17, ఆగస్టు 2016, బుధవారం

ఛోటా సర్దార్జీ పుట్టిన రోజు పార్టీ కబుర్లు


మా అపార్టుమెంట్ లో ఉంటున్న ఒక సర్దార్జీ, వాళ్ళ అబ్బాయి పుట్టిన రోజు పార్టీ కి మమ్మల్ని ఆహ్వానించారు. 

ఇంతకీ మీ వాడికి ఏమిష్టం ..బొమ్మలా, పుస్తకాలా లేక వీడియో గేమ్సా అని అడిగా 

బొమ్మలా అని ఆశ్చర్యంగా అడిగాడు 

ఏం మీ వాడు బొమ్మలతో ఆడుకోడా అన్నాను 

బొమ్మలతో ఆడుకునే వయసు దాటిపోయి అమ్మాయిలతో తిరిగే వయసొచ్చింది అన్నాడు నవ్వుతూ

ఇంతకీ పుట్టిన రోజు మీ పెద్దాడిదా చిన్నాడిదా అన్నాను కాస్త క్లారిటీ వచ్చి 

ఓహో నువ్వు చిన్నాడిది అనుకున్నావా కాదు పెద్దాడిది.  వాడికి 20 కంప్లీట్ అయి 21 వస్తున్నాయి. వాడిదే బర్త్ డే పార్టీ అన్నాడు. 

మరి మేము ఇక్కడున్న గత మూడు ఏళ్లుగా ఎప్పుడూ సెలెబ్రేట్ చెయ్యలేదు ఇప్పుడేంటి స్పెషల్ అని అడిగాను. 

ఇక్కడ మేము మా కమ్యూనిటీ లో అబ్బాయిలకు 1st, 11th, 21st అదే అమ్మాయిలకైతే 18th బర్త్ డే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటాము. 18 నిండిన తర్వాత మందు తాగడానికి ఆఫీసియల్ గా గవర్నమెంటు పర్మిషన్ ఇచ్చినా కొందరు పెద్దలు మాత్రం 21 నిండిన తర్వాతే పర్మిషన్ ఇస్తారు.  అందుకే కొందరు 21st పుట్టిన రోజుకు గిఫ్ట్ తో పాటు బీర్ బాటిల్ ను కూడా ఇస్తారు అన్నాడు. 

(పైన జరిగిన సంభాషణ అంతా నాకు వచ్చీరాని హిందీ లో మాట్లాడాను...నా బ్లాగ్ రీడర్స్ క్షేమం కోరి నేను మాట్లాడిన హిందీ భాషను ఇక్కడ రాయలేదు..అలాగే రాశానంటే గిల గిల కొట్టుకొని మూర్ఛపోవలసి వస్తుంది.)


మేము పార్టీ కి వెళ్ళేప్పటికీ సీట్స్ అన్నీ నిండిపోయి ఉన్నాయి.  ఒక 6 సీట్ టేబుల్ లో మాత్రం ఇద్దరే కూర్చొని ఉండటంతో వారి పక్కన కూర్చోవలసి వచ్చింది. వాళ్లిద్దరూ ఆరడుగుల ఎత్తుతో, మొరటుగా, లావుగా తెలుగు సినిమాల్లో నటించే నార్త్ ఇండియన్ విల్లన్స్ లాగా ఉన్నారు. అందరూ సూటు బూటు  వేసుకుని వస్తే వాళ్ళు మాత్రంచాలా సాధారణ డ్రెస్సుల్లో వచ్చారు. 

వీళ్ళ పక్కన సీట్ ఎందుకు దొరికిందా అని తిట్టుకుంటూనే, వాళ్ళు మాట్లాడించినప్పుడల్లా  పొడి పొడి గా సమాధానమిచ్చాను. ఒకరు ట్రక్ డ్రైవర్ గానూ, మరొకరు సెక్యూరిటీ గార్డ్ గానూ పని చేస్తున్నారని తెలిసింది వాళ్ళ మాటల మధ్యలో.  వీళ్ళను చూస్తే రౌడీల్లాగా ఉన్నారు వీళ్ళతో ఎందుకు ఎక్కువ మాట్లాడటం అని వారిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తూ అక్కడున్నంత వరకూ మన్మోహన్ సింగ్ గారిలా మౌనంగా ఉండిపోయాను. తిండి తింటున్నప్పుడు మాట్లాడకూడదు అన్న పెద్దల మాటను అక్షరాలా పాటించాను ఆ కొద్ది సేపు . 

పార్టీ లో స్టేజి మీదకు వచ్చిన ఒక పంజాబీ పెద్దాయన మాట్లాడుతూ ఈ కాలం యువకులు పంజాబీ మాట్లాడటం మానేశారని, కొందరికి మాట్లడటం సరిగ్గా రాదని వాపోయాడు. చిన్నప్పుడు ఏమో ఇంగ్లీష్ లోనే మాట్లాడండి అని పిల్లలపై ఇదే పెద్దలు ప్రెషర్ పెట్టడం ఇప్పుడేమో వాళ్లకు మాతృభాష మాట్లాడటం రాదు అని బాధపడటం.  ఇదెలా ఉందంటే ఇండియా లో ఉన్నప్పుడేమో చైనీస్ రెస్టారెంట్ ఎక్కడుందా అని వెతుక్కోవడం , చైనా కు వెళ్ళినప్పుడు ఏమో ఇండియన్ రెస్టారెంట్ ఎక్కడుందా అని వెదుక్కోవడం లాగా. 

ఆ అబ్బాయి చిన్నప్పటి ఫోటోలు కాసేపు అక్కడున్న స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశారు. ఆ తర్వాత మరి కొంతమంది పెద్దలు, బంధువులు స్టేజి పైకి ఎక్కి అతనితో వాళ్ళ చిన్ననాటి సంగతులు నెమరు వేసుకున్నారు. ఇలా బోరింగ్ గా సాగుతున్న పార్టీ ఒక్కసారిగా ఓ 21 మంది పంజాబీ యువకులు వాళ్ళ వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులతో స్టేజి మీదకు వచ్చి వేసిన డాన్స్ తో జోరందుకుంది 

వాళ్ళు ఒక ఎక్సపీరియెన్సుడ్ డాన్స్ టీం లాగా డాన్స్ వేశారు. డాన్స్ అంతా అయిపోయాక 'పేరెంట్స్.. దిస్ ఈజ్ ఫర్ యు' అన్నారు వాళ్లంతా ఒక్కసారిగా . ఆల్మోస్ట్ పార్టీ కి వచ్చిన 200 మంది నిలబడి మరీ చప్పట్లు కొట్టారు వాళ్ళ డాన్స్ కి. ఆస్ట్రేలియా లోనే పుట్టి పెరిగిన యువకులే వీళ్లంతా. ఎప్పుడూ పార్టీ లు, షికార్లు అంటూ తిరిగే వీరు అంత బాగా వాళ్ళ భాంగ్రా డాన్స్ వేయడం వాళ్ళ పేరెంట్స్ కు బాగా సంతోషాన్నిచ్చింది. 

రెండు నెలలు ప్రాక్టీస్ చేసి మరీ నేర్చుకున్నారట పేరెంట్స్ కు తెలియకుండా వాళ్ళు. అంత అద్భుతంగా చేశారు డాన్స్.  వాళ్ళ బ్లడ్ లోనే ఉందనుకుంటాను ఆ బాంగ్రా డాన్స్ .

ఒక ఫాన్సీ వాచ్, ఒక సెక్యూరిటీ వాలెట్ గిఫ్ట్ గా ఇచ్చాము ఆ అబ్బాయికి మాకు ఇంతకంటే మంచి గిఫ్ట్ ఐడియా తట్టలేదు. 

పార్టీ అర్థరాత్రి పైగా సాగింది కానీ మా పాప, మా బాబు ఇద్దరూ మా భుజాల మీదే పడుకోవడం తో ఇక అక్కడ ఉండలేక పార్టీ మద్యలోనే బయలుదేరాము. తీరా వెళదామని సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఆ పార్టీ హాల్ నుండి బయటికి వస్తే అక్కడున్న ఒకే ఒక లిఫ్ట్ పనిచేయలేదు. పార్టీ కి వచ్చేముందే అక్కడుండే ఒక మాల్ లో కొన్న గ్రోసరీ సామాన్లు, fruits అన్నీ Pram లో కింద పెట్టాము.  ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలతో, ఆ pram తో ఈ 2 ఫ్ల్లోర్స్ కిందకు ఎలా దిగాలిరా దేవుడా అనుకునే సమయంలో దేవుడు పంపినట్లుగా ఇద్దరు దేవదూతలు వచ్చి ఆ pram ను తలో వైపు పట్టుకొని కిందకు దించి మాకు సహాయం చేశారు. 

ఆ దేవదూతలు మరెవరో కాదు నార్త్ ఇండియన్ విలన్స్ తో పోల్చానే వాళ్ళే. అనవసరంగా అపార్థం చేసుకున్నానే  అనే గిల్టీ ఫీలింగును వారికి మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్పి కొంతవరకైనా పోగొట్టుకున్నాను.

ఇండియా కు 3 వారాలు వెకేషన్ కు వెళ్తుండటం వల్ల అక్కడి నుంచి తిరిగి వచ్చేవరకు నా బ్లాగ్ కి సెలవు ప్రకటిస్తున్నాను. 


11, ఆగస్టు 2016, గురువారం

వృద్ధ నారీ పతివ్రతా

హిజ్రా పాత్రలను కమెడియన్స్ గానూ, విల్లన్లుగానూ చూపించడం తప్పు - ప్రకాష్ రాజ్ 

ఈ మధ్య వస్తున్న సినిమా పాటల్లో బూతులు ఎక్కువగా వాడుతున్నారు. అలాంటి పాటలను గాయకులు పాడకపోవటం మంచిది  - S.P బాలసుబ్రమణ్యం 

ఇప్పుడొస్తున్న సినిమాల్లో ద్వందార్థాల డైలాగులు, వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి.. అందుకే ఈ మధ్య సినిమాలు తగ్గించుకున్నాను. సీనియర్స్ అంటే గౌరవం చూపడం లేదు -- గిరిబాబు 

ఈ మధ్య ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ చూసినప్పుడు 'వృద్ధ నారీ పతివ్రతా'  అన్న సంస్కృత వాక్యం గుర్తుకు వస్తుంది. 

ప్రకాష్ రాజు గారు ఒకప్పుడు ఒక సినిమాలో హిజ్రా గా విలన్ పాత్రలో నటించారు. ఇప్పుడేమో అలా చూపడం మంచిది కాదు అంటున్నారు. అప్పుడేదో అలా చేసాను కానీ ఇప్పుడైతే అలా చేయను అన్నది ఆయన గారి స్టేట్మెంట్. (బహుశా కొత్త సినిమాలో విక్రమ్ చేస్తున్న హిజ్రా విలన్ పాత్ర గురించి కాబోలు). హిజ్రాలను అలా చూపడం ముమ్మాటికీ తప్పే. నేనూ ఆయనతో అంగీకరిస్తాను కానీ ఆయన ఒకప్పుడు అలాంటి పాత్రలను పోషించి ఇప్పుడు అలాంటి పాత్రలు వేయకండి ఆనుతున్నారు  కాబట్టే నాకు 'వృద్ధ నారీ పతివ్రతా' అన్నది గుర్తుకు వస్తుంది. 

ఇక S.P బాలసుబ్రమణ్యం గారి గురించి మాట్లాడే వయసు, అర్హత నాకు లేదు అని తెలుసు కానీ ఆయన కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు మంచి పాటలే కాకుండా బూతు అర్థాలు ఉన్న పాటలు పాడారన్న విషయం ఆయనకూ తెలుసు. నా వరకైతే బాలు గారు సినిమాల్లో పాడటం తగ్గించాక కొత్త పాటలు వినటం కూడా తగ్గించాను. ఎందుకో మరి ఆయన వాయిస్ తప్ప చాలా కొద్దీ మంది వాయిస్ వినడానికే ఇష్టపడతాను అంత  పెద్ద ఫ్యాన్ ని నేను ఆయనకి. కానీ ఆయన స్టేట్మెంట్ విన్నాక 'వృద్ధ నారీ పతివ్రతా' అన్నది గుర్తుకు వస్తుంది. 

ఇక గిరిబాబు గారి విషయానికి వస్తే ఆ కాలంలో సినిమాలు చూసిన పాత తరం వారికి గిరిబాబు వేసేవి వెకిలి వేషాలుగా అనిపించి ఉండచ్చు.  ఈ కాలంలో మిగతా నటులు వేసే పాత్రలు ఆయనకి వెకిలి వేషాలుగా అనిపించి ఉండచ్చు. 

అసలు ఒక సంస్కృత కవి ఏమన్నాడో తెలుసా 

అసమర్థస్య సాధూనాం 
నిర్దనస్య జితేంద్రియః 
వార్ధక్యో దేవతాభక్తి 
వృద్ధ నారీ పతివ్రతా 

అసమర్థుని మంచి తనము, డబ్బు లేని వాడి ఇంద్రియ నిగ్రహము, వయసు మళ్ళాక దైవ భక్తి, వయసు పైబడిన స్త్రీ పాతి వ్రత్యము ఒక్కలాంటిదే అని.

ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నట్లు గుర్తు. మీలో చాలా మంది ఇంగ్లీష్ మీడియం లో చదువుకొని ఉంటారు కాబట్టి తెలుగు లో చెబితే అర్థం అవుతుందని చెప్పాను. గ్రామర్ తప్పులుంటే మన్నించండి..  అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించండి.

మీరు సినిమా ప్రేమికులైతే పెదరాయుడులో మోహన్ బాబు గారి డైలాగ్ గుర్తొచ్చి ఉండాలి ఈ పాటికే.

ఒకసారి మోహన్ బాబు గారు స్టేజి మీద సినిమా టీం మెంబెర్స్ గురించి మాట్లాడుతూ సినిమా సెట్స్ మీద, తెర వెనుక మీరు ఎలాగైనా పిలుచుకోండి వారితో ఎలాగైనా బిహేవ్ చేయండి అది మీ ఇష్టం అంతే కానీ స్టేజి మీద మాత్రం తోటి సినిమా వారిని అగౌరవించకండి అన్నారు. మరి ఆయనే  స్టేజి మీద ఎన్నో సార్లు రజని గాడు అని పిలడవం విన్నాను. ఆయనకు రజిని కాంత్ గారు క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు ఒరేయ్ ఒరేయ్ అని పిలుచుకునేంత చనువు ఉండచ్చు, కానీ స్టేజి మీద రజని గాడు, వాడు, వీడు అని సంబోధించినప్పుడు మాత్రం మనస్సు చివుక్కుమంటుంది. అవును మరి వారు చేస్తే శృంగారం మిగతా వాళ్ళు చేస్తే వ్యభిచారం.


10, ఆగస్టు 2016, బుధవారం

పటం చిత్వా ఘటం భిత్వా


అబ్బిగాడు: ఏమిటి  సుబ్బిగా...   దీర్ఘంగా ఆలోచిస్తున్నావు 

సుబ్బిగాడు: ఏమి లేదు నా పేరు నలుగురి నోళ్ళలో నానాలంటే ఏమి చెయ్యాలా అని 

అబ్బిగాడు: ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది 

సుబ్బిగాడు: మొన్న ఒక పెళ్ళికి వెళ్తే అక్కడందరూ నన్ను మల్లమ్మ మొగుడుగానే పరిచయం చేశారు. నాకంటూ ఒక గుర్తింపు కావాలి అర్జెంటుగా 

అబ్బిగాడు: పటం చిత్వా ఘటం భిత్వా

సుబ్బిగాడు: ఈ మాత్రం దానికే తిట్టాలేంట్రా  

అబ్బిగాడు: తిట్టడం కాదు.. పటం చిత్వా ఘటం భిత్వా అంటే నలుగురు జనాలు ఉన్న చోట వేసుకున్న చొక్కా చింపేసుకోవడమో లేదంటే జంక్షన్ లో ఓ కుండ పగలకొట్టడమో చేసేయ్ అని..అలా చేస్తే నలుగురు నిన్ను గుర్తిస్తారు 

సుబ్బిగాడు: మరీ చొక్కా చించుకోవడం బాగోదేమో .. అయినా ఈ కాలంలో కుండ ఎక్కడి నుంచి తేవాలి. ఇదంతా ఓల్డ్ ట్రెండేమో అబ్బిగా 

అబ్బిగాడు: మరైతే రాఖీ సావంత్ ను ఫాలో అయిపో 

సుబ్బిగాడు: ఏం చేసిందేమిటి తను.. చొక్కా చింపుకుందా  

అబ్బిగాడు: చొక్కా చింపుకోవడం లాంటివి ఎప్పుడో చేసేసింది లేటెస్ట్ గా కొత్త చొక్కా కుట్టించుకొని వేసుకొంది అంతే 

సుబ్బిగాడు: యేటి దానికే ఆవిడ పేరు జనం నోళ్ళలో నానుతోందా 

అబ్బిగాడు:నానదా మరి నువ్వే చూడు ఆవిడ కుట్టించుకున్న చొక్కా 



3, ఆగస్టు 2016, బుధవారం

అక్కర తీరాక బోడి మల్లయ్యలం


భార్యా భర్తల సంభాషణ:

భార్య: పెళ్ళికి ముందు నేనంటే ఎంత ఇంటరెస్ట్ చూపించేవాడివో?

భర్త: చేపకు ఎర వేస్తాం పడ్డాక ఇంకా ఎర అవసరం ఏముంది?


అమ్మ బిడ్డల మధ్య సంభాషణ:

బిడ్డ: ఏదో తాయిలం ఇస్తానని చెప్పావ్  అన్నం తిన్నాక .. ఏదీ ఇవ్వమ్మా

అమ్మ: అలా అయితే అన్నం తింటావని చెప్పాను. ఇప్పుడు కాదు రేపు ఇస్తాను పడుకో రాత్రి అయింది

ఇలాంటివి మన ఇంట్లో జరగడం చూస్తుంటాము. ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోనక్కరలేదు. 


మేనేజర్, ఉద్యోగి మధ్య సంభాషణ:

ఉద్యోగి: ప్రమోషనో లేదంటే జీతమో పెంచుతామని చెప్పారు మీరు .. కానీ ఏది ఇవ్వలేదు

మేనేజర్: టీం లో అందరికి ఇదే చెప్పాను.  నీ కంటే ఇంకొకరు బాగా పని చేశారు (సోప్ రాశారు). అందుకే నీకు ఇవ్వలేదు.

ఇలాంటివి మన ఆఫీసుల్లో జరగడం చూస్తుంటాము. ఒక్కోసారి మనము రియాక్ట్ అయి కంపెనీ మారుతుంటాము లేదా వచ్చే సంవత్సంరం వరకు మళ్ళీ ఆగుతాము ప్రమోషన్ కోసమో లేదంటే జీతం పెరుగుతుందనో. 


మోడీ కి ఓటర్ కు మధ్య సంభాషణ:

ఓటర్: స్పెషల్  స్టేటస్ ఇస్తానని చెప్పారు

మోడీ: ఓట్లు పడటానికి సవా లక్ష చెబుతాం అవన్నీ నిజమనుకుంటే ఎలా?


ఇలాంటివి ప్రతీ ఐదేళ్ల కొకసారి చూస్తుంటాము. ఏమీ చేయలేము మళ్ళీ అయిదేళ్లవరకు వేచి చూస్తాం ఈ సారి గెలిచే పార్టీ వాళ్ళయినా ఇచ్చిన మాట నిలబడతారని. ఇదంతా షరా మామూలే. 

ఓడ ఎక్కే దాకానే ఓడ మల్లయ్యలం ఎక్కి ఒడ్డు దాటేశాక ఆ ఐదేళ్లు మనం బోడి మల్లయ్యలం.

చెడ్డీ తొడుక్కుని గొడ్లు కాసే పిల్లాడి నుంచి బడ్డీ కొట్టు దగ్గర బీడీ తాగే బుల్లయ్య వరకు ప్రతి ఒక్కరూ బాబు గారిని ప్రత్యేక హోదా కోసం ప్రయత్నించడం లేదని విమర్శించేసరికి రక్తం ఉడికిపోయి పుష్కరాలకు మోడీ ని ఆహ్వానించడమే కాకుండా అప్పటికప్పుడు ఆంధ్రాకు  స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ముప్పయ్యో మూడో సారి మోడీ గారిని కలవడానికి వెళ్లారు. 

తీరా అక్కడికి వెళ్ళాక మోడీ గారి P.A అపాయింట్మెంట్ ఇవ్వనన్నారు. 

అసలు నేనెవరో నా రేంజ్ ఏంటో తెలియాలంటే నీకొక చిన్న పిట్ట కథ చెబుతా విను.  చాలా ఏళ్ళ క్రితం నేను ట్రైన్ లో వెళ్తున్నప్పుడు అక్కడ టీ అమ్ముకుంటున్నపిల్లాడిని చేరదీసి పాలిటిక్స్ లో చేర్పించాను

పిల్లాడిని స్కూల్లో చేర్పిస్తారు గానీ పాలిటిక్స్ లో చేర్పించడమేమిటి సార్

నేనంతే ఎవరినైనా చూడగానే పట్టేస్తాను వాళ్ళు ఏ ఫీల్డ్ కు కరెక్టో. అలాగే అప్పట్లో సత్య నాదెళ్ల అనే ఒక కుర్రాడిని చూడగానే అతనికి I.T ఫీల్డ్ కరెక్ట్ అని ఒక కంప్యూటర్ కొనిచ్చా నా సొంత డబ్బులతో.

ఇంతకీ ఆ పాలిటిక్స్ లో చేర్పించిన పిల్లాడి గురించి చెప్పనేలేదు

చెప్పేదేముంది ఆ పిల్లాడైన మోడీనే నేను గైడ్ చేసి ఇప్పుడు ప్రధానిని చేశాను. 

మీరూ ఆయన ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళే కదా మీరూ అప్పుడు పిల్లాడిగానే ఉంటారు కదా..మరి ఇదంతా ఎలా చేయగలిగారు. 

అప్పుడు నేనూ పిల్లాడినే  కానీ పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు కదా అలానే నేనూ. అంతెందుకు ఇంత వరకు ఎవరికీ చెప్పలేదు కానీ అసలు నేను మా అమ్మ కడుపులోంచే రామారావు గారి టాలెంట్ గుర్తించి లాస్ట్ మినిట్ లో 'మన దేశం' సినిమాలో చిన్న రోల్ ఇప్పించాను. ఇలా చెప్పుకుంటూ పొతే ఈ ప్రపంచం లో ప్రతి ప్రముఖుడి ఎదుగుదల వెనుక ఎదో ఒక రకంగా నా హస్తం ఉంది.

పిట్టల దొరల గురించి వినడమే కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం సార్ . మీరు చెప్పిన ఈ పిట్ట కథే మోడీ గారికి కూడా చెప్పి అలాగే మీరు ఆయనను కలుసుకోవడానికి వచ్చారని చెప్పనా. 

అదంతా అవసరం లేదు గాని మోడీ గారి కోసం వజ్రాలు పొదిగిన సూట్ ఒకటి తెచ్చానని  చెప్పు, ఆయనే నన్ను కలుసుకోవాలని ఉత్సాహపడతారు.

మీరు చెప్పింది నిజమే సార్ అలా చెప్పగానే ఇలా మోడీ గారు మిమ్మల్ని కలవడానికి రెడీ అన్నారు.

చెప్పండి బాబు గారు ఇలా వచ్చారేమిటి?

ఈ రెండేళ్లలో మిమ్మల్నికలవడానికి నేనో 33 సార్లు వచ్చి ఉంటాను ఢిల్లీ కి .

ఈ రెండేళ్లలో నేనూ 33 దేశాలు తిరిగాను అయితే ఏంటట .. మ్యాప్ లో ఉన్న అన్ని దేశాలు తిరిగి రావాలన్నది నా కోరిక.  వీలయితే చంద్ర మండలం మీదకు కూడా.

వీలయితే నా చంద్ర మండలం అదే నా ఆంధ్ర ప్రదేశ్ కు కూడా వచ్చి చూడండి మోడీ గారు.  ప్రత్యేక హోదా కోసం మేము ఎంతగా తపిస్తున్నానో. పోయిన సారిలా మనీ (ట్టి నీళ్లు) తో కాకుండా ప్రత్యేక హోదా తీసుకు వస్తే బాగుంటుంది.

మాటలతో కోటలు కట్టగలిగే టాలెంట్ ఉన్నవారు మీరు అలాంటిది అమరావతి కట్టడం మీకొక లెక్కా, అయినా మీ లాంటి గొప్ప ముఖ్య మంత్రి ఉండగా ఆంధ్రాకు మళ్ళీ  ప్రత్యేక హోదా అవసరమంటారా చెప్పండి.

కరెక్టే మోడీ గారూ నేను ఆంజనేయుడి లాంటి వాడిని నా బలం నాకు తెలీదు మీరు గుర్తు చేశారు. వెంటనే వెళ్లి ప్రత్యేక హోదా ఆంధ్రా కు అవసరం లేదని ప్రజల్ని నమ్మిస్తాను.