ఈ ఉద్యోగాలు ఎన్నేళ్ళు చేసినా పెద్దగా మిగలబెట్టేదేమీ ఉండదని తీర్మానించుకున్నాక నేను, నా ఫిడేల్ ఫ్రెండు కలిసి ఒక కొత్త ప్రోడక్ట్ ను మార్కెట్ లో లాంచ్ చేద్దామనుకున్నాము.
దీన్ని ప్రమోట్ చేయడానికి మొదట ఒక పాపులర్ హీరోయిన్ ను అనుకున్నాము. ఆవిడ గారి P.A తో మాట్లాడితే outdoor షూటింగ్ లో ఉన్నారావిడ , మీరు డైరెక్ట్ గా అక్కడికి రండి డీల్ మాట్లాడుకుందాము అన్నారు.
మేము వెళ్ళేప్పటికి ఆవిడ షూటింగ్ లో ఉండటం తో అది పూర్తయ్యేదాకా పక్కన నిల్చొని షూటింగ్ చూస్తూ ఉన్నాము
ఈ లోగా నా ఫిడేల్ ఫ్రెండు దమ్ము లాగించాలని అనుకున్నాడు. లైటర్ ఎవరినైనా అడుగుదామని అటు ఇటు చూస్తే వెదకబోయిన తీగ కాలికి తగులుకున్నట్లుగా ఆ P.A చేతిలో అగ్గిపెట్టె ఉండటం గమనించి అతన్ని అడిగాడు.
సార్ ఆ అగ్గిపెట్టె ఇస్తారా సిగరెట్ వెలిగించుకుని ఇస్తాను
ఇది అగ్గిపెట్టె కాదయ్యా
సార్ అది అగ్గిపెట్టె అని కనపడుతూనే ఉంది ..సిగరెట్ వెలిగించుకుని ఇప్పుడే ఇచ్చేస్తానండి
ఇది అగ్గిపెట్టే కానీ ఇందులో అగ్గి పుల్లలు లేవు... మా మేడమ్ గారి క్యాస్టూమ్స్ ఉన్నాయి అన్నాడు
ఇంతలో సన్నీలియోన్ షూటింగ్ ముగించుకొని మా దగ్గరికి వచ్చింది. మా ప్రోడక్ట్ గురించి డిస్కషన్స్ కూడా నడిచాయి. చివరకి రెమ్యూనరేషన్ అంతా O.K అయింది కానీ మేము పబ్లిసిటీ ఇవ్వబోయే ప్రోడక్ట్ కి ఆవిడ ఎందుకు అప్ట్ కాదో మాకు డిటైల్డ్ గా వివరించి వెనక్కు పంపించేసింది.
ఆ తర్వాత చాలా మంది హీరో లతో డీల్స్ జరిగాయి కానీ ఏవీ వర్కౌట్ కాలేదు. సల్మాన్ ఖాన్ ఓ.కే అన్నాడు కానీ పాపం చీమకి కూడా హాని తలపెట్టని ఆయన మీద మోపబడిన కేసు ల్లోంచి ఈ మధ్యే బయటపడినందుకు గానూ ఆరంజ్ క్రాస్, యెల్లో క్రాస్ లాంటి సంస్థలు "శాంతి దూత" లాంటి బిరుదులతో సన్మానించే కార్యక్రమాలకు అటెండ్ కావాల్సి ఉన్నందున ఈ యాడ్ చేయలేనని చెప్పారు. నోట్లో వేలు పెడితే కూడా కొరకని చంటి పిల్లాడి లాంటి సల్మాన్ ఖాన్తో ఏవో సెరిలాక్, డైపర్ యాడ్స్ చెయ్యొచ్చు గాని పెద్దవాళ్ళ బెడ్స్ లాంటివి చేయడం తగదని మేమూ నిర్ణయించుకున్నాము.
నిన్నరాత్రి పోయిన వారం పేపర్ చదువుతూ ఒక్క సారిగా హుర్రే అని అరిచాను
బజ్జున్న మా బుడ్డమ్మ ఒక్క సారిగా ఆ అరుపుకు లేచి కెవ్వుమంది
ఎవరూ చూడటం లేదనుకొని గోడ వైపు తిరిగి చేతి వేలు నోట్లో పెట్టుకొని చప్పరిస్తున్న మా బుడ్డోడు ఉలిక్కిపడ్డాడు
గుమ్మడికాయ తో గుత్తివంకాయ ఎలా వండాలో నేర్పే ప్రోగ్రాం చూస్తున్న మా ఆవిడ నా వైపు తిరిగి చూసి గుర్రుమంది.
అవేమి పట్టించుకోకుండా తిరిగి పేపర్లోకి తలదూర్చాను. హుర్రే అన్ననా అరుపుకు కారణమైన ఫోటో ఇది
దొరికేసాడు నా యాడ్ కు కరెక్ట్ బ్రాండ్ అంబాసిడర్. లోకసభ లో గోల గోలగా అంత సీరియస్ విషయం మీద డిస్కషన్ జరుగుతున్నపుడు కూడా నిద్ర పోతున్న యువరాజు గారు తప్ప ఇంకెవరూ సూటబుల్ కాదు అని డిసైడ్ అయ్యాను.
చింత లేనమ్మ సంత లోనూ సక్కగా నిద్దరోయిందని సామెత చెప్పినట్లు మన ఫారెక్స్ కూడా బేబీ పార్లమెంట్ లో ప్రశాంతంగా పడుకున్నాడు ఇంతకంటే కరెక్ట్ పర్సన్ ఇంకెవ్వరూ కనపడలేదు నా బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి.
ఆయన్ని ఎలా అప్రోచ్ కావాలో మీలో ఎవరి కైనా తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోరూ ప్లీజ్. మీకూ ఒక ఐదు పైసల వాటా ఇస్తాను లాభాల్లోంచి.
నేను చెప్పనేలేదు కదూ ఆ ప్రోడక్ట్ ఏమిటో "Sleep Always" అనే కొత్త రకం పరుపులు విత్ ది కాప్షన్ 'You Will Get The Sleep Even After Getting Up From The Bed'.
అలాగే ఆయన్ను కలిస్తే కొన్ని చిట్కాలు తీసుకోవాలి నిద్ర బాగా పట్టడానికి.
ఏడ్చినట్లు ఉన్నాయి ఈ "Sleep Always" బెడ్స్. దీని మీద నిద్ర పట్టి చావట్లేదు ఆ పాత బెడ్ తీసుకొచ్చి వేయండి అని మా ఆవిడ గొణుగుతోంది ... నేను వెళ్ళాలి. తర్వాతి బ్లాగ్ లో కలుద్దాం.