12, జనవరి 2023, గురువారం

పండగ నాడూ పాత తాతలేనా?

మా సీమ లో నా చిన్నప్పుడే ఆగిపోయిన ప్యాక్షనిజాన్ని జపిస్తూ ఒక తాత; వీరయ్య, శూరయ్య అంటూ ఎప్పుడో అరిగిపోయిన ఆ కాలపు సోది కథలే చెప్తామంటూ మరో తాత మొహాన ఇంత మేకప్ వేసుకొని మన మొహాన ఇంత మట్టి కొట్టడానికి తయారయ్యారు పండుగ అనే జాలి కూడా చూపకుండా. 

పాత సినిమాల్లో "నేను బియ్యే పాసయ్యానమ్మా, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లే" అని పొట్టను టైట్ గా బెల్టు తో బిగించి తనకన్నా వయసులో చిన్నదైన మహిళను అమ్మగా సంభోదిస్తూ సీనియర్ ఎంటీయార్, "నిన్ను నేను ఘాడంగా ప్రేమిస్తున్నాను దేవి" అని శ్రీదేవి కి రోజా పువ్వు ఇస్తూ నాగేశ్వర్రావు డైలోగ్స్ చెప్తుంటే పడీ పడీ నవ్వుకునే వాళ్ళము. మరి ఈ జనరేషన్ పిల్లలు కూడా ఈ తాతల చేష్టలని చూసి నవ్వుకుంటున్నారేమో తెలీదు మరి. 

"సింహం గడ్డి తినదు",  "సింహం ముడ్డి కడగదు" అని టైటిల్ పెడితే చాలు సింహం ఉందిగా పూనకం వచ్చేస్తది ఒక తాతకి.  

పూనకం అంటే గుర్తొచ్చింది, "పులికి పూనకం వస్తే" అని ఒక మాస్ టైటిల్ పెట్టేస్తే ఇంకో తాత సినిమాకి ఒప్పేసుకుంటాడు. 

అప్పుడెప్పుడో జమానా లో "సింహం నవ్వింది" అని ఒక కామెడీ సినిమా అబ్బా కొడుకుల కాంబినేషన్ లో వచ్చినట్లుంది, అది చూసిన జనాలు పారిపోయారో లేక బతికి బయటపడ్డారో తెలీదు మరి. 

మా బాసేమో హిట్టో ప్లాపో, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు తీసి కాస్తో కూస్తో గాడిలో పడ్డాడు అనుకుంటే మళ్ళీ మాస్ మాస్ అంటూ రంగు రంగుల చొక్కాలు, రోజ్ ఫ్లవర్స్ చేతిలో పట్టుకొని అమ్మాయి వెంట పడటాలు చూడలేక పోతున్నాం. వద్దు బాబోయ్ ఈ తాతయ్య లీలలు.  

కనీసం ఒక తాతయ్యని తెగులు దేశం జనాలు కాస్త మోస్తున్నట్లు ఉన్నారు, ఇంకో తాతయ్య కాడిని ఫ్యాన్స్ కూడా వదిలేస్తున్నట్లు అనిపిస్తోంది గత రెండు సినిమాల వైఫల్యం చూస్తుంటే. ఈ సినిమాతో ఆ విషయం పూర్తిగా తెలిసిపోతుంది. 

ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలు, ఆడ లేడీస్ మన తాతల సినిమాలకి కాస్త దూరంగా ఉంటున్నారు గత కొన్నేళ్లలో.  కాబట్టి మహేష్ బాబు తోనో లేదంటే విజయ్ దేవరకొండ తోనో (వీళ్లేనా లేటెస్ట్ హార్టు-త్రోబ్స్, వేరే ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు)  ఒక మంచి ఐటెం సాంగ్ చేయిస్తే సరిపోతుంది, ఎప్పుడూ హీరోయిన్స్ తోనేనా? ఏం హీరోస్ మాత్రం ఐటెం సాంగ్స్ చేయకూడదా? 

ఒకప్పుడు హీరో ఫాన్స్ అనే ఈ విపరీతమైన పైత్యం చదువుకోని వాళ్లలోనే ఉండేది అని అనుకునేవాడిని, చదువుకున్నవాడి కంటే చంచాలు, కంచాలు కడిగేవాడే బెటర్ అన్నట్లు ఉంది వీరి ప్రవర్తన. సిడ్నీ లో నేను వెళ్లిన థియేటర్ లో RRR సినిమా అయిపోయిన తర్వాత ఆ థియేటర్ కుప్పతొట్టి లా మారిపోయింది, చించేసి విసిరేసిన ఆ పేపర్స్ అవీ చూస్తే. అదనంగా ఈ కార్ ర్యాలీలట, బాబోయ్ ఒక పాతిక కార్లేసుకుని రౌండ్స్ కొడుతున్నారట వారి హీరో పేరు గట్టిగా అరుస్తూ అదీ రాత్రి పదకొండు పన్నెండు టైములో. పోలీసులు వచ్చి వారిని ఆపి ఇంటికి పంపేదాకా అరగంట సేపు ఆ సౌండ్స్ వినలేకపోయాం అన్నారు ఆ చుట్టుపక్కల నివసించే కొందరు మిత్రులు. ఏదో గ్రౌండ్ లోనే మరో చోటో కాదు ఒక సబర్బ్ మధ్యలో వీళ్ళు ఆ కార్ర్యాలీ నడిపిందట. 

నిన్నొచ్చిన తాతయ్య సినిమా కంటే ముందొచ్చిన అఖండ బాగుంది అని చెప్తూ దాన్ని కళాఖండం చేసేస్తున్నారు కొందరు. మరి ఈ రోజు తాతయ్య సినిమా పరిస్థితి ఏంటో సాయంత్రానికి తెలుస్తుందేమో. 

కాకపోతే ఈ తాతలే యువ తాబేళ్ళ కంటే నయంగా అనిపిస్తున్నారు, ఏదో రకంగా వేగంగా సినిమాలు చేస్తున్నారు. అలాగైనా కనీసం ఒక వెయ్యి మందికి  ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగానైనా పని కల్పిస్తున్నారు.

మరో ఫ్రాక్చర్ స్టోరీ

చంద్రుని మీద:

స్టార్టింగ్ సీన్ లో చంద్రుని మీద లాండ్ అవుతాడు నాసా లో పనిచేసే నసీర్.  

అక్కడ గుడారాలు వేసుకొని అమెరికా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదుల మీద ఒక చేత కత్తి మరో చేత సుత్తి పట్టి ఒక భీభత్సమైన ఫైటింగ్ సీన్. 

చంద్రుడి మీద నీరు ఉందో లేదో తర్వాత విషయం, రక్తం మాత్రం ఏరులై ప్రవహిస్తోందని మా శాటిలైట్స్ కనిపెట్టాయి అని రష్యా ప్రపంచానికి తెలియచెప్పింది ఈ లోగా. 

ఆ తర్వాత అక్కడే చందమామ మీద నసీర్ తన అభిమానులతో కలిసి ఒక ఇంట్రడక్షన్ సాంగ్  

మా బ్లడ్డు బ్రీడు వేరే 

మా ఫుడ్డు బ్రెడ్డు మీ ప్రేమే  

మా బ్లడ్ బ్రదర్స్ మీరే 

మీకిక మిగిలేది గాడిద గుడ్డే 


వైట్ హౌస్ లో :

అమెరికన్స్ మన హీరోని అభినందించి ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ గా విజయశాంత్ అని మన తెలుగువాడే ఉంటాడు. అతను మన హీరో దగ్గరికి వెళ్ళి అమెరికాలో ఉగ్రవాదులని ఏరివేసి నీ కర్తవ్యం నెరవేర్చావు, కానీ ఇండియా లో నువ్వు చెయ్యాల్సిన పని ...... అని చెప్పబోతూ ఆగిపోతాడు. 

చెప్పండి, మీరేదో నా దగ్గర దాస్తున్నారు. 

చెప్తాను విను నడిపి సింహా రెడ్డి 

వాడెవడు?

అది నీ పేరే, శత్రువుల కంట పడకుండా నీ అసలు పేరు అయిన నడిపి సింహా రెడ్డి ని నసీర్ గా మార్చాము. మీది సీమలో చంద్రమూరి వంశం. మీకు ఆ సూర్యమూరి వంశానికి పడదు. 


అదే సోది ఫ్లాష్ బ్యాక్ 

అప్పట్లో మీ నాయనమ్మ గారే ఆ ఊర్లో వైద్యులు, ఆ సూర్యమూరి వంశస్తుడి ప్రాణం నిలబెడితే "పగవారు నిలబెట్టిన ప్రాణం ఉంటే యెంత పోతే యెంత" అని అప్పుడే వచ్చిన ఇంద్ర సేనా రెడ్డి సినిమా చూసి తన ప్రాణం తానే తీసుకున్నారు. 

ఆ తర్వాత అప్పుడెప్పుడో వచ్చిన ఎమ్మెస్ రెడ్డి, కేవీ రెడ్డి, సమర సింహా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి, జయ ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి , ఎ  రెడ్డి, బి రెడ్డి , జెడ్ రెడ్డి అని ఫాక్షన్ సినిమాలన్నీ చూసేసి ఈ సీమ లో ఎవరూ కత్తి పట్టకూడదు రక్తపాతం చిందకూడదు అని నరుక్కు చచ్చారు. చివరికి మీ వంశంలో మిగిలిన ఒకే ఒక్క వంశోద్ధారకులు, వారసులు, అరిసెలు, జిలేబీలు, జాంగ్రీలు, వడలు, పకోడాలు అన్నీ మీరే బాబు. 

చివరికి చంపడానికి మీ వంశస్తులు లేక, ఆ సూర్యమూరి వంశస్తులు కత్తులు పట్టడమే మానేశారు. దాంతో తరతరాలుగా కత్తులు చేసేవారు, కత్తులు నూరేవారు తినడానికి పట్టెడన్నం దొరక్క 'అలో  స్విగ్గీ' అంటూ పీజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసుకొని తింటున్నారు. 


లక్ష్యం 

అయితే నేను మా ఊరికి వెళ్ళి నా కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిందే విజయశాంత్. 

వద్దు బాబూ వద్దు ఏదో పొరపాటున ఈ వైట్ హౌస్ లో మాన్షన్ హౌస్ ఎక్కువ తాగేసి నిజం చెప్పేశాను. కావాలంటే ఈ అమెరికన్ ప్రెసిడెంట్ పదవి రాసిస్తా, అసలు ఈ పదవే మీ వంశం పెట్టిన భిక్ష, మీరు ఇక్కడ ఉండటమే మీకు రక్ష, ఎందుకు బాబూ ఈ కక్ష్య. 

ఇకపై నా లక్ష్యం నాసా లో చంద్రుడు, సూర్యుడు, కక్ష్య కాదు, సీమలో మా చంద్రమూరి వంశ రక్ష, ఆ సూర్యమూరి వంశానికి శిక్ష. 

అట్నే గానీ బాబు. శానా సేపు ఎమోషన్ నడిసినాది, ఎంటర్టైన్ మెంట్ కోసం ఒక ఐటెం సాంగ్ ఏర్పాటు చేసినా , మీరు డాన్స్ చెయ్యాల్సిందే. 

ఐటెం సాంగ్ 

నా పేరు జారు మిఠాయి

పుట్టిందేమో బొంబాయి 

నేనిపుడే ఊరుతున్న ఊరగాయి 


నేనొక రాలుగాయి 

వాయిస్తా నీ సన్నాయి 

ఆపై నంజుకుంటా నిన్నమ్మాయి  

సీమలో కత్తులు తయారు చేసే కాలనీలో: 

ఇక మీరు పస్తులతో పడుకునే టైం ముగిసిపోయింది, ఇకపై రకరకాల డిజైన్స్ లో కత్తుల తయారీని మొదలుపెట్టండి. ఈ కత్తుల పరిశ్రమే కాదు మరే పరిశ్రమని మన ఆంధ్రా దాటి వెళ్లనివ్వను. ఆకలేస్తే అమృతాంజనం, జలుబు చేస్తే జండూబామ్ తింటున్న మీరు ఇకపై రోజూ బిర్యానీ తినేలా చేస్తా. 

"మరి బాత్రూములు ఎవడు కట్టిస్తాడు? మీ బాబా?" అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఇద్దరు 

అవును మా బాబే, ఈ సారి పదవిలోకి వచ్చేది మా బాబే, అప్పుడు కట్టిస్తాడు పేదలకు బాత్రూములు, ఈ లోగా అడ్డొచ్చిన వారికి కట్టేస్తాను సమాధులు. 

అది మీ నాన్న తరం కూడా కాదు 

తెలుగు జాతి కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది మా నాన్న, అలాంటి మా నాన్న ఊసెత్తిన నీ కుత్తుకని రపరపా రంపంతో కోసేయ్యకపోతే నేను చంద్రమూరి వంశస్తుడనే కాదు. 

అంటే నువ్వు మా అన్న నడిపి సింహా రెడ్డి వా?

అవును తమ్ముళ్ళు , మీరెవరు?

నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాం అన్నా ఇన్నాళ్లు. నేను కుసిర్ వీడు ఎసిర్. 

అవేం పేర్లు, తేడాగా ఉన్నాయే?

మేము పుట్టగానే నీకు కుడిభుజంగా ఉండాలని కుడి సింహా రెడ్డి, తమ్ముడు ఎడమ భుజంగా ఉండాలని ఎడమ సింహా రెడ్డి అని బొడ్డు కూడా కోయకుండానే పేర్లు పెట్టేసారు మా ఇంట్లో వాళ్ళు. కానీ మీరు లేని టైం చూసి మమ్మల్ని బానిసలని చేసి వాళ్ళు మా పేర్లను ఇలా మార్చేశారు. 

తెలుగు తమ్ముళ్ళారా,  ఇక సహించేది లేదు, ఇష్టమొచ్చినట్లు పేర్లు, ఊర్లు మారిస్తే ఊరుకునేది లేదు. నేను రంగం లోకి దిగనంతవరకే వార్ టూ సైడ్, దిగానంటే వన్ సైడే. కంటి చూపుతో శాసిస్తా, పంటి కొనలతో నమిలేస్తా, కత్తి వేటుతో నరికేస్తా.  ఇకపై మనదే రాజ్యం పదండి ముందుకు. 

జై బాబయ్య జై జై బాబయ్య