21, ఆగస్టు 2021, శనివారం

దియా - దివ్యమైన సినిమా

నా  MCA ఫ్రెండ్ ఈ సినిమా చూడమని రెకమండ్ చేస్తే నటీనటులు ఎవరో తెలియకపోయినా చూద్దాం అని నిన్న రాత్రి డిసైడ్ అయ్యాము.  కాసేపటికే సినిమా బాగా ఆకట్టుకుంది. ఎంతగా లీనం అయ్యామంటే ఒకానొక సీన్ లో నేను, మా ఆవిడ ఇద్దరం ష్.. అనేశాం అదేదో నిజంగా మా కళ్లముందే జరుగుతున్నట్లు, అయ్యో అలా జరగకుండా ఉంటే బాగుండేదని. 

సినిమా అంటే తెర నిండా నటీ నటులు, సెట్టింగ్స్, పాటల్లో భారీతనం అక్కర్లేదు అనిపించింది సినిమా  చూస్తున్నంతసేపు. హడావిడి లేకుండా ఉండే ప్లెసెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరొక అసెట్. 

సినిమాలో మొత్తంగా ఒక పది పాత్రలు ఉంటాయి. ఒక్క పవిత్రా లోకేష్ తప్ప మిగతా నటులను చూడటం ఇదే మొదటి సారి. మూడు ప్రధాన పాత్రదారుల నటన బాగుంది,  ముగ్గురిలో ముందుగా చెప్పాల్సింది ఆది క్యారెక్టర్ ప్లే చేసిన నటుడి గురించే. అతన్ని చూస్తే ఆకలి రాజ్యం టైం లో యంగ్ కమల్ హాసన్ ను చూసినట్లు అనిపించింది అతని హెయిర్ స్టైల్, హైట్ కమల్ హాసన్ నే గుర్తుకు తెచ్చాయి నా వరకైతే.  

లెక్కల మేష్టారు లెక్కల పరీక్ష లో ఫెయిల్ అయ్యాడే అనిపిస్తుంది చివర్లో ఆది క్యారెక్టర్ చూశాక.  అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడ్డట్లు అనే సామెత గుర్తొస్తుంది. సాధారణంగా తమిళ్ సినిమాల ఎండింగ్ ఇలాగే ఉంటుంది. చివర్లో ఈ సినిమా డైరెక్టర్ ని తమిళ్  డైరెక్టర్ పూనాడేమో?

'సమస్యలు లేకుండా అదేం జీవితం అండీ' అని ఆది చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో. అది అక్షర సత్యం. ఇదొక్క డైలాగ్ అనే కాదు ప్రతీ  డైలాగ్ బాగుంటుంది. ప్రతీ సీన్ ఈ సినిమా కథలో మనం ఊహించగలిగినదే అయినా  ఎక్కడా బోర్ కొట్టకుండా సాగుతుంది. నాకైతే చాలా వరకు ఈ సినిమా కథ 'అందాల రాక్షసి' సినిమా  కథనే పోలి ఉందనిపించింది. 

కన్నడ లో తీసి, పోయిన సంవత్సరం రిలీజ్ చేసిన ఈ సినిమాని అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటే  కన్నడ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని తెలుగులో షూటింగ్ కూడా కంప్లీట్ చేసి సెప్టెంబర్ మూడో తేదీ రిలీజ్ చేయబోతున్న టైములో 10 రోజుల ముందు యూ ట్యూబ్ లో డబ్బింగ్ వెర్షన్ పెట్టారంటే,  something fishy అనిపించి గూగుల్ లో ఈ సినిమా గురించి సెర్చ్ చేస్తే యేవో ఫైనాన్సియల్ సెటిల్మెంట్ ఇష్యూస్ నడుస్తున్నట్లు తెలిసింది.    

సరే మన తెలుగులో 'డియర్ మేఘ' ని ఎలా కుక్ చేశారో చూద్దామని అందుబాటులో ఉన్న రెండు మెతుకులను (అదేనండి ట్రైలర్)  రుచి  చూస్తే కాస్త మసాలాలు యాడ్ చేసి రిచ్ నెస్ కోసం కాసిన్ని డెకొరేషన్స్ కూడా చేసినట్లు ఉన్నారు తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్లు. 

కాబట్టి హడావిడి లేని సినిమా చూడాలంటే యూట్యూబ్ లో ఉన్న 'దియా' చూడండి లేదూ మాకు మసాలా యాడ్ చేసిన వెర్షన్ కావాలనుకుంటే 'డియర్ మేఘ' రిలీజ్ వరకు వెయిట్ చెయ్యండి. ఛాయస్ మీదే.  

Final verdict: నీ  ఊపిరి ఇంకా తగులుతూనే ఉంది దియా సూప్....కాదు కాదు దియా సూపర్. 

12, ఆగస్టు 2021, గురువారం

వర్షం పడిన రాత్రో లేక ఒక బలహీన క్షణమో అది చూసేశాను

తెలియని భాష అని లేదంటే థ్రిల్లర్ మూవీస్ కాబట్టి ప్రతీ డీటెయిల్ అర్థం అవ్వాలని సబ్ టైటిల్స్ పెట్టుకుంటారు కానీ సబ్ టైటిల్స్ చూస్తూ ఉంటే ఆ సినిమాలోని నటీనటుల పేస్ ఎక్స్ప్రెషన్స్ ఎంజాయ్ చేయలేక పోతారు.  అందుకే అర్థం అయినా కాకపోయినా సబ్  టైటిల్స్ లేకుండానే చూడటానికి ఇష్టపడతాను. తమిళ్ అయితే పూర్తిగా అర్థం అవుతుంది కానీ మలయాళం మీద ఇంకా అంత పట్టు చిక్కలేదు అయినా సరే ఆ భాష లో వచ్చిన సినిమాలు కూడా చూస్తుంటాను ఇష్టంగా. 

యోధ సినిమా చూసినప్పటి నుంచి మోహన్ లాల్ అన్నా, స్వాతి కిరణం/దళపతి సినిమాల నుంచి  మమ్ముట్టి నటన అన్నా బాగా ఇష్టం. అందుకే వారి సినిమాలు మిస్ అవకుండా చూస్తూ ఉంటాను. కొన్ని సార్లు వీళ్ళ సినిమాలో మరీ స్లో మోషన్ లో హీరో ని చూపిస్తూ అవసరం ఉన్నా లేకపోయినా చెవులు చిల్లులు పడేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో హోరెత్తిస్తుంటారు అవి కమర్షియల్ పాయింట్ అఫ్ వ్యూ లో ఓకే అని సరి పెట్టుకోవాలి. ఆ మధ్య రాజశేఖర్ తో తీసిన 'కల్కి' సినిమాని  ఈ ఎక్స్ట్రా స్లో మోషన్ సీన్సే దెబ్బతీశాయని నా నమ్మకం. 

దృశ్యం 2 ఎప్పటి నుంచో చూడాలని ఉన్నా, అది సీక్వెల్ అవ్వడం వల్ల అంతగా ఇంటరెస్ట్ లేక చూడకుండా ఉండిపోయాను. సాధారణంగా సీక్వెల్ అనేది డైరెక్టర్ లేదా హీరో హిట్స్ లేక కొట్టుమిట్టాడుతున్నప్పుడో లేక గల్లా పెట్టెలు నింపుకోవడానికో లేదంటే బ్లాక్ మనీ ని వైట్ చేసుకోవడానికో ప్రయోగించబడే గిమ్మిక్కులు, లేదంటే ప్రేక్షకులను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోవడమో జరిగినప్పుడు తయారవుతుంటాయి. మన ఇండియన్ హిస్టరీ లో అతి కొద్ది సినిమాలు మాత్రమే ఈ సీక్వెల్ ప్రయోగంలో హిట్టయ్యాయి. 

పైగా మన వెంకీ దృశ్యం2 ని రీమేక్ చేస్తున్నాడని తెలిసి కాస్త మన నేటివిటీ, తెలిసిన ఆర్టిస్టులు అయితే బాగుంటుందని ఆశించి ఆ మలయాళ సినిమాని చాలా రోజులుగా అట్టే పక్కన పెట్టేసాను. 

కథల్లోనో, సినిమాల్లోనే చెప్పినట్లు 'ఒక వర్షం పడిన రాత్రో లేక ఒక బలహీన క్షణమో' తెలీదు కానీ ఏ దిక్కుమాలిన సినిమాలో చూడటం కంటే దృశ్యం 2 చూడటం బెటర్ అనుకున్నా known devil is better than unknown angel అన్నట్లు.  ఒకప్పుడు మళయాళ సినిమాలు అంటే షకీలా సినిమాలో లేదా బూతు సినిమాలు అనే ఒక తప్పుడు అభిప్రాయం ఉండేది, వాటి డబ్బింగ్ టైటిల్స్ కూడా అలానే ఉండేవి నేను ఈ పెట్టిన టైటిల్ లాగా. గత పదేళ్ళలో మంచి మంచి సినిమాలు రావడం వల్ల ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. పదేళ్ళ క్రితం కూడా కొన్ని గొప్ప సినిమాలు వచ్చాయి కానీ అవి చాలా మందికి చేరలేకపోయేవి అప్పట్లో ఉండే పరిమితుల రీత్యా. 

అసలు కంటే కొసరు ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం. దృశ్యం సినిమా ఎక్కడ ముగిసిందో అక్కడే మొదలవుతుంది ఈ సీక్వెల్.  సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఫిల్లింగ్ కోసం పెట్టుకున్న పాత్రలు, వాటి మధ్య అనవసరమైన సీన్స్ అనిపిస్తాయి కానీ ఇంటర్వెల్ లో కొన్ని పాత్రల అవసరం , క్లైమాక్స్ లో మరి కొన్ని పాత్రల అవసరం తెలిసిన తర్వాత ఆ కథకుడైన దర్శకుడికి హాట్స్ హాఫ్ చెప్పకుండా ఉండలేము. దృశ్యం సినిమా ఏదో కొరియన్ సినిమా నుంచి ఎత్తుకొచ్చినా కనీసం దృశ్యం 2 లో సొంత ఆలోచనలు జొప్పించి ఆ లోటు పూడ్చారు. కొన్ని సీన్స్ సిల్లీగా అనిపించినా సినిమాటిక్ లిబర్టీ కింద వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ రిపీటెడ్ సీన్స్ లా అనిపించి కొంచెం బోర్ కొట్టిస్తాయి కానీ సినిమా మొత్తంగా చూస్తే బాగుంది.

అంతా తొండి, యు ట్యూబ్ వీడియో లో లాగా టైటిల్ ఒకటి విషయం మరొకటి రాశాను కదూ.