26, నవంబర్ 2019, మంగళవారం

పొరుగింటి పుల్లగూరకు కాస్త పులుపెక్కువైంది

మూడేళ్ళ క్రితం మణిరత్నం కాఫీ తాగుతూ దేని గురించో ఆలోచిస్తూ ఉన్నారు. 

"ఇంతకీ ఏదైనా  కొత్త సినిమా తీసే ఆలోచనలో ఉన్నారా?" అడిగింది సుహాసిని. 

కథ ఏమి తట్టట్లేదు అందుకే ఆలోచిస్తున్నా.  

ఓకే బంగారం లాంటి ట్రెండింగ్ యూత్ స్టోరీస్ తియ్యండి మళ్ళీ రామాయణం, మహాభారతం జోలికి వెళ్లకుండా.  

ఇంతలో T.V లో పాట వస్తోంది. ఆ పాట అయిపోగానే సుహాసిని గారు పిలుస్తున్నా పట్టించుకోకుండా రూంలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. 

ఆ తరువాత ఒక కథ రాసుకొని 'చెలియా' అనే సినిమా తీశాడు. ఆ సినిమా తీయడానికి టీవీ లో చూసిన ఆ పాటే ఇన్స్పిరేషన్ ఇచ్చింది.

ఆ పాట ఏంటంటే తను మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆయనే తీసిన 'సఖి'  సినిమా లోని 'కలలై పోయెను నా జీవితం' అనేది.  ఆ పాట లో హీరోయిన్ ని వెతుక్కుంటూ హీరో వెళ్ళి చివరికి ఎక్కడో మెడికల్ క్యాంపు లో ఉన్న తనను కలుస్తాడు.

ఇక 'చెలియా' సినిమా కూడా అంతే, ఆర్మీ బ్యాక్ డ్రాప్ పెట్టేసి హీరోయిన్ తో గొడవ పడిన హీరో  చివరకి ఆమెను వెతుక్కుంటూ వెళ్లి ఎక్కడో మెడికల్ క్యాంపు లో కలుస్తాడు. ఆయన అన్ని సినిమాల్లో లాగానే హీరోయిన్ ని అద్భుతంగా చూపించారు కానీ మొహం మీద మీసాలు లేని కార్తీ ని చూడటమే కాస్త ఇబ్బందిగా అనిపించింది.  సినిమా మరీ బాలేదా అంటే బాగుంది అది కూడా హీరో హీరోయిన్ లవ్ స్టోరీ వరకే ఆ తర్వాతంతా బోర్. ఈ మధ్య మణి గారి సినిమాలంటే భయం వేస్తోంది చూడాలంటే, అంత చెత్తగా ఉంటున్నాయి మరి ఆయన ఈ మధ్య కాలంలో తీసిన ఓకే బంగారం మూవీ మాత్రం ఇంకా చూళ్ళేదు. అదెలా ఉందో చూడాలి.

జనతా హోటల్ అనే మళయాళ డబ్బింగ్ సినిమా కూడా చూశాను. ఏదో అప్పట్లో జనతా గ్యారేజ్ సినిమా వచ్చిన టైములో ఏదో ఆ టైటిల్ కలిసి వచ్చేట్లు పెడితే కాస్త క్రేజ్ వస్తుంది అనుకొని జనతా హోటల్ అని పెట్టి ఉంటారు అనుకొని ఆ సినిమా వైపు చూడలేదు. మొన్న ఏ సినిమా దొరక్క ఆ సినిమా చూశాను యు ట్యూబ్ లో. 

ఆ సినిమాలో నాకు ముందుగా నచ్చిన విషయం మ్యూజిక్. ఆ మ్యూజిక్ వింటున్నంతసేపు నాకు బాగా నచ్చిన సినిమా అయిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' గుర్తుకు వస్తూనే ఉంది. సరే ఆ రెంటిలో ఏ సినిమా మ్యూజిక్ ఒరిజినల్ అయి ఉండచ్చు అని గూగుల్ లో గాలిస్తే రెంటికీ గోపి సుందరే మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసింది.  గోపి సుందర్ మలయాళం సినిమా అయిన 'ఉస్తాద్ హోటల్' లోని background మ్యూజిక్ నే 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లో చాలా వరకు రిపీట్ చేసాడు అని అర్థమైంది రెండింటిలోనూ ముస్లిం ఫామిలీ background ఉండటం ఒక కారణం కావచ్చు. నాకు ఆ రెండు సినిమాలు నచ్చడానికి కథ ఒక కారణం అయితే రెండోది పాటలు, background మ్యూజిక్. మూడోది అందులో నటించిన నటీనటులు. ఆ సినిమా చూశాక అర్రే, ఇన్ని రోజులు జనతా హోటల్ లాంటి మంచి సినిమా మిస్ అయ్యానే అనిపించింది. 

గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన సినిమాలేవి అని నెట్లో వెదికితే అందులో చాలా వరకు ఈ మధ్య కాలంలో  నేనెప్పుడూ వినే పాటలు, నాకు నచ్చిన పాటలు అతను కంపోజ్ చేసినవే అని తెలిసింది. అందులో కొన్ని మజ్ను, నిన్ను కోరి, ఊపిరి, మజిలీ, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు లోని సినిమా పాటలు. 

ఒకే సంవత్సరంలో 25 సినిమాలకు సంగీతం అందించిన ఘనత కూడా ఉందట ఇతని ఖాతాలో. 

ఇక నేను రుచి చూసిన పొరుగింటి పుల్లగూరలో బాగా పులుపు ఎక్కింది jackpot అనబడే మరొకటి. జ్యోతిక, రేవతి ప్రధాన పాత్రల్లో వచ్చిన కామెడీ యాక్షన్ సినిమా. యాక్షన్ అని ఎందుకు అన్నానంటే రెగ్యులర్ తెలుగు, తమిళ హీరోల్లాగానే జ్యోతిక కూడా విపరీతమైన బిల్డప్ లతో ఫైట్స్ చేస్తుంది కాబట్టి. మైండ్ లెస్ కామెడీ అంటారు కదా అలాంటి సినిమా ఇది. మొదటి సగం కాస్త కామెడీ గా బానే ఉంటుంది రెండో సగం బాగా సాగదీయడంతో నీరసం వచ్చేస్తుంది. సగం సినిమా చూసేసి మిగతాది చూడకపోవడం బెటర్ మన F2 సినిమా లాగా. 

18, నవంబర్ 2019, సోమవారం

ఈ పాపం ఎవరిది? - అక్కడా ఇక్కడా విన్న మంచి కథలు

అనగనగా అదేదో ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని ఏలే రాజుగారికి ఏడుగురు కొడుకులు ...  ఉన్నారో లేదో నాకు తెలీదు కానీ ఉన్నదంతా ఊరోళ్ళకు పంచిపెట్టే టైపు. అందువల్ల  ప్రతీ రోజూ పేదవాళ్లకు అన్నదానం చేసేవారు. 

ఒక  రోజు మధ్యాహ్నం భోజనం వండి వడ్డించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.  అదే  సమయం  లో   ఆకాశం  లో  ఒక  గద్ద కాళ్ళతో  ఒక పాముని పట్టుకొని గాల్లో  ఎగురుతూ వెళ్తోంది.  ఆ  పట్టుకున్న  పాము  నోటి నుండి జారిన  విషం  వడ్డించడానికి  సిద్ధంగా  ఉన్న  అన్నం మీద  పడింది  .  అది  ఎవరూ  గమనించలేదు. ప్రతీ మెతుకు మీద తినబోయే వారి పేరు ఉంటుంది అంటారుగా ఆలా ఆ విషం పడ్డ మెతుకులమీద ఒక పేద బ్రాహ్మణుడి పేరు రాసి ఉందేమో మరి, ఆ భాగం  తిన్న ఆ  పేద బ్రాహ్మణుడు  చనిపోయాడు.  

ఈ  వార్త  రాజుగారికి  చేరింది.   ఆయన  చాలా   దుఃఖించాడు .   మేలు  చెయ్యబోతే   ఇలా  కీడు  జరిగింది  అని  ఆయన   చింతించాడు. పిల్లిని చంపిన పాపమే గుడి కట్టించినా పోదు అంటారు అలాంటిది నా వల్ల ఒక బ్రాహ్మణుడే చనిపోయాడు. దానికి తోడు పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి అంటారు కాబట్టి ఈ పాపం నాకు మాత్రమే చుట్టుకుంటే పర్లేదు, నా రాజ్యానికి కుటుంబానికి వంశానికి చుట్టుకోకుండా చూడు తండ్రీ అని దేవుడిని వేడుకున్నాడు.   

పైన అకౌంట్స్ రాసుకునే చిత్రగుప్తుడికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ  బ్రాహ్మణుడు  చనిపోవడానికి  కారణం  ఎవరు ?

విషం వదిలిన పామా ? 

లేక పాముని పట్టుకున్న గద్దా ? 

రాజా ? 

వంట చేసిన మనిషా ?    

వడ్డించిన  వ్యక్తా ?  

మరి ఈ  పాపాన్ని ఎవరి అకౌంట్ లో వెయ్యాలి ? 

కావాలని  ఎవరూ   ఆ  బ్రాహ్మణుడిని   చంపలేదు.

అందుకని అతని మేనేజర్ అయిన యమ  ధర్మరాజును  అడిగాడు.  ఆయనకు కూడా అది భేతాళ ప్రశ్న లాగే అనిపించింది. సరే కాస్త అలోచించి చెప్తాను అని అందరు మేనేజర్స్ లాగే అప్పటికి తప్పుకున్నాడు.  

మర్నాడు దారిన  పోతున్న బ్రాహ్మణులు  కొందరు  అన్నదానం  జరిగే  చోటును  చెప్పమని  అక్కడున్న సూర్యకాంతం ని అడిగారు .  

ఆవిడ వారికి  దారిని  చూపుతూ  “ బాబూ !   జాగ్రత్త  మా  రాజు  గారికి బాపనోళ్ళు అంటే పడదు.  నిన్ననే  ఒకాయనను  విషం  పెట్టి  చంపించేశారు. మీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయే రోజులు దగ్గర పడ్డాయేమో ఆలోచించుకొని వెళ్ళండి నాయనా? ఊపిరుంటే ఉప్పయినా అమ్ముకొని బతకచ్చంటారు, ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అని ఆ రోజుకు తన కడుపు నింపుకుంది  ఖాళీ కడుపులతో ఉన్న బ్రాహ్మణుల మనస్సుల్లో అనుమానాలు మొలకెత్తించి. 

వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు అనిపించిన ధర్మరాజు గారు “చిత్రగుప్తా! యాదృచ్చికంగా ఏదైనా జరిగినప్పుడు దానిని ఉద్దేశ పూర్వకంగా ఆ వ్యక్తులు చేయనప్పుడు అనవసరంగా ఆ వ్యక్తులకు అంటగట్టి, వారిని నిందించే  వారికే ఆ  మొత్తం  కర్మ  ఫలం చెందాలి అని  శాస్త్రాలు చెబుతున్నాయి అదే ధర్మం కూడా, కాబట్టి మొత్తం  పాపం  అంతా  ఆమె అకౌంట్ లో వెయ్యి”  అన్నారు.

మొత్తానికి నీతి ఏమిటంటే అనవసరంగా ఇతరులపై బురద చల్లడానికి ప్రయత్నించకండి అది మీ నెత్తి మీదే పడచ్చు అని.  దీనినే కర్మ ఫలం అదీ ఇదీ అంటారు కాస్త ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు, వేదాలు అవీ తిరగేసిన వారు.

P.S: పాత సినిమాల్లో ఏదైనా గయ్యాళి భార్య లేదా గయ్యాళి అత్త  లాంటి పాత్ర ఉంటే వారు గయ్యాళి అని చూపెట్టడానికి అనవసరంగా రెండు మూడు  సీన్స్ పెట్టాలి దానికో రీల్ వృధా ఖర్చు ఎందుకని ఆ పాత్రకు సూర్యకాంతాన్ని తీసుకునేవారట. ఆల్రెడీ ఆవిడ అలాంటి పాత్రలు ఎన్నో సినిమాల్లో చేసింది కాబట్టి ఆవిడని తెర మీద చూడగానే ఈ పాత్ర గయ్యాళి పాత్ర లేదంటే చాడీలు చెప్పే పాత్ర అని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు కాబట్టి. అందువల్ల నేను కూడా సూర్యకాంతం అనే పేరుని వాడాను తప్పితే ఆ పేరు గల (ఎవరైనా అలాంటి పేరు గల వాళ్ళు ఈ పోస్ట్ చదువుతుంటే..ఛాన్స్ ఉండకపోచ్చు ఒక వేళ ఉంటే ) వాళ్లను కించపరచాలని కాదు. 

13, నవంబర్ 2019, బుధవారం

అవ్వా బువ్వా రెండూ కావాలంటే మాత్రం కుదరదు

ఎప్పుడూ సినిమాలు, సరదా కబుర్లే కాకుండా ప్రస్తుతానికి వార్తల్లో బాగా నలుగుతున్న 'ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు' అనే కాన్సెప్ట్ మీద నా అభిప్రాయం రాద్దామనుకున్నాను. ఈ ఇంగ్లీష్, తెలుగు మీడియం చదువుల డిబేట్ ఎప్పటికీ తీరేది కాదు కానీ నా స్టాండ్ అంటూ ఒకటి ఏడ్చి ఉంటుంది కదా అది రాద్దామని ఈ ప్రయత్నం.  ఇలాంటి టాపిక్స్ 'నా కప్ అఫ్ టీ' కాదు అని నాకు తెలుసు కానీ ఏదో రాద్దామని చిన్న ప్రయత్నం అంతే

'దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ'  అని ఒక సారి సినిమా హీరో నాగార్జున T.V ఇంటర్వ్యూ లో అన్నాడు. దాని అర్థం ఏమిటన్నది తెలీదు కానీ అబ్బో వీడికి భలే ఇంగ్లీష్ వచ్చన్నమాట అని నా మిత్రులంతా అనుకునేవారు. మీ చిరంజీవి ఒక్క సారన్నా ఇంగ్లీష్ మాట్లాడాడా అని వాళ్ళు మమ్మల్ని దెప్పి పొడిచేవారు. ఈ విషయం లో మేము ఏమీ మాట్లాడలేకపోయాం. అంటే అర్థం ఏమిటి తెలుగు వచ్చిన వాడికంటే ఇంగ్లీష్ వచ్చిన వాడికే మనం అట్ట్రాక్ట్ అవుతాం అని

కాబట్టి నా ప్రియాతి ప్రియమైన తెలుగు అభిమానులారా, ఎక్కువ మంది ప్రజలు అమ్మ పాల లాంటి  తెలుగు కంటే ఎంగిలిపీసు అయినా ఇంగ్లీష్ వైపుకే కాస్త ఎక్కువ మొగ్గు చూపుతారు అని నా ఉద్దేశం.  నా వరకు నేను చెప్పొచ్చేది ఏమిటంటే అన్ని సబ్జక్ట్స్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండి తీరాలి, అలాగని మాతృ భాషను తక్కువ చెయ్యాలని కాదు కానీ తెలుగు కూడా కంపల్సరీ సబ్జెక్టు గా పెట్టాలి. అది కూడా  ఏదో మొక్కుబడి కోసం సంస్కృతం సబ్జెక్టు పెట్టినట్లు కాకుండా. కుండ లో ఉండే కూడు అట్టాగే ఉండాలి, పిల్లాడు మాత్రం గుండులా తయారు కావాలి అంటే కుదరదు. తెలుగు మీడియం ను పక్కకు తోసేసి, తెలుగును మాత్రమే ముందుకు తీసుకెళ్లాలి, వాటితో పాటు మిగిలిన సబ్జక్ట్స్ ఇంగ్లీష్ లో భోదించాలి. 

మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభ చాటాలంటే ఖచ్చితంగా మొక్కగా ఉన్నప్పుడే ఇంగ్లీష్ అందిస్తూ ఉండాలి, మాను అయిన తర్వాత అందించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. మొక్క, మాను చీప్ తెలుగు వర్డ్స్, ఎవడికి అర్థమవుతాయి ఈ కాలంలో నా పిచ్చి కాకపోతే. 

ఏం, నిజ్జంగా సర్కార్ స్కూళ్ళలో చదువుకొని అంతర్జాతీయంగా తమ సత్తా చాటిన వాళ్ళు లేరా అని అనొచ్చు కానీ వారి సంఖ్య కూడా వేళ్ళ మీద లెక్క పెట్టగలిగేటంత మాత్రమే అన్నది అక్షరాలా నిజం. 

చిన్నప్పుడు గవర్నమెంట్ బడుల్లో చదువుకున్నాను కాబట్టి ఆ అనుభవాలతో చెప్తున్నాను. సైన్స్, మ్యాథ్స్ లాంటి సబ్జెక్టులన్నీ తెలుగులో చదివి పౌనపున్యం, ఆరోహణ, అవరోహణ, కూడికలు, తీసివేతలు, గుణింతాలు, భాగహారాలు, కక్ష్య, భూపరిభ్రమణం, వైశాల్యము, విస్తీర్ణం, లంబ కోణం అని చదువుకున్నాను, ఆ తర్వాత కాలేజీ రోజులకు వచ్చాక తర్వాత వాటిని ఇంగ్లీష్ లో ఏమంటారో సరిగ్గా తెలీక ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన కుర్రాళ్లతో మాట్లాడేప్పుడు కొన్ని సార్లు ఎన్నో విషయాలు తెలుగులో తెలిసి ఉండీ వాటిని ఇంగ్లీష్ లో ఎలా వ్యక్తీకరించాలో తెలీక ఊరుకుండిపోయాను. 

డిగ్రీ  వరకు తెలుగు మీడియం లో చదివి,  ఒక్కసారిగా M .C. A ఇంగ్లీష్ మీడియం అంటే బాగా ఇబ్బందిపడ్డాను. అందులోనూ కంప్యూటర్ ఆర్గనైజషన్ అని ఒక బుక్ ఉండేది, అందులో మొదటి చాఫ్టర్ చదివి అర్థం చేసుకునే లోపే మొదటి సెమిస్టరు అయిపోయింది. ఏదో అత్తెసరు మార్కులతో పాస్ అయి బయటపడ్డాను. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదువులు చదివి ఉంటే అన్ని ఇబ్బందులు ఉండేవి కాదు అని నా అభిప్రాయం. 

అంతెందుకు, తెలుగు మీడియం లో చదివి ఏంతో టాలెంట్ ఉండి  కూడా ఇంగ్లీష్ సరిగ్గా లేక కింది స్థాయిలోనే మిగిలి పోయిన వాళ్ళను చూశాను, టెక్నికల్ గా స్ట్రెంగ్త్ లేకపోయినా నాలుగు ఇంగ్లీష్ ముక్కలు బాగా రావడం వల్ల మానేజేర్స్ గా అధికారాన్ని చెలాయించిన వాళ్ళను చూశాను.

కాలేజీల వరకు తెలుగు మీడియం లో చదివి, వీసాల కోసం PTE/ IELTS/ TOFEL/ GR E  లాంటి ఎగ్జామ్స్ లో తెచ్చుకోవాల్సినన్ని మార్కులు తెచ్చుకోలేక యెంత మంది ఇబ్బంది పడుతున్నారో ఇప్పటికీ నేను రోజూ చూస్తూనే ఉన్నాను. నా వరకు నేను PR కు  అప్లై చేయడటం కోసం 3 నెలల పాటు  ఇష్టం లేకపోయినా కష్టపడి ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడుతూ, ఇంగ్లిష్ మాత్రమే వింటూ, ఇంగ్లీష్ మాత్రమే తింటూ, ఇంగ్లీష్ నే తాగుతూ వచ్చాను. అసలు ఆ మూడు నెలలు ఒక్క తెలుగు సినిమా కూడా చూడలేదంటే నమ్మండి కాకపోతే ఆ 3 నెలల తర్వాత మళ్ళీ తెలుగుకు షిఫ్ట్ అయినప్పుడు సంతలో తప్పిపోయి చివరకు అమ్మ ఒడికి చేరిన బిడ్డ లాగా తెగ ఆనంద పడ్డాను

ఒక వేళ గవర్మెంట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం పెడితే మొదట అక్కడ పనిచేసే టీచర్స్ కి తగిన శిక్షణ ఇవ్వాలి. నేను M.C.A చదివే రోజుల్లో చూసాను అక్కడ భోదించే వారికే సరిగ్గా ఇంగ్లిష్ వచ్చేది కాదు, ఇక స్టూడెంట్స్ కి వాళ్ళేం నేర్పుతారు. 

ఇకపోతే మాతృ భాష మృత భాష అయిపోతుంది అని తెగ గగ్గోలు పెడుతున్న వారంతా నిజంగా తెలుగు మీద అంత ప్రేమే ఉండి ఉంటే తెలుగు భాషను బతికించడానికి మార్గాలు వెతికితే బాగుంటుంది.  ఆల్రెడీ తెలుగులో చదవడం వచ్చిన వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు మీడియం తర్వాత, అసలు తెలుగు చదవడం అనేదే నామోషీ అయిపోయింది ఈ కాలం లో. ఎంతమంది అమ్మా, నాన్న అని పిలుస్తున్నారు వారి తల్లిదండ్రులను ఈ కాలంలో? అంతెందుకు మొన్నటి దాకా అమ్మా, నాన్న అని పిలిచినా వారే ఇప్పుడు వాళ్ళ గురించి చెప్పాల్సినప్పుడు మా మమ్మీ, డాడీ అంటూ మొదలెడతారు.

ఏ ఎండకా గొడుగు పట్టడం ఈ రాజకీయ నాయకులకు తెలిసినంతగా మరెవరికీ తెలీదు. తెలుగు దేశం పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తాం అంటే Y.S.R పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతారు,  Y.S.R పార్టీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువులు తీసుకొస్తాం అంటే తెలుగు దేశం పార్టీ వాళ్ళు గగ్గోలు పెడతారు. చాలా మంది తెలుగు చచ్చిపోతోంది అని దొంగ ఏడుపులు ఏడుస్తున్నారు గానీ వాళ్ళ ఇళ్ళు మొత్తం ఇంగ్లీష్ తోనే నిండిపోయి ఉంటుంది. గాంధీ ఎప్పుడూ పక్కింట్లోనే పుట్టాలి మనింట్లో కాదు అన్నది వీరి కోరిక. 

ఇంకా ఏమైనా అంటే 'ఏ భాషలో విద్యాబోధన జరగదో ఆ భాష కొన్నేళ్ళకు అంతరించి పోతుందని ఫలానా అధ్యయనాల్లో తేలింది' కాబట్టి విద్యా భోధన మాతృభాషలోనే జరగాలి అని వాదిస్తారు. మరి ఇలా అన్నవాళ్లంతా ఈ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూళ్ళు మొదలైనప్పుడు ఏమయ్యారో తెలీదు. తెలుగు వద్దనడం లేదు, తెలుగు తప్పక నేర్పించండి, కానీ సైన్స్, మాథ్స్, సోషల్ లాంటివి ఇంగ్లీషులో నేర్పించండి.

ఏది ఏమైతేనేం, తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి అన్నట్లు ఇంగ్లీష్ మీడియం చదువులు సర్కారు బడుల్లోకి తీసుకొచ్చేశాం మీ ఇష్టమైంది మీరు చేసుకోండి అని డిసైడ్ అయినట్లు ఉన్నారు జగన్ గారు, ఏది ఏమైతేనేం ఇల్లలకగానే పండుగ కాదు, ముందుండి ముసళ్ల పండుగ ఈ ఇంగ్లీష్ మీడియం రాకతో ఎన్ని ఆటు పోట్లు ఎదురవుతాయో సర్కారు స్కూళ్లలో?

కాకపోతే ఒక్కటి నిజం మన తెలుగంత తియ్యనిది ఈ లోకం లో మరొకటి లేదు, కాకపోతే  చద్ది అన్నం కంటే పిజ్జా, బర్గర్లకే డిమాండ్ ఇక్కడ. జీవితంలో ఎదగాలనుకుంటే మాత్రం తెలుగును తుంగలో తొక్కడమో, గంగలో వదిలేయడమో చెయ్యాల్సిందే.  అవ్వా బువ్వా రెండూ కావాలంటే మాత్రం కుదరదు, అసలే పోటీ ప్రపంచం ఇక్కడ. 

'నా కప్ అఫ్ టీ' కాని విషయం మీద ఏదేదో రాసి మీకు బొప్పి కట్టించి ఉంటాను వెళ్ళి టీ పెట్టుకు తాగండి తల నొప్పి తగ్గడానికి. 

10, నవంబర్ 2019, ఆదివారం

ఈ మధ్య చూసిన వాటిల్లో నాకు నచ్చిన రెండు తెలుగు సినిమాలు

నువ్వెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లు, నేను సినిమా చూసి వాటి గురించి రాసేది ఒక ఏడాది లేటు.

నాకు మా చెడ్డ  అలవాటు ఉంది. ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు ఆ సినిమా గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి అని అనిపిస్తుంది, అందుకే ఈ బ్లాగ్ ని ఎన్నుకున్నాను. చూసినవి కొత్త వో పాతవో వాటి గురించి నాలుగు ముక్కలు మీతో పంచుకుంటే అదో తుత్తి నాకు.

రంగస్థలం, జెర్సీ అనే రెండు మంచి తెలుగు సినిమాలు చూశాను, ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటే అస్సలు తమిళ్ సినిమాల వైపు వెళ్ళాలి అనిపించదు. 

దర్శకుడు బోయపాటి ఒక ఇంటర్వ్యూ లో ఇలా అన్నాడు, "విలన్ ను హీరో కొట్టాలి అనుకున్నప్పుడు కొడితే ఎమోషన్ పండదు, ఇప్పుడు హీరో కొడితే బాగుండు అని ప్రేక్షకులకు అనిపించాలి అప్పుడే ఎమోషన్ పండుతుంది, అలానే ఉంటాయి నా సినిమాలో ఫైటింగ్స్ అన్నీ అని", కానీ వినయ విధేయ రామ లో లెక్క తప్పింది. ఆ  సినిమా నిండా ఫైట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడా మనం ఇన్వాల్వ్ అవ్వము, అవ్వాలని అనిపించదు. 

కానీ రంగస్థలం లో సుకుమార్ ఆ involvement  ఎలా ఉంటుందో చూపించాడు. అందులో ఉండేది 3 ఫైట్స్ అనుకుంటా. మూడూ కూడా ఎమోషన్ క్యారీ చేసేవే.

మొదటిది జాతరలో సమంతాను వాడెవడో ఏదో అని ఏడిపించాడని

రెండోది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి తప్పుగా మాట్లాడారని

మూడోది వాళ్ళ అన్నను కాపాడుకోవడం కోసం చీకట్లో ఫైట్

ఈ మూడు ఫైట్స్ విషయం లో ఇంకా కొట్టేయ్ వాణ్ని అని ప్రేక్షకుడు అనుకుంటూ ఇన్వాల్వ్ అవుతాడు, నా విషయంలో అలానే జరిగింది. చిన్నప్పుడు ఫైటింగ్ సీన్స్ అంటే నచ్చేవి కానీ, తర్వాత అంతగా నచ్చేవి కావు. 

చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. రామ్ చరణ్ యాక్షన్ ను మగధీర తర్వాత అంతో ఇంతో ఆస్వాదించగలిగింది ఇందులోనే. ఘన శక్తి నక్షత్రం అని వాళ్ళకు వాళ్ళు పేరు తగిలించుకున్నందుకు మొదటి సారి మన్నించెయ్యచ్చు.  

సినిమా పరిభాషలోని 'పే ఆఫ్' బాగా క్యారీ అయింది ఈ సినిమా విషయంలో. ఉదాహరణకు 'ప్రెసిడెంట్ గారు' అనేదే నా పేరు, నా అసలు పేరు ఈ ఊరెప్పుడో మరచిపోయింది అంటాడు జగపతి బాబు గర్వంగా. 

నెక్స్ట్ సీన్ లోనే  "ఫణీంద్ర భూపతి గారు" అని వెటకారంగా పేరు పెట్టి పిలిచి గాలి తీసేస్తాడు రామ్ చరణ్.

కాకపోతే అంత గొప్పగా చూపిస్తూ వస్తున్న జగపతి బాబు కారెక్టర్ ను చివరికి ఆటలో అరటిపండును చెయ్యడాన్ని జీర్ణించుకోవడం కష్టమే.  

చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన తెలుగు సినిమా ఇది, నచ్చనిది అంటూ ఏమీ లేదా ఈ మూవీ లో అంటే ఉంది, అదే ఐటెం సాంగ్, అలాగే ఎన్నో పాత సినిమాల్లో చూసిన కథే. ఈ తరం కుర్రకారు చూసి ఉండరు కానీ 'ఈ తరం ఫిల్మ్స్' బానర్ మీద ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం లో పాతికేళ్ళ కిందట వచ్చిన 'ఎర్ర మందారం' సినిమా చూడండి బాగుంటుంది.

ఎప్పుడూ నలగని బట్టలు వేసుకునే మహేష్ బాబు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.... జస్ట్ ఫర్ ఫన్.


ఇదే కాదు, ఈ మధ్య కాలం లో నచ్చిన మరో సినిమా జెర్సీ. కాకపోతే పైన చెప్పుకున్న "ఘన శక్తి నక్షత్రం" లాంటి మాస్ హీరో లేడు, అలాగే అర్జున్ రెడ్డి లాంటి యూత్ ని అట్ట్రాక్ట్ చేసే సినిమా కాదు పైగా కేవలం "సహజ నక్షత్రం" సినిమా కాబట్టి కమర్షియల్ గా 100 కోట్ల చిత్రం కాకపోవచ్చు కానీ ఇలాంటి సినిమాలను కలెక్షన్ లెక్కలతో కొలవకూడదు.

కొడుకు జెర్సీ అడిగినప్పుడు, పదరా కోటి సర్కిల్ లో ప్లాట్ఫారం మీద 50 రూపాయలు పెడితే ఒరిజినల్ లాంటిదే వస్తుంది అని ఫ్రెండ్ సలహా ఇచ్చినప్పుడు, "తన వయసుకు తెలియకపోవచ్చు కానీ, నా మనసుకు అర్థమవుతుంది ఏం ఇచ్చానో" అంటాడు నాని. ఇలాంటి మంచి మంచి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో.

చాలా మంచి ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, రైలు కూత కోసం వెయిట్ చేసి తన సంతోషాన్ని గట్టిగా అరుస్తూ అనుభవిస్తాడు చూడండి అది. ఇలాంటిదే ఒక చిన్న బిట్ తొలిప్రేమ సినిమాలో ఉంటుంది, పవన్ కళ్యాణ్ చెట్టు చాటుకి వెళ్ళి డాన్స్ చెయ్యడం. 

నానితో పాటు ఈ సినిమా డైరెక్టర్ అయిన గౌతమ్ గారి గురించి చెప్పకపోతే అర్థమే లేదు ఈ పోస్ట్ కి. చాలా బాగా తీశాడు మూవీ ని, ఇదే కాదు ఇతని మొదటి సినిమా 'మళ్ళీ రావా' కూడా బాగుంటుంది అందులోని అక్కినేని ఆణిముత్యాన్ని లెక్కలోకి తీసుకోకపోతే. ఈ గౌతమ్ గారు కలెక్షన్ అనే సుడిగుండంలోకి వెళ్ళాలని ఆలోచించకుండా ఉంటే మరిన్ని మంచి సినిమాలు ఆశించచ్చు ఇతని నుంచి.

ఇలాంటి క్రికెట్ బ్యాక్ డ్రాప్ తోనే మజిలీ అని మరో సినిమా అదే టైంలోనే రిలీజ్ అయింది, ఆ సినిమా కూడా బాగుంది అన్నారు కానీ అందులోని మరో అక్కినేని ఆణిముత్యానికి బెదిరి ఆ సినిమా చూడాలనే మూడ్ రాలేదు.

P.S: మొన్నా మధ్య కామెంట్స్ లో మెగా స్టార్ ను విన్నకోట నరసింహారావు గారు "ఘన నక్షత్రం" అని అనువదించారు , నేను ఇంకాస్త ముందుకెళ్లి మెగా పవర్ స్టార్ ను "ఘన శక్తి నక్షత్రం" అని నానిని 'సహజ నక్షత్రం' అని మెన్షన్ చేశాను..... జస్ట్ ఫర్ ఫన్.

5, నవంబర్ 2019, మంగళవారం

శాంత మూర్తి కాస్తా రౌద్ర మూర్తి అవుతాడా?

మా ఆఫీసులో శాంత మూర్తి అని పేరుకు తగ్గట్లు ప్రశాంతంగా, శాంతంగా ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు . 

"సారీ మేష్టారు, కాఫీ మీ మీద పడింది, అసలే  మీరు ఇవాళ కొత్త డ్రెస్ వేసుకొచ్చారు." అని ఎవరైనా కాఫీ ఒలకబోసినా ఉతికేస్తే పోతుంది, దానిదేముంది అంటాడు. 

ఏమనుకోకండి, ఇవాళ మీ లంచ్ బాక్స్ లో బిర్యాని తెచ్చారని తినేసాను అని ఎవరైనా అంటే,బయటికి వెళ్ళి తిని వస్తాను, దానిదేముంది అంటాడు.

మీకు కోపం రాలేదా? అని అడిగితే 'ఎందుకు కోపం, పాపం అతనికి నా కంటే ఎక్కువ ఆకలి వేసినట్లు ఉంది, అందుకే తిన్నాడు' అని అనుకొని మన్నించే రకం. 

అంతే కాదు, ఎవరైనా పొరపాటున తిట్టినా కోపం రాదు, అతన్నే కాదు వాళ్ళింట్లో వాళ్ళను తిట్టినా అస్సలు కోపం రాదు దున్నపోతు మీద వాన పడినట్లు దులుపుకు వెళ్తాడే తప్ప చలించడు. 

మొన్న ఒక రోజు లంచ్ టైం లో పొరపాటున సైరా సినిమా లాస్ వెంచర్ అట కదా, ఇక చిరంజీవి సినిమాలు ఆపేస్తే బెటర్ అన్నాను.

అంతే, ఎప్పుడూ కోప్పడని ఆ శాంత మూర్తి, మా బాస్ ని అలా అంటావా అని కోపంతో రగిలిపోయాడు, కల్లు తాగిన కోతిలా చిందులేయడమే కాక ఆల్కహాల్  తాగిన ఆంబోతులా రంకెలేశాడు. 

అతను చిన్నప్పటి నుంచి విన్న బూతులన్నీ ప్రయోగించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శాంత మూర్తి కాస్తా రౌద్ర మూర్తి అయ్యాడు. 

P.S: మొన్న ఒక పోస్టులో చిరంజీవిది ఈతాకు యవ్వారం అన్నానని ఒక మూర్ఖ అభిమానికి పిచ్చి కోపం వచ్చి నన్నొక పనికి రాని వాడి కింద జమకడుతూ కామెంట్స్ పెట్టాడు ఫేస్బుక్ లో.  దాని మీద అల్లిన కథనం పైది. ఒక వేళ నేను చిరంజీవినే డైరెక్ట్ గా అన్నా ఆయన పట్టించుకోరు, ఎందుకంటే ఆయన నిండుకుండ లాంటి వారు. అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది అంటారు చూశారా ఆ టైపు, ఇదిగో ఏమీ లేని ఈ ఖాళీ ఎంగిలి ఇస్తరాకు గాళ్ళే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటివి స్పోర్టివ్ గా తీసుకోలేని వారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. "పేరు గొప్ప ఊరు దిబ్బ" అన్నట్లు అంతో ఇంతో చదువుకునే ఉంటారు కానీ దానికి తగ్గ ప్రవర్తన ఉండదు. ఇంత చదువు చదివి ఏం లాభం? సద్విమర్శలకు అదే పద్దతిలో సమాధానాలివ్వడం చేయాలి అంతే కానీ బూతులు తిట్టడం పద్దతి కాదు అని ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో. అప్పట్లో గోడ మీద  ఉన్న వాల్ పోస్టర్ల మీద పేడ కొట్టడం, బురద చల్లడం చేసేవాళ్ళు , ఇప్పుడు అదే పని సోషల్ మీడియా ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు అంతే తేడా. 

ఎంతసేపూ సినిమాల్లోనే హీరోలు ఉంటారని, అలాంటి సినిమా హీరోలకి అభిమానులుగానే ఉండిపోదాం, అమ్మ, నాన్న, కుటుంబం కంటే ఈ సినిమా హీరోలే మనకు ముఖ్యం అనుకుంటారే తప్ప సరిగ్గా ప్రయత్నిస్తే మనమూ ఏదో ఒక రంగంలో హీరో అవ్వచ్చు అని విస్మరిస్తున్న ఈ శాంత మూర్తి లాంటి వారికి జాలితో ఈ పోస్ట్ అంకితం. 

1, నవంబర్ 2019, శుక్రవారం

రివర్స్ ట్రెండ్ - బ్యాన్డ్ బాజా బారాత్

గురువు గారూ, మీరిది విన్నారా?

ఏంటో చెప్పకుండా నాకెలా తెలుస్తుందిరా శుంఠా?

శూన్యం లోకి చూస్తూ దేవుడితో మాట్లాడే మీకు ఇవి తెలియకపోవటమేమిటి స్వామీ? 

అసలు విషయం చెప్పకుండా నస పెట్టక క్లుప్తంగా వివరించు. 

అదే స్వామీ,మొన్న రెండు విషయాలు జరిగాయిగా వాటి గురించి. 

ఏదీ మన గోలయ్య చేతిలో గుత్తి పట్టుకొని వదిలిన 'రోలర్' సినిమా పోస్టర్, కాంరోగాల్ ఖర్మ వదిలిన 'ఇడ్లీల మధ్యలో గట్టి చట్నీ' సినిమా టీజర్ ఇవేగా. 

అవి కాదు స్వామీ, రివర్స్ లో జరిగిన రెండు విషయాలు. 

"ఎప్పుడూ ఈ చేతిలోకి డబ్బు రావడమే తప్ప ఈ చేతిలోంచి డబ్బు పోగొట్టుకోవడం తెలీదు అలాంటిది మొన్న గోవా వెళ్ళినప్పుడు కాసినో లో కాసులు మొత్తం పోగొట్టుకోవడం వీడికి ఎలా తెలిసిందబ్బా?', దాంతో పాటు 'కొంపదీసి నాకున్నవక్ర దశ  మారడానికి రెమెడీ ఏదో కనుక్కోవడానికి అదే గోవా లోని 'గోచీ బీచీ స్వామి' ఆశ్రమానికి మారు వేషంలో వెళ్ళడం వీడికి తెలిసిందా ఏమిటి?"

ఏమిటి స్వామీ, శూన్యం లోకి చూస్తూ పలకరు?

అదే, నువ్వు దేని గురించి చెబుతున్నావో అది తెలుసుకోవడానికి. 

సరే చెప్తాను వినండి. జింకను వేటగాడు చంపడం, యువతి మీద యువకుడు ఆసిడ్ దాడి చేయడం మనం వింటూ ఉంటాం కదా? 

అవును అది లోకంలో సహజం గా జరుగుతున్నవే కదా నాయనా?

కానీ తన మీద వేటకు వచ్చిన వేటగాడిని జింక చంపడం, గొడవపడిన ప్రియుడిపై ప్రియురాలు ఆసిడ్ పోయడం జరిగాయి స్వామీ నిన్న. 

మరిప్పుడు ఏమంటావు నాయనా? 


మీరు ఈ మధ్యే ఈ లోకానికి పోగాలం దాపురించింది అన్నీ రివర్స్ లో జరుగుతాయి అన్నారు, దీని గురించే అనుకుంటాను కదా గురూజీ. 

సరిగ్గా ఊహించావు శిష్యా?

ఎందుకిలా జరుగుతున్నాయి స్వామీ?

వీటికి కారణం గురుడు, శుక్రుడు వారి వారి కక్షలు మార్చుకొని తిరుగుతున్నారని గ్రహాల స్థితిని ఔపోసన పట్టిన నా మేధస్సు చెబుతోంది.  

మరి దీనికి రెమెడీ ఏమీ లేదా స్వామీ?

'అసలే కాసులు లేక కట కట లాడుతున్నాను, కాసులు రాల్చే ఐడియా ఇచ్చావురా శిష్యా, ఈ దెబ్బకు బొక్క పడిన బొక్కసాన్ని కాసులతో పూడ్చచ్చు ఈ ఐడియా సరిగ్గా వర్కౌట్ అయితే''

మళ్ళీ శూన్యం లోకి చూస్తూ దేవుడితో మాట్లాడుతున్నారు కదా స్వామీ?

అవును నాయనా, దీని కోసం 'రివర్స్ ట్రెండ్ - బ్యాన్డ్ బాజా బారాత్' అనే హింగ్లీష్ యాగం తలపెట్టాలి, కాబట్టి ఈ విషయాలన్నీ మన భక్తులకు తెలియజేస్తూ విరాళాలు పంపమని చెప్పు. 

ఏ విషయాలు స్వామీ?

అదేరా నేను రెమెడీ కోరడం, కాసినో లో కాసులు పోగొట్టుకోవడం. 

ఏమిటి స్వామీ మీరనేది?

అదే  శిష్యా, రివర్స్ లో జరిగిన ఆ రెండు  విషయాలు, అలాగే నువ్వు లోక కళ్యాణానికి నన్ను రెమెడీ కోరడం, అసలు ఎవరి మీదా ఆసిడ్ దాడులు జరగకుండా చూడటం లాంటి వాటి కోసం యాగాన్ని చేస్తున్నామని వివరిస్తూ వాట్సాప్ చెయ్యి మన భక్తులకు.

అలాగే స్వామీ..కానీ చిన్న అనుమానం. 

కాంరోగాల్ ఖర్మ సినిమాకి ముందు వివాదాలు రావడం, విన్న ప్రతీ విషయానికీ నీకు అనుమానాలు రావడం చాలా కామన్ శిష్యా. అడుగు ఆలశ్యం చేయక అవతల నాకు దేవుడి సేవ కి వేళయ్యింది. 

అసలే ఈ సోషల్ మీడియా వచ్చాక మన స్వామీజీల మీద విమర్శలు ఎక్కువయ్యాయి. యాగాలు, హోమాలు అంటే నమ్ముతారా?

సోషల్ మీడియాలు, సైన్స్ మీడియాలు అంటూ ఇంకో పది మీడియాలు వచ్చినా ఈ జనాల్లో ఉండే పాపభీతి ఎప్పటికీ పోదు అలాగే మెజారిటీ జనాల్లో ఉండే ఆ వేపకాయంత వెర్రి తగ్గేదాకా మనకు ఎదురు ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే ఈ భూమి అంతమయ్యేదాకా మా లాంటి స్వామీజీలకు భక్తుల కొరత ఉండదు.  

మిమ్మల్ని నమ్మినా, విరాళాలు ఎవరూ పంపక పోతే? 

జనాలు ఎవరూ చూడకపోతే అని కాంరోగాల్ ఖర్మ 'ఐ స్క్రీం' సినిమా తర్వాత అలోచించి ప్రయత్నాలు ఆపివుంటే ఇప్పుడు  'ఇడ్లీల మధ్యలో గట్టి చట్నీ' అంటూ మరో సినిమాతో వచ్చేవాడు కాదు. ఆయనెంత చెత్త సినిమాలు తీస్తున్నా చూసే వాళ్ళు ఉన్నట్టే మనకూ విరాళాలు పంపే భక్తులు ఉంటారు. ఎప్పుడూ వినేదే కానీ నా మాటల్లో మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకో 'ప్రయత్నం ఆగిపోవాల్సింది ప్రాణం పోయినప్పుడే,  నీకు నువ్వుగా కాదు' . 

అర్థమైంది స్వామీ. 

వెళ్ళిరా నాయనా, 'శుభం భూయాత్, రివర్స్ ట్రెండ్ బ్యాన్డ్ బాజా బారాత్'  

P.S:  వేటగాడిని జింక చంపడం, యువకుడిపై యువతి ఆసిడ్ దాడి అన్న వార్తలు ఒకే రోజు చదివిన తర్వాత వీటి మీద సరదాగా ఏదో రాద్దామని రాసిందే తప్ప ఎవ్వరినీ కించపరచడానికి కాదని మనవి. 

27, అక్టోబర్ 2019, ఆదివారం

సైరా లాస్ వెంచర్ అయిందా?

సైరా సినిమా నేను చూడలేదు కానీ చూసిన వాళ్ళు వారి వారి అభిప్రాయాలు చెప్పారు. ఆ అభిప్రాయాలకు నా పైత్యం కొంత కలిపి పులిహోర వండాను, నచ్చితే ఎంజాయ్ చెయ్యండి లేక పులుపు ఎక్కువైపోయి ఉంటే మన్నించండి. 

కొందరేమో సైరా క్యారెక్టర్ లో మా బాలయ్య అయితే బాగుండేవాడు.   రాజసం అంటే బాలయ్యదే, గౌతమీ పుత్ర శాతకర్ణి లో అదరగొట్టాడు. అంతేకాదు చిరంజీవి డైలాగులు బాగా చెప్పలేదు, వాయిస్ బాగా దెబ్బ తిన్నట్లుంది మా బాలయ్య నోట్లోంచి వచ్చి ఉంటే బాగుండేది అన్నారు. 

మొన్నొక సారి బాబూమోహన్ 'గుర్రం మీద స్వారీ చేయడం అంటే అది బాలయ్య బాబే చెయ్యాలి చిరంజీవి గిరంజీవి బలాదూర్' అన్నాడట భైరవద్వీపం సినిమాలో బాలయ్యతో పని చేసిన అనుభవాలు పంచుకుంటూ ఒక ఇంటర్వ్యూ లో.  మరి బాబూమోహన్ సైరా సినిమాలో చిరంజీవి గుర్రం మీద స్వారీ చేయడం చూశాడో లేదో, కానీ చిరంజీవి ఫాన్స్ మాత్రం కొదమ సింహం సినిమాలో చిరంజీవి స్టైలిష్ గా గుర్రం మీద స్వారీ చేసిన వీడియోలు బాబూ మోహన్ గారికి షేర్ చేస్తున్నారట.

రామాయణం లో పిడకల వేటలా సైరా గురించి మాట్లాడుతూ ఎటో వెళ్ళిపోయా.

మళ్ళీ సైరా విషయానికి వస్తే ఇంకొందరేమో స్క్రీన్ నిండా చిరంజీవే కనపడుతున్నాడు, అంత లావుగా ఉండే వ్యక్తిని హీరో గా accept చెయ్యలేం అంటున్నారు. మన తెలుగులోనే కొందరు అలా ఫీల్ అవుతున్నారంటే ఇక మిగతా భాషల వాళ్ళు ఎలా ఫీలవ్వాలి? అందుకే ఒక్క తెలుగులో తప్ప మిగతా భాషల్లో సినిమా బోర్ల పడినట్లుంది. కాకిపిల్ల కాకికి ముద్దు అన్నట్లు ఈ వయసులో ఆయన మనకు హీరో గానీ పక్క భాషల వారికి కాదు కదా.  అందుకే సినిమాకు పెట్టిన మొత్తం బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే కాస్తో కూస్తో కర్ణాటక నుంచి రావాలి కాబట్టి ఇది లాస్ వెంచర్ కిందే లెక్క.  

చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్లు ఆల్మోస్ట్ కల్లెక్షన్స్ డ్రాప్ అయిన సినిమాకి ఏంతో కొంత కలెక్షన్స్ వస్తే చాలని, సినిమాని నిలబెట్టడానికి ఎక్కే గడప దిగే గడప అన్నట్లు అందరి ఇళ్ల చుట్టూ తిరిగాడు తిరుగుతూనే ఉన్నాడు చిరంజీవి. 

మొన్నటికి మొన్న చిరంజీవి గారి కోడలు పిల్ల మోడీ ని నిలదీసింది మీకు ఈ  దేశంలో సినిమా నటులంటే ఉత్తరేది వారేనా, ఇక్కడి వాళ్ళు మీ కంటికి కనిపించలేదా అని. చిరంజీవి గారు మాత్రం అలాంటి మొహమాటాలు ఏమీ పెట్టుకోకుండా నా సినిమా చూడండి మొర్రో అని మోడీ గారికి  మొర పెట్టుకోబోతున్నాడట పేకాట పేకాటే బామ్మర్ది బామ్మర్దే అన్నట్లు.  అలాగే మొన్న ముఖ్యమంత్రి జగన్ గారిని కూడా కలిసాడు ఈ విషయమై. ఈ తిప్పలేవో సినిమా రిలీజ్ అవ్వకముందే చేసి ఉంటే ఇంకాస్త కలెక్షన్స్ పెరిగేవేమో. అయినా ఊపిరి పట్టినంత మాత్రాన బొజ్జ నిండుతుందా? ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చూసినంత మాత్రానా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ నిండిపోతుందా? ఏమిటో మా చిరంజీవి చాదస్తం, అసలే ఈతాకు యవ్వారం ఆయనది, తన డబ్బులు పోతే ఎట్టా? అందుకే ఆయన పాట్లు యేవో ఆయన పడుతున్నారు. 

సినిమా చివర్లో ఎండ్ టైటిల్స్ పడేప్పుడు చాలా మంది స్వాతంత్ర సమరయోధులను చూపించారట కానీ అల్లూరి సీతా రామరాజుని చూపించలేదు అని గగ్గోలు పెడుతున్నారు.

సర్లే ఎప్పుడో స్వర్గస్తులైన అల్లూరిని చూపించకపోయినా పర్లేదు మొన్నీ మధ్యే మరణించిన మా రాజన్న వీళ్ళ కంటికి అనలేదా అని కొందరు, ఇప్పటికీ కళ్ళ ముందు తిరుగుతున్న మా చంద్రన్న ఫోటో ఎందుకు చూపించలేదు అని మరికొందరు  వాళ్ళ వాళ్ళ అక్రోశం వెళ్ళగక్కారు అది వేరే విషయం.  

P.S: 'ఈతాకు యవ్వారం' అనే పద ప్రయోగం మా అమ్మ అప్పుడప్పుడూ వాడుతూ ఉండేది. దాని అర్థం ఏమిటమ్మా అని అడిగితే చెప్పింది. గాలి వీచినప్పుడో లేదంటే ఆకులు రాలే కాలంలోనో ఏ చెట్టు ఆకులైనా రాలుతూ ఉంటాయి, కానీ ఈతాకు చెట్టుకు మాత్రం ఎప్పుడూ రాలవు. తన డబ్బు ఒక్క రూపాయి కూడా రాలకుండా చూసుకునే వాడిని 'ఈతాకు యవ్వారం' తో పోలుస్తారు అంది. 

22, అక్టోబర్ 2019, మంగళవారం

ఒక్కోసారి పిచ్చి ఊహ కూడా మీకు మేలు చెయ్యొచ్చు - ఏర్చి కూర్చిన కథలు

"పెంపుడు రాళ్ళు" అన్న మాట ఎప్పుడైనా విన్నారా?

ఏంటి మమ్మల్ని పిచ్చోళ్లనుకున్నావా? నువ్వు రాసే ప్రతీ చెత్త మేము చదవడానికి అని నా పోస్ట్ క్లోజ్ చేయాలని మీరు అనుకుంటే పప్పులో కాలు, ఉప్పులో చెప్పు వేసినట్లే.

"పెంపుడు రాళ్ళు" అనే మాట పిచ్చిగా అనిపిస్తుంది కానీ ఆ పిచ్చి ఊహే నాలుగు రాళ్ళు వెనకేసుకునేలా చేసింది ఒక వ్యక్తి విషయంలో.

అప్పుడెప్పుడో 'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో గాలి బొక్కల చొక్కా, తుపుకు తుపుకు డిజైన్ షర్ట్ అని అమ్మితే జనాలందరూ ఎగబడి కొన్నట్లు చూపిస్తే సినిమా కాబట్టి అలా చూపిస్తారు నిజ జీవితం లో అలాంటి జనాలు ఎవరుంటారు అని అనుకునే వాళ్ళము కదా! కానీ నిజ జీవితం లో అంతకంటే క్రేజీ పీపుల్ ఉంటారని మీరు ఈ పోస్ట్ చదివిన తర్వాత అనుకుంటారు. 

ఇక నాన్చుడు లేకుండా డైరెక్ట్ గా విషయానికి వస్తాను.

గారీ రోస్ దాల్ ..వద్దులే అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇప్పుడు నేను మార్చడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ లోనే చెప్తాను Gary Ross Dahl అనే పేరున్న ఇతన్ని మనం Gary అని పిలుచుకుందాం క్లుప్తంగా.

1975 టైములో ఈ Gary అనే వ్యక్తి అమెరికా లో "ఫ్రీలాన్స్ కాపీ రైటర్" అనబడే ఉండీ లేని జాబ్ ఏదో వెలగబెడుతున్న రోజులవి. బార్లో కూర్చొని బీర్ తాగుతూ ఫ్రెండ్స్ తో బాతాఖానీ కొడుతున్నప్పుడు ఒక ఫ్రెండ్, తను ఊరెళ్ళినప్పుడు తన పెంపుడు కుక్క బాగోగులు చూసుకోవడానికి యెంత కష్టపడ్డదీ, యెంత ఖర్చుపెట్టిందీ తలచుకొని బావురుమన్నాడు. ఇక మిగతా వారు కూడా ఈ పెంపుడు జంతువుల విషయం లో తాము ఊర్లో లేనప్పుడు వాటి సంరక్షణ కోసం పడ్డ కష్టాలను ఏకరువు పెట్టారు. అసలే డబ్బులు లేక కరువు లో అల్లాడుతున్న మన Gary కి ఈ సమస్య ఏదో బంగారు బాతులా అనిపించి "పెంపుడు రాళ్ళు" అనే ఐడియా వచ్చేలా చేసింది.

అట్టపెట్టెలలో కాస్త మందంగా ఎండు గడ్డి పేర్చి అట్టపెట్టె సైడ్ లో కాస్త పెద్ద సైజు రంధ్రాలు చేసి లోపల Rosarito అనే బీచ్ దగ్గర దొరికే నున్నటి ఓవల్ షేప్ లో ఉన్న రాళ్ళను ఉంచి ఆ అట్టపెట్టె మీద 'Pet Rock' అని ముద్రించి ఒక్కొక్కటి నాలుగు డాలర్లకు అమ్మకానికి పెట్టాడు. ఈ రాయితో పాటు దాన్ని జాగ్రత్తగా ఎలా చూసుకోవాలో జాగ్రత్తలు చెబుతూ ఒక instruction బుక్ కూడా పెట్టాడు. కరెక్ట్ గా చెప్పాలంటే అమ్మకాల్లో ఈ instruction బుక్ కీ లాగా పనిచేసింది. ఈ బుక్ లో ఆ పెంపుడు రాయిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పే జాగ్రత్తలు బాగా హాస్యాన్ని తెప్పించాయట. 'వీటికి బద్ధకం ఎక్కువ, కూర్చున్న చోటి నుంచి కదలవు. మీరే బయటికి తీసుకెళ్ళాలి.  అలాగని చెప్పి స్విమ్మింగ్ కి మాత్రం తీసుకెళ్ళద్దు వాటికి ఈత రాదు మునిగిపోతాయి' అంటూ హాస్యాన్ని కురిపించాయట.

మొత్తానికి అలా ఈ రాళ్ళ వ్యాపారం 1975 మధ్యలో మొదలైంది. అలా మొదలైన వ్యాపారం ప్రజల్లోకి వెళ్ళడానికి బాగా ఫేమస్ అయిన 'టు నైట్ షో' అనే పాపులర్ అమెరికన్ టీవీ షో లో పాల్గొనడం, పేపర్లో పబ్లిసిటీ ఇవ్వడం వీటికి తోడూ 'నేను నా పెట్ రాక్ తో ప్రేమలో ఉన్నాను'  అనే ఒక సాంగ్ ని కూడా షూట్ చేయించి రిలీజ్ చేయడం చేశాడు.


అతని ప్రయత్నాలు వృథా కాలేదు. అమెరికాలో ఆ సంవత్సరం క్రిస్మస్ కి చలితో పాటు ఈ పెట్ రాక్స్ వ్యాపారం కూడా అమాంతం పెరిగింది. ఈ క్రేజీ ఐడియా 6 నెలలే పని చేసింది గానీ అప్పటికే అతను పది పదిహేను లక్షల రాళ్ళ దాకా అమ్మి సొమ్ము చేసుకున్నాడట.

ఇందులో మనకు అంత విచిత్రం ఏమీ కనపడకపోవచ్చు, ఎందుకంటే జాతి రత్నాలపేరు చెప్పి మన దేశంలో ఇప్పటికీ బోలెడన్ని రాళ్ళు అమ్మి సొమ్ము చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 

ఆ పెంపుడు రాళ్ళ వ్యాపారం మూలపడ్డాక అలాంటివే ఇంకొన్ని పిచ్చి పిచ్చి వ్యాపారాలు మొదలెట్టాడు గానీ ఏవీ క్లిక్ అవలేకపోయాయి. ఏదైతేనేం మార్కెట్టింగ్ లో తన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 'Advertising For Dummies' అనే బుక్ కూడా రాశాడు ఇతను. 

ఇంకెందుకు ఆలస్యం, ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి పిచ్చి ఐడియా ఉండి దాన్ని ప్రమోట్ చేసుకోగలిగితే "పెంపుడు రాళ్ళు" కాన్సెప్ట్ లాగా మీరూ నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు. 

18, అక్టోబర్ 2019, శుక్రవారం

పూరీ జగన్నాథ్, నీకో దండం సామీ!

ఒక్కో సారి మన టైం బాలేనప్పుడు, కోరి తలనొప్పి తెచ్చుకునే పనులు చేస్తుంటాం. అలాంటి ఒక బాడ్ టైం లో మొన్నొక రోజు 'ఇస్మార్ట్ శంకర్' అనబడే హిట్ సినిమా చూశా.  

ఇంట్రడక్షన్ సీన్ లోనే ఒక పది మంది పోలీసుల బొక్కలు ఇరగ్గొడుతూ మధ్య మధ్య లో తెచ్చి పెట్టుకున్న తెలంగాణా స్లాంగ్ తో మన చెవులకు తూట్లు పొడుస్తాడు ఇస్మార్ట్ శంకర్ అనబడే మన ఎనర్జిటిక్ హీరో రామ్

గిట్ల ఫైట్ అవ్వంగానే ఒక పాట షురూ, ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ మళ్ళీ తెచ్చి పెట్టుకున్న తెలంగాణా స్లాంగ్ తో ఈవిడ కూడా మన చెవులకు తూట్లు పొడుస్తూ. 

ఒక రెండు సీన్స్ అయిపోగానే నిన్ను రేప్ జేస్తా అంటూ హీరోయిన్ యెంట బడి ఆమె ఇంట్లోకి దూరి చండాలం చేస్తడు మన ఇస్మార్ట్ శంకర్. అప్పటికే హీరోయిన్ పరిగెత్తుతూ పోలీస్ లకి ఫోన్ చేస్తది ఎవడో నన్ను తరుముతోండు అని. ఇగ పోలీసులు వచ్చి హీరోయిన్ ఇంటి తలుపు కొట్టగానే  'ఇంగ మీకు ఈడ పని లేదు, ఈడు నాకు శానా నచ్చిండు, మీరు ఎల్లిపొండి' అంటది హీరోయిన్ గుంట. 

ఇంత అద్భుతమైన లవ్ స్టోరీ చూశాక పూరి జగన్నాధ్ క్రియేటివిటీ కి స్టన్ అవకుండా ఉండలేం మరి. ఇంగేమ్ జెయ్యలేం, ఈ జనరేషన్ ల లవ్ ఇంతే ఫాస్ట్ గ షురూ అవుతాది అని మనం అనుకోవాలె. 

ఇంగ ఆ తర్వాత రెండు మూడు గన్ ఫైర్స్ జరుగుతయ్ అందుల హీరోయిన్ ఛస్తది. హీరోని పోలీసులు జైలుకి పట్టుకెళ్తారు, నన్నెవరు జైలుకు పంపించిండ్రో ఆళ్లనొదల అని హీరోతో అనిపించి సినిమాకి పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ కలరింగ్ ఇస్తాడు.  

మళ్ళీ రెండు మూడు గన్ ఫైర్స్, ఒక సిబిఐ ఆఫీసర్ జస్తడు , హీరో గాయపడ్తడు. ఇంగ ఇప్పుడు 'క్రిమినల్' అనే ఇంగ్లీష్ సినిమా నుంచి కొట్టుకొచ్చిన Face/off కాన్సెప్ట్ లాగా Brain/off  కాన్సెప్ట్ ఇందులో ఇరికించి సినిమాకి సైన్స్ ఫిక్షన్ లాంటి కలరింగ్ ఇస్తాడు. 

ఇక్కడ CBI డిపార్ట్మెంట్ హెడ్ అయిన షాయాజీ షిండే 'ఆడి బ్రెయిన్ తీసి ఈడికి పెట్టెయ్' అంటాడు రెండో హీరోయిన్ తో.  అదేదో వాడి హ్యాట్ తీసి వీడికి పెట్టు లేదంటే వాడి కిడ్నీ తీసి వీడికి పెట్టు అన్నంత సింపుల్ గా. (ఏ మాటకామాట చెప్పుకోవాలి నాకెందుకో ఈ షాయాజీ షిండే తెలుగులో చెప్పే డైలాగ్స్ వింటే తెలుగు మీద ఉండే ఆ కాస్త అభిమానం కూడా చచ్చిపోతుంది.)

ఇంక ఆ బ్రెయిన్ మార్చేశాక మనోడు అపరిచితుడు టైపులో అటూ ఇటూ మారిపోతుంటాడు కాసేపు ఇంగ్లీష్, కాసేపు తెలంగాణా లాంగ్వేజ్ మాట్లాడుతూ. (మీరు నన్నో వింత జీవిని చూసినట్లు చూస్తారని తెలుసు గానీ ఆ అపరిచితుడు సినిమా కూడా నాకు నచ్చలేదు అది వేరే విషయం) 

మళ్ళీ కొన్ని గన్ ఫైర్స్ జరిగాక అసలైన సస్పెన్స్ (అసలైన విలన్ ఎవరో సినిమా మొదట్లోనే మనకు తెలిసిపోతుంది అనుకోండి)   క్లైమాక్స్ లో బయట పెడతారు. ఆ తర్వాత ఒక భీభత్సమైన ఫైట్, అది అయిపోగానే శుభం కార్డు పడే ఉంటుంది అనుకుంటా. (T.V స్విచ్ ఆఫ్ చేశాను అప్పటికే ఓపిక నశించి) 

ఈ సినిమాలో ఏదో నచ్చే ఉంటుంది కాబట్టే జనాలకు బాగా నచ్చి హిట్ అయిందనుకుంటా. లేదంటే ఇంతకు ముందు పూరి జగన్ తీసిన సినిమాల మీద ఇది కాస్త బాగుంది ఉండచ్చు కాబోలు. 

ఏది ఏమైతేనేం ఇంత మందికి నచ్చిన ఈ సినిమా మరి నాకెందుకు నచ్చలేదు? మీలో ఎవరికైనా నచ్చింటే కాస్త మీ మైండ్ నాకు అరువివ్వండి అది నేను పెట్టుకొని సినిమా చూస్తా. అప్పుడు నచ్చుతుందేమో. 

ఇదే వారం లో చల్తే చల్తే, వినరా సోదరా వీర కుమారా అనే రెండు తెలుగు సినిమాలు చూశాను. ఈ సినిమాలు బాగున్నాయి అని చెప్పను కానీ పైన చెప్పిన సినిమా కంటే కొంతలో కొంత బెటర్. కాకపోతే ఇవి రిలీజ్ అయ్యాయి అని కూడా చాలా మందికి తెలీదు కాబట్టి  ఎంతమంది థియేటర్ కెళ్ళి చూస్తారు అనేదే డౌట్ అందుకే ఇవి యు ట్యూబ్ సినిమాలుగానే మిగిలి పోతున్నాయి. 


మాములుగా హిందీ సినిమాలు అంటే నాకు పెద్దగా నచ్చవు కాకపోతే ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో 'మిషన్ మంగళ్' నచ్చింది.  

P.S: నేను కూడా కాస్త తెచ్చి పెట్టుకున్న తెలంగాణా భాష ఉపయోగించాను, బాగా తప్పులుంటాయి వీలయితే సరిచేయండి లేదంటే మన్నించండి. 

14, అక్టోబర్ 2019, సోమవారం

మరి ఇక్కడ శాలరీ పెరగడానికి దారేది?

ఈ పోస్ట్ 'అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు' అనే పోస్ట్ కి కొనసాగింపు & ముగింపు.

అలా నిరాశతో నిస్పృహతో  కూడిన మొహం వేసుకొని మెహర్ రమేష్ లా బయటికి వచ్చిన నాకు  కాఫీ టైం కంటే బాగా ఆలస్యంగా, లంచ్ టైం కంటే కాస్త ముందుగా ఆఫీస్ కి వస్తున్న రాజేష్ ఎదురయ్యాడు.

అది చూసి "హేయ్  రాజేష్, ఇంత ఆలస్యంగానా ఆఫీస్ కి వచ్చేది"  అన్నాడు సుబ్బారావ్ ఒక చీమను తన కాలికింద నలిపేసి ఇంకో నల్లిని కూడా నలిపేయాలన్న కసితో. 

"కుక్క ఉంది" డోంట్ కేర్ అన్నట్లు రాజేష్ రిప్లై  ఇచ్చాడు. 

"వాట్?" కోపంగా సుబ్బారావ్

మా కాంపౌండ్ లో కుక్క ఉంది, దాన్ని కట్టేయ్యలేదు. ఓనర్స్ దాన్ని కట్టేశాక బయల్దేరా లేటయింది.

"మరి ఆ జుట్టేంది" మళ్ళీ ఎటాక్ మొదలెట్టాడు సుబ్బా రావ్ 

"మొక్కు ఉంది"

"వాట్?"  మళ్ళీ కోపంగా సుబ్బారావ్

తిరుపతి వెళ్ళాలి, అందుకే జుట్టు కటింగ్ చేయించుకోలేదు 

ఆ చిరిగిన బట్టలేంటి ఆఫీస్ కి?

పంది కొక్కు ఉంది

వాట్? అన్నాడు మళ్ళీ, అప్పటికే నిప్పుల మీద పెట్టిన వంకాయలాగా మాడిపోయింది సుబ్బారావ్ మొహం.

పంది కొక్కు ఇంట్లో బట్టలను కొరికేస్తోంది. 

అయితే ఓకే, అని మేనేజర్ వెళ్ళిపోయాడు ఏం అనలేక. 

కుక్కుంది, మొక్కుంది, పంది కొక్కుంది అంటూ మాట్లాడావ్ సుబ్బారావు తో, "ఏముందని నీ దగ్గర అంత  ధైర్యం?" అని అడిగా రాజేష్ ని.

ధైరం ఉంది, బ్రహ్మాస్త్రం  లాంటి  P.R ఉందనే ధైర్యం ఉంది అందుకే అన్నాడు. అదిసరే గానీ  ఏమైంది నీ అప్రైసల్ అంది అడిగాడు. 

మళ్ళీ దెబ్బేశాడు, ఎన్ని హిట్లు పడి, యెంత టాలెంట్ ఉన్నా మార్కెట్ పెరగని నాని లాగా అయిపొయింది నా బతుకు అన్నాను. 

గొడవ పడక పోయావా?

అదీ అయింది, నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లు మాట్లాడాడు.

సరే, నీకు జ్ఞానోదయం కలిగిస్తాను విను అని మొదలెట్టాడు ... 

ఇక్కడ ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా, అసలు దంచకపోయినా అదే కూలి దక్కుతుంది.  

అంతే కాదు, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మన ప్లేట్, కడుపు రెండూ నిండిపోతాయి.

నువ్వెంత పని చేసినా, సంవత్సరం చివరలో నీ పనిలో ఏదో ఒక బొక్క వెతుకుతారు. వాళ్లకు నువ్వు నచ్చకపోతే పొమ్మని ఎవరూ చెప్పరు పొగ పెడతారు అంతే. 

మార్కెట్ కి వెళ్ళినప్పుడు నీకొక్కడికే కూరగాయలు తెచ్చుకుంటే సరిపోదు వాటితో పాటు ఆపిల్స్, అరటి పండ్లు లాంటివి తెచ్చి ఎక్కడ సమర్పించాలో అక్కడ సమర్పించుకోవాలి. 

సూపర్ మార్కెట్ లో నీ బ్యాగులొక్కటి మోస్తూ తిరిగితే మోక్షం రాదు, సూర్యుడి చుట్టూ భూమి ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది చూశావా అలా తిరిగిన వారికే మోక్షం. 

లేదు ఈ తిప్పలన్నీ పడలేను అంటావా అయితే అన్ని రోగాలకు జిందా తిలిస్మాత్ లాంటి ఒకటే మందు ఉంది, అదే PR. ఆ బ్రహ్మాస్త్రం చేతిలో ఉంటే ఇంత తిప్పలు పడాల్సిన అవసరం లేదు. 

సరే! అప్పుడెప్పుడో  స్థిర యోగ హోమం మెదలెట్టానన్నావ్. ఎంతవరకు వచ్చింది?

నడుస్తోంది. చివరి స్టేజి దగ్గర  ఉంది.  కుదిరితే క్రిస్మస్ కు, లేదంటే సంక్రాంతికో అప్పటికీ కాదంటే ఉగాదికో నాకూ బ్రహ్మాస్త్రం వస్తుంది. అప్పుడు చూపిస్తా నా తడాఖా, పెద్దగా కష్టపడకపోయినా అందం ఒక్కటి అడ్డు పెట్టుకొని హిట్ మీద హిట్ కొడుతున్న మహేష్ బాబు లాగా మార్కెట్ పెంచుకుంటా.

ఆల్ ది బెస్ట్ అని రాజేష్ లంచ్ కి వెళ్ళాడు డబ్బా పట్టుకొని.  

P.S: మేనేజర్ మనోభావాలను దెబ్బదీశానని నా మీద కోర్ట్ కేసులేమి పెట్టకండి, అసలే జీతాలు పెరగక ఇబ్బందుల్లో ఉన్నాను. మా సుబ్బారావ్ కి తెలుగు రాదు కాబట్టి నా బ్లాగు చదవడు అని ధైర్యంగా రాసేశా, మీరు మాత్రం ఇలాంటివి రాయాలంటే ఆలోచించండి.

8, అక్టోబర్ 2019, మంగళవారం

అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు

మొన్న ఉదయాన్నే అప్రైసల్ డిస్కషన్ కి  మా మేనేజర్ సుబ్బారావ్ పిలవగానే ఉత్సాహంగా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళాను . 

నేను - డిస్కషన్ ముందు
"పవన్, ఈ ప్రాజెక్ట్ లో గత సంవత్సర కాలంలో నీ అచీవ్మెంట్ గురించి చెప్పు" అని అడిగాడు మా సుబ్బారావ్ (మేనేజర్). 

సీ మిస్టర్ సుబ్బారావ్, సైరా ప్రాజెక్ట్ సురేందర్ రెడ్డి చేతికి వెళ్ళినప్పుడు ఇతను హేండిల్ చేయగలడా అని అందరూ సందేహించినట్లే, ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పుడు చాలా మంది 'పవన్ ఇంత కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలడా?' అని అనుమాన పడ్డారు.  అందరి నోళ్ళు మూయించేలా నేను ఈ ప్రాజెక్ట్ లో పొడిచేసాను, దంచేసాను, రుబ్బేసాను, ఉతికి ఆరేశాను, ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒంటి చేత్తో నిలబెట్టాను. ఇంతకంటే అచీవ్మెంట్ ఇంకేం కావాలి అన్నాను సినిమా సక్సెస్ అయిన తర్వాత జరిగిన అభినందన సభలో హీరోలా రెట్టించిన ఉత్సాహంతో. 

నా ఉత్సాహం మీద నీళ్లు చల్లేస్తూ "అభినందన్ గురించి నీకేం తెలుసు?" అన్నాడు. 

మన టీం లో అలాంటి పేరు ఎప్పుడూ వినలేదే?

టీం లో కాదు టీవీ లో చూసి ఉంటావ్ గా అతన్ని.

అతనెందుకు తెలీదు సర్, మన దేశం పరువు నిలబెట్టిన వీర సైనికుడు.

మరి దేశ పరువు నిలబెట్టిన అతనిది గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్నావా? లేక ప్రాజెక్ట్ ని ఒంటి చేత్తో నిలబెట్టిన నీదా?

ముమ్మాటికీ అతనిదే?

మరి నీది అసలు అచీవ్మెంట్ కానే కాదని ఒప్పుకున్నట్లేగా?

నేనొప్పుకోను, అయినా మోకాలికి బోడి గుండుకి ముడిపెడతారేంటి?

అదే కదా మేనేజర్ మొదటి క్వాలిఫికేషన్, అది లేకే నువ్వలా ఉండిపోయావ్ నేనిలా మేనేజర్ లా ఎదిగిపోయా. 

అది కాదు సుబ్బారావు గారు, ఎప్పుడో మా అమ్మాయి పుట్టక ముందు నుంచి ఇస్తున్న శాలరీ ఇది, మా అమ్మాయి పెరిగిపోయింది కానీ, నా శాలరీ మాత్రం ఒక్క సెంట్ కూడా పెరగలేదు. అంతెందుకు విజయ్ దేవరకొండ నిక్కర్లు వేసుకునే వయసులో నేను ఈ కంపెనీ లో చేరాను. ఇప్పుడతను అవే నిక్కర్లు, చొక్కాలు తన బ్రాండ్ నేమ్ తో అమ్ముకునే స్థాయికి ఎదిగాడు, నేనేమో ఒక్క ప్రమోషన్ కూడా లేకుండా అదే పొజిషన్ లోనే ఉన్నాను. కరెక్ట్ గా చెప్పాలంటే చిరంజీవి సినిమాలు ఆపేసినప్పడు చేరాను నేనీ కంపెనీలో. ఇప్పుడాయన 150,151 వ సినిమా కూడా పూర్తి చేసి 152 వ సినిమా మొదలుపెట్టాడు, నేనేమో ఏ శాలరీతో ఈ కంపనీలో నా ప్రయాణం మొదలెట్టానో అక్కడే ఆగిపోయాను. 

శాలరీ, ప్రమోషన్ అని అంటున్నావ్ గానీ, యెంత శాలరీ పెంచినా మనిషికి సంతృప్తి అనేది ఉండదు పవన్, సరే సంతృప్తికి డెఫినిషన్ ఇవ్వు ముందు, తర్వాత ఆలోచిద్దాం.

నెక్స్ట్ వీక్ నుంచి నేనుండే ఇంటికి వీక్లీ రెంట్ పది డాలర్స్ పెరుగుతోంది  అంటే నెలకు 40 డాలర్లు, కనీసం ఆ మాత్రం శాలరీ పెరిగితే అదే తృప్తి, సంతృప్తి అన్నాను ఒక సారి.

మరీ ఎక్కువ ఆశిస్తున్నావ్, ఫ్యూచర్ లో లోకేష్ బాబు C.M అవ్వచ్చు, పాల్ P.M అవ్వచ్చు,  అంతెందుకు పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు మొదలెట్టచ్చు గానీ ఇది జరగడం అసాధ్యం. వేరే ఏదైనా చెప్పు. 

ఇప్పుడు నేను ఆఫీస్ కు సైకిల్ లో వస్తున్నానుగా, కనీసం దాని మైంటెనెన్సు ఖర్చులు 20 డాలర్లు వస్తోంది, కనీసం ఆ మాత్రం నెలకు పెరిగితే సంతృప్తి .

ట్రైన్లోనే, బస్సు లోనో వస్తే కనీసం 120 డాలర్లు అవ్వుద్ది, కాబట్టి ఇంకా నువ్వు డబ్బులు మిగిలిస్తున్నావ్. ఇంకోటి చెప్పు.

కనీసం బయట కాఫీ తాగాలంటే 5 డాలర్లు ఖర్చు అవుతుంది, ఆ మాత్రం నెలకు పెరిగితే... 

థూ! సిగ్గుండాలయ్యా, 5 డాలర్లు పెరిగితే మాత్రం సిగ్గు లేకుండా ఎవరితో మాత్రం ఎలా చెప్పుకుంటావ్ 5 డాలర్లు పెరిగిందని.

అర్థమైంది మహానుభావా, ఈ సారి కూడా పెరగదు అనేగా.

అంతేగా! అంతేగా! కాబట్టి 'అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు' అని  అనుకో.

మరి ప్రమోషన్?

సంపూర్ణేష్ బాబు రేంజ్ మహేష్ బాబు రేంజ్ ని దాటొచ్చు అంతెందుకు మోహన్ బాబు కొడుకులు కూడా స్టార్ హీరోలు అవ్వచ్చు గానీ ... 

మళ్ళీ అర్థమైంది మహానుభావా, ఈ మాత్రం దానికి ఈ తొక్కలో డిస్కషన్ ఎందుకు సుబ్బారావ్ గారు.

ఫార్మాలిటీ అమ్మా ఫార్మాలిటీ, ఫాలో అవ్వాలి. పద డిస్కషన్ అయిపోయింది.

అపజయం ఎరుగని రాజమౌళిలా ఠీవీగా మీటింగ్ రూమ్ లోకి వెళ్ళిన నేను పరాజయానికి కేరాఫ్ అడ్రస్ గా మిగిలిపోయిన మెహర్ రమేష్* లా మీటింగ్ రూమ్ లోంచి బయటపడ్డాను.

నేను - డిస్కషన్ తర్వాత

పోస్ట్ పెద్దది అవుతోంది మిగతాది తర్వాత పోస్ట్ లో కంటిన్యూ చేస్తా.

P.S: మెహర్ రమేష్ గురించి తెలియని వాళ్ళు 'శక్తి', 'షాడో' లాంటి సినిమాలు చూడండి, జన్మలో అతని పేరు మర్చిపోలేరు.

1, అక్టోబర్ 2019, మంగళవారం

మేమింతే! ఈ జన్మకి చిరంజీవి ఫాన్స్ గానే ఉండిపోతాం

చొక్కాదేముంది  చినగనీ , మన చిరంజీవి సినిమా టికెట్స్ దొరికాయి చాలు. 

ఎప్పుడు చూడు చిరంజీవి, చిరంజీవి అంటూ సినిమాలేనా, చదివేది ఏమైనా ఉందా?

ఈ సారి తిరణాలకు భలే జనం వచ్చినారు, ఏదో చిరంజీవి సినిమాకి వచ్చినట్లు.  

మనూర్లో వాడొక్కడే చిరంజీవిని చూసొచ్చాడు, అందుకే అంత బడాయి వాడికి. 

చిరంజీవి తర్వాత , ముందు బాగా చదువుకో రేపు నువ్వు పెద్దయ్యాక కూడెట్టేది  అదే. 

నేను పెద్దయ్యాక చిరంజీవితో ఒక సినిమా తియ్యాల.

ఇలాంటి మాటలు బాగా విన్న జనరేషన్ మాది.  ఆ జనరేషన్ లో స్కూల్ లో ఎవడన్నా చిరంజీవి ఫ్యాన్ కాదు అని తెలిస్తే వాడికి సినిమా పిచ్చి లేదని అర్థం, వేరే హీరో ఫాన్స్ లేరని కాదు గానీ, వారిని వేళ్ళ మీద లెక్కట్టచ్చు.   

అప్పుడు మొదలైన చిరంజీవి అనే మత్తు ఇప్పటికీ వదల్లేదు. ఇప్పటికీ T.V లో చిరంజీవి పాట వస్తుంటే యెంత ముఖ్యమైన పనున్నా ఆ పాట చూసి కానీ కదలను. ఆ పాటలో శ్రీదేవి ఉంటే  చిరంజీవి మీద నుంచి చూపు కాస్త మళ్లుతుందేమో కానీ వేరే హీరోయిన్ ఉంటే కాన్సంట్రేషన్ మొత్తం మా బాస్ మీదే.  

అలాంటి మా బాస్ ఇప్పటికీ హీరో అంటే చెప్పుకోవడానికి మాకు ముఖ్యంగా నాకు కొద్దిగా అసహనంగా ఉంది, వద్దులే అసహనం అనే మాట వింటే మనోభావాలు గట్రా దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎబ్బెట్టుగా ఉంది అని అంటాను ఎందుకంటే ఈ  వయసులో ఇంకా డ్యూయెట్స్ పాడుతూ హీరో ఏమిటి అని? కాకపోతే ఆయన వయసుకు తగ్గ పాత్రలైతే హుందాగా ఉంటుంది అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. ఇప్పుడు సైరా (తన వయసుకు కాస్తో కూస్తో తగ్గ పాత్రే అనుకుంటున్నా, ఏ మగధీరో, బాహుబలో అనకుండా) అంటూ వస్తున్నాడు కాబట్టి ఆ ఇబ్బంది లేదు. 

గత రెండు రోజులుగా ఏ ఇద్దరు మిత్రుల మధ్యన సంభాషణ మొదలైనా సైరా కి వెళ్తున్నావా అని మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాను. తెలుగులో తన తరం హీరోలు ఈ తరం హీరోలతో పోటీ పడలేక వెనకబడి పోతుంటే మా బిగ్ బాస్ మాత్రం ఇప్పటికీ 'సై' రా అంటూ 'వయసైపోయినంత మాత్రాన కొదమ సింహం గడ్డి తినడం మొదలెట్టదు, రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉంటుంది బాక్సులు బద్దలయ్యేలా' అని ఈ తరం హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారు అరవయ్యేళ్ళ మా చంటబ్బాయ్

మధ్య మధ్య కాస్త ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా రాజా విక్రమార్కలా తన ప్రయత్నాలు మాత్రం ఎప్పుడూ ఆపకుండా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతూ వచ్చారు అందుకే అనొచ్చు బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ అని. సినిమాల్లో అందరివాడు అనిపించుకుని రాజకీయాల్లో మాత్రం ది జంటిల్మెన్ అని అనిపించుకోలేకపోవడం కాస్త వెలితిగా అనిపిస్తుంది. 

అడవికి రారాజు మృగరాజు అయితే తెలుగు సినిమా ప్రపంచంలో మగ మహారాజు మా హీరో.  రిక్షావోడైనా, గ్యాంగ్ లీడర్ లైనా, ముఠామేస్త్రి లైనా, ఆఖరికి  హిట్లర్ లాంటి వారైనా ఆయన్ను తెర మీద చూసి జై చిరంజీవా అని జేజేలు కొడుతూ మిమ్మల్ని ఎప్పటికీ తెర మీదే చూడాలని ఉంది అన్నయ్య  అని మైమరచి పోతారు.    

మొన్నటికి మొన్న 150 వ సినిమాతో విజేత అనిపించుకుని ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో ఆయనే  ఖైదీ గా నిలిచిపోయారని నిరూపించారు. ఇప్పుడీ 151 వ సినిమా కూడా మా చక్రవర్తి కీర్తి కిరీటం లో మరో  కలికితురాయిగా చేరుతుందని మా చిరంజీవి అభిమానుల అభిలాష. ఇల లోని ఈ విజయాలన్నీ అక్కడి ఇంద్ర లోకం నుంచి స్వర్గీయ అల్లు రామలింగయ్య గారు చూసి  మా అల్లుడా! మజాకా! అని మరో సారి పొంగిపోవాలి.   

మా కరడు కట్టిన చిరంజీవి అభిమాని ఖాసీం కి మాట ఇచ్చినట్లు ఈ సినిమా రిలీజ్ మొదటి రోజు చూడటం లేదు. చిరంజీవి ఫాన్స్ ఎవరైనా ఇది చదువుతూ ఉండి ఉంటే కాస్త ఊపిరి పీల్చుకోండి. కాకపోతే సీట్స్ ఇంకా ఖాళీ ఉన్నాయ్ కాబట్టి ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. 


సైరా కి పోటీ అంటున్న హిందీ సినిమా 'వార్' పరిస్థితి ఇంతకంటే ఘోరంగా ఉంది. దిక్కుమాలినన్ని సీట్స్ ఖాళీ ఉన్నాయి. ఏది హిట్ అవుతుంది అనేది తర్వాత విషయం, క్రేజ్ విషయంలో యూత్ హీరోలతో పోటీ పడగలుగుతున్నాడు అని మాత్రం చెప్పొచ్చు. 

ముసలోడికి ఇప్పుడు సైరా లాంటి సినిమా అవసరమా? ప్రభాస్ లాంటి మంచి ఫిజిక్ ఉన్న హీరో అయితే బాగుండు అనేవాళ్ళు అంటూనే ఉంటారు. మాకు అవేమీ పట్టవు, ప్రభాస్, మహేష్ మాకొద్దు.  మేమింతే! చిరంజీవి అనే మత్తు వదలదు అదంతే , మేమింతే. ఈ జన్మకి చిరంజీవి ఫాన్స్ గానే ఉండిపోతాం మా ప్రాణాలు పోయేదాకా. మంచికో, చెడుకో కొందరికి తాగుడు, జూదం అంటూ ఏదో ఒక వ్యసనం ఉంటుంది మాకూ చిరంజీవి అనే వ్యసనం ఉంది, అదలానే ఉండిపోనీ నష్టమేముంది. 

ఏంటి డాన్స్ నేర్చుకుంటావా? వీడో పెద్ద చిరంజీవి మరి, డాన్స్ నేర్చుకుంటాడట మొహం చూడు. 

అవును మరి డాన్స్ గురించి ఎవరైనా అంటే మా చిరంజీవే గుర్తొస్తాడు ఇప్పటికీ, ఎప్పటికీ. ఆయనొక మాస్టర్ పీస్, డాన్స్ లో ఆ గ్రేస్, స్టైల్ మరెవరికీ లేదు, రాదు.  

ఏంటో ఈ వెర్రి "సినిమా హీరోలకి అభిమానులు" అట? వాళ్ళేం సాధించారని అదంతా దర్శకుల గొప్పతనం? అనే వాళ్ళు అననీ. ఒక సామాన్యుడు ఈరోజు కొన్ని కోట్ల మంది తన గురించి మాట్లాడుకునేలా చేసాడంటే ఆ స్వయంకృషి విలువ సామాన్యం కాదు, ఆ కష్టపడే తత్త్వం ఆదర్శంగా తీసుకుంటే మనమూ అద్భుతాలు సృష్టించచ్చు... 

సృష్టించచ్చు ... అంటూ చచ్చు మాటలెందుకూ చచ్చే లోగా మనమూ అద్భుతాలు సృష్టిద్దాం. 

23, సెప్టెంబర్ 2019, సోమవారం

ఒరు నాళ్ ఇరవిల్ - ఒరు తమిళ్ పడం

నాకు తమిళ చిత్రాలతో అనుబంధం డబ్బింగ్ సినిమాల ద్వారా చిన్నప్పటి నుంచే మొదలైంది, కాకపోతే డైరక్ట్ తమిళ సినిమాల వాసన తగిలింది మాత్రం తిరుపతి లోనే. 

సరే మనకున్న సినిమాల passion కు (దీన్నే పిచ్చి అని అంటారు కొందరు) లాంగ్వేజ్ barrier అనే అడ్డెందుకు అని డిసైడ్ అయి, తమిళ్ సినిమా చూద్దాం అని "పళని" కి బయలుదేరా. పళని అంటే తమిళనాడు లో ఉండే ఊరు అని పొరపడకండి. అది మా ప్లాట్ నెంబర్ 62 దగ్గర్లో ఉన్న థియేటర్. అక్కడి నుంచే ఈ తమిళ సినిమాల వాసన తగిలేది.

అక్కడ నేను చూసిన మొదటి సినిమా 'పార్థేన్ రసితెన్' అనే తమిళ హిట్ చిత్రం (తెలుగులో శ్రీకాంత్ హీరోగా 'నా మనసిస్తా రా' అని రీమేక్ చేస్తే అట్టర్ ప్లాప్ అయింది, అది వేరే విషయం). అప్పట్లో టీ బంకుల దగ్గర తమిళ హోటల్స్ లో ఈ సినిమా పాటలు మార్మోగిపోయేవి. ఇప్పటికీ వినడానికి బాగుంటాయి, తమిళ్ నచ్చకపోతే తెలుగు సినిమా పాటలు వినండి, మంచి మ్యూజికల్ ఎంటర్టైనర్.

ఆ సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు ఒక తమిళ్ వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను నిల్చొని ఉంటే 'ఉక్కారుంగా' అన్నాడు ఖాళీ సీట్ చూపిస్తూ, ఆ 'ఉక్కారుంగా' కి అర్థం తెలియకపోయినా కూర్చోమంటున్నాడు కదా అని అర్థమై కూర్చున్నా అక్కడ ఖాళి సీట్ లో.

కాసేపటికి 'నేరం ఎన్న?' అనేదో అన్నాడు.

ఇదేమైనా పోలీస్ స్టేషనా 'నేరం ఏం చేసావ్?' అని అడగటానికి అని కన్ఫ్యూజ్ అయ్యా,

'నేరం ఎన్న?' అన్నాడు ఈ సారి మళ్ళీ నా చేతి కున్న వాచ్ వైపు చూపిస్తూ.

2:30 అన్నాను.

తర్వాత మళ్ళీ తమిళ్ లో ఏదో అన్నాడు, ఆ  ముక్క అర్థం కాలేదు, ఇప్పుడు గుర్తు కూడా లేదు.

"ఎనక్కు తమిళ్ తెరియాదు" అన్నాను వచ్చీ రాని తమిళ్ మాటలు కూడబలుక్కొని.

మరి తమిళ్ సినిమాకి ఎందుకు వచ్చావ్? అన్నట్లు పేస్ పెట్టాడు అతను. 

సో అలా మొదలైన ఆ తమిళ సినిమాల వాసన ఇప్పటికీ నన్ను తాకుతూనే ఉంటుంది. పొరుగింటి పుల్లగూర రుచి అన్నట్లు, నా మటుకు నాకు చాలా వరకు తమిళ్ సినిమాలు బాగా నచ్చుతాయి.  అందులో భాగంగానే ఈ మధ్య చూసిన నాకు నచ్చని/నచ్చిన ఓ నాలుగు సినిమాల గురించి మాట్లాడుకుందాం.  అందులో మొదటిగా  'ఒరు నాళ్ ఇరవిల్' అనే తమిళ సినిమా తో మొదలెడతాను.  

సత్యరాజ్ తప్ప సినిమాలో చాలా వరకు నాకు తెలియని నటీనటులే. ఇది 'షట్టర్' అనే మళయాళ సినిమా రీమేక్. ఆ మళయాళ మాతృక గురించి పెద్దగా తెలియదు గానీ ఈ తమిళ సినిమా మాత్రం నాకు బాగా నచ్చింది. ఇదే సినిమాని తెలుగులో ప్రకాష్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రధారులుగా 'మన ఊరి రామాయణం' అని తీశారు. 

వీలయితే ఈ తమిళ సినిమాని మీరూ చూడండి, నచ్చుతుందనే అనుకుంటున్నాను. యు ట్యూబ్ లో ఫ్రీ గానే దొరుకుతుంది.

అలాగే Monster అని మరో తమిళ్ సినిమా చూశాను, డైరెక్టర్ కం యాక్టర్ అయిన S.J. సూర్య హీరో గా నటించిన సినిమా, చాలా బాగుంటుంది కామెడీగా. 'ఏ ప్రాణినీ చంపడానికి ఇష్టపడని ఒక వ్యక్తి' అనే చిన్న కాన్సెప్ట్ ని స్టోరీ గా మలచి తీసిన సినిమా. సినిమాలో మెజారిటీ భాగం హీరో, ఎలుక మధ్య నడిచే సన్నివేశాలతోనే ఉంటుంది.  కాకపొతే ఎలుకంటే చాలా మందికి చూడటానికే అలర్జీగా అనిపిస్తుంది కాబట్టి అలాంటి వారి గురించి చెప్పలేను కానీ లేదంటే చూడ్డానికి సినిమా చాలా బాగుంటుంది.

ఎక్కడో ఫారిన్ లో పాటలు, ఒక పద్ధతీ పాడూ అంటూ లేని హీరోయిన్ వ్యక్తిత్వం, ఒసేయ్, పోవే అంటూ హీరోయిన్ లను వెకిలిగా పిలిచే హీరో క్యారెక్టర్, ఐటెం సాంగ్స్, ఇవే కాకుండా అమ్మ, అన్న, వదిన అని తేడా లేకుండా అందరినీ వంగోబెట్టి తంతూ ఉంటే అదే కామెడీ అని ఇష్టపడేవాళ్ళు మాత్రం ఈ సినిమాలకు దూరంగా ఉండటం మంచిది.  అలాంటి వారికి నచ్చే మరో సినిమా కూడా చూశాను అదే కాంచన-3.

ఇక మీరెంత టార్చెర్ భరించగలరో టెస్ట్ చేసుకోవాలి అనిపిస్తే 'Anbanavan Asaradhavan Adangadhavan' సింపుల్ గా AAA అనబడే శింబు సినిమా చూడండి. 

15, ఆగస్టు 2019, గురువారం

తలా తోక లేని కథే కావచ్చు

పెన్సిల్ తన మానాన తాను ఏదో రాస్తోంది. 

అప్పుడప్పుడూ రబ్బర్ కొంచెం కొంచెంగా కొట్టేస్తూ ఉంది . 

ఎందుకు కొట్టేస్తున్నావ్? 

నువ్వు తప్పు రాశావు, అందుకే 

కాసేపటికి మళ్ళీ రబ్బర్ కొట్టేసింది.  

మళ్ళీ ఎందుకు?

నువ్వు మళ్ళీ తప్పు రాశావు, అందుకే. 

"నువ్వు ఇలా ప్రతి సారి అడ్డుతగిలితే నేను పూర్తి చెయ్యలేను" విసుక్కుంది పెన్సిల్ 

అయినా రబ్బర్ తన పని తాను చేస్తూనే ఉంది. 

నిన్ను తిట్టినా నీకు బుద్ధి రాదు, అయినా ఎందుకు ఎప్పుడూ నా వెన్నంటే ఉంటావు, నీకు అస్సలు సిగ్గు లేదు. 

ఇవేమీ పట్టనట్లుగా రబ్బర్ తన పని తాను చేస్తూనే ఉంది. 

ఇలా పెన్సిల్ రాస్తూనే ఉంది, రబ్బర్ సరిచేస్తూనే ఉంది. 

కొంతకాలానికి రాయడం పూర్తయ్యింది, చాలా బాగా రాశావని అందరూ పెన్సిల్ని మెచ్చుకున్నారు. 

పెన్సిల్ ఇంటికి వస్తూనే 'చూశావా, ఎప్పుడూ నేను రాస్తుంటే తప్పులు, తడకలు అంటూ నాకు అడ్డు తగులుతూ నన్ను అరగదీస్తుండేదానివి.   ఇప్పుడు చూడు చాలా బాగా రాశానని అందరూ మెచ్చుకుంటున్నారు, నువ్వు అడ్డు రాకపోయి ఉంటే ఇంకా తొందరగా పని పూర్తి చేసేదాన్ని' అని రబ్బర్ తో అందామనుకుంది. 

రబ్బర్ మాత్రం ఎక్కడా  కనిపించలేదు, రబ్బర్ అరిగిపోయి చాలా చిన్న ముక్క మిగిలి ఉండటం వల్ల నేమో పనికి రాదని చెత్త బుట్ట లోకి తోసేసినట్లు గుర్తొచ్చింది. 

ఒకప్పుడు బలంగా, పెద్దగా ఉండే రబ్బర్ ఇలా పీలగా, చిన్నగా అయిపోయిందనే విషయం అప్పుడే అర్థం అయింది. 

నేను తప్పు చేసిన ప్రతీ సారి నన్ను సరిచేస్తూ నువ్వు అరిగిపోతున్నావని నేను గుర్తించలేకపోయాను, క్షమించు అంది పెన్సిల్. 

ఇంతే కథ. ఇది అర్థం పర్థం లేని, తలా తోక లేని కథే కావచ్చు, కానీ రబ్బర్ స్థానం లో మన తల్లిదండ్రులు, పెన్సిల్ స్థానం లో మనము ఉన్నామని గుర్తిస్తే ఈ కథకు తల, తోకే కాదు ప్రాణం కూడా ఉందని అనిపిస్తుంది.