24, జులై 2016, ఆదివారం

దశాబ్దాలుగా మగజాతిని బాధిస్తున్న సీరియల్స్

అది 1999 వ సంవత్సరం

ఏం నాయనా లడ్డూ కావాలా అన్న పిలుపుతో దేవుడ్ని దీనంగా ప్రార్తిస్తున్న నేను కళ్ళు తెరిచి చూసాను

ఎదురుగా దేవుడు .. అచ్చంగా ఎన్టీవోడిలానే అందంగా ఉన్నాడు

అయ్యో లడ్డు కోసమైతే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను స్వామీ.. మా అమ్మనే అడిగితే ఇచ్చేదిగా

మరెందుకు పిలిచావ్ నాయనా

ఆ ఋతురాగాలు సీరియల్ ఆపించెయ్ స్వామి. నేనెప్పుడో ఇంటర్ చదివే రోజుల్లో మొదలైంది నా డిగ్రీ కూడా పూర్తవుతోంది అయినా ఆ రాగాలు ఆగడం లేదు

నీకేంటి నాయనా అంత ఇబ్బంది దాని వల్ల

మా అమ్మ గత మూడేళ్ళుగా ప్రతి సాయంత్రం ఆ సీరియల్ ను క్రమం తప్పకుండా చూస్తోంది దాంతో క్రికెట్ ఉన్న రోజుల్లో అయితే ఆఖరి ఐదారు ఓవర్లు మిస్సవుతున్నాం స్వామీ. మా సిల్క్ స్మిత, దివ్య భారతి లను తొందరగా తీసుకెళ్లడమే కాకుండా శ్రీదేవిని ఇక్కడెవరూ దొరకనట్లు ఆడెవడికో రాసి పెట్టి (1996) మాకు చేసిన అన్యాయానికి ఇలా అయినా న్యాయం చెయ్యి స్వామీ

సరే చింతించకు నాయనా ఆ సీరియల్ ను ఆపించేస్తాను


అది 2008 వ సంవత్సరం


నిన్ననే కదా పిలిచావ్ మళ్ళీ ఏమొచ్చింది

నిన్న ఏమిటి స్వామి ఏళ్ళు గడిచిపోయాయి ఇక్కడ .. చక్రవాకం ఆపించెయ్ స్వామి

ఇలా ఎన్ని ఆపించేసినా ఇంకో సీరియల్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది నాయనా

"జరిగేది జరగక మానదు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్" అని గీత లో ఘంటసాల గారు చెప్పినట్లు గుర్తు స్వామీ అందుకే ఇలా నా వల్ల అయినది నేను చేయాలనుకుంటున్నాను

కృష్ణుడు కదా నాయనా అలా అర్జునిడికి చెప్పింది

మాకైతే ఘంటసాల గారే చెప్పారండి కృష్ణుడు విని అదే అర్జునుడికి చెప్పి ఉండవచ్చు

నిన్ను మార్చడం ఎవరివల్ల కాదు

ఎందుకు మార్చారుగా ...

చాలు నాయనా మాట సరిదిద్దుకుంటాను .. మీ రమణ సారు వల్ల తప్ప నిన్ను మార్చడం ఇంకెవరి వల్ల కాదు.



అది 2013 వ సంవత్సరం

మళ్ళీ పిలిచావ్ ఏమైంది?

ఈ సారి మొగలిరేకులు స్వామీ

నువ్విప్పుడు బెంగళూరు లో ఉంటున్నావు మీ అమ్మ మీ ఊరిలో ఉంటోంది  ఇక ఆ సీరియల్ వల్ల ఇబ్బంది ఏమిటి నీకు?

అప్పుడెప్పుడో ఋతురాగాలు, చక్రవాకం టైం లో మా అమ్మ బారిన పడ్డాను ఇప్పుడు మొగలి రేకులు వల్ల మా ఆవిడ బారిన పడ్డానండి.

సరే అప్పుడంటే చిన్నవాడివి ఇప్పుడు పెద్దవాడివైపోయావు కదా ..  నీ ఫ్రెండ్స్ పబ్ కో క్లబ్ కో వెళ్తారు కదా వాళ్ళతో కలిసి నువ్వు వెళ్లి చావచ్చుగా నీ భార్య సీరియల్స్ చూసే టైం లో

తమలపాకులు నమిలితేనే తప్పు,  చదువు సరిగ్గా రాదు అని పెంచారు స్వామీ పెద్దవాళ్ళు అలాంటిది పబ్ కో క్లబ్ కో అంటే తప్పు కదా స్వామీ

రాజీవ్ గాంధీ కాలంలో పుట్టాల్సిన నిన్ను రాహుకాల గాంధీ సారీ రాహుల్ గాంధీ కాలం లో పుట్టించడం నా తప్పు

కదా..మరి మా ఫ్రెండ్స్ ఏంటి స్వామీ .. ఇందిరా గాంధీ కాలం లో పుట్టాల్సిన వాడినని అంటూ ఉంటారు

మీ ఫ్రెండ్స్ చెప్పిందే కరెక్ట్ అనుకుంటా నేనే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు ఉన్నాను నీ గురించి

అదంతా వదిలేయండి స్వామీ కనీసం మా ఈ. వి .వి  సత్యనారాయణ ను తొందరగా తీసుకెళ్ళి (2011) మాకు చేసిన అన్యాయానికి ఇలా ఈ మొగలిరేకులు సీరియల్ ఆపించి అయినా న్యాయం చెయ్యచ్చుగా

అలా ఆ సీరియల్ కు ఫుల్ స్టాప్ పడింది.

సీరియల్ కష్టాలు ఇక్కడితో ఆగలేదు అవి సీరియల్ గా రాస్తేనే బాగుంటుందని ఇంకో భాగం కోసం అట్టే అట్టి పెట్టా.








8 కామెంట్‌లు:

  1. మీ హాస్యం పోస్ట్ పోస్టుకీ పదునెక్కుతోంది.

    "మాకైతే ఘంటసాల గారే చెప్పారండి కృష్ణుడు విని అదే అర్జునుడికి చెప్పి ఉండవచ్చు" - నేనూ ఎప్పుడు భగవద్గీత కోట్ చేసినా ఘంటసాల అనే చెప్తా. ఆడిగితే కృష్ణుడు సంస్కృతంలో చెప్పాడు తెలుగులో మనకు చెప్పింది ఘంటసాలే కదా అనేవాడ్ని. మీ డైలాగ్ ఇరగదీసింది.

    "రాహుకాల గాంధీ" - :-)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు అలా అనేసి నా బాధ్యతను మరింత పెంచారండి చైతన్య గారు.
      థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ Chaitanya

      తొలగించండి
  2. దేవుడితో మేనేజ్ చేసి "మొగలిరేకులు" సీరియల్ 2013లో ఆపించెయ్యగలిగానని అంత సంతోషపడిపోకండి 😀😀. ఇప్పుడు 2016 లో అదే సీరియల్ మళ్ళా వెయ్యడం మొదలెట్టారని విన్నాను (నేను సీరియళ్ళు చూడను కాబట్టి "విన్నాను" అంటున్నాను) 🙁. అందువల్ల మనం propose చేసినా టీవీ వాళ్ళు dispose చెయ్యగల సమర్ధులు. ఈ రోజుల్లో వాళ్ళు సూపర్ పవర్స్ కదా.
    సీరియళ్ళు ఓ అనంతమైన హింస. దీనికి బలయ్యేది మగవాళ్ళే, ప్రారబ్ధం. "దృశ్యం" మూవీలో కేబుల్ టీవీ సర్వీస్ ప్రొవైడర్ పాత్రలో వెంకటేష్ తన అసిస్టెంట్‌తో రోజూ సీరియల్ టైముకి కనెక్షన్ తీసెయ్, సీరియల్ అయిపోయిన తర్వాత మళ్ళా కనెక్షన్ ఇయ్యి అంటాడు చూశారా ఆ పద్ధతేవన్నా పనిచెయ్యచ్చేమో. కాని ఆ ఆశా లేదులెండి, ఎందుకంటే అదే గనక జరిగితే స్త్రీలందరూ సర్వీస్ ప్రొవైడర్ ఆఫీసు మీదకి దండెత్తి వెళ్ళరూ. 🙁
    మీలో wit పుష్కలంగా ఉంది. కీపిటప్. 👏

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ నరసింహా రావు గారు.

      మళ్ళీ స్టార్ట్ చేశారా మా ఇంట్లో వాళ్లకు తెలియక పొతే చాలు. ఐతే దేవుడితో ఇంకో సెషన్ ఏర్పాటు చేయాల్సిందే.

      ఈ సీరియల్ కష్టాలు తీరేవి కావు.

      తొలగించండి
  3. Nice writing pavan...!!
    by the way Mogilirekulu is back on Gemini again...!! Hope it will cut short in 'Mini' this time....!!

    రిప్లయితొలగించండి