పూరి జగన్నాథ్ కొడుకుని హీరో గా పెట్టి అప్పుడెప్పుడో తీసిన మెహబూబా సినిమా ఈ వీకెండ్ చూశాను. ఇక తరువాతి వాక్యం చదివే ముందు ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకోండి ముందు ముందు పనికొస్తాయి.
ఆయన ఆ సినిమా 2018 లో తీసినట్లు ఉన్నాడు గానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి కథనే నేను 2015 లో రాసుకున్నా. ఇప్పుడు మీరు మూర్చబోయే స్టేజి లో ఉంటారు, కాస్త ఆ చల్ల నీళ్లు మీ గొంతులో పోసుకోవడమో లేదంటే మొహాన కొట్టుకోవడమో చేయండి.
ఇప్పుడు కాస్త తేరుకున్నారు కదా, మళ్ళీ చదవండి. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే కొంత ఇష్టం ఉండటం వల్ల అవంటే నాకు అభిమానం. అందుకే యెంత చెత్త సినిమా అయినా పూర్తిగా చూడందే వదలను. చూసిన తర్వాత అలా కాకుండా ఎలా తీస్తే బాగుండేదో నేను ఒక బుక్ లో రాసుకునేవాడిని. అలా రాసుకున్న పుస్తకం నేను సిడ్నీ కి వచ్చేసాక బెంగళూరు లో నేనుండే రెంటెడ్ హౌస్ ఖాళీ చేసేప్పుడు మా నాన్న న్యూస్ పేపర్స్ తో పాటు నా నోట్స్ మెటీరియల్స్ అంతా పాత పేపర్ వాడికి అమ్మేశాడు.
సిడ్నీ కి వచ్చాక ఒక రెండు మూడేళ్ళు బుధ్దిగానే ఉన్నాను. తర్వాత 2015 టైం లో అనుకుంటా నేను బ్లాగ్ లో రాయడం మొదలెట్టాను. చాలా మంది చదివి అభినందించేవారు బాగానే రాస్తున్నావని. అప్పుడు నా మైండ్ లో ఒక పాత జ్ఞాపకం మెదిలింది.
నేను బెంగళూరు లో ఉన్నపుడు, మగధీర సినిమా విడుదలయ్యి బాగా హిట్టయ్యింది. నాకప్పుడు సినిమా బాగానే అనిపించింది కానీ దాన్ని ఇంకా బాగా తీయొచ్చు అనిపించింది (రచయిత లేదా దర్శకుడు పాపం కథ బాగానే రాసుకొని ఉంటాడు, కాకపోతే బాగా పేరున్న హీరోలు, అతని వెనకున్న భజన బృందాలు వాళ్ళ బంధువులు అంతా తలో చెయ్యి వేసి ఆ కథను బ్రష్టు పట్టించి ఉంటారు. అదేదో సినిమాలో ఒకతను సీరియస్ సినిమా తీద్దాం అనుకుంటే షూటింగ్ పూర్తయ్యి ప్రివ్యూ చూసేప్పటికీ అది ఒక కామెడీ సినిమాలా అవుతుంది. పులిహోర కలపాలని దర్శకుడు అనుకుంటే అతనితో బిర్యాని వండిస్తారు)
నోట్స్ లో అదే మగధీర సినిమానే ఇంకెలా తీయొచ్చు అనుకున్నపుడు వేరొక కథ మదిలో మెదిలింది. నేను పుట్టక ముందు నుంచి అంటే మూగ మనసులు తో మొదలుకొని జానకి రాముడు మీదుగా నిన్నటి మగధీర వరకు పునర్జన్మల మీద సినిమాలు తీసి హిట్ కొడుతున్నారు అంటే మనం ఎంటర్టైనింగ్ గా తీయగలితే ఇంకో హిట్ సినిమా కూడా తీయొచ్చు అని క్లుప్తంగా ఒక కథ రాసుకున్నాను పునర్జన్మల కథకు అప్పుడెప్పుడో చూసిన సన్నీడియోల్ 'గదర్:ఏక్ ప్రేమ్ కథా' సినిమా కాన్సెప్ట్ ని మిక్స్ చేస్తూ (నాకు తెలిసి 90% సినిమా వాళ్ళు ఒక నాలుగైదు సినిమాలు చూసేసి ఒక కథ అల్లుకుంటారనుకుంటా) రాసుకున్న నోట్స్ చెత్త పేపర్స్ వాడి దగ్గరికి చేరినా ఆ కథ మాత్రం నా మైండ్ లో అలాగే ఉండిపోయింది కదా అని దాన్ని డెవలప్ చేసి ఫుల్ డైలాగ్స్ వెర్షన్ తో ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రాసి బైండ్ కూడా చేసి పెట్టుకున్నాను. నాకంత సీన్ లేదు, నేను ఆ సినిమా ఎలాగూ తీయలేనని తెలుసు గాని అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఆ 132 పేజీల స్క్రిప్ట్ ని ఎప్పుడూ నా టేబుల్ మీదే ఉంచుకుంటాను నేను నా ఫెయిల్యూర్ కి జ్ఞాపకంలా.
నా ఉద్దేశ్యం చెత్త వాడికి అమ్మేసిన ఆ నోట్స్ పూరి గారి కంట పడి కాపీ కొట్టాడని కాదు కానీ ఐడియాస్ అలా ఇద్దరికీ ఒకేలా వస్తుంటాయి అని. సంతోషం సినిమాలో ప్రభుదేవా ఒక పల్లెకి ఉదయాన్నే వెళ్ళినప్పుడు, కాల కృత్యాల కోసం మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న వారంతా లేచి నిలబడతారు. పర్లేదు కూర్చోండి నాకంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు ప్రభుదేవా . అప్పుడు పక్కన ఉన్న మా శీను నాకెప్పటి నుంచో ఇలాంటి సీన్ నా మైండ్ లో ఉండేది అన్నాడు.
ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాక కొందరు ఇది నా కథ అని గొడవ పెడుతుంటారు. వాటి విషయం లో కూడా ఇద్దరూ ఒకే లాగా అలోచించి ఉండచ్చు లేదంటే నిజంగానే కథ కొట్టేసి ఉండచ్చు అది వేరే విషయం.
సినిమాలో కుర్రాడు బానే చేశాడు, పూరి జగన్నాథ్ గారు గనుక మునుపటి ఫామ్ లోకి వచ్చి ఇడియట్ లాంటి హిట్టు సినిమాలు అతడితో తీస్తే అతను స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంది (ఇడియట్ అనేది గొప్ప సినిమా అని కాదు కానీ, హిట్టే సినిమా ఇండస్ట్రీలో కొలమానం అది బాగుందా లేదా అని కాదు. నిజం చెప్పాలంటే పూరి గారి ఏ సినిమా నాకింత వరకు నచ్చలేదు. నా లాంటి ఓ బోడి లింగానికి నచ్చకపోతే ఆయనకేం నష్టం లేదనుకోండి) ఇక ఆ సినిమా సెకండ్ హాఫ్ నుంచి పూరీ విశ్వరూపం చూపిస్తాడు. ఇక క్లైమాక్స్ లో మాత్రం తాండవం ఆడేస్తాడు. ఎంతో సెన్సిటివ్ గా తీసి ఉండాల్సిన లవ్ స్టోరీ ని బాగా లౌడ్ గా తీశాడు. ఇక ఇండియన్ పాకిస్తాన్ బోర్డర్ విషయాలను మాత్రం వీధిలో నీళ్ళ కొళాయిల దగ్గర జరిగే కొట్లాట స్థాయి లోకి దిగజార్చి చూపించాడు. బాబోయ్ ఆ బోర్డర్ దగ్గర ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ గా ఓవర్ యాక్షన్ చేసిన ఆవిడెవరో గానీ ఆస్కార్ ఇచ్చేయచ్చు (పోకిరి సినిమా తర్వాత ఆవిడని మళ్ళీ ఇదే సినిమాలోనే చూడ్డం)
సారూప్యత ఉందనిపిస్తోంది కాబట్టి ఎక్కడో ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ నాకు గుర్తు ఉన్నంతలో చెప్పి ముగిస్తాను. సమానమైన విలువున్న ఓ రెండు కొత్త కాయిన్స్ ని ముద్రించి వదిలారు. అందులో ఒక కాయిన్ ఎక్కడో రోడ్లో పడిపోయింది, ఇంకో కాయిన్ మాత్రం చలామణి లోకి వెళ్ళిపోయి దాని వేల్యూ అది పొందింది. రోడ్లో పడిన కాయిన్ అలా వాహనాల కింద పడి అట్నుంచి అటు రోడ్ పక్కన చెత్తలోకి చేరిపోయింది. కొన్నేళ్ళకి చెత్త ఏరుకునే వాడికి ఆ కాయిన్ దొరికింది కానీ అప్పటికే సొట్టలు పడి, తుప్పుపట్టిపోయి ఉన్న ఆ కాయిన్ ఎక్కడా చెల్లలేదు.
ఈ పోటీ ప్రపంచం లో మీ ఐడియాస్ ని వీలైనంత తొందరగా సేల్ చేసెయ్యండి. దేనికైనా విలువ ఉండేది సరైన సమయంలో దాన్ని వినియోగించినప్పుడే అంతే కాదు సరైన ఛానెల్లో వెళ్ళినప్పుడే. మీరూ వినే ఉంటారు శంఖంలో పోస్తేనే తీర్థం అని, సరైన టైం లో మీ ఐడియాస్ ఎగ్జిక్యూట్ చేయకుండా పక్కన పెట్టేస్తే కథలోని ఆ చెల్లని నాణెం లాగా లేదంటే నా 132 పేజీల స్క్రిప్ట్ లాగా మీ ఐడియా కూడా ఎందుకూ పనికి రాకుండా పోతుంది.