26, అక్టోబర్ 2016, బుధవారం

సిటీ బస్సు లో జరిగిన సంఘటన

ఇండియా వెళ్లినప్పటి కబుర్లలో భాగమైన సెలూన్ లో నా పాట్లు కి తర్వాతి పోస్ట్ ఇది. 

సెలూన్ లో 150 పే చేసి మిగిలిన 50 తో బయటి కొచ్చాను. మెడికల్ షాప్ లో కొన్న సామాన్లు బరువు ఉండటం తో సిటీ బస్సు లో వెళదామని బస్సు స్టాప్ కి వచ్చి ఆగాను.

వచ్చిన 3 బస్సులు ఆగడం వెళ్లిపోవడం అంతా క్షణాల్లోనే జరిగిపోతోంది. అందరూ దిగాక ఎక్కుదాం అని నేను అనుకుంటున్నాను కానీ బస్సు రావడం జనాలు ఎక్కడం దిగడం వెళ్లిపోవడం క్షణాల్లో జరిగిపోతోంది. అప్పుడు నా మెదడు కాళ్ళకు సందేశం అందించింది నువ్వు ఇప్పుడు వెయిట్ చేసేది సిడ్నీ బస్ స్టాప్ లో కాదు బెంగుళూరు బస్సు స్టాప్ లో అని. (ఈ విషయంలో కొక్కిరి బిక్కిరి వంకర కాయల కథ  నాకు అన్వయించాలనుకోవడంలో మీ తప్పేమీ లేదు) ఇంకేముంది కాళ్లకు పని చెప్పి బస్సు ఎక్కేసాను. 

bus is a vehicle that runs twice as fast when you are after it as when you are in it 

అని అన్నట్లు బస్సు లోకి ఎక్కాక చాలా నిదానంగా బస్సు వెళ్తున్నట్లు అనిపించింది. 'చాలా రోజులుగా గమనిస్తున్నాను మా ఊరికి వచ్చే దాకా బస్సు బాగా ఫాస్ట్ గా వస్తుంది తీరా మేము ఎక్కాక ఇంత నిదానంగా వెళ్తుందెందుకు ' అని కండక్టర్ ని కోప్పడ్డాడట వెనకటికి ఒకతను. 'మీరు బస్సు దిగాక మళ్ళీ ఆటోమేటిక్ గా స్పీడ్ అందుకుంటుందిలెండి' అన్నాడట లావుగా ఉండే ఆయనను, ఆయన భార్యను, బాల భీముళ్ళ లాంటి వాళ్ళ ఐదుగురు పిల్లలను చూసి. 

నేను దిగాల్సిన స్టాప్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటే బస్సు లో గొడవ మొదలైంది. 

నువ్వు ఇవ్వాల్సింది 80 అంటున్నాడు ఒక పదిహేను పదహారేళ్ళ కుర్రాడు. 

కాదు 30 అంటాడు కండక్టర్. 

100 ఇస్తే టికెట్ కి 20 పోనూ 80 చేంజ్ ఇవ్వాలి అదే నువ్వు టికెట్ వెనుక వైపు రాసావు అంటాడు కుర్రాడు 

లేదు నేను 30 అని రాసాను నువ్వు దాన్ని 80 అని మార్చావు అంటాడు కండక్టర్ 

ఇలాంటి కుర్రాళ్ళను చాలా మందిని చూశాను నాటకాలు ఆడి డబ్బులు రాబడతారు అన్నాడొక వ్యక్తి మధ్యలో కలగజేసుకొని 

అదిగో తెల్ల కాకి అంటే ఇదిగో దాని పిల్ల కాకి అన్నట్లు - అసలు అక్కడ ఎం జరిగిందో పూర్తిగా తెలుసుకోకుండానే నాతో పాటు బస్సు లోకి ఎక్కిన మరో ఇద్దరు అతనికి వంత పాడారు. 

తిరిగి ఇంటికి వెళ్ళడానికి, మధ్యాహ్నం అన్నం తినడానికి ఆ 80 అవసరం అంటాడా కుర్రాడు 

అన్నమే నేనూ కడుపుకు తినేది, మన్నుకాదు అంటాడా కండక్టర్ - నేనలా మోసం చేసే టైపు కాదు అనే ఉద్దేశ్యంతో

కండక్టర్ వెళ్ళిపోగానే అసలు ఆ కుర్రాడు ఏ మాత్రం నిజం చెబుతున్నాడు అని అతన్నే కాసేపు అబ్సర్వ్ చేస్తే నావరకైతే అతని బిహేవియర్ లో, కళ్ళల్లో నిజాయితీ కనిపించింది. 

అసలు నువ్వేమి చేస్తుంటావ్ తమ్ముడూ అని మాటలు కలిపితే 'మార్కెట్ లో పని చేస్తుంటానని, వారం చివర్లో వాళ్ళు డబ్బు ఇస్తుంటారని చెప్పాడు. ఇప్పుడుండే 30 లో తిరిగి ఇంటికెళ్లడానికే 20 కావాలి కాబట్టి మిగిలే 10 రూపాయలతో మధ్యాహ్నం ఎదో ఒకటి తినాలని అన్నాడు. 

నా జేబులో మిగిలిన 30 రూపాయల్లో 20 నోట్ అతనికి ఇచ్చి భోజనానికి ఉంచుకోమంటే ససేమిరా తీసుకోనన్నాడు, కానీ చుట్టుపక్కల ఉన్న మరో ఇద్దరు బలవంతపెడితే తీసుకున్నాడు. 

వెనుక సీట్లో కూర్చున్న ఒక ముస్లిం వ్యక్తి కూడా 30 ఇచ్చి తీసుకోమన్నాడు. ఆ కుర్రాడు తీసుకోకపోతే ఇది నీ డబ్బే అనుకో మీ బాబాయే ఇస్తున్నాడనుకో అని అతని జేబులో పెట్టాడు. 

మీలాంటి అమాయకులు ఉన్నన్నాళ్ళు ఇలాంటి వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు అన్నారు ఆ బస్ లో ఇద్దరు ముగ్గురు. 

ఒకవేళ ఆ పిల్లాడు నిజంగా నిజాయితీ పరుడు అయ్యుంటే నేను చేసిన దాంట్లో తప్పేమి లేనట్లే. ఒకవేళ నేను మోసపోయినా పర్లేదు కనీసం ఆ కుర్రాడు సిగరెట్లో, బీడీలో కాకుండా ఆ డబ్బులతో కడుపు నిండా తిని ఉంటాడు అనే ఆలోచన నన్ను సంతోషపరిచింది.  

13, అక్టోబర్ 2016, గురువారం

మా బుడ్డోడి పుట్టిన రోజు పార్టీ కబుర్లు

పార్టీ జరిగే రోజు ఉదయం చాలా మంది ఫోన్ చేసి 'డే లైట్ సేవింగ్' ఆ రోజు నుంచే మొదలయిన విషయం మరచిపోయామని అందువల్ల లేడవం కాస్త లేటయ్యిందని 12 గంటలకు కాకుండా కాస్త లేటుగా ఒంటి గంటకు వస్తాము అని చెప్పారు . 

అర్రే 'డే లైట్ సేవింగ్' మొదలవుతుందనే విషయం ముందుగానే అందరికి గుర్తు చేసి ఉంటే బాగుండేదని అనిపించింది, సరే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదని చాలా మందికి ఫోన్ చేసి నిద్ర లేపి బాబూ మీ గోడ గడియారాల టైం చూసుకోకుండా మీ ఫోన్ లో టైం చూసుకోండి పది అవుతోంది అని చెప్పాను.  గోడ గడియారాలైతే ఇంకా పాత టైం చూపిస్తూ ఉంటాయి అదే స్మార్ట్ ఫోన్స్, లాప్టాప్ లు, ట్యాబు లు అయితే డే లైట్ సేవింగ్' ప్రకారం ఒక గంట ముందుకు అప్డేట్ అయుంటాయి.

ఈ డే లైట్ సేవింగ్ అనే పద్దతి క్వీన్స్ లాండ్, వెస్ట్రన్ ఆస్ట్రేలియా లలో లేదు కానీ సిడ్నీ లో ఉంది. అక్టోబర్ నెలలో వచ్చే మొదటి ఆదివారం ఉదయం 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2 AM ను ఒక గంట ముందుకు అనగా 3 AM  గా పరిగణిస్తారు/మార్చుకుంటారు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో వచ్చే మొదటి ఆదివారం ఉదయాన ఈ టైం ను మళ్ళీ సరిచేసుకుంటారు. ఈ పద్దతి దాదాపు 70 దేశాలలో అమలులో ఉంది. 1916 లో మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు దీపాలకు వాడే ఆయిల్ ఖర్చు తగ్గించడానికి జర్మనీ లోఈ పద్దతి మొదలుపెట్టారు. దీని వలన ఉపయోగం ఏమిటంటే రాత్రి 8 గంటల టైం లో కూడా దీపాల అవసరం ఉండదు ఎందుకంటే ఒరిజినల్ టైం 7 కాబట్టి. ఎండాకాలంలో రాత్రి 7 వరకు సూర్యకాంతి/ వెలుగు ఉండటం మూలాన దీపాల అవసరం అంతగా ఉండదు.

ప్రతీ నాణేనికి రెండు వైపులున్నట్లే ఈ పద్దతి వలన కొన్ని ఇబ్బందులూ ఉన్నాయి ముఖ్యంగా రైతులకు ఎందుకంటే ఏ కాలమైనా వాళ్ళ షెడ్యూల్ ను నిర్ణయించేది సూర్యుడు కానీ టైం కాదు. ఈ టైం చేంజ్ వలన షిప్పింగ్ షెడ్యూల్స్ మీట్ అవ్వడానికి లేదా షాప్స్ కు పాలు చేరవేయడానికి ఉదయం 5 గంటలకు పాలివ్వవలసిన ఆవులు 4 గంటలకే ఇవ్వాల్సి వస్తుంది. అందుకే కొంత మంది రైతులు ఈ పద్దతి ని ఇష్టపడరు.

నా వరకైతే నేను ఈ పద్దతి ఇష్టపడతాను ఎందుకంటే ఇంటికి సాయంకాలం 7 కు వెళ్లినా ఇంకా బోలెడు వెలుతురు ఉంటుంది కాబట్టి పిల్లలను పార్క్ కో లేదా బీచ్ కో తీసుకెళ్లి ఆడించవచ్చు. డే లైట్ సేవింగ్ గురించి ఇంతకంటే ఎక్కువ రాస్తే చదివే వాళ్ళు నన్ను తిట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడితో ముగిస్తాను.

ఈ కారణంతో అందరూ ఒంటి గంటకు రావటం తో కేక్ కట్టింగ్ కాస్త లేటయ్యింది.  కడుపు కూటికేడిస్తే - కొప్పు పూలకేడ్చిందన్నట్లు పిల్లలందరూ కేకు తినాలని ఉబలాట పడుతుంటే, ముందు పెద్దలందరూ వాళ్ళ పిల్లలతో కలిసివచ్చి ఫొటోస్ దిగిన తర్వాతే కేక్ అని మా ఆవిడ వాళ్లకు సర్దిచెప్పింది.

బార్బర్ దృష్టి అందరి జుట్టుమీద, చెప్పులు కుట్టేవాడి దృష్టి నడుస్తున్న వాళ్ళ కాళ్ళ మీద అన్నట్లు ఆ హోటల్ వాడి దృష్టంతా తినే వాళ్ళ మీదే ఉంది ఎవరెక్కువ తినేస్తారేమో అన్నట్లు మరీ ముఖ్యంగా మా ఫ్రెండ్ ఒకతని మీద. తనకు తిండి విషయం లో నో లిమిట్స్ అందుకని అతను అడిగి మరీ ఐటమ్స్ తెప్పించుకుని తిన్నాడు. ఇక లాస్ట్ లో నాకు అర్జంట్ పని ఉంది వెళ్ళాలి అని అంటే కాసేపు ఆగు రసమలాయ్ ఉంది తెస్తారు అది తినేసి వెళ్ళు అన్నాను. పొట్ట లోకి రసమలాయ్ దూరే సందే ఉంటే ఇంకో రెండు చికెన్ ముక్కలే తినేవాడిని కదా పవన్ అన్నాడు నవ్వుతూ అంతటి నాన్-వెజ్ ప్రియుడు తను.

ఆహారానికి ముందు వ్యవహారానికి వెనుక ఉండాలి అనే సూత్రాన్ని పాటించే నేను ఆ రోజు మాత్రం పార్టీ కి వచ్చిన అందరినీ పలకరిస్తూ వాళ్ళు సరిగ్గా తిన్నారో లేదో కనుక్కునే పనిలో పడి పాటించలేకపోయాను.

ముందు రోజు నైట్ పార్టీ హాల్ కు వచ్చి కొన్ని బెలూన్స్ ఊదటం, బ్యానర్ కట్టడం లో హెల్ప్ చేసిన రాధిక గారికి, ఉదయాన్నే లేచి కార్ తీసుకువచ్చి షాప్ లో ఆర్డర్ చేసిన హీలియం బెలూన్స్ తీసుకురాడానికి హెల్ప్ చేసిన శ్రీలంకన్ ఫ్రెండ్ కు, ఆ బెలూన్స్ ను పార్టీ హాల్ లో అలంకరించడం లో హెల్ప్ చేయడానికి ఒక గంట ముందే పార్టీ హాల్ కి వచ్చిన తమిళియన్ ఫ్రెండ్ తుకారాం గారికి, అలాగే మేము పార్టీ హడావిడిలో బిజీ గా ఉంటే మా బుడ్డోడిని పక్కనే కూర్చోబెట్టుకొని వాళ్ళ అమ్మాయితో పాటు తనకి ఓపికగా తినిపించిన మలయాళీ ఫ్రెండ్ సింధు గారిని ఎలా మర్చిపోగలము.

చెడు ఉంటే చెవిలో చెప్పు మంచి ఉంటే మైక్ లో చెప్పు అంటారు కదా అందుకని మైక్ లేదు కాబట్టి బ్లాగ్ లో చెప్తున్నాను.  అడిగిందే ఆలస్యం అనుగ్రహించడం తమ స్వభావం అన్నట్లు సాయపడిన వీరందరికి ధన్యవాదాలు.

లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్లు చెప్పవలసిన వ్యక్తి మరొకరున్నారు ఎవరో కాదు మా ఆవిడ. వెనకటికో పనిమంతుడు పందిరేస్తే పిచ్చుకలు వ్రాలగానే పడిపోయిందట, అలాంటి పనిమంతుడిని నేను.  డెకరేషన్ అంతా ముగిసి కాస్త రిలాక్స్ అవుదామని ఫ్యాన్ వెయ్యగానే గోడకు నేను అతికించిన బెలూన్స్ అన్నీ కింద పడిపోయాయి. అయినా కూడా ఓపికగా మళ్ళీ ఆ బెలూన్స్ అన్నీ గోడకు అతికించేసింది. బెలూన్ కలర్స్ నుంచి, బ్యానర్ కలర్ వరకు ప్రతి ఒక్క విషయం లో చాలా కేర్ తీసుకొని ఏ ఈవెంట్ మేనేజర్ కి తగ్గని రీతిలో అద్భుతంగా స్టేజి ని పార్టీ హాల్ ని డేకరేట్ చేసిందని వచ్చిన గెస్ట్ లతో మెప్పు కూడా పొందింది.

9, అక్టోబర్ 2016, ఆదివారం

పుట్టిన రోజు పార్టీ సన్నాహాలు

ఇండియా విశేషాలకు కాస్త గ్యాప్ ఇచ్చి గత వారం జరిగిన మా బుడ్డోడి పుట్టిన రోజు పార్టీ కబుర్లు గురించి 2 పోస్టులు రాయబోతున్నాను.

సరిగ్గా సంవత్సరం క్రితం గాంధీ జయంతి నాడు మా బుడ్డోడు భూమి మీద పడ్డాడు. వాడి అల్లరి, నవ్వులతో తెలియకుండానే ఒక సంవత్సరం గడిచి పోయింది. 

ఇండియా నుంచి సిడ్నీ కి రాగానే మొదట మేము చేసిన మొదటి పని వీడి పుట్టిన రోజు పార్టీ కి సన్నాహాలు మొదలుపెట్టడమే.  హోటల్ కి వెళ్లి పార్టీ హాల్ బుక్ చెయ్యడం నుంచి కేక్, బెలూన్ లు ఆర్డర్ చెయ్యడం,పార్టీ కి వచ్చే పిల్లలకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కొనడం, ఫ్రెండ్స్ ను పార్టీ కి ఇన్వైట్ చేయడం లాంటివి.

పుట్టినప్పటి నుంచి, 11 వ నెల వరకు తీసిన అన్ని ఫొటోస్ వెదికి, మా వూరికి వెళ్ళినప్పుడు బర్త్ డే బ్యానర్ తయారు చేయించాము.హోటల్ కి వెళ్లి పార్టీ హాల్ బుక్ చెయ్యడం:

"కిత్నా లోగ్ ఆయేంగే" హోటల్ వాడు అడిగాడు 

"35 లోగ్ .. కిత్నా ఛార్జ్ కరేగా తు" అన్నాను 

క్యా క్యా ఐటమ్స్ చాహియే ఆప్ కో లంచ్ మే

2 నాన్- వెజ్ స్టార్టర్స్, 2 వెజ్ స్టార్టర్స్ , బ్లా బ్లా బ్లా అని నా లిస్ట్ చెప్పాను.

35 డాలర్స్ పర్ హెడ్ 

30 లేలోగా.. గీ .. గే ..(ఖూనీ చేసేసా)

ఇలా సాగింది మా సంభాషణ.

ఆ విధంగా నేను హిందీని ఖూనీ చేయడాన్నిఆతను జీర్ణించుకోలేక ఆ ఎఫెక్ట్ తో నన్ను ఖూనీ చేసే ప్రమాదం ఉందని గ్రహించి 30 డాలర్స్ కి ఒప్పుకున్నాడు.

కేక్ ఆర్డర్ ఇచ్చే షాప్ లో కూడా నా హిందీ ప్రావీణ్యాన్ని ప్రయోగించడం వల్ల అడిగిన రేట్ కే కేక్ చేయడానికి ఒప్పుకున్నారు.  

అయినా ఒకరిద్దరిని చంపితేగానీ వైద్యుడు కాలేడు అన్నట్లు తరచుగా మాట్లాడితేనే కదా హిందీ వచ్చేది అనేది నా గట్టి ఫీలింగ్.

ఫ్రెండ్స్ ను పార్టీ కి ఇన్వైట్ చేయడం:

భయ్యా ఆదివారం ఖాళీయేనా అడిగాను కొలీగ్ ని 

లేదు బ్రో .. నేనేదో డాలర్లలో తెగ సంపాదిస్తున్నానని మా అన్నయ్య ఉద్దేశ్యం అందుకే ఒక 5 లక్షలు సర్దమన్నాడు. అన్నయ్య అడిగిన డబ్బు కోసం బ్యాంకు కు కన్నం ఎలా వేయాలో ప్లాన్ చేసుకోవాలి అన్నాడు. 

ఏంటి భయ్యా జోకులు అన్నా 

కాకపొతే ఏంటి ఆదివారం తిని తింగోడం తప్ప ఏనాడైనా పని చేయడం చూసావా 

అయితే మా బుడ్డోడి పుట్టిన రోజు పార్టీ కి వచ్చేయ్ భయ్యా తాజ్ ఇండియన్ హోటల్ లో చేస్తున్నాం అన్నాను 

కాణీ తక్కువకు కాశీ లో కొబ్బరి కాయ దొరుకుతుందంటే కాలి నడకన వెళ్లి తెచ్చుకునే రకాన్నంటావ్ మరి అంత ఖర్చు పెట్టి హోటల్ లో చేయడం అవసరం అంటావా అన్నాడు 

పర్లేదు భయ్యా ఖర్చు పెట్టే దగ్గర పెడదాం మిగిల్చే దగ్గర మిగిలిద్దాం .. పిల్లల కోసమే కదా సంపాదించేది అన్నాను. 

అలాగే ఆఫీస్ లో కొలీగ్ అయిన నార్త్ ఇండియన్ అమ్మాయి ను కూడా invite చేస్తే నేను ఆ రోజు ఉపవాసం కానీ పార్టీ కి వస్తాను అంది. 

ఇప్పుడెందుకు ఉపవాసం అన్నాను 

ఇప్పుడు నవరాత్రి కదా అందుకే తొమ్మిది రోజులు ఉపవాసం అంది. ఈ తొమ్మిది రోజులు 'జై దుర్గ జై దుర్గ' అంటాం పదవ రోజు 'దే ముర్గ దే ముర్గ' (చికెన్ ఇవ్వు చికెన్ ఇవ్వు) అంటాము అంది 

నువ్వు వెజిటేరియన్ వి కదా మరి నువ్వేం అంటావు పదో రోజు అన్నాను 

'దే మ్యాగీ దే మ్యాగీ' అంటా అంది తాను ఇష్టంగా తినే మ్యాగీ ని తలుచుకొని.

మ్యాగీ మీద ఎన్ని కంప్లయింట్స్ వచ్చినా దాని మీద ఇష్టాన్ని వదులుకోరనుకుంటాను.

పోస్ట్ మరీ పెద్దదవుతుంది కాబట్టి మిగిలిన పుట్టిన రోజు పార్టీ కబుర్లు తర్వాతి పోస్ట్ లో. 

6, అక్టోబర్ 2016, గురువారం

సెలూన్ లో నా పాట్లు

బెంగుళూర్ లో మొదటి రోజు పోస్ట్ కి కొనసాగింపు

సిడ్నీ లో చాలా వరకు సెలూన్ షాప్స్ Asians వాళ్ళవే ఉంటాయి అంటే ముఖ్యంగా కొరియా వాళ్ళవో లేదంటే చైనా వాళ్ళవో ఉంటాయి. సెలూన్ షాప్స్ అనే కాదు మిగతా షాప్స్ కూడా చాలా వరకు వాళ్ళవే ఉంటాయి. మేము ఉండే చోట అయితే వీళ్ళు మరీ ఎక్కువగా ఉంటారు. అప్పుడప్పుడూ  అనిపిస్తూ ఉంటుంది నేను ఉండేది ఆస్ట్రేలియా లోనా లేక కొరియా/చైనా లోనా అని. 

వాళ్లలో చాలా మందికి ఇంగ్లీష్ సరిగ్గా రాదు. వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ మనకు అర్థమయి చావదు. ఇంగ్లీష్ మాట్లాడటం లో మనమేదో పెద్ద పిస్తాలం అని కాదు కానీ వాళ్ళ కంటే మనం కొంచెం బెటర్ అని నా ఉద్దేశ్యం. నేను ఇలా ఇలా హెయిర్ కట్ చేయండి అంటాను వాళ్ళేదో అర్థం చేసుకుంటారు చివరికి వాళ్ళ పద్దతిలో చేసేస్తారు. మన వెంట్రుకలను  అంట రాని వాటి కింద లెక్కేసి చేత్తో ముట్టుకోకుండా మిషన్ తోనే హెయిర్ కట్ కానిచ్చేస్తారు. 

అదే మన ఇండియా లో అయితే మనకు నచ్చే పద్దతిలో  హెయిర్ కట్ చేయించుకోవచ్చు అంతేకాదు చక్కగా కత్తెర తో కట్ చేస్తారు.  పైగా సిడ్నీ లో 20 డాలర్లు సమర్పించుకోవాలి అదే ఇండియా లో అయితే 200 లో కటింగ్ తో పాటు షేవింగ్ కూడా చేయించుకుకోవచ్చు కదా అందుకని ఇండియాకు బయలు దేరే ముందు 2 నెలల నుంచి హెయిర్ కట్ చేయించుకోలేదు కాస్త డబ్బులు మిగుల్చుకుందామని. ఇదేం కక్కుర్తి అంటారా ఏం చేస్తాం మిడిల్ క్లాస్ మెంటాలిటీ. పుట్టుకతో వచ్చిన బుద్ధి కదా పుడకలతో పోవాల్సిందే. 

మెడికల్ షాప్ లో మిగిలిన 200తో హెయిర్ కట్ చేయించుకుందామని సెలూన్ వెళ్ళాను. సోమవారం అదీ మధ్యాహ్నం అవ్వడం వల్లనేమో సెలూన్ ఖాళీగా ఉంది. ఒక మూల కుక్క కూర్చొని ఉంది షాప్ వాడిదే అనుకుంటాను. కుర్చీ లో కూర్చుని కునికి పాట్లు పడుతున్న కుర్రాడు నన్ను గమనించి కటింగా సర్ అన్నాడు.

అవునన్నాను.

కుర్చీ చూపించి కత్తెర అందుకున్నాడు హెయిర్ కట్ చేద్దామని


అలాగే  షేవింగ్ కూడా అన్నాను. కాస్త ఆశతో  కుక్క వచ్చి నా చైర్ వెనుక కూర్చున్నట్లు అనిపించింది. 

ఫ్యాన్ తో పాటు టీవీ ఆన్ చేసి మంచి పాటలు పెట్టాడు 

చూడమ్మా ఇలా కట్ చెయ్ అలా కట్ చెయ్ అని instructions ఇవ్వబోయాను 

జుట్టున్నయ్య అయితే ఏ కటింగ్ అయినా కొట్టించుకోవచ్చు కానీ .. నీకుండే నాలుగు వెంట్రుకలకు ఇన్ని instructions అవసరం లేదనుకుంటానురా డిప్పకాయ్ అనేట్లు పెట్టిన అతని పేస్ ఎక్స్ప్రెషన్స్ అద్దం లో గమనించి కటింగ్ పూర్తయ్యే వరకు సైలెంట్ అయిపోయాను 

షేవింగ్ మొదలెడుతూ, సర్ డెనిమ్ షేవింగ్ క్రీం రాయమంటారా లేక లోకల్  షేవింగ్ క్రీం రాయమంటారా అన్నాడు 

తేడా ఏమిటి అన్నాను 

డెనిమ్ అయితే ఎక్కువ ఛార్జ్ చేస్తాం లోకల్  షేవింగ్ క్రీం అయితే తక్కువ ఛార్జ్ చేస్తాం అన్నాడు 

ఉన్నది 200 రూపాయలు అందుకని ఎందుకైనా మంచిదని లోకల్  షేవింగ్ క్రీం యూస్ చెయ్యి అన్నాను 

సరే అని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసాడు. 

పేస్ ప్యాక్ ఏమన్నా వేయమంటారా అన్నాడు 

వద్దమ్మా అన్నాను 

పాటలు వస్తున్నఛానల్ మార్చి 'నీదీ ఒక బతుకేనా' అనే సీరియల్ వస్తున్న ఛానల్ పెట్టాడు. 

ఇందాకా కటింగ్ చేస్తున్నప్పుడు అబ్సర్వ్ చేసాను సర్ మీ తల బాగా హీట్ ఎక్కినట్లు ఉంది, నవరత్న ఆయిల్ తో మసాజ్ చేయమంటారా అని నవరత్న ఆయిల్ గుర్తు చేసి మరింత మంటెక్కించాడు.

వద్దమ్మా అన్నాను 

అంత దాకా నెమలి ఈక తో చేస్తున్నట్లు అనిపించిన షేవింగ్ కాస్తా మచ్చుకత్తి తో బరా బరా గోకుతున్నట్లు అనిపించింది.  

కుక్క కళ్ళలో ఆశ మరింత పెరిగింది నా చెవి ముక్క కాస్త దొరుకుతుందని. 

పరిస్థితి అర్థమయి 'చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం కంటే చేతులు కాలకుండా ఉండేట్లు' నివారణా చర్యలు మొదలెట్టాను.

ఇప్పుడు కాస్త అర్జెంటు పని మీద బయటకు వెళ్లాలి సాయంత్రం తీరికగా వచ్చి ఆయిల్ మసాజ్, ఫేసియల్ చేయించుకుంటాలే అన్నాను 

 'నీదీ ఒక బతుకేనా' అనే సీరియల్ వస్తున్న ఛానల్ కాస్తా మార్చేసి 'రాజువయ్యా మహరాజువయ్యా' పాట వస్తున్న ఛానల్ పెట్టాడు. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసాడు. మచ్చుకత్తి తో కాకుండా నెమలీక తో షేవింగ్ చేయడం మొదలెట్టాడు.

కుక్క నా సీట్ వెనుక నుంచి వెళ్ళిపోయి దాని ప్లేస్ లో అది పడుకుండిపోయింది నిరాశగా.

ఇవండీ నా ఇక్కట్లు/ పాట్లు మొదటి రోజు బెంగుళూరు లో ఇండియా కి వెళ్లినపుడు.

డాలర్స్ సంపాదిస్తూ ఇండియా లో రేట్స్ పెరిగాయని మీరు ఏడుస్తున్నారే మరి రూపాయలు సంపాదిస్తూ రూపాయలు ఖర్చు పెట్టాలంటే మాకెంత ఇబ్బందో ఆలోచించండి అన్నారు ఒకతను నా పాత పోస్ట్ చదివి.  ఏం చేస్తాం సర్ పీత కస్టాలు పీతవి సీత కస్టాలు సీతవి.

ఈ పోస్ట్ కు వచ్చే రెస్పాన్స్ బట్టి ఇండియా విశేషాలు రాయాలా వద్దా అని డిసైడ్ అవుతాను. దయచేసి మీకు ఇవి నచ్చాయో లేదో తెలియజేయండి.