చాప్టర్ 1
అనగనగా కర్నూల్ అనే ఊరిలో "పీకలు కోసి బదులుగా చెట్లు నాటే" ఒక నాటు విలన్ ఉంటాడు. అదే ఊరికి డాక్టర్ గా మన హీరో వస్తాడు. వచ్చీ రాగానే విజిల్ వేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
"డాక్టరూ డాక్టరూ నువ్వేలే నా సారూ, తగ్గించు మా అమ్మకి షుగరు" అంటూ హీరోయిన్ ఒక పాట వేసుకుంటుంది.
అటు విలన్ చేసే ఆగడాలు, ఇటు విజిల్ వేసే అమ్మాయి విన్యాసాలతో రెండు మూడు సీన్స్ ముగిశాక విలన్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాడు మన హీరో. ఆ కంప్లైంట్ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది విలన్ బెదిరింపుల వలన. అలా రెండు సార్లు హీరో విలన్ కి ఎదురొచ్చాక కొండారెడ్డి బురుజు దగ్గర హీరోని చితక్కొట్టి అక్కడే కొక్కానికి వేలాడదీసి వెళ్ళిపోతాడు విలన్.
చాప్టర్ 2
డాక్టర్ తో పని అయ్యేలా లేదు అని ఈ సారి మళ్ళీ కర్నూల్ వస్తాడు రెండేళ్ళ తర్వాత పోలీస్ అయి.
"భూమికి బెత్తెడు లేవు నువ్వేం పోలీసువి రా" అని విలన్
"భూమికి బెత్తెడు కాదు బారెడు నేను" అని హీరో
నాలుగైదు కౌంటర్ డైలాగ్స్ అనేసుకొని రెండు మూడు ఛాలెంజ్ విసురుకోవడాలు అయిన తర్వాత మళ్ళీ ఆ కొండారెడ్డి బురుజు దగ్గర కొట్టుకున్నాక విలన్ ని అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాడు హీరో.
"పోలీసు పోలీసు నువ్వేలే నా బాసు, కొట్టేయ్ మా నాన్న మీది కేసు" అని హీరోయిన్ వచ్చి ఒక పాట వేసుకుంటుంది.
అరెస్ట్ చేసిన విలన్ ని కోర్టులో ప్రవేశపెడతారు. అక్కడ విలన్ తరపు లాయర్ ఒకడు గొప్పగా వాదించేసి విలన్ మీద కేసులన్నీ కొట్టేయించి బయటకి తీసుకొస్తాడు.
ఈ చెట్లు నాటే కార్యక్రమానికి పుల్ స్టాప్ పెట్టించాలనుకొన్న హీరో కామా మాత్రమే పెట్టించగలుగుతాడు.
చాప్టర్ 3
పోలీస్ తో పని పయ్యేలా లేదు అని రెండు మూడేళ్ళ తర్వాత నల్లకోటు వేసుకొని లాయర్ గా వస్తాడు.
డ్రైవర్, మనం కరెక్ట్ రూట్ లోనే కర్నూల్ వెళ్తున్నామా?
అవును సర్.
మరి ఏదో అడవి లాగా ఉందే దారంతా!
అవును సర్, ఈ కర్నూల్ అరణ్యం అయిపోయింది ఆ విలన్ నాటిన మొక్కలు చెట్లై, చెట్లు మానులై, మానులు వృక్షాలై, వృక్షాలు వనాలై, వనాలు అరణ్యం గా మారిపోయింది సర్. ఇలానే అయితే ఒకప్పుడు ఇక్కడ కర్నూల్ నగరం ఉండేది అని మన పిల్లలు పుస్తకాల్లో చదువుకోవసి వస్తుంది సర్ అని గుక్క తిప్పుకోకుండా గుప్పెడు డైలాగ్స్ చెప్పేస్తాడు డ్రైవర్.
అది ఆపడానికి వచ్చింది నేను, కార్ ఆపు కోర్ట్ వచ్చేసింది అంటాడు హీరో.
"లాయరూ లాయరూ చూపించు నీ జోరూ, అయిపోవాలి అందరూ బేజారూ" అని హీరోయిన్ వచ్చి ఒక పాట వేసుకుంటుంది.
కేసును తిరగతోడి మళ్ళీ విలన్ ని కోర్ట్ బోనులో నిలబెడతాడు.
అద్భుతంగా వాదించినా జడ్జి ఇచ్చిన తప్పుడు తీర్పుతో మళ్ళీ కేసు కొట్టివేస్తారు.
చాప్టర్ 4
ఈ సారి జడ్జి గా వచ్చి విలన్ కి ఉరిశిక్ష పడేలా చేస్తాడు.
ఉరిశిక్ష వేసి వచ్చి బయటకి వస్తుంటే ఎదురుగా ఉండే కిరాణాకొట్టులో ఉండే ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి "మీరు? ఇక్కడ?" అని అడిగితే
అవును, నేనే ఆ తప్పుడు తీర్పు ఇచ్చిన జడ్జి ని, దానికి పశ్చ్యాతాపంగా ఆ జడ్జి జాబ్ వదిలేసి ఇదిగో ఇలా "పక్కా కమర్షియల్" అనే కిరాణా కొట్టు నడుపుకుంటున్నాను అంటాడు.
హీరోయిన్ వస్తుంది గానీ జడ్జి పాత్రధారి పాట పాడితే బాగోదని కొంచెం డీసెన్సీ మెయింటైన్ చెయ్యడం వల్ల ఇక్కడ సాంగ్ పెట్టడం లేదు.
"కర్నూల్ నగరాన్ని అమెజాన్ అడవిలా పెంచి పర్యావరణాన్ని కాపాడినందుకు" రాష్ట్రపతి మెచ్చుకొని ఇచ్చిన క్షమాభిక్ష వల్ల ఉరి శిక్ష నుంచి తప్పించుకుంటాడు విలన్.
చాప్టర్ 5
మీరు మరీ స్మార్ట్ ఈ పాటికే ఊహించివుంటారు హీరో ఎంట్రీ ఈ సారి రాష్ట్రపతి గా అని.
సినిమా చివర్లో డీసెన్సీ లాంటివి వదిలేయాలి, ఎందుకంటే మాస్ కి ఇక్కడో మాంచి బీట్ ఉన్న సాంగ్ పెట్టి తీరాలి ఎప్పటి నుంచో వస్తున్న తెలుగు సినిమా ఆచారం ప్రకారం కాబట్టి "రాష్ట్రపతి రాష్ట్రపతి నువ్వే నాకు పతి, చేసుకో నన్ను నీ సతి" అని పెట్టిన పాట సెన్సార్ నుంచి బయటకు వస్తే చూడచ్చు.
క్షమాభిక్ష ని కొట్టివేసి తిరిగి విలన్ కి ఉరి శిక్ష విధిస్తాడు మన హీరో.
చాప్టర్ 6
ఈ సారి మన హీరో అమెరికా ప్రెసిడెంట్ అవుదామని అమెరికా వెళ్ళి అక్కడ రోడ్డుపై నడుస్తూ ఉండే సీన్ తో "వారియర్-2" అని సినిమా ముగుస్తుంది.