26, జనవరి 2022, బుధవారం

సినిమా జ్ఞాపకాలు - మండే సూర్యుడు

నా  తొమ్మిదవ తరగతి మిత్రుడు ముగ్ధుమ్ కు వీడ్కోలు చెబుతున్న సమయం అది. మా నాన్నగారికి కర్నూల్ జిల్లా పత్తికొండ నుంచి కడప కి ట్రాన్స్ఫర్ అయ్యింది. (ఇప్పుడు ఈ జిల్లాల పేర్లు అలానే ఉంచారో లేక నిన్న విడుదల చేసిన జాబితాలో మార్చేశారో తెలీదు) 

సరిగ్గా మేము ఆ పత్తికొండ లో ఉన్నది ఒక్క సంవత్సరమే అయినా ఆ కొద్ది సమయం లోనే నా  మనసుకు దగ్గరయిన మిత్రుడు ముగ్ధుమ్ అని చెప్పగలను. అప్పట్లో మా వయసుకి  సినిమా మాత్రమే సరదా కాబట్టి చివరి రోజు ఇద్దరం కలిసి సినిమాకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. 

అప్పట్లో ఆ ఊర్లో ఉన్నది  రెండు థియేటర్స్, ఒక దాంట్లో మేము చూసేసిన సినిమా ఏదో ఆడుతోంది కాబట్టి రెండో దాంట్లో ఏ సినిమా ఆడుతుందో దానికే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాం. 

ఆ రెండో థియేటర్ లో 'మండే సూర్యుడు' అనబడే తెలుగు లోకి డబ్ చేసిన తమిళ్ సినిమా ఆడుతోంది. సైడ్ క్యారెక్టర్, విలన్ లేదంటే సెకండ్ హీరో వేషాలేసుకొనే అతను ఆ సినిమాలో  హీరో అని బయట సినిమా పోస్టర్ చూస్తే అర్థం అయింది. నిజంగా చెప్పాలంటే అతన్ని స్టువర్ట్ పురం పోలీసుస్టేషన్  సినిమాలో  విలన్ గా, గ్యాంగ్ లీడర్ సినిమాలో చిరంజీవి  అన్నగా చూసినట్లు గుర్తు కానీ అతని పేరు అప్పటివరకూ రిజిస్టర్ కాలేదు. అంతే కాకుండా 'కెప్టెన్ ప్రభాకర్' అనే తమిళ్ సినిమా లో కూడా చూశాను కానీ అతను బాగా గుర్తుండి పోయింది మాత్రం వెంకటేష్ నటించిన  సూర్య I.P.S సినిమాలో, అదేమంత బంపర్ హిట్ కాదు గానీ ఆ రోజుల్లో బానే ఆడింది.

ఆ సినిమాలో ఒక బాక్సింగ్ పోటీలో అతని చేతిలో వెంకటేష్  ఓడిపోతాడు. అప్పటికే వెంకటేష్ మంచి కమర్షియల్ హిట్లతో స్టార్ల లిస్ట్ లో చేరిపోయినా  క్యారెక్టర్ కోసం వెంకటేష్ ఎలాంటి సీన్స్ అయినా చేసేవాడు. మిగతా స్టార్ హీరోల లాగా ఇగో ల మాటున ఇరుక్కోవడం అప్పటి నుంచే లేదు అతనికి. ఆ సినిమాలో పోలీస్ ట్రైనర్ క్యారెక్టర్ లో అతని బాడీ లాంగ్వేజ్, పర్సనాలిటీ మాత్రం బాగా నచ్చింది. అర్రె, హీరో అంటే ఇలా కదా ఉండాలి, ఇతనెందుకు హీరో కాకూడదు అనుకున్నాను అప్పట్లో. 

సో అప్పుడెప్పుడో అనుకున్నది కళ్ళ ఎదురుగా జరగడం చూసి ఆ సినిమాకే వెళదామని డిసైడ్ అయ్యాం. మరి తక్కువ అంచనాలతో చూడటం వల్లో, లేదంటే సినిమా నిజంగానే బాగుండటం వల్లో మాకు విపరీతంగా నచ్చేసింది 'మండే సూర్యుడు' అనబడే ఆ సినిమా. ఆ తర్వాతే తెలిసింది అతని  పేరు శరత్ కుమార్ అని. 

ఆ తర్వాత ఈ 'మండే సూర్యుడు' సినిమా ఎప్పుడూ చూడలేదు, మళ్ళీ చూసినా నచ్చుతుంది అన్న గారంటీ లేదు, కొన్ని సినిమాలు ఆ కాలానికే నచ్చుతాయి అంతే. చిన్నప్పుడు పల్లెల్లో ఉండటం వల్ల  ఖైదీ సినిమా చూళ్ళేదు, 1995 టైం లో అనుకుంటా ఒక సారి చూశాను. నాకేం పెద్ద నచ్చలేదు. ఏముందని ఈ సినిమాలో అంత హిట్టయ్యింది అని అనిపించింది కానీ కాలం తో జరిగే మార్పుల ప్రభావం అది అని అప్పుడు నాకు అర్థం కాలేదు. క్లాస్ సినిమాల మాటేమో గానీ మాస్ సినిమాలకెప్పుడూ కాలం గడిచిన తర్వాత కూడా ఆదరణ దక్కుతుందని చెప్పలేము.  

'మండే సూర్యుడు' అనే టైటిల్ తోనే  ఆర్య హీరోగా ఒక డబ్బింగ్ సినిమా నిన్న యూట్యూబ్ లో చూశాను, అప్పుడు ఈ పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి ఇలా పోస్ట్ రాసేశాను.  వీలయితే చూడండి సినిమా బానే ఉంటుంది పోకిరి సినిమా ఫ్లేవర్ కనపడుతుంది ఈ సినిమాలో.