17, ఏప్రిల్ 2017, సోమవారం

బానిస వీరుడు - లోహ మార్పుడు

నేనోదో నా పాటికి లాప్టాప్ లో 'నా ఒరు సిరిక్కి సంసారిక్కినుం' అనే ఒక అద్భుతమైన రొమాంటిక్ కంగాళీ మళయాళ సినిమా చూసేసి  'బానిస వీరుడు' అనే  తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమా చూద్దామనుకుంటుంటే 'ఉన్నావా పోయావా' అన్న మాట వినపడింది.

ఎవరా అని చుట్టూ చూస్తే ఎవరూ కనపడలేదు

నేనోయ్ నీ బ్లాగ్ ని ..మంకీ కి మొబైల్ దొరికినట్లు నేను నీకు దొరికి చచ్చాను. నువ్వేమిటి ఈ మధ్య మరీ నల్ల పూస అయిపోయావ్, ఇటు వైపే రావట్లేదు అంది 

వెన్నపూసలా తెల్లగా ఉండేవాడిని ఎండలు కదా నల్ల పూస అయ్యుంటాను. 

నీ చెత్త వెటకారం ఏడ్చినట్లే  ఉంది కానీ నీ పాటికి నువ్వు నన్ను ఓపెన్ చేసి వారాల తరబడి అలా ముట్టుకోకుండా వదిలేస్తే ఎలా..ఎదో ఒక పోస్ట్ రాయొచ్చుగా. 

కాస్త పనుల్లో బిజీ గా ఉండి సమయం లేక.  

సమయం లేకా? విషయం లేకా?

విషయాలకేం ఇంకో 20 పోస్ట్స్ రాయడానికి సరిపడా కంటెంట్ ఉంది నా దగ్గర.  పోస్ట్ రాయాలనుకుంటే ఇప్పటికిప్పుడు ఒక గంటలో రాసి పోస్ట్ చేసేయగలను అది నా సత్తా. 

నీలాగే పూరి జగన్నాథ్ కూడా 20 సినిమాలకు కావాల్సిన కథలు నా దగ్గరున్నాయ్, తలచుకుంటే రెండు నెలలకో సినిమా తీసే సత్తా ఉందంటూ బీరాలు పలికి 'రోగ్' లాంటి చెత్త తీసాడు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు వాళ్ళ గురువు వర్మ గారు కూడా నిన్న మొన్నటి వరకు లెక్కలేనన్ని చెత్త సినిమాలు తీసేసి మళ్ళీ బాలీవుడ్ కి వెళ్లిపోయారు. అది సరే గానీ సినిమా అంటే గుర్తొచ్చింది తప్పని సరి తద్దినానికి వెళ్ళొచ్చావా లేదా?

ఏది కాటమ రాయుడు సినిమా గురించేనా? వెళ్లాను. 

మరి కనీసం ఆ రివ్యూ రాసి పోస్ట్ చేయొచ్చుగా

చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకు అని వదిలేశా .. అదీ గాక సినిమా రిలీజ్ అయిన వారం దాకా రివ్యూ రాయకపోతే మంచిది, సినిమాలు లాభపడతాయ్ అని రజినీ కాంత్ గారు అన్నారుగా ఆయన మాటకు విలువ ఇద్దామని. 

అబ్బో నీకూ, నాకు అంత సీన్ ఎక్కడ ఏడ్చి చచ్చిందిలే గానీ కనీసం పది మందికి పనికొచ్చే విషయం గురించైనా రాయొచ్చుగా..ఎప్పుడూ పనికి మాలిన విషయాలు తప్ప పనికొచ్చే విషయం ఒక్కటైనా రాశావా?

ఎందుకు రాయలేదు..గొంగళి పురుగు సీతాకోకచిలుక గా పరివర్తనం చెందినట్లు పవన్ అనబడే నేను చిరంజీవి అభిమానిగా ఎలా మారానో యెంత inspiring గా రాసానో గుర్తు లేదా?

అవి కాదు  ఉపయోగపడే విషయాలంటే. దేశం లో ఉండే పేదరికం eradicate చేయడమెలా? బర్నింగ్ ఇష్యూష్ మీద ప్రజలను educate చేయడమెలా అన్నవి పనికొచ్చే విషయాలంటే. అదెలాగూ నీకు చేతకాదు కానీ కనీసం చూసిన ఒక ప్రదేశం గురించైనా, చదివిన ఒక మంచి పుస్తకం గురించైనా నలుగురికీ తెలిసేలా రాయొచ్చుగా. 

రాద్దామనే అనుకుంటున్నాను అందుకే కెమిస్ట్రీ పుస్తకాలన్నీ ఎక్కడ దొరుకుతాయో అని గూగుల్ లో ఎంక్వయిరీ చేస్తున్నా. 

కాస్తో కూస్తో బుర్ర షార్ప్ గా ఉండే స్కూలు, కాలేజీ టైం లోనే ఆ కెమిస్ట్రీ అర్థం కాక చదవలేదు.లోకేష్ బుర్రతో తో పోటీ పడటానికి రెడీగా ఉంది నీ బుర్ర, ఇప్పుడెందుకు  దాన్ని కష్టపెట్టాలనుకుంటున్నావ్?

మొన్నొకసారి 'ఏమిటి పవనయ్యా దీర్ఘ0గా ఆలోచిస్తున్నావ్' అని నా  friend సుబ్బు అడిగితే 'యేమీలేదు  జీవితం లో ఏది సాధించలేక పోతున్నాను అందుకే గిల్టీ ఫీలింగ్ కలుగుతోంది' అంటే ఇందులో ఆలోచించడానికేముంది  'ఆల్ కెమిస్ట్రీ ' చదువు నీ గిల్టీ ఫీలింగ్ పోతుంది అని చెప్పాడు. అందుకే  కెమిస్ట్రీ పుస్తకాల కోసం ఈ వెదుకులాట. 

తెలివి తెల్లారినట్లే ఉంది అది 'ఆల్ కెమిస్ట్రీ ' అయుండదు.

'నాలాగ డబ్బింగ్ జోలికి పోకుండా అన్ని భాషల్లోని జీవిత సత్యాలన్నీ రుబ్బింగ్ మిషన్ లో రుబ్బేసి మరీ తాగి శుభ్రంగా జీర్ణించుకున్న మా చార్మింగ్ చబ్బీ సుబ్బు చెప్పిన దాంట్లో తిరుగులేదు'.  (రుబ్బింగ్ మిషన్ - గ్రైండర్ కు తెలుగు అనువాదం.. ప్రాస కోసం ప్రయాస..మన్నించాలి)

అయితే అది 'ఆల్ కెమిస్ట్రీ ' అయుండదు alchemist అయుంటుంది తాను సరిగ్గానే చెప్పి ఉంటాడు నీకలా అర్థం అయుంటుంది. ఖర్మ! అందుకే అన్నాను నేను నీ చేతిలో పడటం కోతికి కొబ్బరి కాయ దొరికినట్లే అని . డిక్షనరీ చేతిలో ఉంటే తప్ప ఇంగ్లీష్ అర్థమయి చావదు నీకు, అలాంటిది ఆ ఇంగ్లీష్ బుక్ చదవడం అవసరమా?

సరేలే అయితే 'లోహ మార్పుడు' దొరుకుతుందేమో ప్రయత్నిస్తా 

మళ్ళీ ఈ అర్థం కాని 'లోహ మార్పుడు' ప్రయత్నమేమిటి  విక్రమూర్ఖ మహాశయా!

alchemist ఇంగ్లీష్ బుక్ కి తెలుగు డబ్బింగ్ 'లోహ మార్పుడు' పేరు తోనే చేసి ఉంటారు కదా అందుకు. 

తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సినిమాలు చూసిన తెలివి ఎక్కడికి పోతుంది ... 'పరుసవేది' అని వెదికి చావు అదే తెలుగు అనువాదం ఆ పుస్తకానికి. అలాగే 'సందులో సుందరి -గొందులో బందరి', 'రహస్య వీరుడు- అసహ్య శూరుడు' లాంటి డబ్బింగ్ సినిమాలు చూడటం మానెయ్. అవే కాదు ఆ కాటమ రాయుడు లాంటి సినిమాలు avoid చెయ్యి, దానికి తోడు ఆ 'మిస్టర్' సినిమా కూడా చూసినట్లున్నావ్ పూర్తిగా మతి గతి తప్పినట్లుంది . అయినా ఆ మెగా ఫామిలీ కి నువ్వేమైనా కట్టప్పవా?తరతరాలకు  అభిమాన బానిసత్వం చేస్తున్నావ్? చిరంజీవి అంటే అభిమానం అన్నావ్ బాగుంది.  తమ్ముడు, కొడుకు, మేనల్లుడు అంటూ వచ్చే వారినందరిని అభిమానించడమేమిటి? రేపు చిరంజీవి మనవడు హీరో గా వచ్చినా అభిమానిని అంటూ వాళ్ళను తలకెక్కించుకుంటావ్ కట్టప్పలా. దీనికి అంతు పొంతు లేదా?

దాని గురించి చెప్పాలంటే ఇంకో పోస్ట్ అవుతుంది ...అయినా నేనిప్పుడు 'బానిస వీరుడు' అనే సినిమా చూడాలి ఇంకోసారి రాపో తీరిగ్గా మాట్లాడుకుందాం.

చూడు ఇంత చెప్పినా మళ్ళీ ఇంకో డబ్బింగ్ సినిమా చూస్తా అంటున్నావ్.  అలా డబ్బింగ్ సినిమాలు చూస్తే అందులోని ఒరిజినాలిటీ మిస్ అవుతావ్. అది సరే నీకు తెలుగే సరిగ్గా వచ్చి చావదు, ఆ మలయాళం ఎలా అర్థమవుతుంది డబ్బింగ్ కాకుండా ఒరిజినల్ చూస్తున్నావ్?

భావం అర్థమవ్వాలంటే లాంగ్వేజ్ ముఖ్యం కానీ జింరిజ్ఝయ్ అర్థం కావడానికి భాష ముఖ్యం కాదు. నీకు చెప్పినా అర్థం కాదు నన్ను విసిగించకుండా వెళ్ళిపో అన్నాను. 

ఈ పోస్ట్ చదువుతున్న వారిలో ఎవరైనా 'నా ఒరు సిరిక్కి సంసారిక్కినుం' అనే రొమాంటిక్ కంగాళీ మళయాళ సినిమా కోసం అలాగే 'జింరిజ్ఝయ్' అర్థం కోసం ఈ పాటికి ఎవరైనా గూగుల్ ను ఆశ్రయించి వుంటే  నాకు, అలాగే భజన బృందాలతో భావి ముఖ్య మంత్రి గా కీర్తింపబడుతున్న చినబాబు లోకేష్ కు మధ్య తెలివితేటల విషయంలో 'అక్టోబర్ 2 వ తేదీ గాంధీ వర్ధంతి' రోజున జరగబోయే పోటీలో మీరు కూడా పాల్గొనచ్చు. 

మొన్న రాత్రి, నా మిత్రుడు కాలేజీ రోజుల్లో రూమ్మేట్ అయిన సుబ్బు తో మాట్లాడుతున్నప్పుడు alchemist అనే పుస్తక ప్రస్తావన వచ్చింది. ఆ పాయింట్ ను బేస్ చేసుకొని అతిశయోక్తులు,సెటైరులు ,సెట్యూబులు అనబడే మసాలా లాంటివి పూసి, కాసిన్ని సమకాలీన విషయాల్లాంటి పోపు గింజలు జత చేసి తాలింపు వేసి ఒక పోస్ట్ రాయగలనా అని నాకు నేను ఒక చిన్న టెస్ట్ లాంటిది పెట్టుకొని రాసిన పోస్ట్ ఇది. మీకు నచ్చినట్లైతే సంతోషం లేదంటే మీ టైం వేస్ట్ చేసినందుకు క్షమాపణలు. 

6 కామెంట్‌లు:

 1. పూరి జగన్నాధ్ చేస్తున్నది వ్యాపారం. మీరు రచనావ్యవసాయం చేస్తున్నారు. అందుకని వెనుకంజ వెయ్యక్కరలేదు. వ్రాత బాగోపోతే ఎవ్వరు కామెంటరు. అంతేకదా! ముఖ్యంగా, లోహమార్పిడి, అభిమాన బానిసత్వం, చినబాబుతో పోటీ పరీక్ష బావున్నాయి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ ఎంకరేజిమెంట్ అన్యగామి గారు.

   తొలగించండి
 2. Very good narration and funny article.

  October 2nd is 'Gandhi Jayanti' Just correct that in the post.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ హరీష్ గారు.

   అది mistake కాదండి. లోకేష్ గారి మీద వేసిన Satire లో భాగం. మొన్నామధ్య అంబేద్కర్ జయంతి రోజు 'అంబేద్కర్ వర్ధంతి' అని పలికి నవ్వులపాలయ్యాడు. అందుకే నేను అలా రాయవలసి వచ్చింది.

   నిన్నటికి నిన్న ఒక సభలో మాట్లాడుతూ 'తాగునీటి సమస్య సృష్టించడమే తన లక్ష్యం' అని అన్నారు. చినబాబు గారు బాగా వీక్ అనుకుంటా తెలుగులో. అందుకే ఇన్ని పొరపాట్లు చేస్తున్నట్లున్నారు.

   తొలగించండి
 3. పవన్‌గారు: మీ పోస్టులన్నిటిలో నాకు బాగా నచ్చిన పోస్టిది.
  గుంటూరులో మా ఇంటిముందు "జయలక్ష్మి రుబ్బింగ్‌మిషన్" వుండేది - నిజ్జంగా!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరు చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు లలిత గారు. నిజంగా షాప్ కి అలాంటి పేరు వినడం ఇదే మొదటి సారి : )

   తొలగించండి