత లాగా బాగా లావుగా ఉండే నా పాత కొలీగు నయనతార లాగా తయారైంది.  గత 2 నెలల్లో డైట్ ప్లాన్ ఫాలో అయి 20 కిలోలు తగ్గానని దాంతో పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పుకొచ్చింది. ఇలాంటి వాళ్ళను కనీసం ఒక పది మందిని చూసి ఉంటాను ఈ మధ్య కాలంలో. అందరూ 25 నుంచి 30 లోపు వాళ్ళే పైన చెప్పిన భార్య భర్త తో కలిపి.  వీళ్ళంతా ఆ డైట్  కంపెనీ లకు మహారాజ పోషకులు. ఇంతకీ లంచ్ ఏమి తిన్నావు అని నేను అడిగితే 300 కేలరీలు అని లెక్క చెప్పే వాళ్ళని కూడా చూసాను. 

బకాసురులను కూడా బక్కగా మార్చి చూపిస్తాము అనే టైపు లో చెప్పుకునే ఒక కంపెనీ కి వెళ్ళిన నా మిత్రున్ని వాళ్ళ జిమ్ కు తీసుకెళ్ళి సన్నబడటానికి పాటించవలసిన డైట్ పాలసీ వివరించాడు instructor. 

మేము సప్లై చేసే ఫుడ్ మాత్రమే తినాలి, రైస్ మానేయాలి, పొటాటో మానేయాలి, ఆయిల్ ఫుడ్ మానేయాలి, నువ్వు బతకడం మానేయాలి, నీకు నువ్వు తద్దినం పెట్టుకోవాలి, ఇంకా ఏవేవో మానేయాలి అని చెప్పి ఒక పెద్ద లిస్టు ఇచ్చాడట. 

పాపం ఏం  చేస్తాడు బకాసురుడి లాంటి నా మిత్రుడు మానేసాడు ..... జిమ్ కు వెళ్ళడం. 






16 కామెంట్‌లు:

  1. Nice one . Just thinking how it would be if the person who offered green tea reads this ... lol

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thanks for the comment Mitta gaaru. would be great if he reads this. He doesn't offer the green/white tea next time onwards :) just the water is enough

      తొలగించండి
  2. గ్రీన్ టీ వద్దని అన్నందుకు మిమ్మల్ని కట్టేసి హాట్ స్టార్ లో "బ్రతుకు జట్కాబండి" ఎపిసోడ్స్ వరుసగా చూపించాలి. "జీవిత"ం అంటే ఏమిటో తెలిసి వస్తుంది.

    అరస్పూన్ టీపొడి,ఒకస్పూన్ తేనె, రెండు పుదీనా ఆకులు, మూడు చుక్కల నిమ్మరసం ఒక కప్పుడు వేడినీళ్ళలో వేస్తే పంచామృతం అయిపోదూ ? పంచామృతం నచ్చని వారూ ఉంటారన్నమాట ! ఈ పంచామృతంతో బరువు తగ్గుతారని గ్యారెంటీ మాత్రం ఇవ్వను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వేడి నీళ్లలో టీ బ్యాగ్ వేసి ఇచ్చే గ్రీన్ టీ కి, మీరు చెబుతున్న పంచామృతమనబడే టీ కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి. మీరు చెబుతున్న పంచామృతం అయితే నేనూ ఇష్టపడతాను ఎందుకంటే అందులో కమ్మటి తేనె తో పాటు పుదీనా ఆకులు నిమ్మ రసం ఉంది కాబట్టి.

      తొలగించండి
    2. నీహారికగారు గ్రీన్‌టీ ఎప్పుడన్నా తాగారో లేదో తెలియదు కాని వారు చెప్పిన రిసిపీ‌ మాత్రం బాగుంది.
      1. అరస్పూన్ టీపొడి.
      2. ఒక స్పూన్ తేనె.
      3. రెండు పుదీనా ఆకులు.
      4. మూడు చుక్కల నిమ్మరసం
      4. ఒక కప్పు వేడినీళ్ళు.
      5. ???????????

      ఐదవది లేకుండా పంచామృతం ఎలాగౌతుందండీ?
      నీహారిక గారూ‌ మరొక్కటి కూడా కలిపి పంచామృతం పూర్తి చేసెయ్యండి.

      తొలగించండి
    3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    5. నీహారికగారు, నా చిన్నప్పుడు (అంటే ఉద్యోగస్థుడినైన క్రొత్తలో అన్న మాట) లలితా శ్రీనివాసన్ అనే సహోద్యోగిని స్నేహితురాలు లెమన్ టీ రుచి చూపించింది. అది చాలా బాగుందంటే ఆ టీ చేసే విధానం కూడా పాపం ఓపిగ్గా వివరించింది. ఇంటికి వచ్చాక ఆ టీ సంగతీ దాన్ని చేసే విధానమూ చెబితే మా అమ్మగారూ మా చెల్లెళ్ళముఠా అందరూ ఏకకంఠంతో అదేదో రేపు నువ్వే చేసి చూపించరా అన్నారు. అలాగే నని మర్నాడు ప్రయత్నిస్తే ఎన్ని నిమ్మకాయలరసం పిండినా లలిత చెప్పిన గోల్డెన్ కలర్ చచ్చినా రాలేదు. అందరూ ఒకటే నవ్వటం. ఇల్లాగైందని చెబితే ఆ మర్నాడు లలితా శ్రీనివాసన్ కూడా పడీపడీ నవ్వటం. ఆ తర్వాత కూడా ఆమె చెప్పినట్లు లైట్ టీ డికాక్షన్ లోనే నిమ్మకాయలు పిండినా నాక్కావలసిన లెమన్ టీ మాత్రం ఎన్నడూ రానేలేదు. ఇప్పుడు మీరు చెప్పిన గ్రీన్ టీ ప్రయోగం చేయటం‌ గురించి ఆలోచించటం కష్టమే. ఇకపోతే మాయింట్లో‌ టీ పౌడర్ తేవటమే కాని టీ చేయటం సాధారణంగా జరగే‌పని కాదు మరి.

      తొలగించండి
    6. శ్యామలీయం గారు,

      లెమన్ ఎక్కువ వేయకూడదు,ఒక్క చుక్క ఎక్కువైనా పులుపు ఎక్కువైపోయి టేస్ట్ చెడిపోతుంది. పులుపు ఎక్కువైనపుడు తేనె కొంచెం కలిపితే సరిపోతుంది.రోజూ చేయగా చేయగా వస్తుంది. ఎంత బాగా చేసినా మొదటిసారి త్రాగినప్పటి టేస్ట్ మళ్ళీ రాదు కానీ రోజుకొక రకంగా టేస్ట్ చేయడమే !

      తొలగించండి
  3. మీరు చెప్పింది నిజమే. Weight watchers plan అటువంటిదే. బాగా వ్యాయామం చేస్తే పాయింట్లు పెంచుతాడు. లేకపోతే ఈ రోజు మీకు ఇవే పాయింట్లు ఇంతే తినండి అంటూ ఒక పరిమితి పెడ్తాడు. ఈ మధ్య గ్రీన్ టీ తో విసిగిస్తున్నారు. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదు అన్నట్లు ఈ మధ్య భారతదేశం లో కూడా మొదలు పెట్టారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండి చంద్రిక గారు. వచ్చిన వాళ్ళు గ్రీన్ టీ తాగుతారో లేదో, అది వాళ్లకు ఇష్టమో లేదో కనుక్కోకుండానే ఇవ్వడం మాత్రం మంచిది కాదు. పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని ఊరికే అనలేదు కదండీ, ఎవరి టేస్ట్ వారిది.

      తొలగించండి
    2. మోడీ గారి దయవల్ల ఇండియా ఇంకా చైనాలాగా డెవలప్ అవ్వలేదండీ. ఇపుడు అందరికీ చిన్నవయసులోనే బీ పీలు షుగర్ వ్యాధులు ఉంటున్నాయి కనుక టీ త్రాగుతారా, కాఫీ తాగుతారా ,షుగర్ వేయమంటారా అని అడిగిమరీ వేస్తున్నాం. తేనె పంచదారలాగా చవక కాదు.భక్తితో కళ్ళకద్దుకునే వారికే పంచామృతం దక్కుతుంది.

      తొలగించండి
    3. 1. "తేనె పంచదారలాగా చవక కాదు"
      పంచదార చవక, అది మితిమీరితే ఫలం బహుఖరీదు!
      2. "భక్తితో కళ్ళకద్దుకునే వారికే పంచామృతం దక్కుతుంది."
      అంతే అంతే!

      తొలగించండి