పెన్సిల్ తన మానాన తాను ఏదో రాస్తోంది.
అప్పుడప్పుడూ రబ్బర్ కొంచెం కొంచెంగా కొట్టేస్తూ ఉంది .
ఎందుకు కొట్టేస్తున్నావ్?
నువ్వు తప్పు రాశావు, అందుకే
కాసేపటికి మళ్ళీ రబ్బర్ కొట్టేసింది.
మళ్ళీ ఎందుకు?
నువ్వు మళ్ళీ తప్పు రాశావు, అందుకే.
"నువ్వు ఇలా ప్రతి సారి అడ్డుతగిలితే నేను పూర్తి చెయ్యలేను" విసుక్కుంది పెన్సిల్
అయినా రబ్బర్ తన పని తాను చేస్తూనే ఉంది.
నిన్ను తిట్టినా నీకు బుద్ధి రాదు, అయినా ఎందుకు ఎప్పుడూ నా వెన్నంటే ఉంటావు, నీకు అస్సలు సిగ్గు లేదు.
ఇవేమీ పట్టనట్లుగా రబ్బర్ తన పని తాను చేస్తూనే ఉంది.
ఇలా పెన్సిల్ రాస్తూనే ఉంది, రబ్బర్ సరిచేస్తూనే ఉంది.
కొంతకాలానికి రాయడం పూర్తయ్యింది, చాలా బాగా రాశావని అందరూ పెన్సిల్ని మెచ్చుకున్నారు.
పెన్సిల్ ఇంటికి వస్తూనే 'చూశావా, ఎప్పుడూ నేను రాస్తుంటే తప్పులు, తడకలు అంటూ నాకు అడ్డు తగులుతూ నన్ను అరగదీస్తుండేదానివి. ఇప్పుడు చూడు చాలా బాగా రాశానని అందరూ మెచ్చుకుంటున్నారు, నువ్వు అడ్డు రాకపోయి ఉంటే ఇంకా తొందరగా పని పూర్తి చేసేదాన్ని' అని రబ్బర్ తో అందామనుకుంది.
రబ్బర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు, రబ్బర్ అరిగిపోయి చాలా చిన్న ముక్క మిగిలి ఉండటం వల్ల నేమో పనికి రాదని చెత్త బుట్ట లోకి తోసేసినట్లు గుర్తొచ్చింది.
ఒకప్పుడు బలంగా, పెద్దగా ఉండే రబ్బర్ ఇలా పీలగా, చిన్నగా అయిపోయిందనే విషయం అప్పుడే అర్థం అయింది.
నేను తప్పు చేసిన ప్రతీ సారి నన్ను సరిచేస్తూ నువ్వు అరిగిపోతున్నావని నేను గుర్తించలేకపోయాను, క్షమించు అంది పెన్సిల్.
ఇంతే కథ. ఇది అర్థం పర్థం లేని, తలా తోక లేని కథే కావచ్చు, కానీ రబ్బర్ స్థానం లో మన తల్లిదండ్రులు, పెన్సిల్ స్థానం లో మనము ఉన్నామని గుర్తిస్తే ఈ కథకు తల, తోకే కాదు ప్రాణం కూడా ఉందని అనిపిస్తుంది.