26, ఆగస్టు 2022, శుక్రవారం

లైగర్ - పూరీ పగిలిందట

బద్రి, ఇడియట్, పోకిరి , బిజినెస్ మాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి పనికి మాలిన సినిమాలను రిజెక్ట్  చేయకపోవడం వల్ల వచ్చిన ఖర్మ ఇది. ఇడియట్, పోకిరి లాంటి సినిమాలు హిట్టయి ఉండచ్చు, ఎక్కువ మంది ఆడియెన్స్ కి నచ్చి ఉండచ్చు గానీ వాటికంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అతడు (ఇది వేరే డైరెక్టర్  సినిమా, కాకపోతే పోకిరి ముందు వచ్చిన సినిమా) లాంటి సినిమాలు బాగుంటాయి.  

యేవో నాలుగు పంచ్ డైలాగ్స్, రెండు మెట్ట వేదాంతాలు, శృతి మించిన హీరోయిజం అతని సినిమాలో వాడేసి హిట్ అని అనిపించుకుంటాడు గానీ చాలా వరకు అతని సినిమాల్లో మొదటి నుంచి  విషయం తక్కువే. కొన్ని సినిమాల్లో అయితే హీరోయిన్ అనే పదార్థానికి చీము నెత్తురు, రోషం పౌరుషం, సిగ్గు షరం, మానం మర్యాద లాంటివేవీ ఉండవన్నట్లు కారక్టరైజెషన్ పెడతాడు. 

ఫేస్బుక్, వాట్స్ అప్ లలో వచ్చే కోట్స్ కి ఆయన తన స్టైల్ కోటింగ్ ఇచ్చి ఆ మధ్య musings మొదలు పెట్టాడు. శంఖం లో పోస్తేనే తీర్థం అన్నట్లు సెలబ్రిటీ నోటి నుంచి వచ్చాయి కాబట్టి అవి బాగా క్లిక్ అయినట్లున్నాయి. అది చూసి కొందరు వాతలు కూడా పెట్టుకున్నట్లు ఉన్నారు. 

పూరి గారికి టాలెంట్ ఉంది. అది కాదనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే ఆయన సినిమాలు చెప్పాయి  ఆయన టాలెంట్ ఏంటో. సినిమా జనాలు ఆహా ఓహో అని ఆయన్ను తెగ పొగిడేస్తూ ఉంటారు మీరు అది సర్ ఇది సర్ అని, వాళ్ళందరినీ కాస్త దూరం పెట్టి జాగ్రత్త తో పొలోమని పాన్ ఇండియన్ సినిమా అని ఇంకొకరి లాగా తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ కావాలని వాతలు పెట్టుకోవడం మానేస్తే మంచిది.  

ఈ లైగర్ సినిమా ప్లాప్ వల్ల అనసూయతో పాటు మెగాస్టార్ ఫాన్స్ సంతోషంతో చంకలు గుద్దుకొని "కర్మ సిద్ధాంతాన్ని" ప్రచారం చేస్తున్నారు. అనసూయ కి విజయ్ దేవరకొండ కి మధ్య అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా టైములో జరిగిన గొడవలు కారణం అయితే, అప్పట్లో "ఆటో జానీ" సినిమా సెకండ్ పార్ట్ నచ్చలేదని చిరంజీవి ఆ సినిమా చేయకుండా "బ్రూస్ లీ" అనే కళాఖండం లో గెస్ట్ రోల్ చేస్తే అది తుస్సుమన్నప్పుడు చార్మీ సంతోషపడుతూ ట్వీట్స్ చేయడం మరొక కారణం .   

ఒకప్పుడు ఫలానా హోటల్ లో పూరి బాగుంటుంది అని ఎగబడి తింటున్న జనాన్ని చూసి, ఎలాగూ ఇక వస్తూనే ఉంటారులే అని ఆ హోటల్ ఓనర్ పదేళ్ళ క్రితమే పెద్ద మొత్తంలో పిండికలిపి పెట్టుకుని ఇప్పటికీ  అదే పిండితోనే పూరీలు చేసి వడ్డిస్తున్నాడు.ఈ మధ్య వాటికి పాచి కంపు మొదలయ్యేసరికి కస్టమర్లు ఆ సద్ది పూరీలు తినలేక కొద్ది కొద్దిగా రావడం తగ్గించేశారు. 

కాబట్టి కాస్తో కూస్తో పూరి అభిమానిగా నా ఆశ ఏమిటంటే తన హోటల్ లో జనాలు పూర్తిగా  కనుమరుగయ్యే లోపు ఆ పాత పిండిని పారేసి కొత్త పిండిని కలుపుకుంటే మంచిది లేదంటే ఇక తన గురువు గారి లాగా కొట్టు మూసేసి షెడ్డు దారి పట్టడమే.  

25, ఆగస్టు 2022, గురువారం

సినిమాలో కథ ఎవడికి కావాలి?

మన సినిమాలో హీరో కి సొట్ట కాలు, పేరు "బండోడు". 

టైటిల్ అదే పెడదామా? బాగా మాసీ గా ఉంది. 

ఆగండి సర్, నేను టైటిల్ ఫిక్స్ చేసుకున్నా ఆల్రెడీ. 

వెరీ గుడ్, కంటిన్యూ. 

ఒక గుడి దగ్గర చెప్పులు పెట్టుకునే స్టాల్లో పని చేస్తుంటాడు.  హీరోయిన్ కి గుడ్డి, అదే గుడి దగ్గర పూల వ్యాపారం చేస్తుంటుంది. 

ఏంటీ, తమిళ్ సినిమా తీస్తున్నామా?

కాదు తెలుగే, కాస్త మాస్ కారక్టరైజెషన్. 

ఇలా సినిమా తీస్తే తర్వాత అదే గుడి దగ్గర నేను అడుక్కుతినాలి. అయినా కుంటి, గుడ్డి ఇవన్నీ అవసరమా. 

అదే ట్రెండ్ సర్, ఏదో ఒక లోపం పెడితే ఆడియన్స్ కి కిక్కివ్వచ్చు. ఈ మధ్య కొన్ని సినిమాలు చూశాం కదా. 

సరే మిగతా కథ చెప్పు 

అవును సర్,  'చెప్పే' మన కథా వస్తువు. 

అర్థం కాలేదు. 

చెప్తాను వినండి. ఒక పెద్ద లీడర్ అయిన "అమిత్ నరేంద్ర జోడి" ఢిల్లీ నుంచి  ఏదో ఒక పని మీద  హైదరాబాద్ వచ్చి ఈ గుడికి దర్శనానికి వస్తాడు. 

అతను గుడి నుండి బయటకి రాగానే  మన బండోడు వెళ్ళి తన చేతులతోనే చెప్పులు తొడుగుతాడు. దాంతో అతను ఇంప్రెస్ అవుతాడు. 

బాగుంది, తర్వాత.. 

మన "జోడి" కార్ ఎక్కేప్పుడు ఆ కార్ లోపల నుంచి మెరుపులా ఒకడు దూకి కోడి కత్తితో పొడవబోతుంటే మన బండోడు ఉరుములా వచ్చి "జోడి" ని కాపాడతాడు. దాంతో ఆ "జోడి" మన బండోడ్ని మెచ్చి తనతో పాటే ఢిల్లీ  తీసుకుపోతాడు. 

ఇంటరెస్టింగ్ 

ఇక అక్కడి నుంచి మన హీరో ఎలా ఎదుగుతాడు అనేది మనకిష్టం వచ్చినట్లు ఏ రోజు ఎలా తడితే అలా తీసుకోవచ్చు. 

మరి గుడి దగ్గరి హీరోయిన్ 

అక్కడితో ఆ హీరోయిన్ ని వదిలేద్దాం సర్, ఢిల్లీ లో క్లబ్ లో డాన్స్ చేస్తూ మరో హీరోయిన్ ని దింపుదాం. హీరోయిన్స్ మన ఇష్టం సర్, ముగ్గురు నలుగురు హీరోయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ హీరో ఒక్కడే ఉండాలి. 

అంతేనంటావా? 

కావాలంటే ఆ హీరోయిన్ ని కూడా ఢిల్లీ రప్పించి ఇద్దరు హీరోయిన్ లని పెట్టి ఫారిన్ లో 

"అటు మాస్, ఇటు క్లాస్ .. మధ్యలో నేను ఊర మాస్

ఇటు పచ్చడి అటు పిజ్జా .. నంజుకోరా తనివి తీరా

ఇటు ఐస్క్రీమ్ అటు పుల్లైసు .. చప్పరించేయ్ చెలికాడా

అటు స్లమ్ము ఇటు స్లిమ్ము ఇక చూపిస్తా నా దమ్ము"

అని ఒక మంచి ఊపున్న సాంగ్ క్లైమాక్స్ ముందు ప్లేస్ చేద్దాం.  

ఇప్పుడు డబల్ ఓకే. ఇంకా కావాలంటే ఆ "జోడి" ఒకప్పుడు అదే గుడి దగ్గర టెంకాయలు అమ్మేవాడని అక్కడే హీరో తల్లిని తండ్రిని చంపి వాళ్ళ "టెంకాయల" కొట్టును కొట్టేశాడని ఒక రివెంజ్ కథ కూడా అల్లుకోవచ్చు. 

గ్రేట్ సర్. టైటిల్ 'చప్పల్' అని పెడదాం. 

హిందీ పేరులా ఉంది??

అవును సర్. దేశమంతా అదే టైటిల్ తో ప్రచారం చేసుకొని పాన్ ఇండియా మూవీ అందాం.  ఒక నార్త్ ఇండియన్ పిల్లని హీరోయిన్ గా పెడదాం ఎలాగూ. ఆ లీడర్ క్యారక్టర్ ని ఒక నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్ తో చేయించి, అతని పక్క ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులని కన్నడ, తమిళ్, మలయాళం నుంచి తీసుకొచ్చి అవసరం ఉన్నా లేకున్నాఇరికిద్దాం పాన్ ఇండియా మూవీ అయిపోతుంది. 

ఇంప్రెస్డ్.  రేపే ప్రెస్ మీట్ పెట్టి మన సినిమా 'చప్పల్' అనౌన్స్ చేద్దాం. 

తోక ముక్క: ఈ విధంగా డబ్బు మూటల్తో వచ్చిన నిర్మాతకి ఏదో ఒక కథ చెప్పేసి కొద్ది మంది దర్శకులు కథ లేకుండా కాకరకాయ మాత్రమే పెట్టి సినిమా తీస్తున్నట్లు ఉన్నారు. నాకూ అలాంటి నిర్మాత దొరికితే బాగుండు, బోలెడు కథలు రాయగలను నేను కూడా డబ్బులిస్తే మరింత శ్రద్ధగా.                                         


22, ఆగస్టు 2022, సోమవారం

చిరంజీవన్నయ్య

వెండి తెరపై నటుడిగా నా కంటే ముందు పుట్టడం వల్ల అన్నయ్య అయ్యాడు. నా వయసు పెరుగుతున్నట్లే అన్నయ్య ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. నా ఆటల్లో పాటల్లో అన్నయ్య ఒక భాగం అయిపోయాడు, అందుకేనేమో ఆ బాండింగ్ ఇప్పటికీ ఇలా నిలిచిపోయింది. 

ఒకపక్క ఎన్టీఆర్-ఏయన్నార్ లాంటి మహామహులు, మరో పక్క కృష్ణ -శోభన్-కృష్ణంరాజు లాంటి సీనియర్లు , తన తర్వాత వచ్చిన బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ లాంటి జూనియర్స్ తో పోటీ పడి వారందరి జనరేషన్ మధ్య ఒక వారధిగా ఉండగలిగారంటే యెంత కష్టపడి ఉంటారు. ఇక పడిన కష్టం చాలనుకున్నారో ఏమో ఆ కష్టపడేతత్వాన్ని రాజకీయాల్లో కంటిన్యూ చేయలేక మొదట్లోనే కాడి వదిలేసి వెళ్ళడం మాత్రం ఒక మాయని మచ్చ. 

ఒక చిరంజీవి అభిమాని గా నేను చాలా ఎక్కువ ఆశిస్తాను, అదే నాకు వచ్చిన ప్రాబ్లెమ్. నా వరకైతే టాలెంట్ విషయం లో "కమల్ హాసన్ + రజని కాంత్ = చిరంజీవి" . అబ్బ ఛా! వీడు మరీ ఎక్కువ  అతి చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు గానీ, నటన పరంగా కమల్ కు, స్టైల్స్ విషయం లో రజనీ కి చిరంజీవి సరితూగగలడు అని నా గట్టి నమ్మకం. 

అప్పట్లో మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్స్, వాళ్ళకు తోడు రెహమాన్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగులో తగలక కాస్త రేసులో వెనుకబడ్డాడు. పైగా మన తెలుగు వాళ్ళు తమిళ్ సినిమా వాళ్ళని ఆదరించినంతగా అక్కడివారు మన వాళ్ళని ఆదరించరు అని నా అభిప్రాయం. 

కమల్ హాసన్ కి ఉన్న నేషనల్ వైడ్ క్రేజ్ ని మణిరత్నం నాయకుడు, శంకర్ భారతీయుడు మరింత పెంచాయి. అలాగే రజనీ క్రేజ్ ని మణిరత్నం 'దళపతి', శంకర్ 'శివాజీ', 'రోబో సీరీస్' సినిమాలు పెంచాయి. 'Bigger Than Bachhan' అనే క్రేజ్ ఉన్న రోజుల్లోనే చిరంజీవికి  ఇప్పటి రాజమౌళి లాంటి వాడు దొరికిఉంటే ఆ క్రేజ్ రెట్టింపు అయ్యేది. 

కథల ఎంపికలో, తనకు తగిన సినిమాలు చేయడంలో చిరంజీవి పొరపాట్లు కూడా ఉండి ఉండచ్చు.  దానికి తోడు కాస్త ధైర్యం చేసి ముందడుగు వేసినప్పుడల్లా 'రుద్రవీణ', 'స్వయం కృషి', 'ఆపద్బాంధవుడు' , 'డాడీ' లాంటి సినిమాలు దెబ్బతిన్నాయి. 'డాడీ' సినిమాలో కూతురిని కాపాడుకోలేక జైలులో నిస్సహాయుడుగా కూర్చోవడం నచ్చక కడప లో ఒక థియేటర్ లో ఫాన్స్ ఆ థియేటర్ ని పీకి పందిరి వేశారు. అప్పుడెప్పుడో ఖైదీ లోనే పోలీసులని ఉతికి ఆరేసిన మా హీరో ఇప్పుడు లాకప్ లో ఏడవడం ఏమిటి అని. సరే అదంతా ఆయన స్వయంకృతాపరాధమే. 'రోగి పాలు కావాలన్నాడు, డాక్టర్ అవే తాగు బాబూ' అన్నాడు అన్నట్లు కెరీర్ మొత్తం లో అన్నీ అలాంటి సినిమాలే చేసాడు ఫ్యాన్స్ కోసం అంటూ.  

కమల్ హాసన్ పాత సినిమాలు ఇప్పటికీ ఎవరు గ్రీన్ అనిపిస్తాయి. అడ్డంగా ఇరవై ముప్పై మందిని చితక్కొట్టే మాస్ సన్నివేశాలు ఆయన సినిమాలో అరుదు. మొదట్లో ఉట్టి మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేసిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కెరీర్ దెబ్బతింది. కానీ మొదట్లో కుదురుకోవడానికి కాస్త టైం పట్టినా రొడ్డకొట్టుడు సినిమాలు చేయని అమీర్ ఖాన్ కెరీర్ మంచి బూమ్ లో ఉంది ఈ మధ్య వచ్చిన రెండు ప్లాప్స్ తప్ప. 

అన్నయ్య కెరీర్ వయసు కంటే తక్కువ వయసున్న నేను ఆయనకు చెప్పగలిగే స్థాయిలో  లేను కానీ ఒక అభిమానిగా 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు' లాంటివి పక్కన బెట్టి తన వయసుకు తగ్గ సినిమాలు చేసి అలరిస్తారని కోరుకుంటున్నాను. 

Belated happy birthday wishes చిరంజీవి అన్నయ్య. 

చిన్న జ్ఞాపకం: ఖైదీ సినిమా మొదట వేరే హీరో చేయాల్సి ఉండేది అనే మాట నిజం. కానీ అది మా దగ్గరికి వచ్చేప్పటికి - "రగులుతోంది మొగలిపొద" పాటలో బెండు అప్పారావు (క్షమించాలి ఆయన ఫాన్స్ నన్ను. యెంత చిరంజీవి ఫ్యాన్ అయినా నాకెందుకో ఆయనంటే ఇప్పటికీ బాగా అభిమానం, అప్పట్లో ఆయనను కొందరు అలా యెగతాళి చేసేవారు కానీ ఇలాంటి సిల్లీ విషయాలను అస్సలు పట్టించుకోని సాహసి ఆయన) డాన్స్ అస్సలు చేయలేకపోయాడని అందుకే ఆయన్ని తీసేసి పల్లెటూరి రైతు పాత్రని స్టూడెంట్ పాత్రగా మార్చి చిరంజీవి ని పెట్టి తీశారనే విధంగా మారిపోయింది రాజు గారి నోట్లో తాటి చెట్టు  మొలిచిందట అనే సామెత లాగా.  

మీ సొట్ట కాళ్ళోడు యెంత గంతులేసినా మా హీరో లాగా డైలాగ్స్ చెప్పలేడు అనేవాళ్ళు అవతలి హీరో ఫాన్స్.  

అవన్నీ ఇప్పుడు తలచుకుంటే భలే నవ్వొస్తుంది. 

16, ఆగస్టు 2022, మంగళవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 6

ఇది ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 5  కి కొనసాగింపు  

ఆఫీస్ కి వెళ్ళే హడావిడిలో ఉంటే డోర్ ఎవరో కొడుతున్నట్లు శబ్దం వచ్చింది. 

ఓపెన్ చేసి చూస్తే ఇంగ్లీష్ బామ్మ, ఆవిడ తలుపు తట్టిందంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఎప్పుడూ ఏదో ఒక రగడ చేస్తుంది వచ్చిందంటే. 

మీ బాల్కనీ లో బట్టలు ఆరేశారు అంది 

ఇది కొత్తగా వచ్చిన మా ముఖేష్ పనే అని అర్థమైంది మాకు. 

ఈ సారికి మమ్మల్ని ఒగ్గెయ్యవే బామ్మ అని కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడితే "కొత్తవాడు తెలియదు అన్నారు కాబట్టి వదిలేస్తున్నా" అంది 

బాబూ ముఖేషూ,  బాల్కనీ లో బట్టలు ఆరేయద్దు. 250 డాలర్ల దాకా ఫైన్ వేస్తారు అన్నాను. 

ఎందుకలా?

బాల్కనీ లో బట్టలు ఆరేస్తే , బిల్డింగ్ బ్యూటీ దెబ్బతింటుందని ఇక్కడి వారి బోడి ఫీలింగ్. 

అవును మరి ఇదో ఓపెరా హౌస్ లేదంటే తాజ్ మహల్ మరి, కనీసం మా ఊరిలో పాడు బడ్డ రాయల్ టాకీస్ లా కూడా లేదు అన్నాడు. 

అవుననుకో, కానీ ఇక్కడ రూల్స్ అలా ఉన్నాయి మరి. మన బాల్కనీ అటు మెయిన్రోడ్  వైపుకు వస్తుంది కాబట్టి ఆరేయకూడదు. 

అయినా నేను ఆరేసింది బాల్కనీ గోడలమీద కాదు కదా, బాల్కనీలో ఉన్న మన చైర్స్ మీదే కదా! 

మన బాల్కనీ ఎవరికీ కనపడకుండా రోడ్డుకు వెనుక వైపు ఉంటే ఆరేసుకోవచ్చు. లేదంటే అది కూడా తప్పే అన్నాను. 


                                                    ********************


బుధవారం సాయంత్రం రూమ్ కి వచ్చేసరికి కిచెన్ లో కాస్త బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లు అనిపించింది. ఏమిట్రా అని అన్ని గిన్నెలు వెదికితే విరిగిపోయిన పాలు కనిపించాయి ఒక గిన్నెలో. 

"నేనే పాలల్లో తోడు వేశా పెరుగు కోసం" అన్నాడు మా ముఖేష్. 

ఈ చలికి అంత ఈజీగా పెరుగు తోడుకోదు, మైక్రోవోవెన్ లో ఉంచు లేదంటే రెండు రోజులైనా పేరుకోక ఇలా బాడ్ స్మెల్ వస్తుంది. మన రూమ్ పక్కన ఉండే షాప్ లో కొను ఈ ఇబ్బందులు పడకుండా అన్నాను. 

వాడి దగ్గర పెరుగు లేదు అన్నాడు. 

వాడి దగ్గర ఉంటుందే, నేను ఎప్పుడూ అక్కడే తెచ్చుకుంటా. 

అదేంటి? మరి వాడు నేను అడిగితే తెలీదు, లేదు అన్నాడే?

నువ్వేం అడిగావు?

కర్డ్ అని అడిగా. 

ఈ సారి వెళ్ళినప్పుడు యోగర్ట్ అని అడుగు ఇస్తారు, వీళ్ళు కర్డ్ అనే మాట వాడరు అన్నాను. 


                                                       ******************                             


మరుసటి రోజు ఇవాళ చికెన్  చేసుకుందాం అని చికెన్ షాప్ కి పట్టుకెళ్ళాడు. 

కిలో చికెన్ అడిగితే షాప్ వాడు ఫ్రిడ్జ్ లోంచి తీసి ఇచ్చాడు. 

మనూర్లో అయితే చక్కగా అప్పటికప్పుడు మన కళ్ళ ముందు కోసి ఇస్తే గానీ తీసుకోము అలాంటిది వీడేంటి నిన్నో మొన్నో ఫ్రిడ్జ్ లో పెట్టినది తీసి ఇస్తున్నాడు. 

నిన్నో మొన్నో కాదు ప్రతీ శుక్రవారం స్టాక్ వస్తుంది 

అంటే ఈ రోజు గురువారం, అంటే 6 వ రోజు అన్నమాట 

అవును స్టాక్ వచ్చి 6 రోజులు అంతే, కోసిన తర్వాత రెండు రోజులు warehouse లో ఉంచిన తర్వాతే ఇలా షాప్ కి పంపిస్తారు రూల్ ప్రకారం. 

ఇవెక్కడి రూల్స్ రా బాబూ, మనూర్లో ఉదయం కోసిన చికెన్ మధ్యాహ్నం ఇస్తేనే ఒప్పుకోము. 

అవును ఇక్కడ అంతే. ఈ సారి శుక్రవారం ఈవెనింగ్ లేదంటే ఆదివారం వచ్చి కొను అన్నాను. 

సర్లే చికెన్ అప్పుడే కొంటా, అయినా ఈ చికెన్ తినడానికా ఆస్ట్రేలియా వచ్చింది, ఇవి కాదురా అబ్బాయ్ ..  ఇక్కడ కంగారు, క్రొకోడైల్ మాంసం దొరుకుతాయట? ఎక్కడ అన్నాడు. 

కంగారు అంటే మనకు ఇంగ్లీష్ తెలియదనుకుంటారు, దాన్ని కేంగరు అని ఒక రకంగా పలకాలి. అయినా వాటిని కూడా వదిలిపెట్టవా? 

తినేప్పుడు కోడి అయితేనేం క్రొకోడైల్ అయితేనేం పద ఆ షాప్ చూపించు అన్నాడు. 

అక్కడ అరకిలో క్రొకోడైల్ మాంసం కొని రూమ్ కి వెళ్ళాం కానీ ఆ రోజు రాత్రి జరగబోయే క్రొకోడైల్ ఫెస్టివల్ (ఉపద్రవం) ఊహించలేకపోయాం. 

11, ఆగస్టు 2022, గురువారం

ఇదో అంతులేని మరో సినిమా గాథ

                                                                చాప్టర్ 1

అనగనగా కర్నూల్ అనే ఊరిలో "పీకలు కోసి బదులుగా చెట్లు నాటే" ఒక నాటు విలన్ ఉంటాడు. అదే ఊరికి డాక్టర్ గా మన హీరో వస్తాడు. వచ్చీ రాగానే విజిల్ వేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

"డాక్టరూ డాక్టరూ నువ్వేలే నా సారూ, తగ్గించు మా అమ్మకి షుగరు" అంటూ హీరోయిన్ ఒక పాట వేసుకుంటుంది. 

అటు విలన్ చేసే ఆగడాలు, ఇటు విజిల్ వేసే అమ్మాయి విన్యాసాలతో రెండు మూడు సీన్స్ ముగిశాక విలన్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాడు మన హీరో. ఆ  కంప్లైంట్ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది విలన్ బెదిరింపుల వలన. అలా రెండు సార్లు హీరో విలన్ కి ఎదురొచ్చాక కొండారెడ్డి బురుజు దగ్గర హీరోని చితక్కొట్టి అక్కడే కొక్కానికి వేలాడదీసి వెళ్ళిపోతాడు విలన్. 


                                                                    చాప్టర్ 2

డాక్టర్ తో పని అయ్యేలా లేదు అని ఈ సారి మళ్ళీ కర్నూల్ వస్తాడు రెండేళ్ళ తర్వాత పోలీస్ అయి. 

"భూమికి బెత్తెడు లేవు నువ్వేం పోలీసువి రా"  అని విలన్ 

"భూమికి బెత్తెడు కాదు బారెడు నేను" అని హీరో 

నాలుగైదు కౌంటర్ డైలాగ్స్ అనేసుకొని రెండు మూడు ఛాలెంజ్ విసురుకోవడాలు అయిన తర్వాత  మళ్ళీ ఆ కొండారెడ్డి బురుజు దగ్గర కొట్టుకున్నాక  విలన్ ని అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాడు హీరో. 

"పోలీసు పోలీసు నువ్వేలే నా బాసు, కొట్టేయ్ మా నాన్న మీది కేసు" అని హీరోయిన్ వచ్చి ఒక పాట వేసుకుంటుంది. 

అరెస్ట్ చేసిన విలన్ ని కోర్టులో ప్రవేశపెడతారు. అక్కడ విలన్ తరపు లాయర్ ఒకడు గొప్పగా వాదించేసి విలన్ మీద కేసులన్నీ కొట్టేయించి బయటకి తీసుకొస్తాడు. 

ఈ చెట్లు నాటే కార్యక్రమానికి పుల్ స్టాప్ పెట్టించాలనుకొన్న హీరో కామా మాత్రమే పెట్టించగలుగుతాడు.  


                                                                     చాప్టర్ 3

పోలీస్ తో పని పయ్యేలా లేదు అని రెండు మూడేళ్ళ తర్వాత నల్లకోటు వేసుకొని లాయర్ గా వస్తాడు. 

డ్రైవర్, మనం కరెక్ట్ రూట్ లోనే కర్నూల్ వెళ్తున్నామా?

అవును సర్.  

మరి ఏదో అడవి లాగా ఉందే దారంతా!

అవును సర్, ఈ కర్నూల్ అరణ్యం అయిపోయింది ఆ విలన్ నాటిన మొక్కలు చెట్లై, చెట్లు మానులై, మానులు వృక్షాలై, వృక్షాలు వనాలై, వనాలు అరణ్యం గా మారిపోయింది సర్. ఇలానే అయితే ఒకప్పుడు ఇక్కడ కర్నూల్ నగరం ఉండేది అని మన పిల్లలు పుస్తకాల్లో చదువుకోవసి వస్తుంది సర్ అని గుక్క తిప్పుకోకుండా గుప్పెడు డైలాగ్స్ చెప్పేస్తాడు డ్రైవర్. 

అది ఆపడానికి వచ్చింది నేను, కార్ ఆపు కోర్ట్ వచ్చేసింది అంటాడు హీరో. 

"లాయరూ లాయరూ చూపించు నీ జోరూ, అయిపోవాలి అందరూ బేజారూ" అని హీరోయిన్ వచ్చి ఒక పాట వేసుకుంటుంది. 

కేసును తిరగతోడి మళ్ళీ విలన్ ని కోర్ట్ బోనులో నిలబెడతాడు. 

అద్భుతంగా వాదించినా జడ్జి ఇచ్చిన తప్పుడు తీర్పుతో మళ్ళీ కేసు కొట్టివేస్తారు. 


                                                                చాప్టర్ 4

ఈ సారి జడ్జి గా వచ్చి విలన్ కి ఉరిశిక్ష పడేలా చేస్తాడు. 

ఉరిశిక్ష వేసి వచ్చి బయటకి వస్తుంటే ఎదురుగా ఉండే కిరాణాకొట్టులో ఉండే ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి "మీరు? ఇక్కడ?" అని అడిగితే 

అవును, నేనే ఆ తప్పుడు తీర్పు ఇచ్చిన జడ్జి ని, దానికి పశ్చ్యాతాపంగా ఆ జడ్జి జాబ్ వదిలేసి ఇదిగో ఇలా  "పక్కా కమర్షియల్" అనే కిరాణా కొట్టు నడుపుకుంటున్నాను అంటాడు. 

హీరోయిన్  వస్తుంది గానీ జడ్జి పాత్రధారి పాట పాడితే బాగోదని కొంచెం డీసెన్సీ మెయింటైన్ చెయ్యడం వల్ల ఇక్కడ సాంగ్ పెట్టడం లేదు. 

"కర్నూల్ నగరాన్ని అమెజాన్ అడవిలా పెంచి పర్యావరణాన్ని కాపాడినందుకు" రాష్ట్రపతి మెచ్చుకొని ఇచ్చిన క్షమాభిక్ష వల్ల ఉరి శిక్ష నుంచి తప్పించుకుంటాడు విలన్. 

                                                                    

                                                                చాప్టర్ 5

మీరు మరీ స్మార్ట్ ఈ పాటికే ఊహించివుంటారు హీరో ఎంట్రీ ఈ సారి రాష్ట్రపతి గా అని. 

సినిమా చివర్లో డీసెన్సీ లాంటివి వదిలేయాలి, ఎందుకంటే మాస్ కి ఇక్కడో మాంచి బీట్ ఉన్న సాంగ్ పెట్టి తీరాలి ఎప్పటి నుంచో వస్తున్న తెలుగు సినిమా ఆచారం ప్రకారం కాబట్టి "రాష్ట్రపతి రాష్ట్రపతి  నువ్వే నాకు పతి, చేసుకో నన్ను నీ సతి" అని పెట్టిన పాట సెన్సార్ నుంచి బయటకు వస్తే చూడచ్చు. 

క్షమాభిక్ష ని కొట్టివేసి తిరిగి విలన్ కి ఉరి శిక్ష విధిస్తాడు మన హీరో. 


                                                                    చాప్టర్ 6

ఈ సారి మన హీరో అమెరికా ప్రెసిడెంట్ అవుదామని అమెరికా వెళ్ళి అక్కడ రోడ్డుపై నడుస్తూ ఉండే సీన్ తో "వారియర్-2" అని  సినిమా ముగుస్తుంది. 

1, ఆగస్టు 2022, సోమవారం

అంతా ఆయనే చేశారు

సాధారణంగా నేను హిందీ సినిమాలు ఇష్టపడను. ఒక ఇరవైయ్య్యేళ్ళ క్రితం కాస్తో కూస్తో చూడాలని అనిపించేవి. తర్వాత అవీ చూడబుద్ధి కాలేదు. అప్పుడప్పుడూ మరీ బాగున్నాయి అన్న సినిమాలు తప్పితే హిందీ సినిమాలు చూడటం దాదాపు మానేశాను. 

మొన్న ఆదివారం రోజు, నాకు ఈ పంచాంగాలు, జాతకాలు తెలీదు కాబట్టి ఏ శుక్రుడో నన్ను వక్ర దృష్టితో చూస్తుండబట్టో లేక ఆ దిక్కుమాలిన ఆదివారం అమావాస్య రోజో ఏమో తెలీదు కానీ ఒక హిందీ సినిమా అదీ హారర్ చూద్దామని అనుకుంటే ఆ netflix భాండాగారంలో ఓ సినిమా కనపడింది. రేటింగ్స్ లాంటివి చూడకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏ సినిమా దొరికితే అది చూసే నేను ఆ సినిమా చూడటం మొదలు పెట్టాను.  

కాసేపటికే ఆ సినిమా హారర్ కాదు జుగుప్సకి పరాకాష్ట అనిపించింది, నా లైఫ్ లో ఒక్క సినిమా కూడా పూర్తిగా చూడకుండా మధ్యలో మధ్యలో వదిలేసింది  లేదు అలాంటిది పాతిక భాగం కూడా చూళ్ళేకపోతున్నానే అని 1.5 స్పీడ్ లో పెట్టి ముగిద్దాం అని  అనుకున్నా కానీ అర్ధ భాగం చూసేప్పటికీ ఆ జుగుప్స ని తట్టుకోలేక ఆపేశాను. ఆ సినిమా పేరు "ఘోస్ట్ స్టోరీస్" , కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ అనబడే నలుగురు ఉద్దండుల చేత తీయబడిన నాలుగు స్టోరీల సమాహారమే ఆ సినిమా. రెండు స్టోరీస్ చూసేప్పటికే నాకు కంపరం పుట్టుకొచ్చి ఆపేశాను, ఇక ఆ నాలుగు స్టోరీస్ చూసిన వారెవరో గానీ వారికి గొప్ప గొప్ప అవార్డ్స్ ఇవ్వచ్చు. 

పోయిన ఏడాది వరకు ఈ హిందీ సినిమాలు నాకు నచ్చడం లేదంటే నేను outdated అయ్యానేమో అని అనిపించింది కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమా, బాలీవుడ్  ప్రేక్షకులకే ఎక్కడం లేదంటే హమ్మయ్య! కాస్తో కూస్తో ఇంకా నేను outdated కాలేదేమో సినిమాలని ఆస్వాదించగలిగే టేస్ట్ మన దగ్గర మిగిలే  ఉంది అనుకున్నా (మన అంటే నేనే, మా ఎన్టీవోడి పద ప్రయోగం అంతే, నన్ను నేనే గౌరవంగా పిలుచుకొని, గర్వంతో భుజం తట్టుకొని అభినందించుకుంటున్నాను)

పదేళ్ళ క్రితం బాలీవుడ్ సినిమా హిట్టవ్వాలంటే షారుఖ్ అయినా ఉండాలి లేదా సెక్స్ అయినా ఉండాలి అనేవారు, తర్వాత షారుఖ్ కూడా ఆ లిస్ట్ లోంచి వెళ్ళిపోయి సెక్స్ ఒక్కటే మిగిలింది. యాభై శాతం పైన సినిమాల్లో కథలు అక్రమ సంబంధాల చుట్టూ లేదంటే సహ జీవనం  అనబడే విచ్చలవిడి జీవితాల చుట్టే తిరుగుతుంటాయి. మా తెలుగు సినిమాలే మేలబ్బా, ఇంకా అంత ఎత్తుకు ఎదగనందుకు. ఇంకా అవే రొటీన్ సినిమాలైనా ఏ చెట్టు లేని చోట ఆముదము చెట్టు లాగా వెలిగిపోతున్నాయి. 

చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కాస్త డిమాండ్ లో ఉన్నప్పుడు "ఆ టాలీవుడ్ లో కథంతా హీరో చుట్టే తిరుగుతుంది, అందుకే మేము తెలుగు సినిమాల్లో నటించం" అని పెద్ద స్టేట్మెంట్స్ పడేస్తుంటారు అక్కడికి వారేదో అక్కడ గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తున్నట్లు. 

"దేశంలో ఉండే ఎన్నో సమస్యలతో పాటు ఈ హిందీ సినిమా ఇండస్ట్రీ ఇలా దరిద్రంగా  తయారవ్వడానికి కారణం ఆ గాంధీ గారు కదూ, నెహ్రూ గారిని కాకుండా పటేల్ గారిని ప్రధానిని చేసి ఉంటే అసలు ఇలా జరిగేదా" అని సభాముఖంగా ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటున్నాను.