వచ్చీరాని మాట వరహాల మూట అన్నట్లు ముద్దు ముద్దు గా ముద్ద ముద్ద గా మాట్లాడటం మొదలెట్టాడు మా బుడ్డోడు. ఊరీ ఊరని ఊరగాయ లాగా వచ్చీరాని మాటలతో వాడు మాట్లాడుతుంటే ముచ్చటేస్తోంది. మునుపు ఆస్తమానూ చేతి వేళ్ళు నోట్లో పెట్టుకునేవాడు ఇప్పుడు కొంత ఇంప్రూవ్మెంట్ కనిస్పిస్తోంది చేతి వేళ్ళు పెట్టుకోవడం మానేసి అందుతున్నాయి కదా అని కాలి వేళ్ళు పెట్టుకుంటున్నాడు :)
క్రిస్మస్ సందర్బంగా మా బుడ్డోడిని ఇదిగో ఇలా శాంటా గా మార్చేశాము.
మొన్నా మధ్య అనుకోకుండా 'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమా పాటలు విన్నాను, చాలా బాగున్నాయి పాటలు. థాంక్స్ టు ది మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ ఫర్ ది బెస్ట్ ఆల్బం. ఆ సినిమా కాన్సెప్ట్ కూడా వెరైటీ గా ఉంది, ఈ వారం రిలీజ్ అవుతోందని తెలిసి వెళదాం అని అనుకున్నాను కానీ ఇక్కడికి తీసుకురాలేదు. ఇక్కడికి కాస్త పెద్ద హీరోల సినిమాలు మాత్రమే తెస్తారు. కానీ అప్పుడప్పుడు "పెళ్లిచూపులు" లాంటి మంచి సినిమా కూడా సిడ్నీ లో ప్రదర్శిస్తారు.
ఒక సీనియర్ సిటిజెన్ గారి సినిమా రాబోతోంది సంక్రాంతికి. అప్పుడే 3 పాటలు కూడా రిలీజ్ చేశారు. ఒక మెలోడీ సాంగ్ తప్పితే మిగతావన్నీ మాస్ మసాలా సాంగ్ లే. 'అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు' పాట లో అయితే ఆ సీనియర్ సిటిజెన్ గారిని 'పిల్లడూ' అని సంబోధించడం నవ్వొచ్చే విషయమే. దేవిశ్రీ దానిని జనతా గారేజ్ సినిమాలో ఎన్టీఆర్ కు వాయించాలనుకున్న పాట అట.
ధృవ సినిమాకు వెళ్ళినప్పుడు టైటిల్ సాంగ్ లో 'ఐ హావ్ ఎ డ్రీం' అని ఒక నాయకుడు స్టేజి మీద మాట్లాడటం చూపిస్తారు. ఎవరతను అని ఫ్రెండ్స్ ని అడిగాను కానీ తెలియదని చెప్పారు ఆ తర్వాత గూగుల్ లో వెదుకుదాము అనుకున్నాను కానీ మర్చిపోయాను. నిన్న ఒక న్యూస్ పేపర్ లో లీడర్స్ గురించిన ఆర్టికల్ చదివినప్పుడు relate చేసుకోగలిగాను అతను అమెరికన్-ఆఫ్రికన్ హక్కుల కోసం పోరాడిన ఉద్యమ కారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా అని. ఆ ఆర్టికల్ లో అలాంటి లీడర్ల పక్కన మన రాజన్న(రాజ శేఖర్ రెడ్డి) కు కూడా చోటిచ్చారు. ఈ పాటికే మీకు అర్థం అయి ఉంటుంది అది ఏ పత్రికో.
'అమ్మ' కు భారత రత్న, నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారట. మన 'అన్న' గారు చనిపోయినప్పుడు కూడా భారత రత్న ఇవ్వాలని డిమాండ్స్ వినపడ్డాయి గాని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదు. ఓట్ల అవసరం పడ్డప్పుడు మాత్రం మన బాబు గారు ఈ డిమాండ్ వినిపిస్తారు. చూడాలి మరి భారత రత్నజయలలిత గారికి కట్టబెడతారో లేదో.
సిడ్నీ లో ఒపేరా హౌస్ దగ్గర న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్బంగా ఫైర్ వర్క్స్ అద్భుతంగా ఉంటాయి. అది చూడాలనుకునే వాళ్ళు జంకాణాలు, కావలసిన డేరాలు, పేకముక్కలు తీసుకొని తెల్లవారు జాము నుంచే ప్లేస్ రిజర్వు చేసుకుంటారు . ఈ సారి ఆ సెలెబ్రేషన్స్ చూడాలి అనుకుంటున్నాం చూడాలి ఇద్దరు పిల్లలతో వెళ్లి చూడటం వీలవుతుందో లేదో.