30, మే 2022, సోమవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 5

అప్పుడెప్పుడో ఆర్నెల్ల క్రితం రాసిన ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 4 పోస్ట్ కి కొనసాగింపు....  

'పొగ త్రాగడం హానికరం మరియు ప్రమాదకరం' అంటూ సినిమాకి ముందు వచ్చే ముఖేష్ యాడ్ ని  గుర్తుకు తెచ్చేలా నా రూమ్ లోకి ఆరోజు మధ్యాహ్నమే ఒక కొత్త రూమ్మేట్ వచ్చాడు. అతను ఇన్ఫోసిస్ లో మేనేజర్ గా పనిచేసేవాడు. ఆగ్రా నుంచి వచ్చాడట, ఎప్పుడు చూసినా సిగరెట్ తాగుతూ ఉండటమో లేదంటే పాన్ పరాగ్ నములుతూ ఉండటమో చేస్తుంటాడు. ఆ పాన్ పరాగ్ ని ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తూ ఉంటాడు. నాకు రూమ్ లోకి రాగానే కనిపించిన ఆ రక్తపు మరకల ఎఫెక్ట్ అదే. ఉమ్మేసిన తర్వాత అక్కడ ఏ టవల్ దొరికితే ఆ టవల్ తో మూతి తుడుచుకునేవాడు తన పర అనే భేదం లేకుండా. ఆ ఒక్క రాత్రే నన్ను నిద్ర పోనీకుండా తన ఫామిలీ హిస్టరీ మొత్తం చెప్పేశాడు అర్ధ రాత్రి దాకా. 

పొద్దుటే గంట కొడుతున్న శబ్దం వినిపించి ఉలిక్కిపడి లేచా, టైం చూస్తే ఉదయం ఆరు. బాగా చలిగా ఉండే మే నెలలో అంత ఉదయాన్నే గంట కొడుతూ అగరొత్తులు వెలిగించి పూజ చేస్తున్నాడు ఆ వ్యక్తి.  

అయినా ఓరి ముఖేష్! నీకు ఈ యాంగిల్ కూడా ఉందా? సిగరెట్స్, పాన్ పరాగ్ లాంటి చెడ్డ అలవాట్లతో పాటు అగరొత్తులు, పూజ అనే ఈ మంచి అలవాట్లూ ఉన్నాయే అనుకున్నా.

గుడ్ మార్నింగ్ పవన్. అదేం విచిత్రమో లేక దైవ బలమో తెలీదు గానీ ప్రతీ రోజూ తెల్లవారుజామున ఐదుకే లేచి స్నానం చేసి పూజ చేయడం అలవాటు. ఈ చలికి చల్ల నీళ్ళతో ఎలా స్నానం చెయ్యాలా అని దిగులుపడ్డా, పైగా నేను ఇండియా నుంచి తెచ్చుకున్న వాటర్ హీటర్ ఇక్కడి ప్లగ్ సాకెట్స్ లో పట్టలేదు యెంత ట్రై చేసినా. చివరికి ఏదైతే అదవుతుందని చన్నీళ్లతోనే స్నానం చేద్దాం అనుకున్నా కానీ బై గాడ్స్ గ్రేస్ వేడి నీళ్ళు వచ్చాయి టాప్ తిప్పితే అన్నాడు. 

గాడ్స్ గ్రేస్ లేదు గాడిద గుడ్డు లేదు ఆస్ట్రేలియా లో బై డిఫాల్ట్ హీటర్ ఫిక్స్ అయి ఉంటుంది వాటర్ కనెక్షన్ కి అన్నాడు దేవుడంటే గిట్టని మా చెన్నై కమల్ హాసన్ (ఎప్పుడూ ఉదయం 9 కి గానీ లేవని మా ఫ్లాట్ లోనే మరో రూమ్ లో ఉండే ఫ్లాట్ మేట్ ఇతను,  ఆ గంట శబ్దానికి మొదటి సారి సూర్యుడి కంటే ముందే నిద్ర లేచాడు) 

అవునా, నాకా విషయం తెలీదే అన్నాడు ఆశ్ఛర్యంగా ఆ ముఖేష్. 

ఆశ్ఛర్యం తర్వాత, ముందు ఆ గంట కొట్టడం ఆపేయ్ లేదంటే మన పక్క ఫ్లాట్ లో ఉండే ఆ రష్యా వాడు డిస్టర్బ్ చేస్తున్నామంటూ కంప్లైంట్ చేస్తాడు అనే లోపే తలుపు తడుతున్నారు ఎవరో. 

తీసి చూస్తే ఆ రష్యా వాడే... 

"ఈ ఫ్లాట్ కి ఏమైంది, ఒక వైపు టంగు టంగుమని శబ్దం, మరో వైపు ఈ దట్టమైన పొగ .. దీన్ని చూస్తూ నేను సహించలేను" అంటూ సినిమా ముందు వచ్చే స్మోకింగ్ రీల్ డైలాగ్స్ ను గుర్తు చేస్తూ మా మీద విరుచుకు పడ్డాడు. 

ఈ గంట శబ్దం సరే, ఆ  పొగ కథేమిటబ్బా ఇంత పొగ చుట్టుకుంది అని చూస్తే డోర్ బయట రెండు వైపులా అటొక కట్ట, ఇటొక కట్ట అగరొత్తులు గుచ్చి ఉన్నాయి.  ఆ  అగరొత్తుల నుంచి వచ్చిన పొగ అది.

అర్థమైంది అది మా ముఖేష్ పనే అని, ఇక ఆ రష్యా వాడికి చిక్కిన ఉక్రెయిన్ వారిలా బలి కావడం తప్ప వేరే దారి లేదని మౌనంగా తలదించుకున్నాం సారీ చెబుతూ

నాకసలే ఆస్మా ఉంది, ఈ పొగకి నాకేమైనా అయితే నన్నే నమ్ముకున్న నా మొదటి భార్య చివరి ఇద్దరు పిల్లలు, రెండవ భార్య కి పుట్టిన నా పెద్ద కొడుకు, ఆవిడ మొదటి భర్త తో కన్న ఇద్దరు పెద్ద  కూతుర్ల భాద్యత, ఇప్పుడు లివింగ్ టుగెదర్ లో ఉన్న నా బాయ్ ఫ్రెండ్, వాడి మొదటి పెళ్ళాం కి పుట్టిన మూడవ పిల్లాడి భాద్యత ఎవరు చూస్తారు? మరో సారి ఇలా జరిగితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. 

అగరొత్తులు వెలిగించొద్దా, నీకు ఆస్మా ఉందా. ఏంటీ ఈ మాత్రం పొగకే పోతావా? నిన్ను ఢిల్లీ లోనో బీజింగ్ లోనో వదిలేయాలి దెబ్బకు దారికొస్తావ్ అని మేము రూమ్ లోకి వెళ్లి సైలెంట్గా నవ్వుకున్నాం. 

కానీ  ఇలాంటిదే  మరో తుఫాన్ హెచ్చరిక  రాబోవు రెండు మూడు గంటల్లో వస్తుందని మేమూ ఊహించలేకపోయాము, ఏ ఆకాశవాణి మమ్మల్ని హెచ్చరించనూ లేదు.  

9, మే 2022, సోమవారం

అర్రే, పంచు నాకు పడిందే


యూట్యూబ్ లో 'తల్లి పోగాదే' (ఇలాగే పలకాలా, ఏమో తెలీదు మరి) అని కొత్త తమిళ్ సినిమా కనపడితే చూడటం మొదలెట్టాను. ఒక అరగంట అయిన తర్వాత 'ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే' పాట మ్యూజిక్ మొదలైనప్పుడు డౌట్ వచ్చింది అరే, ఇది మన తెలుగు సినిమా 'నిన్ను కోరి' లో పాట కదా అనుకున్నాను. కాసేపటి తర్వాత ఆ సినిమా రీమేకే నేను చూస్తున్న సినిమా అని అర్థమైంది. 'నిన్ను కోరి' సినిమా కాన్సెప్ట్ తెలుసు కానీ ఆ సినిమా చూడలేదు కాబట్టి పోల్చుకొని తెలిసేప్పటికి గంట సినిమా ముగిసింది. 


ఇక చూద్దామా వద్దా అనే ఊగిసలాటలో అక్కడి నుంచి సినిమా ఎంజాయ్ చెయ్యలేకపోయాను. అరె, నాని అయితే ఈ సీన్లో ఇంకా బాగా యాక్ట్ చేసి ఉంటాడేమో, అనుపమ కంటే నివేదా థామస్ బాగా చేసేదేమో అని అనిపిస్తూనే ఉంది. రీమేక్ సినిమాలతో వచ్చే తంటానే ఇదేమో, యెంత వద్దనుకున్నా కంపారిజన్ వచ్చేస్తుంది. పైగా 'హృదయం' హీరో మురళి కొడుకు అధర్వ గానీ, అనుపమ పరమేశ్వరన్ గానీ నాకెందుకో నచ్చరు, అది కూడా ఒక కారణం కావచ్చు.


పైగా ఇదే సినిమా ఫ్లేవర్ లో అభినందన, ప్రేమాలయం, ప్రేయసీ రావే, కన్యాదానం, శ్రీమతి వెళ్ళొస్తా లాంటి బోలెడు పాత సినిమాలు చూసినందువలన కూడా పెద్దగా నచ్చలేదు.


ఆ సినిమా చూడడం అయిపోయాక నా భార్యను కాస్త ఉడికిద్దామని  నేను కాలేజీలో చదివే రోజుల్లో నన్ను కూడా ఒక అమ్మాయి ప్రేమించింది కాకపోతే కులం-మతం, ఆస్తులు-అంతస్తులు, అప్పడాలు-వడియాలు, కోడి -పకోడీ లాంటి కారణాల వల్ల నేను తనని పెళ్లి చేసుకోలేకపోయాను. అప్పటి నుంచి తను ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు నన్ను తలుచుకుంటూ. ఇందాక చూసిన సినిమాలో లాగా తనని కూడా  మన ఇంటికి తీసుకొని వస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు అన్నాను. 


నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే .. "తీసుకురా నిన్ను, దాన్ని కలిపి చీపురు తిరగేస్తాను అంటుందని అనుకున్నా,  కానీ తను సింపుల్గా "ఆ పని చెయ్ పుణ్యం ఉంటుంది రోజూ ఈ వంట పని చేసే బాధ ఉండదు, అది ఉన్నన్ని రోజులు ఆ పని దానికి అప్పగిస్తే సరిపోతుంది." అంది 


అర్రే, పంచు నాకు పడిందే అనుకున్నా. 

5, మే 2022, గురువారం

మళ్ళీ ఫ్రైడ్ రైసా?

ఇది మునుపటి పోస్ట్ పోర్ట్ స్టీఫెన్స్ ట్రిప్ విశేషాలు కి కొనసాగింపు.


అది పేరుకు హోటల్ గానీ మాకు అలాట్ చేసిన యూనిట్ ఒక త్రీ బెడ్రూమ్ హౌస్. బయట స్విమ్మింగ్ పూల్ తో పాటు లోపల పెద్ద కిచెన్ ఉంది. ఆ రాత్రి పడుకొని ఉదయాన్నే లేచి కిచెన్ లో ఇండియన్ టీ పెట్టుకొని తాగి, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయిన దోశ వేసుకొని తిని రూమ్ ఖాళీ చేసి వేల్ వాచింగ్ కోసం వెళ్ళిపోయాము. మేము స్టే చేసిన రూమ్ పక్కన ఉండే ఇండియన్ షాప్ లో పాల కోసం వెళ్తే దోశ పిండి దొరికింది మరి.


మధ్యాహ్నం థాయ్ రెస్టారెంట్ బయట మెనూ చూస్తూ - "ఏంటి ఫ్రైడ్ రైస్ 11 డాలర్ లేనా అంత తక్కువ రేట్ పెట్టాడు అంటే ఏదో డౌట్ కొడుతోంది, టూరిస్ట్ ప్లేస్ లో ఇంత తక్కువ లో దొరుకుతుందా? పైగా నిన్న రాత్రి ఇండియన్ రెస్టారెంట్ లో ఉప్పు లేని ఆ ఫ్రైడ్  రైస్ తిన్న తర్వాత మళ్ళీ ఈ సాహసం అవసరమా" అంది మా ఆవిడ.


సరే మనకు వేరే ఆప్షన్ ఏమన్నా ఉన్నాయా? మరో రెస్టారెంట్ కూడా దగ్గర్లో లేదు కాబట్టి ఇక్కడే ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోదాం అన్నాను నేను లోపల సంబరపడిపోతూ తక్కువ రేటుకు ఫుడ్ దొరికినందుకు.


నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక డాక్టర్ ఉండే వారు. ఆయన ఏదైనా సూది పొడిస్తే ఏంటి సారు అసలు చురుక్కుమనలేదు మీరు అసలు మంచి సూది మందు వేస్తున్నారా అని అడిగే వాళ్లట అక్కడి పల్లెటూరి వాళ్ళు. ఆయన మంచివాడే పాపం, మంచి ఇంజక్షన్ లే ఇచ్చేవాడు. ఒక్కోసారి ఆయన నవ్వుతూ ఇలా అనేవాడు. వీళ్లకు ఉప్పు, నీళ్లు కలిపి దాన్ని సిరంజీ లోకి ఎక్కిచ్చి వెయ్యాలి అప్పుడే వీళ్లు నన్ను నమ్ముతారు అనేవాడు. చురుక్కుమని కాస్త నొప్పి పుట్టేలా ఉండే ఇంజక్షన్ అయితే మంచిది అని వారి నమ్మకం. అయినా పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్లు మనూరి డాక్టర్ వేస్ట్, పక్కన పులివెందులలో ఉండే డాక్టర్ బెస్ట్ అనేది వాళ్ళ అభిప్రాయం.


వాళ్లనే కాదు ఎవరైనా ఇలాంటి అభిప్రాయంతోనే ఉంటారు రేటు తక్కువ పెడుతున్నారంటే డౌట్ పడుతుంటారు. ఏ మాటకా మాట చెప్పుకోవాలంటే మేము తిన్న ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చాలా బాగుంది అక్కడ.


మొన్న ఇండియన్ రెస్టారెంట్ లో ఉప్పు లేని ఆ ఫ్రైడ్  రైస్ తిన్న తర్వాత ఇంతకుముందు వెళ్ళిన ట్రిప్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తోంది. పెరి పెరి చికెన్ పిజా ఆర్డర్ చేస్తే అందులో బేకన్ వేసి తెచ్చారు, అందుకు మేము రిపోర్ట్ చేస్తేవారు సారీ చెప్పి ఫ్రెష్ గా మరో పెరి పెరి చికెన్ పిజా తీసుకువచ్చి ఇవ్వడమే కాకుండా బిల్ లో ఆ పిజ్జా ఛార్జ్ చేయకుండా మా వైపు జరిగిన తప్పుకు కాంప్లిమెంటరీ ఇది అని చెప్పారు.

2, మే 2022, సోమవారం

పోర్ట్ స్టీఫెన్స్ ట్రిప్ విశేషాలు

మొన్న ఈస్టర్ లాంగ్ వీకెండ్ వచ్చిందని ఓ రెండ్రోజుల ట్రిప్ కోసం "పోర్ట్ స్టీఫెన్స్" అనే ప్లేస్ కి వెళ్ళాము . 

ఆ రోజు 'శాండ్ బోర్డింగ్' అని తలకి 40$, కామెల్ రైడ్ కి తలకో 30$ సమర్పించుకొని (ఈ శాండ్ బోర్డింగ్ మా పెన్నా నదిలో ఫ్రీ గా చెయ్యచ్చు, మా ఊరి తిరణాలలో 100 రూపాయలు పెట్టి ఈ కామెల్ రైడింగ్ చెయ్యొచ్చు, ఏమైనా శంఖం లో పోస్తేనే తీర్థం అయినట్లు డబ్బులు వదిలించుకుంటే గానీ సాటిస్ఫాక్షన్ రాదు) తర్వాత మోకాలి చిప్పలు నొప్పెట్టేవరకు కొండ పైకి ఎక్కేసి రాత్రి పది గంటల టైం లో ముందు రోజే బుక్ చేసుకున్న రిసార్ట్స్ కి వెళ్ళాము. 

మీరు బుక్ చేసుకున్న రూమ్ ఇక్కడికి మరో కిలోమీటర్ అని చెప్పి కీస్ ఇచ్చి మా వాడిని ఫాలో అయిపోండి తీసుకెళ్తాడు అని చెప్పింది రిసెప్షనిస్ట్ ఆఫీస్ క్లోజ్ చేస్తూ. వాడు మా ముందు బైక్ లో వెళ్తుంటే మేము వాడిని ఫాలో అయిపోయాము గుడ్డిగా. 

అదొక అపార్ట్మెంట్, అందులో ఒక ఫ్లోర్ లో ఉండే యూనిట్స్ అన్నీ ఈ హోటల్ వాడు కొనేసి వాటిని ఇలా పీక్ సీజన్లో హోటల్ గదులుగా అద్దెకి ఇస్తుంటాడు అన్న మాట. 

బాబూ, ఇక్కడ మంచి రెస్టారెంట్స్ ఉన్నాయా అంటే రెండు మూడు లోకల్ రెస్టారెంట్స్ పేరు చెప్పాడు గానీ ఉదయం నుంచి ఆ బర్గర్స్, పీజ్జాలు తిని నాలుక చప్పబడిపోయి ఉండటం వల్ల అలాగే అన్నానికి మొహం వాచి దగ్గర్లో ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయా అని అడిగితే వాచ్ లో టైం చూసుకొని '2 బ్రదర్స్' అనే ఒక ఇండియన్ రెస్టారెంట్ 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది పదకొండు వరకు ఓపెన్ అన్నాడు. 

వెంటనే అక్కడి నుంచి మ్యాప్ పెట్టేసుకొని వెళ్ళి తిన్నాము. ఫ్రైడ్ రైస్ లో ఉప్పు లేదని అక్కడే ఉన్న వెయిటర్ ని పిలిచి ఇందులో ఉప్పు లేదు అని కంప్లైంట్ చేస్తే ఇదేమైనా పేస్టా ఉప్పు ఉండటానికి అనే రేంజ్ లో మెనూ కార్డు తెచ్చి ఇందులో సాల్ట్ వేస్తామని రాశామా? అంది. నేను షాక్ లోంచి తేరుకొని మరి ఈ చికెన్ కర్రీ లో వేస్తామని మెనూ లో రాయలేదు కదా మరెందుకు వేశారు అని అడిగేలోపే అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చి తినేది టూరిస్ట్స్ మాత్రమే కదా ఒకసారి వచ్చిన వారు మళ్ళీ వస్తారని గారంటీ లేదనే 'డోంట్ కేర్ యాటిట్యూడ్' అయి ఉండచ్చు. 

భోజనం చేసి బయలుదేరే ముందు గుర్తొచ్చింది అర్రే! మనం స్టే చేసే ప్లేస్ అడ్రస్ నోట్ చేసుకోలేదు కదా, ఇప్పుడెలా అని. అప్పుడు ఆ రిసార్ట్స్ దగ్గరికి వెళ్లి అక్కడినుంచి గుడ్డిగా ఆ బైక్ వాడిని ఫాలో అయిన రోడ్ లను ఒక్కక్కటిగా సర్వే చేస్తూ వెనక్కి ముందుకు వెళ్ళి ఏదోలా ఆ ఇంటి అడ్రస్ పట్టేశాము. 

గూగుల్ మ్యాపులు గట్రా లేని రోజుల్లో చలామణిలో ఉన్న చిన్న జోక్ ఇప్పుడు:

ఒకతనికి ఇంట్లో ఉండే పెళ్ళంటా పాటు ఆవిడ పెంచుకునే కుక్క అన్నా ఇష్టం ఉండేది కాదట. అందుకని ఒక రోజు ఆ కుక్కను పెళ్ళాం చూడకుండా కార్ లోకి కుక్కేసి, ఒక రెండు మైళ్ళ దూరం తీసుకెళ్ళి వదిలేసి వచ్చాడట దాన్ని వదిలించుకోడానికి. 

అక్కడినుంచి అతను తిరిగి వచ్చి గారేజ్ లో కార్ పార్క్ చేసే లోపే ఆ కుక్క ఇంటికి చేరి మొరుగుతూ స్వాగతమిచ్చిందట. ఇలా కాదని మరుసటి రోజు ఒక 20 మైళ్ళ దూరంలో విడిచి వస్తే అతని కంటే ముందే అది ఇంటి చేరిందట, ఇలా కాదని ఒక 100 మైళ్ళ దూరానికి వెళ్ళి అక్కడ కుక్కను విడిచి ఇంటికి బయలుదేరాడట. ఒక నాలుగైదు గంటల తర్వాత ఇంటికి ఫోన్ చేసి కుక్క ఇంట్లో ఉందా అని అడిగాడట పెళ్ళాన్ని?

ఉంది గానీ ఇంత రాత్రి పూట చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లిపోయారు అందట 

వస్తా గానీ ముందు కుక్కకు ఫోన్ ఇవ్వు, ఇంటికి దారి కనుక్కోవాలి మూడు నాలుగు గంటల నుంచి దారి తప్పిపోయి తిరుగుతున్నా అన్నాడట

అలా ఉండేవేమో అప్పట్లో తిప్పలు.  ఈ GPS, గూగుల్ మ్యాపులు లేకపోతే బైక్ రోడ్ లో ఆపేసి అటు పక్క ఉండే షాప్స్ వారినే లేదంటే ఆ రోడ్ లో ట్రావెల్ చేస్తున్న వారినో అడ్రస్ అడిగి వెళ్లిన రోజులు నాకింకా గుర్తే.