28, ఫిబ్రవరి 2021, ఆదివారం

పులి, పొట్టేలు, గుఱ్ఱం మరియు ఆవు

ఈ రోజు ఆఫీస్ లో లంచ్ టైములో కొలీగ్ ఒక ప్రశ్న అడిగాడు. మీ దగ్గర పులి, పొట్టేలు, గుఱ్ఱం, ఆవు ఉంటే అందులో నుంచి ఒక్కొక్క జంతువును  వదిలేయాల్సి వస్తే ఏ ఆర్డర్ లో వదిలేస్తారు అని.   

నేను కొద్ధి సేపు ఆలోచించి మొదట నేను పులి ని వదిలేస్తాను అన్నాను. 

కారణం అడిగాడు. 

పులి ప్రమాదకరమైంది, దాన్ని హేండిల్ చేయడం కష్టం కాబట్టి నేను రిస్క్ తీసుకోనుమొదట్లోనే వదిలేస్తాను అన్నాను. తర్వాత గుఱ్ఱం వదిలేస్తాను ఎందుకంటే దానికి దాణా ఖర్చు తప్ప వేరే రకంగా ఉపయోగపడదు. పైగా ఇప్పుడిప్పుడే కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి దాని ఉపయోగం శూన్యం అన్నాను. 

తర్వాత అన్నాడు 

పొట్టేలు, ఆవు ఈ రెండింటిలో ఏది ముందు వదిలేయాలి అన్నది  కష్టం. రెండూ ఉపయోగపడేవే. తప్పని సరి అయితే పొట్టేలు వదిలేస్తాను ఎందుకంటే నేను ఇండియన్ సెంటిమెంట్స్ నమ్మేవాడిని కాబట్టి ఆవు ఇంట్లో ఉండటం మంచిది, పైగా అది పవిత్రమైనది అని నమ్మకంఅంతే కాకుండా తన చుట్టూ ఉన్న గాలిని కూడా ప్యూరిఫై చేయగల సామర్థ్యము ఆవుకు ఉంది అని ఎక్కడో చదివాను . అయినా ఈ ప్రశ్న అడగటం వెనుక లాజిక్ ఏంటి అన్నాను. 

చెప్తాను, మన సూర్య ఏం చెప్తాడో విందాం అన్నాడు. 

తనేమో నాకు ఆల్మోస్ట్ రివర్స్ లో ఆన్సర్ చేశాడు పొట్టేలు, ఆవు, గుఱ్ఱం, పులి అని. కారణం అడిగితే ఆవు, పొట్టేలు చాలా ఇళ్ళలో ఉంటాయి గుఱ్ఱం, పులి ఉంటే అదో థ్రిల్ అన్నాడు. 

సరే, నువ్వైయితే ఏ ఆర్డర్ లో వదిలేస్తావు అని ఆ ప్రశ్న అడిగిన కొలీగ్ నే అడిగాను. 

మొదటి సారి నన్ను ఈ ప్రశ్న నా ఫ్రెండ్ అడిగినప్పుడు పులి, గుఱ్ఱం, ఆవు, పొట్టేలు అని చెప్పాను కారణం ఆల్మోస్ట్ నువ్వు చెప్పిన లాంటిదే. కాకపోతే ఆవును మేనేజ్ చెయ్యడం కంటే పొట్టేలు పెంచడం ఈజీ అని నా ఉద్దేశ్యం అదీ కాక పొరపాటున అవి చనిపోతే పొట్టేలు అయితే పెద్ద ఇబ్బంది ఉండదు, ఆవు అయితే కాస్త ఫార్మాలిటీస్ ఉంటావు అని. 

సరే ఇప్పుడు చెప్పు ఈ ప్రశ్న అడగటం వెనుక లాజిక్ ఏంటి అన్నాను. 

చెబుతాను, ముందు ఇంకో ప్రశ్న కి సమాధానం చెప్పండి అని 'మీ ఇద్దరిలో షేర్స్ లో ఎవరైనా మనీ ఇన్వెస్ట్ చేశారా' అన్నాడు. 

అబ్బే, అలాంటి వాటికి నేను ఆమడ దూరం. అంత తెలివి తేటలు లేవు, రిస్క్ అంత కన్నా అస్సలు చేయలేను అన్నాను. 

'మరి నువ్వు సూర్య?' అని అడిగాడు. 

నా ఇన్వెస్ట్మెంట్ మొత్తం షేర్స్, బిట్ కాయిన్ లోనే పెట్టాను అన్నాడు. 

నాకు కూడా ఈ షేర్స్ అర్థం కావు, నేను కూడా ఇన్వెస్ట్ చేయలేదు అందులో అన్నాడు కొలీగ్. 

నాకిప్పుడు అర్థం అయింది అన్నాను మొదట్లో ఆ ప్రశ్న అడగడం వెనుక లాజిక్  ఏంటో అన్నాను. 

తను చెప్పడం మొదలెట్టాడు 'పులి డబ్బుకు, గుఱ్ఱం స్టేటస్ కి, పొట్టేలు ప్రేమకి, ఆవు కుటుంబానికి నిదర్శనం. మనం డబ్బును మేనేజ్ చెయ్యలేక పోతే అదే మనల్ని ఆడిస్తుంది అదే ఆ డబ్బును మేనేజ్ చెయ్యగలిగితే మనమే కింగ్. సూర్య విషయం లో ఇది సరిగ్గా రుజువైంది, తనకి డబ్బును ఎలా హేండిల్ చెయ్యాలో తెలుసు కాబట్టి చివర్లో మాత్రమే పులి ని వదిలేశాడు మనమిద్దరం మొదట్లోనే వదిలేశాం అన్నాడు.'

నోట్: ఈ లాజిక్ అన్ని చోట్లా కరెక్ట్ అవ్వకపోవచ్చు కాకపోతే టైంపాస్ కోసం మీ ఫ్రెండ్స్ నో మీ ఫామిలీ మెంబెర్స్ నో  ఈ ప్రశ్న అడిగి చూడండి. 

24, ఫిబ్రవరి 2021, బుధవారం

కొత్తొక వింత పాతొక రోత కాలం కాదిది

మన పాత తెలుగు సినిమాల్లో అడుక్కునే వాళ్ళు ఒక చక్రాల బల్ల పై కూర్చుని చేతులతో తోస్తూఉంటే అది ముందుకు వెళ్తూ ఉంటుంది. చిరంజీవి దొంగ మొగుడు సినిమా లో ఇలాంటిది యూజ్ చేశాడు. ఇంకా ఖైదీ లో అనుకుంటా సుత్తివేలు యూజ్ చేస్తాడు ఇలాంటిది.  ఇప్పుడా సోది ఎందుకు అంటారా? సరిగ్గా అలాంటి చక్రాల బల్లనే చూశాను మొన్నొక సారి షాప్ కి వెళ్ళినప్పుడు.  పైగా దానికి 'స్కూటర్ బోర్డ్' అని దానికి స్టైల్ గా పేరొకటి.



ఈ మధ్య ఒకసారి మా ఆఫీస్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో క్లే పాట్స్ స్టాల్ పెట్టి హెల్త్ కి మంచిది ఈ మట్టి కుండలో వంట వండుకోండి నాన్ స్టిక్ కోటింగ్ మంచిది కాదు అని ఊదర గొట్టేసి సాయంత్రానికి స్టాల్ మొత్తం ఖాళీ చేసుకొని వెళ్ళారు. ధర తక్కువేమీ కాదు ఒక్కొక్కటి 50$ పైనే. నా చిన్నప్పుడంతా ఈ మట్టి కుండల్లోనే శుభ్రంగా వాడుకుతినేవారు. ఆ తర్వాత నాన్ స్టిక్ అనేది రావడంతో మట్టి పాత్రలని, ఇనుప పాత్రలని వదిలేసి నాన్ స్టిక్ కి స్టిక్కయి పోయారు. ఆ మోజు కొంచం తీరి మళ్ళీ ఇప్పుడు మట్టి కుండల వెంట పడుతున్నారు.  

ఒకప్పుడు చక్కగా పెరట్లోనో, సొంత తోటల్లోనో పురుగుల మందులు వాడకుండా పెంచిన కాయగూరలు వాడేవారు. ఆ తర్వాత ఎక్కడెక్కడి నుంచో ఇంపోర్ట్ అయి వచ్చిన కూరగాయలు కొన్నారు.  ఇప్పుడు అందరూ ఆర్గానిక్ వెంట పడ్డారు. ఆర్గానిక్ అని చెప్పి గోంగూర 250 గ్రాములు 15$ పెట్టి అమ్ముతున్నారు. ఇప్పుడు ఆర్గానిక్ కొంటే అదో గొప్ప ఫ్యాషన్ పైగా హై క్లాస్ ఫ్యామిలీ అని ఒక ఫీలింగ్.  సరేలెండి హెల్త్ కి మంచిదే కాబట్టి కొంటే తప్పేమి లేదు. 

ఒకప్పుడు హవాయి చెప్పులు (ఆ రబ్బరు చెప్పులు) వేసుకు తిరిగితే నామోషీ అనేవారు. ఇప్పుడంతా అవే చెప్పులే స్టైల్ గా వేసుకుని తిరుగుతున్నారు, వాటికి బీచ్ స్లిప్పర్స్, thongs, Flip flops అని ఏవేవో పేర్లు పెట్టేశారు రకరకాల రంగుల్లో తయారుచేసి. 

అప్పట్లో ప్యాంట్ పైకి మడిస్తే రిక్షా వాడిలా ఏమిట్రా అని తిట్టేవారు. ఇప్పుడు అదే ఫాషన్. మిస్సమ్మ లో మన ఎన్టీవోడు వేసిన నిక్కర్ల లాంటివి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయి షార్ట్స్ గా పేరు తెచ్చుకున్నాయి. 

మన పాత రాగి సంగటిని రాగి బాల్స్ అని పెద్ద పెద్ద రెస్టారెంటుల్లో అమ్మేస్తున్నారు. ఇదిగో ఇప్పుడు చద్ది అన్నం కూడా ఫ్యాషన్ అయినట్లు ఉంది. 



చిన్నప్పుడు బయటి నుంచి రాగానే చేతులు, కాళ్ళు కడుక్కోండి అని పెద్దవాళ్ళు అంటే వీళ్లది మరీ చాదస్తం అనేవాళ్ళే ఇప్పుడు రుద్ది రుద్ది చేతులు కడుగుతున్నారు COVID దెబ్బకి. 

కాలం ముందుకే కాదు అప్పుడప్పుడూ వెనక్కి పోతుందని అనిపిస్తుంది ఇలాంటివి చూస్తే. కొత్తొక వింత పాతొక రోత అనుకునే కాలం పోయి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నారు ఇప్పుడు. 

22, ఫిబ్రవరి 2021, సోమవారం

5 రోజుల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం ఎలా?

ముందు రెండు భాగాలు కాసిన్ని కారు కూతలు మాట్లాడుకుందాం , ఇన్నాళ్ళకి.. కాదు కాదు ఇన్నేళ్ళకి మొదలెట్టాను చదవకపోయి ఉంటే చదివేసి ఇక్కడికి వచ్చేయండి. ఇదేదో బాహుబలి పార్ట్ ఒకటో లేక KGF చాఫ్టర్ ఒకటో కాదు కాబట్టి చదవకపోయినా వచ్చే నష్టం లేదు. 

'బైక్ డ్రైవ్ తెలుసు అన్నావు కాబట్టి ఆక్సిల్రేటర్, బ్రేక్ స్లో గా ఎలా  ప్రెస్ చెయ్యాలి  అనేది తెలిసే ఉంటుంది, కాబట్టి ఆక్సిల్రేటర్ స్లో గా ప్రెస్ చేస్తూ వెళ్లు' అని ఢాంబాబు మొదటి డ్రైవింగ్ లెసన్ స్టార్ట్ చేశాడు. 

మొత్తానికి అలా మొట్ట మొదటి సారి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని డ్రైవింగ్ మొదలెట్టాను. కాసేపటికి సిగ్నల్స్ ఉండే రోడ్ వచ్చింది. 

హేయ్, గ్రీన్ లైట్ పడ్డప్పుడు మాత్రమే సిగ్నల్ క్రాస్ చెయ్యాలి, నువ్వేమిటి ఆగకుండా వెళ్తున్నావ్?

అదిగో గ్రీన్ హ్యూమన్ లైట్ పడిందిగా అందుకే వెళ్తున్నాను. 

నువ్వు ఇప్పుడు ఉన్నది కార్ లో, కార్ రూల్స్ ఫాలో అవ్వాలి. 

సారీ, కన్ ఫ్యూజ్ అయ్యాను. ఇక్కడి 9 ఏళ్ళ వాకింగ్ అనుభవం ఈ 9 నిమిషాల డ్రైవింగ్ ని డామినేట్ చేస్తోంది. 

ఇప్పుడు కాసేపు కారు పక్కన పార్క్ చెయ్. కొద్దిసేపు నీకి థియరీ క్లాస్ చెబుతా. కారు డ్రైవింగ్ అనేది ఒక కల, ఒక వరం. పూర్వ జన్మ లో ఎంతో తపస్సు చేసావో గానీ ఇంత చిన్న వయసులోనే నీకు దక్కింది (వెటకారంగా).  ఏదీ ముందు నీకు కార్ గురించి యెంత తెలుసో చెప్పు?

ఏముంది కారుకు నాలుగు వీల్స్ ఉంటాయి. ఈ రోజు డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక తెలిసింది ఇక్కడ కూడా ఒక వీల్ ఉంటుందని. 

వెనుక డిక్కీలో కూడా ఒక వీల్ ఉంటుంది దాన్ని స్టెప్నీ అంటారు (వెటకారంగా). 

స్టెప్నీ అంటే స్పేర్ వీలా, నేనింకా ఒక సెటప్ అనుకుంటున్నానే. అదేదో సినిమాలో శరత్ బాబు పెళ్ళాన్ని కాకుండా ఇంకొకరిని మెయింటైన్ చేస్తుంటాడు. వాళ్ళను కదా స్టెప్నీ అంటారు.. 

ఇదిగో మా శరత్ బాబు ను ఏమన్నా అంటే నేను ఊరుకోను. 

సరే. సారీ. నీకు జావా గురించి తెలుసా. 

తెలుసు.  నా చిన్నప్పుడు మా అమ్మ రోజూ రాగి జావ చేసి ఇచ్చేది. ఇప్పటికీ వేడి చేస్తే ఆ రాగి జావానే  తాగుతా. 

ఏమిటీ! అప్పుడెప్పుడో మీ అమ్మ కాచి ఇచ్చిన జావ నే ఇప్పటికీ తాగుతున్నావా?

ఇదిగో ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడకు నాకు మండుతుంది. 

సరే, నేను అడిగేది జావా లాంగ్వేజ్ గురించి, నీకు దాని గురించి యెంత తెలుసో నాకూ కారు గురించి అంతే తెలుసు. 

సరే విను నీకు రూల్స్ చెబుతా అని గ్రీన్, రెడ్ సిగ్నల్స్, రౌండబౌట్స్ అని కాస్త థియరీ రౌండ్ వేసుకున్నాడు. నువ్వు స్టీరింగ్ వీల్ ని గట్టిగా పట్టుకుని తిప్పుతున్నావు. అలా గట్టిగా తిప్పినంత అది నీ మాట వింటుందనుకోకు, లూస్ గా పట్టుకో. సినిమాల్లో తిప్పినట్లు ఓ తెగ తిప్పేయ్యాల్సిన అవసరం లేదు.  కాస్త యంగ్ గా ఉన్న వాళ్లయితే ఈజీ గా క్యాచ్ చేస్తారు, నువ్వు లేట్ ఏజ్ లో నేర్చుకుంటున్నావ్ అదే ప్రాబ్లెమ్. 

మరి నేర్చుకోవడం కష్టం అంటావా?

మై హూ నా, 5 రోజుల్లోనే నేర్పిస్తా. 'హేయ్, లేన్ చేంజ్ అయ్యేప్పుడు అటుపక్క ఇటుపక్క వెళ్ళే వెహికల్స్ ని చూసి మారాలి' అన్నాడు. 

సారీ, నాకు కాపీ కొట్టే అలవాటు లేదు, వాళ్ళను చూసి ఎలా మారాలో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో కూడా ఎప్పుడూ పక్కనోళ్ళను చూడలేదు తెలుసా?

'ఆ పరీక్షల్లో ఓకే గానీ ఈ డ్రైవింగ్ పరీక్షలో చూసి తీరాలి, లేదంటే నెగటివ్ మార్క్ వేస్తాడు, పైగా అలా అబ్సర్వ్ చేస్తూ లేన్ మారటం సేఫ్ కూడా' అన్నాడు. 

అలా 5 రోజులు గడిచిపోయాయి రోజుకో గంట డ్రైవింగ్ ప్రాక్టీస్ తో. కాకపోతే అయిదు రోజులైనా పర్ఫెక్ట్ గా రివర్స్ పార్కింగ్ చేయడం లాంటివి రాలేదు. ఎలాగోలా డ్రైవింగ్ చేయడం అయితే నేర్చేసుకున్నాను. అందుకని '5 రోజుల్లోనే డ్రైవింగ్ నేర్పిస్తా అన్నావ్? ఇంకా ఆ పర్ఫెక్షన్ రాలేదే' అని అడిగా. 

'30 రోజుల్లో ఇంగ్లీష్' అని ఒక పుస్తకం వచ్చేది మన చిన్నప్పుడు చదివావా?

బోలెడు సార్లు 

చదివావా?

నీ మొహం, బోలెడు సార్లు చూశాను. అది చదివి 30 రోజుల్లోనే ఇంగ్లీష్ మొత్తం నేర్చుకుంటారు అని చెప్తే నమ్మేటంత పిచ్చి వెధవని అనుకున్నావా?

మరి నేను 5 రోజుల్లో డ్రైవింగ్ అని అన్నప్పుడు ఎలా పిచ్చి వెధవ అయ్యావ్? చూడు, వయసులో నువ్వు నా కంటే పెద్దవాడివి అయినా సరే నీకు ఒక జీవిత పాఠం చెప్తా విను..  

నిన్ను చూసినప్పుడు, నువ్వే నా కంటే పెద్ద వాడివి అనుకుంటున్నానే?

కాదు, నీ డ్రైవింగ్ లైసెన్స్ లో  నీ డేట్ అఫ్ బర్త్ చూసాను. నేను నీ కంటే చిన్నవాడిని. కాకపోతే బాగా జుట్టు రాలిపోయి, కాస్త పొట్ట వచ్చేసి వయసులో పెద్ద వాడిలా కనపడుతున్నాను. అప్పట్లో కాలేజ్ రోజుల్లోనే కార్ కొన్న తర్వాత ఆ కార్ తీసుకొని నేను రోడ్డు ఎక్కాను, దాంతో చదువు అటకెక్కింది. చివరికి ఏ ఉద్యోగం రాక ఇదో ఇలా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అవతారం ఎత్తాను. తొందరగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు అందరూ ఇలా అయ్యారు అని చెప్పను. నా విషయం లో జరిగింది నీకు చెప్తున్నాను. నేనేదో లైఫ్ తెగ ఎంజాయ్ చేస్తున్నానని, బాగా సంపాదిస్తున్నానని అనుకోను. ఈ కార్ లో తిరిగి తిరిగి వొళ్ళు బాగా వేడి చేస్తుంది. ఆరోగ్యం బాలేక సెలవు పెడితే ఆ రోజుకు  ఆదాయం ఉండదు. పోయిన నెల ఆరోగ్యం బాలేక నెల రోజులు ఇంట్లోనే ఉండాలి వచ్చింది. మీకు లాగా మాకు సిక్ లీవ్స్, యాన్యువల్ లీవ్స్ ఉండవు.  

అందుకేనేమో Other side of grass always looks greener అని ఇంగ్లీష్ పెద్దోళ్లు, దూరపు కొండలు నునుపు అని మన తెలుగు పెద్దోళ్ళు అన్నది అన్నాను అతని మాటలకు అడ్డుపడుతూ.  

చూడు, ఇలా డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ ల చుట్టూ తిరుగుతుంటే డబ్బులన్నీ డ్రైవింగ్ క్లాసెస్ కే అయిపోతాయి. నీకు బేసిక్ డ్రైవింగ్ వచ్చేసింది ఇకపైన నువ్వే ఒక కార్ కొని ప్రాక్టీస్  చేసేయ్, లేదంటే నీ ఫ్రెండ్స్ కార్ తీసుకొని ప్రాక్టీస్ చెయ్. 'కొత్త కార్ కొనగలిగే స్థోమత ఉంటే పాతది కొను' ఇలా మీ మురళీమోహన్ డైలాగ్ ని కాస్త కస్టమైజ్ చేసుకొని సెకండ్ హ్యాండ్ కార్ కొనెయ్  అని జ్ఞానోదయం కలిగించి  శ్రీ కృష్ణుడు తన రథం లో వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ 'నువ్వు లేట్ ఏజ్ లో నేర్చుకుంటున్నావ్ అదే ప్రాబ్లెమ్ కాబట్టి నీకు బాగా డ్రైవింగ్ రావడానికి ఇంకో రెండు మూడు నెలలు పట్టొచ్చు' అని కాస్త నిరుత్సాహపరిచాడు . 

14, ఫిబ్రవరి 2021, ఆదివారం

ఇన్నాళ్ళకి .. కాదు కాదు ఇన్నేళ్ళకి మొదలెట్టాను

అప్పుడెప్పుడో COVID అనేది పుట్టక ముందు:

హలో, నా పేరు పవన్. ఇది add a did daala కార్ డ్రైవింగ్ ఇన్స్టిట్యుటా?

add a did daala కాదది 'అడ్డదిడ్డాల'.  నా పేరు అడ్డదిడ్డాల ఢాంబాబు. మా ఇంటి పేరు మీదే  ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాను. 

ఓహో అలాగా! నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. 

DKT ఇచ్చావా ?

నేను ఆఫీస్ లో KT ఇస్తున్నట్లు వీడికేలా తెలిసింది? 3 KT లు ఇచ్చాను, ఇంకో రెండు ఇస్తే అయిపోతుంది. 

అంటే 3 సార్లు రాశావా?

రాయడమేమిటి?

DKT టెస్ట్ 

అలాంటి పేరు వినలేదు. 

ముందు DKT టెస్ట్ రాసి పాస్ అయితే learner లైసెన్స్ ఇస్తారు. అప్పుడు రా, డ్రైవింగ్ నేర్పిస్తాను. ఎర్ర బస్సు అనుకొని ఎయిర్ బస్ ఎక్కి వచ్చేస్తారు మా టైం వేస్ట్ చెయ్యడానికి. 

కొన్నినెలల.. కరెక్ట్ గా చెప్పాలంటే ఏడాది తర్వాత:

అడ్డదిడ్డాల ఢాంబాబా?

అవును. 

నాకు learner లైసెన్స్ ఉంది. కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. 

ఓకే,  గంటకు XX $. 

మరీ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు మిగతా వారి కంటే. 

నేనయితే 5 గంటల్లో నేర్పిస్తా, మిగతా డ్రైవింగ్ స్కూల్ లాగా కాదు. 

అయితే ఓకే. 

రేపు ఉదయం 8 గంటలకి మీ ఇంటి బయట వెయిట్ చేస్తుంటాను. 

మరుసటి రోజు ఉదయం: 

మీరేనా ఢాంబాబు?

అవును, ఎవరికి నేర్పించాలి? మీ తమ్ముడికా? లేక మీ అబ్బాయికా ??

నాకే... అన్నాను జేబులోంచి మాస్క్ బయటికి తీస్తూ. 

దబ్బున శబ్దం వచ్చింది. ఎదురుగా ఢాంబాబు కనపడలేదు. అరె, ఢాంబాబు ఎక్కడ అని అటూ ఇటూ చూస్తే కింద పడి ఉన్నాడు. 

వెంటనే కార్లోంచి కాస్త పెట్రోల్ తీసి ఢాంబాబు మొహం మీద చల్లితే లేచి నిలబడ్డాడు. 

మరీ ఇంత లేత వయసులో డ్రైవింగ్ నేర్చుకోవాలని ఎందుకు  అనుకుంటున్నారు. ఇంకో పదేళ్ళు ఆగితే మీ పిల్లలే నేర్చుకునేవారుగా. 

అవుననుకోండి, కాకపోతే ఇంత లేటుగా డ్రైవింగ్ ఎందుకు నేర్చుకోవడం మొదలెట్టానో తెలుసు కోవాలంటే కాసిన్ని కారు కూతలు మాట్లాడుకోవాల్సిందే

ఆపు నీ సోది, ఇప్పటికే ఇవాళ్టి గంటలో 15 నిముషాలు టైం  అయిపొయింది. పద కార్ లో కూర్చో. 

సరే. 

సరే అని అటు వైపు సీట్ లోకి వెళ్తావేం? డ్రైవింగ్ సీట్ లోకి వచ్చి కూర్చో. 

అలవాటు లేదు కదా అందుకే ఈ పొరపాటు అనేసి 'ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే' అని హమ్ చేసుకుంటూ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాను. 

నువ్వు బైక్ డ్రైవ్ చేశావా ఎప్పుడైనా?

బైక్ డ్రైవింగా? మూతి మీద మీసాలు మొలవక ముందే దాని మీద విన్యాసాలు చేశాను.  ఏదో కార్ డ్రైవింగ్ అంటే టైం కలిసి రాక నెత్తి మీద జుట్టు రాలడం మొదలయ్యాక మొదలు పెడుతున్నాను. 

అదీ గొప్పేనా, నేను మూతి మీద మీసాలు మొలవక ముందే అప్పట్లోనే డబ్బు లేకపోయినా అప్పు చేసి మరీ కార్ కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను. 

డబ్బు లేకపోయినా అప్పు చేసి కార్ కొన్నావా? మురళీ మొహన్  ఇంటర్వ్యూ చూడలేదా?

ఆడెవడు?

అదే, తెలుగు సినిమాల్లో ఎక్కువగా సెకండ్ హీరో వేషాలు వేసేవాడు అప్పట్లో.  నాగేశ్వర్రావో, శోభన్బాబో కొన్ని కారణాల చేత హీరోయిన్ ని పెళ్ళి చేసుకోకపోతే తనే చేసుకునే వాడు. 

నేను శరత్ బాబు ఫ్యాన్ ని. మురళీ మోహన్ నచ్చడు, అతని ఇంటర్వ్యూలు మాత్రం ఎందుకు చూస్తాను?

అర్రే యెంత ఘోరం జరిగి పోయింది, నేను కూడా శరత్ బాబు ఫ్యాన్ అయ్యుంటే మురళీ మొహన్ ఇంటర్వ్యూ చూడకుండా అప్పట్లోనే కార్ కొని డ్రైవింగ్ నేర్చుకొని ఉంటే ఇప్పుడిలా వీడితో అడ్డదిడ్డమైన మాటలు పడాల్సి వచ్చేది కాదు, పైగా వీడిలా దర్జాగా రోజూ కార్లో తిరుగుతూ బతకొచ్చు అనుకుంటూ ... 

8, ఫిబ్రవరి 2021, సోమవారం

కాసిన్ని కారు కూతలు మాట్లాడుకుందాం

హలో, మాట్లాడేది పవనేనా?

అవును నేనే 

మేము RMS డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. 

సారీ, నేను MCA తోనే చదువు ఆపేసాను, ఇప్పుడు MS చేసే ఆలోచన లేదు. 

Roads and Maritime Services డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. లాస్ట్ ఇయర్ మీరు కార్ రివర్స్ చేస్తూ ఫలానా నెంబర్ వెహికల్ ని గుద్దేశారు. అది మేము ఓల్డ్ రికార్డెడ్ వీడియోస్ చూస్తూ ఉంటే బయటపడింది. మీరు దానికి ఇంతవరకు ఫైన్ చెల్లించలేదు. ఓవరాల్ గా మీరు 1240$ చెల్లించాలి. మేము మా అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాము, మీరు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చెయ్యండి ఈ రోజు బిజినెస్ క్లోజ్ అయ్యే లోపు. లేదంటే రేపు ఉదయాన్నే పోలీసులు మీ డోర్ తట్టాల్సి వస్తుంది. 

డోర్ తట్టాల్సిన అవసరం లేదండి, మాకు ఇంటర్ కామ్ ఉంది అందులో మా యూనిట్ నెంబర్ ఎంటర్ చేసి # సింబల్ ప్రెస్ చేయమని చెప్పండి. 

అంతే, అవతలి వాడు టక్కున ఫోన్ కట్ చేశాడు. 

ఇలాంటి ఫేక్ కాల్స్ ఇక్కడ చాలా కామన్ గా వస్తుంటాయి. మీరు ఇల్లీగల్ గా వీసా ప్రాసెస్ చేయించుకున్నారు, కాబట్టి మీకు అరెస్ట్ వారెంట్ తప్పదు, వెంటనే ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ కి ఫలానా అమౌంట్ కట్టి అప్లికేషన్ పెట్టుకోండి. లాస్ట్ ఇయర్ మీరు టాక్స్ ఎగ్గొట్టారు మీరు ఇంత అమౌంట్ వెంటనే కట్టేయండి అని స్కాం కాల్స్ వస్తుంటాయి. 

ఇలాంటి ఫోన్స్ రాగానే  చాలా మంది భయపడి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం కూడా చేశారు. 2019 లో ఇలాంటివి చాలా ఎక్కువై గవర్నమెంట్ టీవీల్లో రేడియోల్లో కూడా అవేర్నెస్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. 

నాకు మాత్రం కొంచెం కూడా భయం వెయ్యలేదు ఆ కాల్ వచ్చినప్పుడు..ఎందుకంటే నా మొహానికి కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి. 

మాది చిన్నప్పుడు మధ్య తరగతి కుటుంబం అవ్వడం వల్ల (ఇప్పుడేదో హై క్లాస్ ఫామిలీ అనుకునేరు ఇంకా అదే ఏడుపే) బైక్ ఉండేది కానీ కారు ఉండేది కాదు కాబట్టి బైక్ డ్రైవింగ్ మాత్రమే నేర్చుకున్నాను. 

ఆ తర్వాత M.C.A పూర్తి చేసి I.T జాబ్ వెలగపెట్టేటప్పుడు ఇప్పుడే కదా సంపాదన మొదలైంది అప్పుడే అప్పు పెట్టి కార్ కొనడం అవసరమా అనుకున్నాను. 

కొన్ని సంవత్సరాలకి చేతిలో కొంత డబ్బు పడింది. అసలే మనకి సినిమా పిచ్చి కదా, సినిమా వాళ్ళు ఏమి చెప్పినా బాగా ఎక్కేస్తుంది. ఒక సారి మురళి మోహన్ ఏదో ఇంటర్వ్యూ లో మాటాడుతూ మీ దగ్గర కారు కొనగలిగిన డబ్బు ఉన్నా బైక్ కొనండి చాలు.  బైక్ కొనగలిగిన డబ్బు ఉన్నా సైకిల్ కొనండి, సైకిల్ కొనగలిగిన డబ్బు ఉన్నా తోపుడు బండి కొని దాని మీద ముంత కింద పప్పు అమ్ముకుని బతకండి (కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అని మీరు అర్థం చేసుకోవాలి) అని 'డబ్బులన్ని ఖర్చుపెట్టక దాచుకోండి నాయనా' అనే ఒక ఉపదేశం ఇచ్చాడు. అది బాగా పట్టెయ్యడం వల్ల కార్ కొనగలిగే స్తోమత ఉన్నా కారు కొనలేదు (ఓహో అయితే బైక్ కొన్నావా?  అని మాత్రం అడగకండి. బైక్ కొనడమో లేక  తోపుడు బండి కొని దాని మీద శెనక్కాయలు అమ్ముకోవడమో కాదు కాన్సెప్ట్ ఇక్కడ, మనం కార్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం) 

ఆ తర్వాత ఇంకాస్త డబ్బు సంపాదించాక, ఈ బెంగుళూరు ట్రాఫిక్ లో కార్ డ్రైవ్ చేసే నరకం కన్నా అదే బెంగుళూరు లో ఏదో ఒక థియేటర్ లో కన్నడ సినిమా చూడటం ఎంతో కొంత బెటర్ అని డిసైడ్ అయి కార్ కొనలేదు. 

ఆఫ్ఘనిస్తానో , పాకిస్తానో ఏదో ఒక దేశానికి onsite పంపిస్తామని ఆఫీస్ లో చెప్పడం వల్ల  ఈ టైం లో కార్ కొనడం అవసరమా అని అప్పుడూ కార్ కొనలేదు. 

నాకుండే ఫ్రెండ్స్ కి కూడా అప్పట్లో కారు ఉండేది కాదు కాబట్టి కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి అని ఎప్పుడూ అనుకోలేదు, అనిపించలేదు కూడా. 

అలా స్వదేశంలో  నా చుట్టుపక్కల నాకెప్పుడూ కారు కూతలే వినిపించలేదు.