రాయడం నాకు ఇష్టం, కానీ బుర్రలో ఉండే ఐడియాలన్నీ ఖాళీ అయిపోయాయి. కాబట్టి ఏం రాయాలో తట్టక ఎప్పుడో విన్న కథని నా రాతల్లో మీతో పంచుకుంటున్నాను. చాలా మంది వినే ఉండచ్చు, కాకపోతే మరో సారి చదవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదనుకుంటాను. నాకు నచ్చిన కథలన్నీ ఒక చోటికి నా మాటల్లో చేర్చాలనే నా ఈ ప్రయత్నానికి ఇది తొలి మెట్టు. ఏదో ట్రై చేశాను, ఇది నాకు సెట్టవ్వదనుకుంటే మొహమాటపడకుండా చెప్పెయ్యండి, ఇలాంటి పోస్ట్లు రాయకుండా ఉండనని చెప్పను గానీ మరింత బాగా రాయడానికి ప్రయత్నిస్తాను.
ఇవాళ రాయబోతున్న ఈ చిన్ని కథ నాది కాదు, కానీ కథనం, రాతలు మాత్రం నావే.
ఇంటింటికి తిరిగి వస్తువులమ్మే హోవార్డ్ కెల్లీ అనే ఒక కుర్రాడు, ఆ రోజు ఒక్క వస్తువు కూడా అమ్ముడుకాకపోవడంతో నిరాశగా ఉన్నాడు. మధ్యాన్నం కూడా దాటటంతో కడుపులో ఆకలి పెరిగిపోయింది, జేబు తడిమి చూసుకుంటే అందులో ఒక పెన్నీ (సెంట్ కాయిన్) మాత్రమే ఉంది. కడుపులో ఏదో ఒకటి పడితే గానీ అడుగు కూడా ముందుకు వేయలేను అనిపించింది.
పక్కన ఉండే ఇంటి డోర్ తట్టాడు. ఒక యువతి తలుపు తీసి ఇప్పుడు మేము ఏ వస్తువులు కొనదలచు కోలేదు, వెళ్ళమని అంది.
ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం ఇవ్వగలరా అని అడగబోయి తన దగ్గర ఉన్న పెన్నీకి అది రాదని మొహమాటపడి, ఒక గ్లాస్ మంచి నీళ్లివ్వగలరా అని అడిగాడు.
అలాగే అని లోపలికెళ్లిన యువతి గ్లాస్ తో తిరిగొచ్చింది.
గ్లాస్ అందుకొని చూస్తే అందులో నీళ్ల బదులు పాలు ఉండటం గమనించి ఆమె వైపు చూశాడు.
"నువ్వు ఆకలితో ఉన్నావని అర్థమవుతోంది, ఇంట్లో ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి" అంది ఆ యువతి అంతకు మించి సహాయం చేయలేని నిస్సహాయతకు సిగ్గుపడి.
అతను తన జేబు లోంచి పెన్నీ ఇవ్వబోతే, ఆవిడ పుచ్చుకోవడానికి ఒప్పుకోలేదు.
స్వచ్ఛమైన ఆ యువతి మంచితనానికి ఆ పాలే కాక, అతని కనుపాపల వెనుక ఉబికిన కన్నీళ్లూ సాక్ష్యమయ్యాయి.
ఆ యువతి కి కృతజ్ఞతలు తెలిపి బయలుదేరాడు.
పాలతో కాస్త ఆకలి బాధ తగ్గడం వల్ల, సాయంత్రం లోపు ఇంకొన్ని ఇళ్లకు తిరిగి ఏదో ఒక వస్తువు అమ్మగలననే నమ్మకం పెరిగింది దానితో పాటు మనుషుల మీద నమ్మకం కూడా.
*************************************
కొన్నేళ్ళకు, మంచి వాళ్ళకే కష్టాలు ఎదురవుతాయి అన్న అపోహను మరోసారి బలపరుస్తూ తీవ్రమైన జబ్బుతో ఆసుపత్రి పాలయ్యింది ఆ గ్లాస్ పాలు ఇచ్చిన ఆవిడ.
తనుండే ఊరిలోని హాస్పిటల్ వాళ్ళు చేతులెత్తెయ్యడంతో పక్కనుండే సిటీ లోని పెద్ద హాస్పిటల్ లో నయం చేస్తారు అనే ఆశతో అక్కడికి వెళ్ళింది.
ఆ డాక్టర్ ఆవిడకు అన్ని పరీక్షలు చేసి నయం అవడానికి కొన్ని రోజులు హాస్పిటల్ లో జాయిన్ అవ్వమన్నాడు.
అతని ట్రీట్మెంట్ ఫలించి కొన్ని రోజులకే ఆవిడ జబ్బు నయమైంది.
ఆవిడ డిశ్చార్జ్ అయ్యే రోజు రానే వచ్చింది, ఆ రోజు ఉదయం లేచి కిటికీ తలుపులు తెరవగానే బయటి నుంచి వచ్చిన గాలికి టేబుల్ మీదున్న పేపర్ యెగిరి కింద పడింది.
ఆ పేపర్ చూడగానే అర్థం అయ్యింది అది తాను చెల్లించాల్సిన బిల్ అని. అది తన తాహతుకు మించిన బిల్ అయి ఉంటుంది అని ముందే ఊహించడం వల్ల వణుకుతున్న చేతులతో ఆ బిల్ ను తెరచి చూసింది .
'మీరు ఆరోజు ఇచ్చిన గ్లాస్ పాలకు ఈ బిల్లుకు చెల్లు - డాక్టర్ హోవార్డ్ కెల్లీ' అని రాసి ఉన్న ఆ బిల్లు, చేసిన సహాయం ఊరికే పోదు అన్న నిజాన్ని మరో సారి రుజువు చేసింది.
ఆ బిల్ టేబుల్ పై ఉంచి డాక్టర్ కు కృతజ్ఞతలు తెలపడానికి రూమ్ బయటికి వెళ్ళింది ఆవిడ.
ఈ సారి కిటికీ నుంచి గాలి మళ్ళీ వీచింది కానీ కన్నీటితో తడిచి బరువెక్కిన ఆ బిల్లును కదిలించలేక పోయింది.
పైన చెప్పిన కథ Dr. Howard Kelly (1858-1943) జీవితంలో జరిగిన సంఘటన అని అంటారు కానీ నిజంగా జరిగిందో లేదో కరెక్ట్ గా తెలియదు. అందరి డాక్టర్స్ లాగానే ఇతను కూడా ఫీజులు బాగా ఛార్జ్ చేసేవారని అంటారు. కాకపోతే అతని ఫ్రెండ్ అయిన Audrey Davis ప్రకారం కొందరికి ఫ్రీ గానే ట్రీట్మెంట్ చేసేవారట.