27, జులై 2016, బుధవారం

ఇప్పుడు డబ్బింగ్ సీరియల్స్ తోడయ్యాయి



2016 వ సంవత్సరం..అంటే నిన్నో మొన్నో


దేవుడు ప్రత్యక్షం ... ఏమయ్యా మళ్ళీ ఏమైంది...కబాలి సినిమాకి వెళ్లి బలి అయిన వాడిలా అలా మొహం పేట్టావేం


స్వామీ వచ్చేసారా .. ఈ సారి బాలిక వధూ ఉరఫ్ చిన్నారి పెళ్లి కూతురు వంతు

ఈ ఎనిమిది ఏళ్లలో సీరియల్ చూడటానికి అలవాటు పడిపోయి ఉంటావనుకున్నాను

అలవాటు పడేవాడినే కానీ ఇది వేరు స్వామీ.  ఆ సీరియల్ ఏమో హిందీ,తెలుగు, తమిళ్ బాషలలో వస్తుంది.  నా భార్యకు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషలు వచ్చు కాబట్టి అన్ని భాషల్లో చూస్తుంది. ఒక భాషలో అయితే సరే కానీ అన్ని భాషల్లో అయితే కష్టం కదా స్వామీ

అన్నీ నా! ఎందుకు అని అడగకపోయావా?

అడిగానయ్యా..మీరే వినండి ఆ రాపిడ్ ఫైర్ సెషన్ 

నేను: ఆ సీరియల్ హిందీ లో ఎందుకు  చూస్తావ్
తను: లేటెస్ట్ ఎపిసోడ్స్ హిందీ లోనే ఫస్ట్ వస్తాయి కాబట్టి 

నేను: మరి తమిళ్ లో
తను: మొదట్లో హిందీ లో కొన్ని ఎపిసోడ్ లు మిస్  అయ్యాను అందుకు

నేను: మరి తెలుగులో 
తను: ఎంతైనా మన తెలుగులో చూస్తే అదో తుత్తి అందుకు.

బాగుందయ్యా.. ఎక్కువ భాషలు తెలిస్తే ఇలాంటి ఇబ్బందులు కూడా ఉన్నాయన్నమాట. అది సరే గాని ఇప్పుడు కాలం మారింది కదా మీ ఆవిడ సీరియల్ చూస్తోంటే నువ్వు నీ ఫోన్ లో ఏదో ఒక సినిమా చూస్కోవచ్చుగా

నా ఫోన్ లో సినిమానా!

ఏం నెట్ కనెక్షన్ లేదా?

ఉన్నా లాభం లేదు స్వామి

ఏం 

నా ఫోన్ ఇది స్వామి



ఇదేదో మ్యూజియం లో ఉండాల్సిందిగా ఉందే

అవును స్వామి అడుగుతున్నారు నేనే ఇంకో పదేళ్లు వాడి ఇద్దామనుకున్నా

అంత కాసుల కక్కుర్తి ఎందుకు కొత్తది  కొనుక్కోవచ్చుగా

మా అమ్మాయికి కిండర్ జోయ్స్, షాప్కిన్స్ లాంటి టాయ్స్ కొనడానికే జీతం సరిపోవడం లేదు స్వామీ

అదీ నిజమే చాలా మంది భక్తులు నా దగ్గర మొరపెట్టుకున్నారు ఈ విషయమై. అయినా ఆ దిక్కుమాలిన I.T జాబ్ వదిలేసి టాయ్స్ షాప్ పెట్టుకో స్కూల్ దగ్గరో పార్క్ దగ్గరో తొందరగా డబ్బు సంపాదించచ్చు. సరే ఆ టాబ్ లో ఏమన్నా మూవీ చూడచ్చుగా

దాంట్లో  మా అమ్మాయి కార్టూన్స్ చూస్తూ ఉంటుంది

కనీసం ఆ laptop లో ఏ సినిమాలో చూస్తూ కాలక్షేపం చేయొచ్చుగా

పోయిన సారి ఊరెళ్ళినప్పుడు laptop బాగా దుమ్ము పట్టిపోయిందని మా బామ్మ సర్ఫ్ లో నానబెట్టింది. అప్పటినుంచి అది పలకడం మానేసింది స్వామీ

ఇలా సీరియల్స్ స్టాప్ చేస్తూ పొతే ఆడవాళ్ళ పాపం నీకు తగులుకుంటుంది నాయనా

ఆ పాపాన్ని సీరియల్స్ అయిపోవడం వల్ల రిలీఫ్ అయ్యే మగవాళ్ళ ఆశీర్వాదం బాలన్స్ చేస్తుందిలెండి స్వామీ. మా బాపు రమణ ను మా నుంచి దూరం చేసినందుకైనా ఈ సాయం చేయండి స్వామీ

సరే నాలుగు సార్లు పిలిచావ్ ఇప్పటికే .. ఇక మళ్ళీ మళ్ళీ పిలవకు ..ఈ సారికి ఆ సీరియల్ అయిపోయేలా చూస్తాను

అలాగే స్వామి .. ఇంకో సీరియల్ స్టార్ట్ అయి అది ఏళ్ళ తరబడి సాగి నేను దాని బారిన పడేసరికి ముసలాడిని అయిపోయి పడక్కుర్చీలో కూర్చొని రిటైర్ అయిన మిగతా మగాళ్లలా నేనూ సీరియల్స్ చూడటం అలవాటు చేసుకుంటానులెండి స్వామి

P.S  బాలిక వధూ సీరియల్కి ముగింపు ఇస్తున్నారన్న వార్త విని అల్లిన పిచ్చి పోస్ట్

2 కామెంట్‌లు:

  1. హిందీలో ఇప్పుడు ముగిసినా ఆ ముగింపు తెలుగుడబ్బింగులో కనిపించేందుకు మరికొన్నేళ్ళు పడుతుంది కదా! ఒకవేళ ఆ ఇనపరేకులు సీరియల్లాగు తెలుగుడబ్బింగు బాదుడు ప్రేక్షకుల కోరికపై పునఃప్రసారం అంటూ మళ్ళా వెంఠనే మొదలైనా కావచ్చునన్నది మర్చిపోతున్నారు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. instant రిలీఫ్ దొరికినా చాలండి శ్యామలీయం గారూ అల్ప సంతోషులం

      తొలగించండి