26, జులై 2021, సోమవారం

ఆ మాత్రం లాజిక్ ఆలోచించలేకపోయావా?

హే పవన్,  మన 'సినిమా పిచ్చోళ్ళు'  వాట్సాప్  గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోయావ్? నిన్న మీ ఫేవరెట్ హీరో గురించి నెగటివ్ గా మాట్లాడామని అలిగావా?

లేదబ్బా, COVID వల్ల ఈ వారం బయటికి వెళ్ళడానికి వీల్లేదు, కనీసం ఏదో ఒక రకంగా బయటికి వెళ్లాలని గ్రూప్ లోంచి బయటికి వెళ్ళా 😝

సరే, మళ్ళీ గ్రూప్ లోకి యాడ్ చేస్తాలే నిన్ను. 

థాంక్స్,  ఇంకేంటి విషయాలు. 

ఏం చేస్తాం, నా కంటే నా చేతులే ఎక్కువ  ఆల్కహాల్ తాగుతున్నాయి, మాటి మాటికి చేతులు రబ్ చేసుకోవడం వల్ల బొబ్బలు కూడా వచ్చేస్తాయేమో 

ఈ  మాత్రం దానికే బొబ్బలు వచ్చేస్తాయా నువ్వు మరీనూ. 

రాలేదు, కాకపొతే ఈ రోజు నుంచి బట్టలు నేనే ఉతుక్కోవాలి అందుకు వస్తాయేమోనని 

వాషింగ్ మిషన్ వాడచ్చుగా 

అది సరిగ్గా పని చెయ్యట్లేదు పవన్, ప్రతీ అర నిమిషానికి ఆగిపోతోంది. 

అదేంటి, పోయిన సంవత్సరమేగా కొన్నావు. 

అవును మొన్నటివరకు పని చేసింది, ఇవాళే పని చేయడం లేదు.  వారంటీ ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ ఎత్తేశాక రిటర్న్ ఇచ్చెయ్యాలి. 

అవును, అమెజాన్ ప్రైమ్ లో ఏదైనా కొత్త సిరీస్ ఏమైనా స్టార్ట్ అయిందా?

థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అని COVID కొత్త సిరీస్ లు ఆపేస్తే గానీ కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ అవ్వవేమో. అవును, నిన్న డబ్బు డ్రా చేయడం కోసం బ్యాంకుకి వెళ్లానన్నావ్? ఎటిఎం కి వెళ్లచ్చుగా?

జనాలు సూపర్ మార్కెట్ ల మీదే కాదు, పిచ్చి పిచ్చిగా ఎటిఎం ల మీద కూడా పడి డబ్బు డ్రా చేసుకున్నారు, అందుకని ఎటిఎం లో డబ్బు లేక బ్యాంకు వెళ్ళాను. సినిమాల్లో చూపించినట్లు బాంక్ కొల్లగొట్టడానికి వచ్చిన దోపిడీ దొంగ మాదిరి మాస్క్ వేసుకొని వెళ్ళి డబ్బు తెచ్చుకోవాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. 

అవును నిజమే.  

ఈ మాస్క్ ఉండటం వల్ల బ్యాంకు బయట ఉండే సెక్యూరిటీ గార్డు నన్ను గుర్తుపట్టలేదు. 🤣🤣

అందులో విశేషం ఏముంది?

వాడికి నేను అప్పున్నా, డబ్బు లేదని చెప్పి తీర్చకుండా తిరుగుతున్నా, గుర్తుపట్టలేదు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ డబ్బు తీసేసుకునేవాడు. 

మాస్క్ వల్ల ఉపయోగాలు ఉన్నాయన్నమాట. 

ఈ మధ్య ఎప్పుడూ షార్ట్స్ వేసుకొని ఉంటున్నామా, నిన్న బ్యాంక్ కి వెళ్ళడానికి జీన్స్ వేసుకుంటే కంఫర్ట్ గా అనిపించలేదు.  

కొంపదీసి ఆ జీన్స్ ప్యాంట్ గానీ వాషింగ్ మెషిన్ లో వేశావా?

అవును, ఎప్పుడో సంవత్సరం క్రితం ఉతికేసింది, ఇప్పుడన్నా ఉతికేద్దామని వేశా. 

వెంటనే అది తీసి ఆన్ చెయ్. 

అవును పవన్, నిజంగానే ఇప్పుడు పనిచేస్తోంది.  

నువ్వు మాత్రం గత ఏడాదిగా షార్ట్స్ వేసుకొని, నిన్నొక్క రోజు జీన్స్ వేసుకుంటే కంఫర్ట్ గా లేదు అన్నావు. మరి, ఆ వాషింగ్ మెషిన్ పరిస్థితీ అదేగా, కొన్నప్పటి నుంచి దానికి నిక్కర్లు, బనీన్లు మాత్రమే ఉతికే అలవాటుంది. ఇప్పుడు జీన్స్ వేస్తె ఎలా? దానికీ హెవీ అనిపించదూ పాపం?        


23, జులై 2021, శుక్రవారం

బాలయ్య కు భారత రత్న ఇవ్వాల్సిందే

"ఏంటి కబుర్లు" అంటూ ఫోన్ లో ఫ్రెండ్.  

ఏముంది, మా బాలయ్య కు భారతరత్న ఎప్పుడిస్తారా? అని ఆలోచిస్తుంటే నువ్వు ఫోన్ చేశావ్. 

ఇది మరీ విడ్డూరంగా ఉంది. ఒక ముతక సామెత చెప్పినట్లు, పెద్దాయన అంటే గౌరవం ఉంది కాబట్టి అది చెప్తే బాగోదు. అయినా తండ్రికే ఇవ్వట్లేదు అంటే కొడుక్కి కావాలంటావ్?

నేను కావాలని అనట్లేదు, భారత రత్న తనకి ఇవ్వాలని మా బాలయ్యే అన్నాడు. 

అదెప్పుడు?

మొన్నొక ఇంటర్వ్యూ లో 

అలా అనలేదే, భారత రత్న మా నాన్న చెప్పుతో సమానం అన్నాడు. 

కదా, మరి తండ్రి ఆస్థి ఎవరికి చెందాలి

కొడుక్కి 

మరి భారతరత్న వాళ్ళ నాన్న చెప్పుతో సమానం అంటే అది వాళ్ళ నాన్న ఆస్థి అయినట్లే కదా. తండ్రి ఆస్థి అయినా అస్తికలు అయినా కొడుక్కే కదా చెందాలి.  కాబట్టి భారత రత్న ని మా బాలయ్యకే ఇవ్వాలి. 

అలా వచ్చావా. ఖర్మ. నిన్ను, బాలయ్య ను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. 

సర్లే వాళ్ళో వీళ్లో ఇచ్చేదేమిటి? నేనే ఇస్తా బాలయ్య బాబు కి భారత రత్న. 

అదెలా?

మొన్నా మధ్య హీరో  సుమన్ కు 'దాదా సాహెబ్ పాల్కే' అవార్డు ఇచ్చారు కదా అలా. 

సుమన్ కు 'దాదా సాహెబ్ పాల్కే' అవార్డు ఏంటి? మతుండే మాట్లాడుతున్నావా?

అవును, పేపర్స్ లో ఆ వార్త చదివలేదా?

లేదే? 

చెప్తా విను. సుమన్ కు 'దాదా సాహెబ్ పాల్కే' అవార్డు ఇచ్చారని పేపర్లో చదివా.  సామాన్యంగా  మన తెలుగోళ్ళకి అవార్డు ఇవ్వరు, ఒక వేల ఇచ్చినా ఏదో పెద్ద రేంజ్ లో లాబీయింగ్ జరగాలి.  మరి సుమన్ కి అంత రేంజ్ లేదు, పైగా కృష్ణ లాంటి సీనియర్ యాక్టర్ ని పెట్టుకొని సుమన్ కి ఎందుకు ఇచ్చారు? అయినా అమితాబ్ కి రజని కాంత్ కి ఇచ్చారు కాబట్టి పాపులారిటీ లో వారి తర్వాతి స్థానం చిరంజీవిదే  కాబట్టి తనకైనా ఇవ్వాలి కానీ సుమన్ కి ఎలా ఇచ్చారు అని కాస్త శోధిస్తే తెలిసిందేమిటంటే ఏదో ఒక సంస్థ వాళ్ళిచ్చే అవార్డుకి  ''దాదా సాహెబ్ పాల్కే" అని పేరు పెట్టేసుకొని ఇచ్చేస్తున్నారట.  అలా నేను కూడా ఇస్తా బాలయ్య బాబు కి భారత రత్న. 

ఖర్మ రా దేవుడా ?  నీ ఇష్టం. జేమ్స్ కామెరూన్ కన్నా, రెహమాన్ కన్నా మీ బాలయ్య తక్కువేం కాదు కాబట్టి భారతరత్న తో పాటు ఆస్కార్ కూడా ఇచ్చుకో. 

20, జులై 2021, మంగళవారం

మనం ఊహించనిది జరిగేదే జీవితం అంటే!

ఒరేయ్ గోవిందం, తాజ్ మహల్ గురించి నీకేం తెలుసో చెప్పరా?

ఆ బ్రాండ్ పొడి తో చాయ్ చేస్తే ఘుమ ఘుమలాడిపోతది సార్. 

ఖర్మ రా, పోనీ ఇండియా గేట్ గురించి 

ఆ బ్రాండ్ బియ్యంతో తో బిర్యాని చేస్తే ఘుమ ఘుమలాడిపోతది సార్. 

పోనీ చార్మినార్ గురించి చెప్పు 

అది తెలీనోడు ఎవడుంటాడు సార్, మనకు బాగా పరిచయం దాంతో.  

ఇప్పుడు దారిలోకి వచ్చావ్, చెప్పు  

ధారాళమైన పొగ, తక్కువ ఖర్చులో దొరికే సిగరెట్ సార్. 

పోనీ కనీసం, గాంధీ జయంతి గురించి చెప్పు?

గాంధీ గురించి తెలియదు గానీ జయంతి అంటే మా పక్కింట్లో ఉండే ఆంటీ. 

మన దేశ ఐకాన్స్ తెలీదు, జాతి పిత గురించి తెలీదు, ఎందుకు పనికొస్తావురా నువ్వు. రేపు వచ్చేప్పుడు మీ అయ్య సిగ్నేచర్ తీసుకురా. 

మరుసటి రోజు ఆ టీచర్ క్లాస్ లోకి రాగానే టేబుల్ మీద అంతే, అగ్గి  మీద గుగ్గిలం అయ్యాడు ఆ టీచర్, ఇలాంటి మూర్ఖుడిని చదివించడం డబ్బు దండగ అని ఆ కుర్రాడి పేరెంట్స్ కి నచ్చ జెప్పి స్కూల్ నుంచి పంపించేశాడు.  తెలివితక్కువ గోవిందం స్కూల్ నుంచి వెళ్లిపోవడంతో మిగతా స్టూడెంట్స్ అందరూ సంతోషించారు. 

                                                                     ***************

చూస్తుండగానే 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 20 సంవత్సరాలు తాను స్కూల్ నుంచి పంపించేసిన గోవిందం గురించి మధన పడుతూనే ఉన్నాడు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉండి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ లేకపోతేనేం మాథ్స్ లోనే సైన్స్ లోనే తనకు పట్టు ఉండి ఉండచ్చు, ఆ దిశగా నేను అతన్ని ప్రోత్సహించి ఉంటే అతను ఖచ్చితంగా గొప్పోడు అయ్యేవాడు అనుకునేవాడు. 

                                                                   ***************

"పోయిన నెల COVID తో హాస్పిటల్ లో చేరిన మిమ్మల్ని కాపాడలేమని ఈ సిటీలో ఉండే డాక్టర్స్ అందరూ చేతులెత్తేస్తే ఈ ఒక్క డాక్టర్ గారే ముందుకొచ్చారు. మీరిలా తిరిగి కళ్ళు తెరవగలుగుతున్నారంటే దానికి కారణం ఈయనే  నాన్నా" అని అప్పుడే రూమ్ లోకి ఎంటర్ అవుతున్న డాక్టర్ ని చూపించాడు కొడుకు.  

మెల్లగా కళ్ళు తెరిచి, అద్దాలు పెట్టుకొని ఆ డాక్టర్ కి దండం పెట్టబోయాడు మన కథలోని స్కూల్  మేష్టారు. 

మేస్టారూ, మీరు నాకు దండం పెట్టడమేమిటి అని ఆయన చేతులు పట్టుకునే లోపే శ్వాస తీసుకోవడానికి ఆ పెద్దాయన ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకున్నాడు డాక్టర్. ఉన్నట్టుండి ఏమైపోయింది అనుకొని జరిగిందేమిటో అర్థం చేసుకొని  వెంటనే రియాక్ట్ అయి మేష్టారు ని మరోసారి కాపాడాడు ఆ డాక్టర్. 

ఆ డాక్టర్ ఎవరో కాదు, చిన్నప్పుడు ఇదే మేష్టారు స్కూల్ నుంచి మూర్ఖుడని ముద్ర వేసి పంపిన మన హీరో గోవిందం అనుకుంటే, మీ ఆలోచనలకు అడ్డుకట్ట వెయ్యండి. తెలుగు సినిమాలు యెక్కువ చూడటం , ఇన్స్పిరేషన్ ఇచ్చే ఇన్సిడెంట్సో లేక మోటివేషన్ కి పనికొచ్చే కథలో ఎక్కువ చదివితే ఇలాగే తయారవుతారు.  

అసలు జరిగిందేమిటంటే, మన హీరో గోవిందం ఆ రూమ్ క్లీన్ చెయ్యడానికి వచ్చి ఖాళీ సాకెట్ ఏదీ దొరక్క, వెంటిలేటర్ ప్లగ్ పీకేసి అందులో వ్యాక్యూమ్ క్లీనర్ ప్లగ్ పెట్టి ఆ రూమ్ క్లీనింగ్ మొదలెట్టాడు.  

18, జులై 2021, ఆదివారం

4 వ వారం లాక్డౌన్

సిడ్నీలో ఈ రోజుతో COVID సెకండ్ వేవ్ 4 వ వారం లాక్డౌన్ లోకి అడుగుపెడుతున్నాం. 3 వారాలుగా ఇంట్లోనే ఉండి జనాలకి పిచ్చెక్కిపోతోంది, సరైన కారణం లేకుండా రోడ్ల మీద కనపడితే భారీగా ఫైన్స్ వేస్తున్నారు. ఉద్యోగాలు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. 

సర్దార్జీ ల మీద ఎన్ని సిల్లీ జోకులు వేసినా 'పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు' అని నిరూపిస్తూ ఎప్పటికప్పుడు వారికి తోచిన సాయం చేస్తున్నారు. కొంతమంది సర్దార్జీ లు ఒక గ్రూప్ గా ఫార్మ్ అయి ఇబ్బందుల్లో ఉన్నవారు అడగవలిసిన అవసరం లేదు, మీరే వచ్చి మీక్కావలసిన సరుకులు తీసుకెళ్లండి అని ఒక ట్రక్ లో బియ్యం, బ్రెడ్ లాంటి నిత్యావసరాలన్నీ ఒక పెద్ద ట్రక్ లో ఉంచుతున్నారు. అంతే కాదు వంట వండుకోలేని స్టూడెంట్స్ లాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని టేక్ అవే ఫ్రీ మీల్స్ కూడా ఏర్పాటు చేశారు. అందుకే కదా సింగ్ ఈజ్ కింగ్ అన్నారు. 

ఇబ్బందుల్లో ఉన్న వారికి, జాబ్స్ పోయినవారికి సోషల్ సెక్యూటరీ కింద నెలకు కొంత అమౌంట్ గవెర్నమెంట్ వారి ఖాతాల్లో జమ చేస్తోంది. 

పిల్లలతో, ఆఫీస్ వర్క్స్ తో పిచ్చెక్కే ఎంప్లాయిస్ కి రిలీఫ్ కోసం కంపెనీలు ఆన్లైన్ కౌన్సిలింగ్ గట్రాలు నిర్వహిస్తున్నాయి. యోగ చెయ్యండి, దాని నుంచి మీకు కొంత రిలీఫ్ ఉంటుంది అని ఆ కౌన్సిలింగ్ లో చెప్పారని నా మిత్రుడు అన్నాడు. శంఖంలో పోస్తే గానీ తీర్థం అవదు అన్నట్లు, మన యోగా గురించి ఈ ఇంగ్లీష్ వాళ్ళు చెప్తే కానీ నమ్మటం లేదు మనవాళ్ళు. 

నేను తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడు మా నాన్న యోగ నేర్చుకోవడానికి వెళ్తే పగలబడి నవ్విన జనాన్ని చూశాను. ఆయన ఉదయం పూట ఇంట్లో యోగ చేస్తుంటే, అది చూసి మా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్స్ నవ్వుకునేవారు.  ఎవరు నవ్వితే మనకేంటి అని గత పాతికేళ్లుగా ఆయన యోగా చేస్తూనే ఉన్నారు. నేనూ ఒకప్పుడు రెగ్యులర్ గా చేసేవాడిని కానీ ఆ తర్వాత ప్రొడక్షన్ సపోర్ట్ లో పని చేయాల్సి వచ్చింది, దాని వల్ల లేట్ నైట్ ప్రొడక్షన్ ఇష్యూస్, డెప్లాయిమెంట్స్ అని రాత్రుళ్ళు మేలుకోవలసి వచ్చి లైఫ్ బాగా డిస్టర్బ్ అయింది . కంపెనీ స్పాన్సర్డ్ వర్క్ వీసా నా మెడ మీద కత్తి లాగా ఉండేది, కాబట్టి ఇష్టం లేకపోయినా చెయ్యాల్సి వచ్చేది.  ఆ గ్యాప్ తో యోగ అనేది నా లైఫ్ లో పార్ట్ టైం జాబ్ లాగా అయిపొయింది.  'ఫిట్నెస్ కోసం ఇవాళ అర గంట  టైం కేటాయించలేకపోతే, రేపెప్పుడో  రెండు గంటలు టైం హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కేటాయించాల్సి వస్తుంది' అని తెలిసీ యోగా ని రెగ్యులర్ గా చేయాలి అనే విషయాన్ని ఆచరణలో పెట్టలేకపోతున్నాను. 

స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనే దాని మీద చైనా లో జోక్ లాంటి ఒక  నిజం చలామణిలో ఉంటుంది. ఇప్పుడు దాన్ని COVID ఎఫెక్ట్ కి అన్వయించుకోవచ్చు. 

ఆ జోక్ ఏమిటంటే 

రెండు నెలల క్రితం, మార్కెట్ బాగుండేది. నేను తినేదే నా కుక్క కూడా తినేది. 

పోయిన నెల, మార్కెట్ కొంచెం దెబ్బతింది, నా కుక్క తినేదే నేనూ తిన్నాను. 

ఈ నెల మార్కెట్ పూర్తిగా క్రాష్ అయింది, నా కుక్కనే నేను తిన్నాను. 

కాస్త చేదుగా, ఎబ్బెట్టుగా అనిపించినా ఇది కాదనలేని నిజం. త్వరలో ఈ COVID కేసెస్ తగ్గి, ఇక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తేస్తుందని, అందరం మళ్ళీ సాధారణ జీవితాన్ని గడుపగలుగుతామని  ఆశిస్తున్నాను. 

14, జులై 2021, బుధవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 2

అలా దూరపు కొండలు నునుపు కాదు అని సిడ్నీ లో దిగగానే తెలుసుకున్న నేను ఇండియా నుంచే  బుక్ చేసుకున్న ఇంటికి వెళ్ళాను. (నా లాగా ఇక్కడికొచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఒకరిద్దరు ఇదొక సైడ్ బిజినెస్ లాగా మొదలెట్టారు. స్టేషన్ కి బాగా దగ్గరగా ఉండి, ఇండియన్స్ ఎక్కువగా ఉండే స్థలాల్లో ఒక మూడు నాలుగు ఇళ్ళు అద్దెకు తీసుకోవడం, అందులో ఇలా కొత్తగా వచ్చిన వాళ్ళకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం)

అదే ఇంట్లో క్రాంతి అనే అతను పరిచయమయ్యాడు, మన తెలుగోడే, నాకొక గైడ్ గా అలాగే నా గోడు ఏమైనా ఉంటే వినడానికి అతనొక్కడే దొరికాడు మొదటి 3 వారాల్లో (ఏ దేశమేగినా అక్కడ మనతో మాట్లాడటానికి ఒక తెలుగోడు దొరికితే యెంత హాయో మాటల్లో చెప్పలేము)

అరే, ఇన్ని బొద్దింకలు ఏమిట్రా బాబు. అని అడిగా? 

ఇవి చాలా తక్కువ, ఇది కొంచెం కొత్త బిల్డింగ్ కాబట్టి, రామ్ అని నా కొలీగ్ ఉండే రూమ్ లో బొద్దింకలు  చైనా జనాభా ని ఛాలెంజ్ చేయగలవు. 

అది మూడో నాలుగో తరగతి చదువుతున్న రోజులు, బెల్ కొట్టగానే ఒంటేలు కోసం పరిగెత్తాము నేను నా మిత్రుడు. ఆ రోజు రాత్రి బట్టసినిమాగా వేటగాడు వేయబోతున్నారు అని దండోరా వినపడింది. 

అవున్రా, మీ శ్రీదేవి కూడా ఒంటేలు వస్తే మనలా పరిగెత్తాల్సిందేనా? అడిగాడు మిత్రుడు 

ఛీ ఛీ వెధవా, వాళ్ళకు ఇలాంటివి ఉండవురా. 

అంటే పొద్దుటే చెంబు పట్టుకుపోరా వాళ్ళు 

మళ్ళీ అదే మాట, వాళ్ళు ఇలాంటి దరిద్రపు పనులకు పోవాల్సిన పని లేకుండా దేవుడు పుట్టించి ఉంటాడురా. 

"రేయ్, వాళ్ళు కూడా మన లాగా భూమ్మీద పుట్టినోళ్ళేరా. శ్రీదేవేమీ ఆకాశం నుంచి ఊడి పళ్ళేదు" అన్నాడు ఏడో తరగతి చదువుతున్న మా సీనియర్ జిప్పెట్టుకుంటూ. 

ఆస్ట్రేలియా లో కూడా బొద్దింకలు ఏమిటి ఛండాలంగా? అందామనుకున్నా కానీ చిన్నప్పుడు జరిగిన పై సంఘటన గుర్తొచ్చి ఆగిపోయి 'కానీ ఇవి మన ఇండియా లో కనపడే బొద్దింకలలా లేవే, కొంచెం చిన్నగా ఉన్నాయి' అన్నాను. 

వీటిని జర్మన్ బొద్దింకలు అంటారు, మన ఇండియా లో కనిపించే అంత సైజు లో ఉండవు ఇవి, ఇవి చిన్నగా ఉంటాయి గానీ బాగా చిరాకు పెడతాయి. కానీ వీటితో మరీ అంత పెద్దగా ప్రమాదం లేదు కానీ ఫ్రిడ్జ్ వెనుక దాక్కొని వాటి వైర్లను కొరికేసి డామేజ్ చేస్తుంటాయి.  

పుట్టి బుద్దెరిగాక ఇలాంటి బొద్దింకలను ఎన్ని చూడలేదు, సరేలే మనల్ని కొరకవు  కదా అది చాలు.  

దాని కోసం స్పైడర్స్ ఉన్నాయిగా, ఇక్కడ తిరిగే కొన్ని రకాల స్పైడర్స్ నిన్ను స్వర్గానికో, నరకానికో పంపగల సామర్థ్యం గలవి. 

సరేలే, స్పైడర్స్ తో ఎలాగోలా జాగ్రత్త పడతాలే. అయినా అంతగా మన మీదకి వస్తే అప్పుడా  స్పైడర్స్ ని అలా సైడ్ కి తోసేస్తే సరి ?

మరి పాములు?

అవి కూడానా?

ప్రపంచం లో ఉండే డేంజరస్ పాముల్లో 20 శాతం ఇక్కడే ఉన్నాయిట, మనం ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి backyard లో అప్పుడప్పుడూ అవి తిరుగుతూ ఉండచ్చు జాగ్రత్త, చీకటి పడితే డోర్ మూసి ఉండటం మంచిది. 

నిజం చెప్పొద్దూ, కలలోకి కూడా వచ్చేవి ఆ బొద్దింకలు అంత ఎక్కువగా తిరుగుతుండేవి ఆ ఇంట్లో.  

12, జులై 2021, సోమవారం

ఈ వారం ముచ్చటగా మూడు మంచి సినిమాలు

ఎప్పుడూ మంచి సినిమాలే పెట్టవు అంటుంది మా ఆవిడ రోజూ టీవీ లో సినిమా పెట్టినప్పుడు. ఏం చేస్తాం నిశ్శబ్దం, మోసగాళ్ళు, సాహో లాంటి చెత్త సినిమాలే చూశాను ఈ మధ్య కాలంలో. 

జాతి రత్నాలు సినిమా రిలీజ్ టైములో ఆ సినిమా ప్రోమోస్, యాడ్స్ యూ ట్యూబ్ లో చూసి ఈ సినిమాకి థియేటర్ కి వెళదాం అంది. మా ఆవిడ.  సోషల్ మీడియా లో కనపడే జోక్స్ ని సినిమాలో పెట్టారు ఇదీ ఒక సినిమానేనా అని వద్దన్నాను. నా ప్రెడిక్షన్స్ ఎప్పుడూ తప్పు కాలేదు కాబట్టి తనూ పట్టుపట్టలేదు సినిమాకి తీసుకెళ్ళమని. 

ఆ తర్వాత ఈ సినిమా హిట్టయిందని విని చూశావా అనవసరంగా మంచి సినిమాని మనం మిస్ అయ్యాము అంది. సరే, నాకు దాని మీద ఇంటరెస్ట్ లేకపోయినా అమెజాన్ లో ఎలాగూ ఎప్పటి నుంచో ఉంది కదా అని ఆ సినిమా పెట్టాను కనీసం నవ్వుకోవడానికి బాగుంటుందని . 

ప్రధాన నటుల ప్రతిభ తప్ప ఏ రకంగానూ మెప్పించని సినిమా ఇది. అసలు ఇలాంటి సినిమా ఎలా హిట్టయిందో దేవుడికే ఎరుక. కాస్త ఎక్కువ పబ్లిసిటీ చేసి హడావిడి చేసేసి హిట్ చేసే tactics వంటబట్టించుకున్న వారు ఉన్నట్లు ఉన్నారు ఈ సినిమా వెనుక, 'సరిలేరు నీకెవ్వరూ' లాంటి సినిమాకి దిల్ రాజు ఉన్నట్లు. నిండుకుండ తొణకదు కానీ ఇదిగో ఇలా విషయం తక్కువ హడావిడి ఎక్కువ సినిమాలే తెగ తొణుకుతూ ఉంటాయి. టీవీ లోనూ సోషల్ మీడియా లోనూ ఇంతకంటే మంచి జోకులు కనపడుతుంటాయి. సోషల్ మీడియా లోదొరికే ఒక పది జోకులను, సెటైర్ లను పోగేసుకొని ఈ సినిమా తీసినట్లు అనిపించింది కథ కాకరకాయ మాకెందుకు అని, ఈ మాత్రం దానికి జబర్దస్త్ చూడటం బెటర్. 

మత్తు వదలరా, బ్రోచేవారెవరురా, షాదీ ముబారక్ లాంటి మంచి సినిమాలు కూడా చూశాను ఈ మధ్యకాలంలో.  మత్తు వదలరా లో నటించిన ముగ్గురు కుర్రాళ్ళలో ముందుగా చెప్పుకోవలసింది కమెడియన్ సత్య గురించి మాత్రమే. వచ్చిన కొత్తలో ఇతను ఎక్కువగా సునీల్ ని ఇమిటేట్ చేసేవాడు కానీ ఈ మధ్య కాలంలో ఆ ఇమిటేషన్ ని కాస్త తగ్గించి బాగా షైన్ అయ్యాడు. ఒకే మూసలో వస్తున్న తెలుగు సినిమాలకి ఇలాంటి కొత్త దర్శకుల అవసరం ఎంతైనా ఉంది. హీరో అనగానే 6 పాటలు, 4 ఫైట్స్ అనే ధోరణి పోవాలి అప్పుడే ఇండస్ట్రీ లో మంచి సినిమాలు వస్తాయి.

నట వారసుల కంటే మంచి ఫిజిక్, డైలాగ్ డెలివరీ, నటన ఉన్న సత్య దేవ్ లాంటి నటులు బ్రోచేవారెవరురా లాంటి సినిమాలో చిన్న చితక పాత్రల్లో నటించాల్సిరావడం తెలుగు సినిమా కి పట్టిన చీడ. 

షాదీ ముబారక్ ఫస్ట్ హాఫ్ సినిమా బాగుంటుంది, సెకండ్ హాఫ్  కొంచెం బోర్ కొడుతోంది. సాధారణంగా సెకండ్ హాఫ్ సరిగ్గా తీయలేకపోవడాన్ని సినిమా పరిభాషలో సెకండ్ హాఫ్ సిండ్రోమ్ అంటారు. ఇది చాలా మంది దర్శకుల్లో ఉంటుంది. షాదీ ముబారక్ సినిమా చూస్తున్నంత వరకు ఈ సినిమా బాగుందే ఎందుకు అంత హిట్ కాలేదు అని ఆలోచించా. అలా ఆలోచించిన కాసేపటికే అర్థం అయింది, సినిమా లో సెకండ్ హాఫ్ నుంచి ఫ్లో దెబ్బ తింది అని. ఇవన్నీ సినిమా రివ్యూ లో రాసే మాటలు. నా భాషలో చెప్తాను ఎక్కడ సినిమా మీద ఇంటరెస్ట్ తగ్గింది అన్నది. 

సినిమా గురించి మాట్లాడేముందు ఈ సినిమాలో ఆకట్టుకునే విషయం ఏమిటంటే అది హీరోయిన్. ముఖ్యంగా ఆమె ఎక్సప్రెస్సివ్ కళ్ళు సినిమా చూస్తున్నంతసేపూ ఆకట్టుకుంటాయి. మంచి నటి అనిపించుకునే అవకాశాలు ఉన్నాయి భవిష్యత్తులో, పైగా చిట్టి పొట్టి బట్టలు లాంటివి వేసుకోకుండా పద్దతిగా బట్టలు వేసుకుంది. 

సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే హీరోయిన్ చీర కట్టుకుంటుంది. ఇక అదే చీర తోనే ఆల్మోస్ట్ ఇంటర్వెల్ వరకూ కథ జరుగుతుంది.  ఆ చీర తోనే  సినిమా అంతా హీరోయిన్ కనపడినా ప్రాబ్లెమ్ ఉండేది కాదు. ఏదో మాల్ లోపలికి వెళ్ళి డ్రెస్ కొనుక్కొని, అదే డ్రెస్ వేసేసుకొని వస్తుంది. అహ, ఇది అవసరమా? సినిమా బాగా సాగే టైములో. ఆ డ్రెస్ ఏమైనా బాగుంటుందా అంటే అది ఛండాలంగా ఉంటుంది  పైగా మెళ్ళో అదేదో పూసల దండ దరిద్రంగా. అంత వరకు దేవ కన్య లా అందంగా అనిపించిన ఆ అమ్మాయి ఉన్నట్లుండి ఒక మామూలు అమ్మాయిగా అనిపిస్తుంది. సరే సర్దుకుపోదాం అనుకుంటే మళ్ళీ అదే డ్రెస్సులో అర్థం పర్థం లేకుండా పబ్బులో పాట ఒకటి. (ఈ కాలం యూత్ కి ఇలాంటి లేటెస్ట్ ఫ్యాషన్ డ్రెస్సులు, పబ్బుల్లో పాటలు నచ్చుతాయి అనుకుంటా, బట్ నాకు నచ్చలేదు ఎంతైనా కాస్త ఓల్డ్ జనరేషన్ కదా) సినిమా అంటే పాటొకటి ఉండాల్సిందే అనే భావన పోతే గానీ సినిమాలు బాగుపడవు. పాటలు పెట్టాలి అనుకుంటే సినిమా ఫ్లో కు అడ్డుపడకుండా ఎలా తీయాలో పవన్ కళ్యాణ్, కరుణాకర్ కాంబినేషన్ లో వచ్చిన తొలిప్రేమ చెబుతుంది. 

మరీ హీరోయిన్ గురించి ఎక్కువ రాసేశాను కదా, ఏం చేస్తాం మగబుధ్ధి. హీరో గురించి ఇప్పుడు చెప్పుకుందాం. ఋతురాగాలో, చక్రవాకమో ఏదో సీరియల్లో పాపులర్ అయిన సాగర్ ఈ సినిమాలో హీరో.  ఛిచ్చీ! హీరోల గురించి ఇంత కంటే ఇంకేం చెపుతాం చాలు చాలు. 

6, జులై 2021, మంగళవారం

మోకాలికి బోడిగుండుకి ముడెట్టడమంటే ఏమిటి? - సామెతల వివరణ

మోకాలికి బోడిగుండుకి ముడెట్టడమంటారు కదా, దాని అర్థం ఏమిటి?

చెప్తా కానీ, మా పవన్ కళ్యాణ్ కి జాతీయ అవార్డులు బోలెడు రావాల్సింది, ఎవరో అడ్డుకుంటున్నారు. 

మతుండే మాట్లాడుతున్నావా? నాకు నటన రాదు, నేనేమి గొప్ప నటుడిని కాదు అని మీ పవన్ కళ్యాణ్ కొన్నివందల సార్లు కెమెరా ముందు చెప్పాడుగా.   

అదంతా ఆయన గొప్పతనం అంతే. 

సరే ఇప్పుడేమంటావ్?

అదే అన్యాయం జరిగిందంటాను. 

డిటైల్డ్ గా చెప్పు. 

కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, అమీర్ ఖాన్ వీరంతా గొప్ప నటులా  కాదా? 

అవును, అందులో అనుమానం లేదు.  

మరి  మా పవన్ కళ్యాణ్ కూడా అని ఒప్పుకో 

ఇదిగో అర్థం పర్థం లేని వాగుడు వాగకు. 

వివరంగా చెప్తా వినుకో, కమల్ హాసన్, ప్రకాశ్ రాజ్, అమీర్ ఖాన్ వీరంతా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వారేగా. 

అవును, అయితే?

2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళే గొప్ప నటులైతే మూడు చేసుకున్న మా వాడు గొప్ప నటుడు కాదంటావా? 

కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, అమీర్ ఖాన్ విడాకులు తీసుకున్నారని అలా విడాకులు తీసుకున్నోళ్లంతా గొప్ప నటులని అనడం మూర్ఖత్వం.  నీ వాదన అర్థం పర్థం లేకుండా ఉంది. 

కదా,  దీన్నే మోకాలికి బోడిగుండుకి ముడెట్టడం అంటారు,  చూడ్డానికి రెండూ నున్నగా, గుండ్రంగా ఉన్నా దేని గొప్ప దేనిదే, రెంటికి పోలిక లేదు. ఇప్పుడర్థం అయిందా దానిలోని మర్మం. 


5, జులై 2021, సోమవారం

ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేది పక్కోడే

గత రెండేళ్ళలో పర్మనెంట్ రెసిడెన్సీ కోసం PTE (IELTS, TOEFL లాంటిది), తర్వాత ఇంటర్వ్యూ కోసం జావా, AWS ఆ తర్వాత కార్ డ్రైవింగ్ టెస్ట్ ల (Driver Knowledge Test, Hazard Perception Test) కోసం మెటీరియల్స్, ఇవాళ్టి వరకు సిటిజెన్ షిప్ టెస్ట్ కోసం ఆస్ట్రేలియన్ హిస్టరీ చదవాల్సి వచ్చింది. గత రెండేళ్ళలో ఏదో ఒక టెస్ట్ కోసం ప్రతీ రోజూ ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. అసలే డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్ పైగా తెలుగు మీడియం చదువులు కాబట్టి PTE కోసం ఒక 3 నెలలు తెగ చదవాల్సి వచ్చింది. ఈ చదివేదేదో కాలేజీ రోజుల్లో చదివుంటే స్టేట్ ఫస్ట్ కాకపోయినా యూనివర్సిటీ ఫస్ట్ అయినా వచ్చేవాడినేమో. లేదంటే కాలేజీ తర్వాతి రోజుల్లో చదివుంటే ఏ IAS / IPS పాస్ అయి ఈ తొక్కలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాల్సి వచ్చేది కాదు. 

ఇవాళ ఉదయాన్నే ఒక పని మీద బ్యాంకు కి వెళ్తే ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగాడు అక్కడ కౌంటర్లో వ్యక్తి. నేను మీడియా కి సంబంధించిన కంపనీ లో పనిచేస్తాను కాబట్టి నేను ఫలానా కంపెనీ లో పని చేస్తాను అనగానే మీరు జర్నలిస్టా అని అడిగాడు వెంటనే. అదైనా బాగుండు 24 గంటలు ఈ కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు మని కీ బోర్డు మీద కోడింగ్ చెయ్యాల్సిన బోరింగ్ జాబ్ పని తప్పేది అని అనుకున్నాను కానీ అది తప్పని తర్వాత అర్థమైంది. 

ఇవాళ మధ్యాహం మీటింగ్ లో ఒక వ్యక్తి ని కలిశాను. 40+ వయసు ఉండి ఉంటుంది కానీ చాలా వరకు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కి సంబంధించిన టెర్మినాలజీ విషయంలో అర్థం కాక ఒకటికి రెండు సార్లు అదేమో ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు. లంచ్ టైం లో మాటల మధ్యలో   Lawyer వృత్తి లో  కొన్నేళ్ళు పని చేసి సాఫ్ట్వేర్ వైపు వచ్చానని చెప్పాడు. 

నాకు తెలిసినంతవరకు లేదా చూసినంతవరకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి టీచర్ జాబ్స్ కి, పోలీస్ జాబ్స్ కి లేదంటే బిజినెస్ వైపుకు వెళ్లడం జరిగింది కానీ Lawyer వృత్తి నుంచి సాఫ్ట్వేర్ వైపుకు వచ్చినట్లు వినడం ఇదే మొదటి సారి, కారణం ఏంటో తెలుసుకోవచ్చా అని అడిగాను. 

లాయర్ వృత్తిలో మనుషులతో డీల్ చేయాలి అండ్ ఇట్ ఈజ్ unpredictable, వాళ్ళ బిహేవియర్ మారుతూ ఉంటుంది కొన్ని సార్లు మోసపోతాం కూడా, కానీ కంప్యూటర్స్ అలా కాదు అన్నాడు. 

నాకేమో ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ బోర్ కొడుతుంది వేరే జాబ్ ఏదైనా అయితే ఇంటరెస్టింగ్ గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అందుకేనేమో The other side of the grass is always greener లేదంటే మన అచ్చ తెలుగులో దూరపు కొండలు నునుపు అన్నారు. 

ఈ జాబ్ విషయం లోనే కాదు ప్రతీ విషయం లోనూ చాలా మంది ఇలానే ఆలోచిస్తుంటారు. ఈ ప్రపంచంలో సంతోషంగా ఉండేది పక్కోడే  అని అనుకుంటాం గానీ పీత కష్టాలు పీతవి సీత కష్టాలు సీతవి అనే విషయం మరచి పోతాము. 

1, జులై 2021, గురువారం

ఎత్తుకు పై ఎత్తు - ఏర్చి కూర్చిన నవ్వులు

ఎక్కడో విన్న జోకు, దాన్ని 50% మార్చేసి పోస్ట్ చేస్తున్నాను.  

"మీరెంత తినగలరో అంతా తినండి....మీ మనవలు/మనవరాలు బిల్ కడతారు” అని హోటల్ బయట ఓ బోర్డ్ పెట్టించాడు యజమాని

దాన్ని ఆశ్చర్యంగా చూసిన ఆత్రారావు, ఆనందంగా ప్రవేశించి, ఫుల్ గా పొట్ట నిండా తిని, బ్రేవ్ మని తేర్చుతూ  ప్రశాంతంగా కూర్చున్నాడు.

సర్వర్ వచ్చి, ఏమైనా మీ కంటే  మీ తాత గ్రేట్ సర్ అన్నాడు. 

ఆత్రారావు ఆశ్యర్యంతో నీకు మా తాత తెలుసా? అన్నాడు 

అవును, మీరు నాలుగు  దోశలు, మూడు వడలు, రెండు ప్లేట్స్ పూరి మాత్రమే తింటే అప్పుడెప్పుడో వచ్చిన మీ తాత మీరు తిన్నదాని కంటే ఒక ప్లేట్ పూరి ఎక్కువే తిన్నాడు  అని బిల్ ఇచ్చాడు.

దెబ్బేశాడు అనుకొని బిల్ కట్టేసి వచ్చాడు ఆత్రారావు. 


***

నెక్స్ట్ రోజు పున్నమ్మ కూడా అదే హోటల్ కి వెళ్ళి టిఫిన్ చేసి ప్రశాంతంగా కూర్చుంది. 

అదే సర్వర్ వచ్చి, ఏమైనా మీ కంటే  మీ అవ్వ గ్రేట్ మేడం అన్నాడు. 

పున్నమ్మ కూడా ఆశ్యర్యంతో నీకు మా అవ్వ తెలుసా? అంది. 

అవును, మీరు ఒక దోశ ,రెండు వడలు మాత్రమే తింటే అప్పుడెప్పుడో వచ్చిన మీ అవ్వ మీరు తిన్నదాని కంటే ఒక ప్లేట్ పూరి ఎక్కువే తిన్నారు అని బిల్ ఇచ్చాడు.

ఆ బిల్ ఇక్కడ పెట్టు, వెళ్ళే ముందు కట్టేస్తా గానీ నేనింకా తినడం కంప్లీట్ కాలేదన్నా, ఇంకో ప్లేట్ దోశ, రెండు ప్లేట్స్ పూరి తీసుకురా.