21, జూన్ 2016, మంగళవారం

బాల్యంలో గురువు, డిక్షనరీ, వికీపీడియా, గూగుల్ అన్నీ నాన్నే

నాన్న అనడంలోనే 'నా' అన్న భరోసా వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరి బాల్యంలో గురువు, డిక్షనరీ, వికీపీడియా, గూగుల్, అన్నీ నాన్నే.

చదువు నేర్పడంలో ఆయన ఒక గురువు
విస్తృతమైన సమాచారం ఇవ్వడం లో వికీపీడియా
అర్థం కానీ పదాలకు ఆయనో డిక్షనరీ
తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఆయనో గూగుల్
మొత్తంగా నా అనుకునే ఒక వెలకట్టలేని నిధి నాన్న. 

స్కూల్లో చదువుకునే రోజుల్లో నా ఫ్రెండ్స్ ఎవరన్నా నన్ను కలవడానికి వస్తే గేటు దగ్గర నుంచే నన్ను పిలిచి, మా నాన్నగారు ఇంట్లో లేరని  confirm చేసుకున్నాకే లోనికి వచ్చేవారు. మా నాన్న ఉన్నప్పుడు వస్తే "ఎలా చదువుతున్నారు" అని వాళ్ళను అడుగుతారని భయం.  అడగడంతో  ఆపేస్తే పర్లేదు నన్ను textbook తెమ్మని చెప్పి అందులోంచి ప్రశ్నలు కూడా అడిగేవారు. అలాగని మా నాన్న హిట్లర్ అనుకునేరు..చదువు విషయం లో కాస్త స్ట్రిక్ట్  అంతే. అదే ఈ రోజు నా ఈ స్థితికి కారణం.  ప్రతి రోజూ తెల్లవారుజామునే లేపి చదివించేవారు. క్రమ శిక్షణ ను మా జీవితం లో ఒక భాగం చేసాడు. 

అప్పట్లో పల్లెటూళ్లలో ఆరుబయట ఒక గోడకు తెల్లని బట్టను కట్టి దాని మీద సినిమాలు ప్రదర్శించేవారు. బట్ట సినిమాలు అని పిలిచేవాళ్లు వాటిని. నెలకొకసారి అలాంటి సినిమాలు వేసేవారు మేముండే పల్లెలో.  అలా వేసే రోజు ఆ సినిమా కు వెళ్లాలంటే అమ్మ ద్వారానో  చెల్లి ద్వారానో రెకమండేషన్ వెళ్ళేది నాన్న దగ్గరికి. నాన్నను డైరెక్ట్ గా అడగలేదు కానీ ఎన్నడూ వెళ్లొద్దు అనలేదు. ప్రతి నెల జీతం రాగానే సరుకులు తేవడానికి పక్కనున్న Town కు పోయినప్పుడల్లా ఒక సినిమాకి తప్పకుండా తీసుకెళ్లేవారు. ఒక సారి పెళ్లికి నెల్లూరు వెళ్ళినప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా సెకండ్ షో కు తీసుకెళ్ళేదాకా వదిలిపెట్టలేదు నేనైతే. అంత బిజీ షెడ్యూల్ లోనూ తను ఇబ్బంది పడి  కూడా నా సంతోషం కోసం  ఏ మాత్రం విసుక్కోకుండా సినిమా కు తీసుకెళ్లారు. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా కాస్త బాధగా ఉంటుంది. ఈ విషయం లోనే కాదు ఎన్ని విషయాలలో ఇలా బాధపెట్టానో అన్నిటికి క్షమించేసారు. ఆయన క్షమాగుణం ముందు బంగాళాఖాతం కూడా బలాదూర్.  

తిరుపతి లో చదివే రోజుల్లో ఒక సారి మా ఊరికి మిడ్ నైట్ ఎప్పుడో వెళ్లాను నేను నా మిత్రుడితో కలిసి.  మేము డోర్ కొట్టగానే ఓపెన్ చేసి "ఎగ్జామ్స్ బాగా రాశారా?" అని అడిగాడు. 

మీ నాన్న ఏమిటి రాగానే బాగున్నారా అంటాడనుకున్నాను కానీ ఎగ్జామ్స్ బాగా రాశారా అంటారేమిటి అని ప్రశ్నించాడు నా మిత్రుడు.

ఉదయం లేవగానే ఇదే మాట నేను మా అమ్మతో అని బాధపడితే వెళ్లి ఫ్రిడ్జ్ తెరువు అంది.  తెరిచి చూసాను కదా ఫ్రిడ్జ్ అంతా నా కిష్టమైన grapes, apples ఇలా అన్నిరకాల  పళ్లతో నిండి ఉంది. అంతే కాదు బిస్కెట్స్,బేకరీ ఐటెమ్స్ కూడా ఉన్నాయి అదే ఫ్రి డ్జ్ మీద.  అదిరా మీ నాన్నకు నీ మీద ప్రేమ, నువ్వుస్తున్నావని తెలిసి ఇల్లంతా నీకు ఇష్టమైన వాటితో  నింపేసాడు అని చెప్పింది. ఇప్పుడు కూడా నీ కిష్టమని ఉదయాన్నే అయితే మంచి చేపలు దొరుకుతాయి అని తీసుకు రావడానికి షాప్ కు వెళ్ళాడు  అంది. పాపం పిచ్చి నాన్న ఎవరెస్టు శిఖరమే చిన్నబోయేంత  ప్రేమ ఉన్నా బయటపడడు అంతే. 

కనీసం కాఫీ కలుపుకోవడం కూడా రాని మా నాన్న అమ్మ ఊరెళ్ళినపుడు నా కోసం ఒకసారి ఉప్మా చేసి పెట్టాడు. కానీ పాపం అన్ని తిరవాత గింజలతో పాటు మెంతులు కూడా వేసేశాడు తెలీక. మాకు మంచి చదువులు చెప్పించడానికి ఎన్ని సార్లు ఎంతెంత దూరాలు ఆటోలోనే బస్ లోనో వెళ్లకుండా, కాలినడకన వెళ్లారో లెక్క కట్టలేను. 

చిన్నప్పుడు ఆటలు పాటలలో పడి నాన్నల గొప్పతనం తెలుసుకోలేము కానీ పెద్దయ్యాక వాళ్లకు దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం ఏమిటో. వెలుగులో ఉన్నప్పటికంటే చీకటిలో ఉన్నప్పుడే కదా వెలుగు విలువ తెలుసుంటాము. 

అయినా మా నాన్న ప్రేమ గురించి నేను చెప్పింది అణువంత చెప్పాల్సింది ఇంకా కొండంత.

HAPPY FATHERS DAY నాన్న. ఈ FATHERS DAY రోజే కాదు ఎప్పుడూ తలచుకుంటూ ఉంటాను మీ గురించి. 



9 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. Nice one Pavan. For a while I just remembered my NAANA and my childhood days.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. It was one my degree friend. But our Lakshmeekar (Chinni) also faced that question from my father when we reach home at mindnight :)

      తొలగించండి